" నేను ఆత్మ అని తెలుసుకున్నాను "

 

 

పేరు: T.తులసి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్

 

 

నా ఆత్మ సహచరులందరికీ "తులసి" అనబడే ఈ ఆత్మ సహచరి ప్రణామాలు.


నేను 2002 లో ధ్యానం నేర్చుకున్నప్పటికీ .. పత్రీజీ ఆధ్వర్యంలో D.కేశవరాజు గారు నిర్వహించిన హిమాలయాల యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత నాలో ధ్యానం పట్ల ఇష్టం బాగా పెరిగింది. మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత బాగా ధ్యానం చేసి, ఎంతో మంది యోగుల పుస్తకాలు చదివి చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ సజ్జన సాంగత్యంతో నా అనుభవపూర్వకంగా "నేను ఆత్మను" అని తెలుసుకున్నాను. ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా బాధపడే నేను .. ధ్యానం ప్రారంభమయ్యాక పట్టించుకోవడం మానివేశాను. ప్రతి నిమిషం ఆలోచనా రహిత స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.

 

మనం ధ్యానాన్ని .. ధ్యాన అనుభవాలతో పాటు, మనలో మంచి గుణాలు పెంచుకోవడానికి జ్ఞానాన్ని పొందడానికి మరి ఎప్పటికప్పుడు మన జీవితంలో వాటిని ఇమిడ్చి అభివృద్ధి చెందాలి "భౌతిక జీవితం అద్భుతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా ఉండాలి." అని తెలుసుకున్నాను.

 

మనం ఆధ్యాత్మికపరంగా ధ్యానప్రచారం చేస్తూన్నా కొన్ని అహంకారాలు తలెత్తుతాయి. "ఆ ప్రకారం ప్రకృతి మన చేత చేయించుకుంటుంది" అని మనం అర్థం చేసుకోవాలి. "అప్పుడు అహంకారం పెరగదు" అని తెలుసుకున్నాను. "మనల్ని చూస్తేనే ఎదుటివారు మనం ఆధ్యాత్మికతతో జీవిస్తున్నాం" అని తెలుసుకునేంత అద్భుతంగా జీవించాలి.

 

ప్రాపంచికంగా ఎంత సంపాదించినప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదల ఉంటేనే మన ఆత్మ ఎదుగుదల ఉంటుందని తెలుసుకున్నాను. ధ్యానంలో ఎందరో మాస్టర్స్ కనపడడం, వాళ్ళ దగ్గర నుండి ఎంతో శక్తిని తీసుకోవడం జరిగింది.

 

నా అంతరాత్మ ఏది చెబితే అది చేస్తున్నాను. పత్రీసార్ కూడా మార్గం చూపిస్తూ ఉన్నారు, ఎంతో శక్తిని చూడగలుగుతున్నాను.

 

సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ "ప్రేమ్‌నాథ్" మరి " బాలక్రిష్ణ" గార్ల ఆధ్వర్యంలో జరిగే సేత్ విజ్ఞానం క్లాస్‌కు నేను అటెండ్ అయ్యాను. నాలో ఉన్న అనేక అనుమానాలు మరెన్నో సంశయాలు తొలిగిపోయాయి.

 

అందరం ఏదో ధ్యానం చేయాలంటే శ్వాసను గమనించడం .. "ఒక గంట, రెండు గంటలు ధ్యానం చేస్తే సరిపోతుంది" అని కాకుండా .. అదే మన జీవితంగా చేసుకుంటే మరి దానిపై మనం ఇష్టం పెంచుకుంటే .. "మన భౌతిక జీవితం పూలబాట అవుతుంది" అని తెలుసుకున్నాను.

