" సచివాలయం అంతా ధ్యానమయం చెయ్యాలి "

 

 

పేరు: A. నాగేంద్రమణి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫిసర్ (రిటైర్డ్)
విభాగం : ఉన్నత విద్య

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు. నాకు మొదటి గురువు సుభాష్ పత్రిగారు అయితే రెండవ గురువు మా పెద్దమ్మాయి సృజన. నాకు చాలా రోజుల నుంచి ధ్యానం గురించి తెలిసినా మా అమ్మాయికి క్యాన్సర్ అని తెలిసిన తరువాత నా జీవితం మలుపులు తిరిగింది.

 

నేను ధ్యానం మా కజిన్ లక్ష్మి దగ్గర నేర్చుకున్నాను. ధ్యానం క్లాసులకు వెళ్ళడం, ఆ కొద్ది సేపు మాత్రమే ధ్యానం చెయ్యడం జరిగేది. మా సృజనకు క్యాన్సర్ అని ఆమె మూడు నెలలే ఉంటుందని తెలుసుకున్నప్పటి నుంచి వైద్యంతో పాటు ధ్యానం చేయిస్తూ నేను కూడా రోజుకి 5, 6 గంటలు ధ్యానం చేస్తూ వచ్చాను. సృజన ఆత్మ ఎందుకో శరీరం వదిలేయాలని పెట్టుకోవడంతో 11 నెలల తరువాత క్యాన్సర్ రోగిలా కాకుండా ఒక ధ్యానిలాగా దేదీప్యమానమైన తేజస్సుతో శరీరం వదిలివేసింది. ఆమెకు ఒక 5 సంవత్సరాల పాప. నాకు ముగ్గురు అమ్మాయిలు. అప్పటికి నాకు ధ్యానంలో కొంచెం జ్ఞానమే ఉంది.

 

నేను డిప్రెషన్‌లో ఉన్నా మళ్ళీ నేనే దానినుంచి బయటికి రాగలగడానికి ధ్యానం నాకు సహకరించింది. చాలామంది నా తోటి ఉద్యోగులు "మీకు ధ్యానం తెలుసు కాబట్టి దాని నుంచి బయటపడ్డారు, తెలియనివాళ్ళు ఇటువంటి కష్టాలు వస్తే ఎలా తట్టుకుంటారు?" అని అనడం నన్ను ఆలోచించేలా చేసింది. "సచివాలయం అంతా ధ్యానమయం చెయ్యాలి" అని బలంగా నాలో నాటుకుంది.

 

సచివాలయంలో చాలా డిపార్ట్‌మెంట్లకి మధ్యాహ్న భోజన సమయంలో వెళ్ళడం, ధ్యానం గురించి చెప్పడం చేసేదానిని. నేను ఇప్పటి వరకు వీళ్ళందరికీ థియరీ నేర్పుతున్నాను కానీ ఆచరణలో పెట్టడం లేదు కాబట్టి ఆచరణలో పెట్టాలి అని అనుకోవడం వెంటనే చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్న సూర్యప్రభ, తులసిలను కలవడం, ముగ్గురం కలిసి రెండు రోజులలో సెక్రెటేరియట్‌లో మధ్యాహ్న భోజన సమయంలో వారం రోజుల క్లాసులు 2008 లో మొదలు పెట్టడం జరిగింది. ప్రాక్టికల్‌గా ధ్యానంలో రుచి తెలిసాక వారంతా "క్లాసులను పొడిగించండి" అన్నారు. దీని గురించి ప్రత్యేకమైన గది లేకపోవడంతో రకరకాల గదులు మారుస్తూ చివరికి సెంట్రల్ రికార్డు రూంలో ప్రతిరోజూ సామూహిక ధ్యానం జరిగేలా చెయ్యడం జరిగింది.

 

సూర్యప్రభ, తులసి, లీల, రమ్య, లక్ష్మీ సుజాత, శ్రీదేవి, సరోజిని, సరళ ఇంకా వందల మంది మాస్టర్లు తయారవడం, సెక్రెటేరియట్‌లో రెండు మూడు చోట్ల మధ్యాహ్న భోజన సమయంలో మెడిటేషన్ రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ కావడం, "పిరమిడ్ విజయ్" సహాయంతో మాస్టర్స్‌ను పిలిపించడం, తరువాత C.ఆనంద్ కుమార్ మరి A.V. సాయికుమార్ రెడ్డి (స్పిరిచ్యువల్ ఇండియా) గార్ల సహాయంతో ఇంకా చాలామంది మాస్టర్లు రావడం ఇలా ప్రతి నెలా క్లాసులను నిర్వహిస్తూ, పత్రిసార్ 2009లో క్లాసు జరుపుకోవడం ఇది అంతా ఒక కలలా నాకు అనిపిస్తుంది!