 

ఎప్పటికప్పుడు మనస్సు శూన్యం చేసుకుని .. అంతరాత్మ ప్రబోధం అందుకుంటే మనం ఏం చేయాలో బోధపడుతుంది. మనకు ఎవరిపైనా కోపం వద్దు .. "అందరూ మన ఆత్మ సహచరులే" అని గుర్తించుకోండి. ఎన్ని గంటలు ధ్యానం చేశాం అని కాదు .. ఎంత సేపు ఆలోచనా రహిత స్థితిలో ఉన్నామో చూసుకోవాలి. మనం ఒక రోజు 2గంటలు ధ్యానం చేసి ఎవరినైనా కామెంట్ చేసినా, కోపం చూపినా ఆరోజు ధ్యానం వలన వచ్చిన ఫలితం శూన్యం అయిపోతుంది. ఇది ప్రతి ఒక్క ధ్యాని గుర్తు పెట్టుకోవాలి.

 

క్రీస్తు చెప్పినట్లు "దేవుని రాజ్యం మనలోనే ఉంది" అన్నది గుర్తించుకోవాలి. మనం ఏ విషయంలో చూసినా అద్భుతంగా ఉండాలి.. అది ఆధ్యాత్మిక అభివృద్ధి వల్లనే సాధ్యపడుతుంది.

 

"ఒక్క పుస్తకాన్ని బాగా అవగాహన చేసుకుంటే చాలు .. మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకు వస్తుంది" అని తెలుసుకున్నాను. పుస్తకాన్ని చదివి వదిలివేయడం కాదు .. ఆ పుస్తకంలోని విషయాలు ఆచరించాలని గ్రహించాను. మన మీదే మనం ప్రయోగాలు చేసుకోవాలి. మనల్ని ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులుగా పత్రిగారు ఎప్పుడూ పేర్కొంటారు .. అది నిజం చేద్దాం.

 

పత్రీ సార్ చెప్పినట్లు "నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యంతోనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాధిస్తాం" అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

నేను ఎంతో అదృష్టం చేసుకున్నాననుకుంటాను. ఎందుకంటే ఈ జన్మలో నేను ధ్యానం నేర్చుకున్నాను కాబట్టి. పత్రిగారు చెప్పినట్లు స్పిరిచ్యువల్ లైఫ్ బాగుంటే ఫిజికల్ లైఫ్ ఆటోమేటిక్‌గా బాగుంటుంది. ఎవరైతే ధ్యానం తన లైఫ్‌లో బాగంగా చేసుకుంటారో మనలో ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి అనడానికి నా జీవితమే ఒక నిదర్శనం.

 

ధ్యానం ద్వారా మన గత జన్మలన్నీ చూసుకోవచ్చు. నేను నా గత జన్మలన్నీ ఇలానే చూసుకున్నాను. బాలకృష్ణ గారు నిర్వహించే సేత్ వర్క్‌షాప్‌లో ఎంతో మందికి కౌన్సిలింగ్‌లు చేసి వారి గత జన్మలను వారి చేతనే చెప్పించడం జరిగింది. ఇదంతా ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క కృప; వారు లేనిదే నేను లేను, నా ఆధ్యాత్మిక సంపద లేదు. ప్రతిక్షణం వారు నాకు తోడుగా ఉంటారు.

 

చిన్నప్పటి నుంచి "భక్తి" అంటే దేవుని స్తోత్రాలు చదవడం, కొబ్బరికాయ కొట్టడం, అగరుబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం అనుకునేదాన్ని. అది అసలైన భక్తి కాదు; నిజమైన భక్తి అంటే ఎలా ఉంటుందో ఈ ధ్యానం ద్వారానే తెలిసింది. ధ్యానం ద్వారా మన ఆలోచనలను దూరం చేసుకొని మన మైండ్ ఓపెన్‌గా పెట్టుకొని తెల్లకాగితంలా మార్చుకుంటే "అన్ని డైమెన్షన్స్‌లోకి మనం వెళ్ళవచ్చు" అని తెలిసింది.

 

ఒక సారి మేము త్రయంబకం వెళ్ళడం జరిగింది. అక్కడ పూజ జరుగుతూంటే పంతులు గారు అందరు దేవతలనూ మంత్రం ద్వారా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు తమ తమ వాహనాలతో రావడం నేను చూశాను. మరల వీడ్కోలు మంత్రాలతో వాళ్ళను పంపడం చూశాను. "నా వంక చూడవా?" అని నేనన్నప్పుడు విష్ణుమూర్తి నా వంక చూడడం ఈనాటికీ నాకు గుర్తే! ఇదంతా ధ్యాన మహిమ కాక మరేమంటారు?!

 

అలహాబాద్‌లో సూర్య భగవానుణ్ణి మనిషి రూపంలో నేను దర్శించాను ఆయన నవ్వుతూ చూడడం నేను చూశాను. అలహాబాద్ కుంభమేళాకు వెళ్ళేటప్పుడు నాకు కలలో రెండు భావనాలు కన్పించాయి. అలహాబాద్‌లో ట్రైన్ దిగగానే అవే దర్శనమిచ్చాయి!

 

ధ్యాని కాకముందు సంతోషంగానే ఉండేదాన్ని .. ధ్యాని అయిన తర్వాత అసలైన ఆనందంతో ఉంటున్నాను. ఒకసారి మన ధ్యానులు ఢిల్లీ వెళ్ళారు. నేను ఫోన్ చేస్తే ఢిల్లీ రమన్నారు. వెంటనే నేను మెడిటేషన్‌లో కూర్చుని ఢిల్లీ వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కలర్ డ్రస్ వేసుకున్నారో చెప్పగలిగాను! మనం పూర్తి శక్తివంతంగా ఉంటే ఇవన్నీ మనకు చాలా సులువు అని తెలుసుకున్నాను. energy నిలుపుకోవాలంటే సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్లు మనం మెడిటేషన్ రోజుకు 2 గంటలు తప్పనిసరిగా చేయాలి.

 

బ్రహ్మర్షి పత్రి గారు నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు రావడం, క్రిస్‌మస్ నాడు క్రీస్తు కన్పించి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పడం .. ఇవన్నీ ధ్యానం వలన నాకు లభించిన ప్రసాదమే.

 

మనందరం ఒకటే అని మనందరిలో అనంతమైన శక్తి ఉందని మనమే భగవంతుడు అని తెలుసుకుని మనమంతా దివ్యజ్ఞానం పొందే రోజు ఇంకెంతో దూరం లేదు. ఒక్క అడుగు ధ్యానం వైపు వేస్తే 99 అడుగులు ధ్యానమే మనలను లాక్కెళుతుంది. మనం ధ్యానం ద్వారా ప్రశాంతత పొందడమే కాదు భూమండలమంతా ప్రశాంతత పొందుతుంది.

 

ఎప్పుడూ ఇద్దరు మాస్టర్స్ మనతో ఉంటారు. వాళ్ళు మనలను గైడ్ చేస్తూ ఉంటారు. వారు ఇచ్చే సలహాల ప్రకారం నేను నడుస్తూ ఉంటాను. ఇంత గొప్ప ధ్యానం నేర్పిన బ్రహ్మర్షి పత్రీజీకి వేల వేల నమస్సుమాంజలులు. ఆయన నేర్పిన "శ్వాస మీద ధ్యాస" నన్ను ఈ స్టేజ్‌లో నిలబెట్టింది.

 

నేను కాశీ వెళ్ళినప్పుడు కబీరు ఇంటికి వెళ్ళాను. అక్కడ కబీరు చిన్న బాలుడిగా ఫోటో ఉంది. "ఆ బాబు చాలా బాగున్నాడు" అని ఫోటో తీస్తూంటే కళ్ళు ఆర్పుతున్నాడు, తెరుస్తున్నాడు. తరువాత తెలిసింది నా గత జన్మలో కబీరు కుటుంబంలో నేను ఉన్నానని. కాశీలో నాకు ఆరోగ్యం బాగా లేకపోతే ఒక మాస్టర్ వచ్చి ఆస్ట్రల్‌గా నాకు హీలింగ్ చేశారు.

 

ఇప్పటికీ నేను ఎవరు డిప్రెషన్‌లో ఉన్నా, వారు కొత్తవారైనా ధ్యానం చెబుతున్నాను. ధ్యానం అనేది అక్షయపాత్ర ! అది మన చేతిలో ఉంటే అన్నీ మనలో ఉన్నట్లే!