 

ఒక మంచి ఉద్దేశ్యంతో వేసిన విత్తనం రోజు రోజుకి చెట్టుగా ఎదిగి శాఖోపశాఖలుగా అవ్వడం దీనికంతటికీ కారణం ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్స్ గొప్పతనమే! మాంసాహారాన్ని 2005 నుంచే మానివేసి శాకాహారిగా మారినప్పటి నుంచి నేను ధ్యానం గురించి అందరికీ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏ మందులు తీసుకోకుండా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఏవైనా చిన్న చిన్నవి వచ్చినా ధ్యానంతోనే తగ్గిపోతాయి. ఈ ధ్యానంలో ఆరోగ్యం, ఆనందం మరి ఉత్సాహం .. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో లాభాలు పొందాను. అందరూ అలా ఉండేలా చెయ్యడానికి కంకణం కట్టుకున్నాను.

 

రోజూ ఇంట్లో ధ్యానం చేయడమే కాకుండా ఇంటి దగ్గర ఉన్న పార్కులో రోజూ క్రొత్తవాళ్ళకు ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పి వాళ్ళ చేత చేయించడం, అప్పుడప్పుడు సచివాలయంకు మాస్టర్స్‌ను రప్పించి క్రొత్తవాళ్ళకు ధ్యానం చెప్పించడం చేసేదాన్ని.

 

ఇంకా పుస్తకాలు చదవడం, సీనియర్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గారి స్వాధ్యాయ యోగ క్లాసులకు హాజరు అవ్వడం మరి క్రమం తప్పకుండా పత్రిగారి క్లాసులకు హాజరు అవ్వడం జరిగింది. ఆరోగ్యంతోపాటు మనందరం మన ఆలోచనలు, భావాలు, మన చేతలు అన్నీ సరిచేసుకోవడం మరి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అన్నీ కూడా ధ్యానంలో అందరం నేర్చుకుంటాం.

 

నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెలుగువాళ్ళకు ధ్యానం క్లాసులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు నన్ను చాలా ప్రశ్నలు అడిగి వారి సంశయాలనన్నీ, అనుమానాలన్నీ తీర్చుకోవడం, ఇంటర్‌నెట్‌లో మన వెబ్‌సైట్ చూసుకుని, మన పుస్తకాలు చదవడమే కాకుండా పత్రీ సార్ సందేశాలు విని వాళ్ళు చాలా ఆనందం పొంది నాకు వాళ్ళ అనుభవాలు ఫోన్‌లో చెపుతూంటే "జన్మ ధన్యమైనట్లే" నని భావిస్తున్నాను. నా భర్త ధ్యాన ప్రచారంలో నాకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తారు.

 

నేను D. కేశవరాజు గారు నిర్వహించిన .. పత్రిసార్‌తో .. హిమాలయాల యాత్రకు వెళ్ళినప్పుడు రాణిఖేత్‌లో బాబాజీ గుహ దర్శించడం మరి ఈజిప్టు గీజా పిరమిడ్ వెళ్ళడం ఈ రెండూ నా జీవితంలో మరిచిపోలేనివి! పరమ గురువైన పత్రీజీ సమకాలికులమైన పిరమిడ్ మాస్టర్స్‌గా మనమంతా కూడా చాలా ధన్య జీవులం. "నేను మీకు గురువును కాదు .. మీ శ్వాసే మీ గురువు" అని చెప్పి మన అందరినీ సక్రమమైన రీతిలో నడిపించే మహానుభావుడు పత్రీజీయే. ఆయనకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తున్నాను.

 

ఈ ధ్యానంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ధ్యానానుభవాలు రావడం సహజం. పత్రీజీ ఆధ్వర్యంలో A.V.సాయికుమార్‌రెడ్డి గారు నిర్వహించిన ఈజిప్ట్ యాత్రలో నాకు వచ్చిన ధ్యాన అనుభవాలు మీతో పంచుకొంటాను. మేము అస్వాన్ గుడికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ౩:౩౦ కల్లా బస్సులలో బయలుదేరి సెక్యూరిటీ కోసం ఒకచోట ఆగాము. "అందరూ దిగండి; ఇక్కడ కొద్దిసేపు ఆగుతుంది బస్సు" అన్నారు. నేను దిగకుండా బస్సులో మెడిటేషన్‌లో ఉన్నాను. కొద్దిసేపు తరువాత "అందరూ ఎక్కండి; బస్సులు బయలుదేరుతున్నాయి" అన్నారు. అప్పుడు ఒక ఆజానుబాహుడు చేతిలో పెద్ద శూలంతో బస్సు ఎక్కి "అందరూ వచ్చారు, ఇక పదండి" అన్నారు. వెంటనే బస్సులు కదిలాయి. "ఈయనను నేను బస్సులో చూడలేదే" అనుకున్నాను. తరువాత నేను మరిచిపోయాను. గుడి నుంచి వచ్చేటప్పుడు ఆ మనిషి అక్కడ విగ్రహాలలో కనిపిస్తారేమో అని చూశాను. అక్కడ కనిపించ లేదు. తరువాత నిర్మల, అంజనా మేడమ్ అందరూ ధ్యాన అనుభవాలు చెప్పమన్నప్పుడు ఈ విషయం చెబితే "చూశారా! మాస్టర్ ఎప్పుడూ మన వెంట ఎలా ఉంటారో" అన్నారు.