 

ఈ సత్యయుగంలో మనమంతా భగవంతులమే అని మనం తెలుసుకుని మన తోటివారిని కూడా తెలుసుకునేటట్లు చేయగలిగితే మనం తీసుకున్న ఈ జన్మ సాఫల్యం అయినట్లే.

 

నేను మొక్కలతో మాట్లాడడం, వనదేవతలను చూడడం జరిగింది. నేను ఒక రోజు వంట చేసేటప్పుడు ఉప్పు వేయడం మరిచిపోతే అది "నన్ను వెయ్యి" అనడం నేను విన్నాను; "పదార్థంలోని భగవంతుని శక్తి మనలో ఉంది" అని నేను తెలుసుకున్నాను.

 

రండి, అందరం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి మనం సంతోషంగా ఉండడమే కాకుండా భూమండలాన్నంతా సంతోషంగా ఉంచుదాం. అసూయ, కోపం, ద్వేషాలను తరిమి కొడదాం. ఎందుకంటే మనమందరం ఒకటే. భగవంతునిలోని భాగం మనం. మన మీద మనకెందుకు కోపం, అసూయ, ద్వేషం? మన తోటివారితో సఖ్యతతో ఉంటే మనతో మనం సఖ్యతతో ఉన్నట్లు. మనం వారితో అహంకారంగా ప్రవర్తిస్తే మనమీద మనమే అహం చూపించుకున్నట్లు.

 

మన మనస్సును మనం తెల్లకాగితంగా వుంచుకుందాం. ఈ లోకాన్ని ఆనందమయంగా ఉంచుదాం. మా అటెండర్ వాళ్ళ మనవడికి తల మీద సీలింగ్ ఫ్యాను పడి తలనొప్పితో చాలా బాధపడ్డాడు. ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు కానీ తగ్గలేదు. హాస్పిటల్స్ ఖర్చుల కోసం బంగారమంతా అమ్మేశారు. చివరకు ఆ బాబు ఆరోగ్యం కోసం ఇల్లు అమ్మడానికి రెడీ అయ్యారు. చివరకు వాళ్ళ అమ్మ నా దగ్గరకు తీసుకువచ్చింది. నేను కౌన్సిలింగ్‌లో మాస్టర్స్‌ను పిలిచి ఆ అబ్బాయికి హీల్ చేయడం జరిగింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ అబ్బాయికి తలనొప్పి రాలేదు. వారి కుటుంబమంతా నేను క్షేమంగా ఉండాలని ప్రతి రోజూ సూర్య నమస్కారాల తర్వాత కోరుకుంటారని నాతో చెప్పారు. ఈ క్రెడిట్ అంతా మాస్టర్స్‌దీ, ధ్యానానిదీ కాదా!

 

నా చుట్టూ ఉన్న శక్తులను నేను చూడడం, నెగెటివ్ శక్తులను పంపేయడం ఈ ధ్యానం మూలంగా తెలిసింది. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే "శ్వాస మీద ధ్యాస" ధ్యానం మన చేతిలో ఉండాల్సిందే. మన ఖాళీ సమయం అంతా ధ్యానం చేస్తూంటే మనం మన కుటుంబం, మన సొసైటీ, మన దేశం, మన విశ్వం అంతా చాలా, చాలా బాగుంటుంది.

 

పురాణాలు, ప్రవచనాలు జరిగేటప్పుడు దేవతలు ఉంటారంటారు. నేను ఎప్పుడైనా ప్రవచనాలకు వెళితే దేవతలంతా ఆకాశంలో నుంచి చూడడం చాలాసార్లు గమనించాను. అదంతా ధ్యాన మహిమ కాదా!

 

మనం మన అంతర్వాణి ప్రబోదాన్ని వినగలం. ఒక రోజు నా అంతర్వాణి "నువ్వు స్వర్గానికి వెళతావులే" అనడం విన్నాను.