 

తరువాత కైరోలో పత్రిసార్‌తో కలిసి గీజా పిరమిడ్‌లో ధ్యానం చెయ్యడానికి కింగ్స్ ఛాంబర్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు షేక్‌హ్యాండ్ ఇచ్చి "o.k వెళ్ళండి" అని అందరినీ పంపించారు. అప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఆ మహానుభావుడు మనకు కావలసిన శక్తినిచ్చి లోపలికి పంపారు అని. అక్కడ ఒక గంట ధ్యానం తరువాత "క్వీన్స్ ఛాంబర్‌లో 15 నిమిషాలు ధ్యానం" అన్నారు. అక్కడ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు గాలిలోకి లేచినట్లుగా అయ్యింది. నా ప్రక్కన వాళ్ళు కూడా అలాగే లేచారు. పత్రిసార్ o.k అన్నారు. నేను కళ్ళు తెరవకుండా చెయ్యి క్రింద పెట్టి చూశాను నేను క్రిందే వున్నాను. అప్పుడు అనిపించింది క్వీన్స్ ఛాంబర్‌లో 15 నిమిషాలు ఎందుకు ధ్యానం చేయించారో.

 

ఏ పూర్వజన్మ సుకృతంతోనో పత్రిసార్‌తో గీజా పిరమిడ్‌కి వెళ్ళడం, ఈ విధంగా "మనం శరీరం కాదు, ఆత్మ" అని తెలుసుకున్నాం. ధ్యానంలో లోతుగా వెళ్ళేకొద్దీ ఎప్పుడూ అనుభవాలే, ఎప్పుడూ ఆనందమే మరి ఎప్పుడూ ఉత్సాహమే, ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం చెబుతూ పరిణితి చెందిన ఆత్మలుగా పత్రిసార్ సహవాసంతో, సహకారంతో ఎదగాలని కోరుకుంటున్నాను.

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా ప్రచురించబడిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటినీ చదివాను. ప్రతిరోజూ చక్కగా ధ్యానం చేస్తూ అనేక ధ్యానానుభవాలు పొందుతూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను మరి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. నా ద్వారా ఎంతో మంది ధ్యానం నేర్చుకుని వారి వారి రోగాలను తగ్గించుకొని ఆనందంగా జీవిస్తున్నారు.

 

ఎంతో మంది మా ఇంటికి వచ్చి ధ్యానం చేయటం ద్వారా మా రోగాలన్నీ తగ్గిపోయాయనీ హాయిగా ఆనందంగా జీవిస్తున్నామనీ వారు చెపుతూంటే నా ఆనందం వర్ణంచలేనిది. ఈ భూమి మీద ఏదైనా అత్యంత మహత్తరమైన గొప్ప సేవ ఉంది అంటే అది అందరికీ ధ్యానం తెలియజేయటమే "ధ్యానం తెలియజేయటం" అనే సేవ అన్ని సేవల కంటే శతకోటి రెట్లు గొప్పది.

 

ఇంటర్నెట్‌లో స్కైప్ (skype)ద్వారా ప్రపంచంలోని అనేక దేశాల వారితో ధ్యానం క్లాసులను నిర్వహించాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి కౌన్సిలింగ్ కోసం నాకు ఫోన్ చేస్తూంటారు. వారందరికీ ఇలా కౌన్సిలింగ్ చేస్తూ, చక్కటి గైడెన్స్ ఇస్తూ, ధ్యానం నేర్పిస్తూ ఉంటే, ఏమని చెప్పను నాలో కలిగే ఆనందం!

 

ప్రతి సంవత్సరం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ధ్యానమహాచక్రం, ప్రతిసంవత్సరం డిసెంబర్ 18 వతేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా అఖండ ధ్యానంతో, అనేక మంది యోగులతో వారి యొక్క సజ్జన సాంగత్యంతో పత్రీజీ సమక్షంలో జరుపబడే కార్యక్రమానికి దేశ విదేశాల నుండి తరలివచ్చి అత్యంత గొప్ప పండుగలా జరుపుకుంటాము. ఈ ధ్యానమహాచక్రం పండుగ మా అందరి జీవితాలలో ప్రతి రోజు పండుగను తెస్తుంది. ఈ పండుగ కోసం ప్రతి ధ్యాని తపిస్తూ ఉంటారు. మాకు ఇంతటి అత్యద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మ ప్రణామాలు.

 

సందేశం: భారతదేశంలోని అన్ని సచివాలయాలలో ప్రతి ఒక్కరికీ ధ్యాన సుగంధ పరిమళాలు అందిద్దాం. సచివాలయాలన్నింటినీ" ధ్యాన సచివాలయాలు" గా మారుద్దాం.

Go to top