 

మేము ఈ మధ్యనే ఇల్లు కట్టాము. ఇల్లు కట్టేటప్పుడు బోర్ వెయ్యగా 300 ఫీట్లకు కూడా నీళ్ళు పడలేదు. మా భర్తగారు వచ్చి ఎంతకు పడుతుందో మెడిటేషన్‌లో చూసి చెప్పు అని అడిగారు. నేను మెడిటేషన్‌లో చూస్తే "420 ఫీట్లకు వాటర్ పడుతుంది" అని తెలిసింది. సరిగ్గా 420 ఫీట్లకు వాటర్ పడడం అది ధ్యానంలో నాకు తెలియడం, ధ్యానం యొక్క గొప్పతనం కాదా!

 

ఒక రోజు గురు పౌర్ణమి రోజు నేను ధ్యానం చేసాను. ధ్యానంలో గొప్ప గొప్ప ధ్యానానుభవాలు కలిగాయి. రెండు సంవత్సరాల క్రితం నేను రోజుకు పది గంటలు ధ్యానం చేసాను. మొదలు పెట్టిన రోజులలోనే నా DNA మొత్తం గొప్పగా మార్పు చెందింది. దీంతో ఇతర లోకాలతో సంబంధం ఏర్పడింది. వేంకటేశ్వర స్వామి వచ్చి నన్ను చిన్న పాపగా మార్చి చక్కగా ఆటలు ఆడించాడు. ఒక negative energy నన్ను తాకటానికి ప్రయత్నం చేస్తే మహావతార బాబాజీ వచ్చి నా భుజాల దగ్గర గట్టిగా పట్టుకున్నాడు. ఈనాటకీ ఆ స్పర్శ నాకు తెలుసు.

 

రెండు సంవత్సరాల క్రితం నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ ధ్యానం చేసేదాన్ని. ఒక ఏంజిల్ వచ్చి నాతో మాట్లాడుతూంటే నాకు నేనే మాట్లాడుకున్నట్టు ఉంది. "నువ్వు నిజంగా వస్తే నాకు స్పర్శ ఇవ్వు" అన్నా. నా బుగ్గ మీద ‘టచ్’ చేసి వెళ్ళిపోయింది. దీంతో "ధ్యానం ద్వారా మనం multi dimensional beings తో మాట్లాడవచ్చు" అని తెలిసింది.

 

ఈ మధ్య హనుమంతుని జయంతికి నేను గుడికి వెళితే అక్కడ హనుమంతుడు శక్తిని పంపడం చూశాను. మన మైండ్ శూన్యంగా ఉంచుకుంటే ఎందరో మాస్టర్స్ మనకు శక్తిని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకే బ్రహ్మర్షి పత్రి గారు "మాటలోని మౌనం, మనసులోని శూన్యం దాని పేరు ధ్యానం" అన్నారు. అందుకే మనమందరం ధ్యానం చేద్దాం. ప్రకృతితో సహజీవనం చేద్దాం. ప్రకృతితో మనం కలిసి నడుద్దాం. అప్పుడే విశ్వశాంతి వస్తుంది. ప్రపంచ గురువులు కలగన్న ఆధ్యాత్మిక స్వర్గం ఏర్పడుతుంది.

 

విశ్వశక్తి ప్రవాహం, ఆ శక్తి మనలో తీసుకువచ్చే మార్పులు గమనించాలంటే మనం ఆలోచనారహిత స్థితిలో ఉండాలి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు మనం చేసిన పనులు ఏ రోజుకు ఆ రోజు ‘చెక్’ చేసుకోవాలి. "అలా చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల సాధిస్తాము" అని నేను తెలుసుకున్నాను.

 

"మనం ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం చేస్తూ .. విశ్వకళ్యాణానికి సహాయపడుతూ ఉంటే ప్రకృతి మనకు సహాయపడుతుంది. మనం ఇచ్చిన దాని కంటే ఎక్కువే ప్రకృతి ఇస్తుంది" అన్న సందేశం ధ్యానంలో రావడం జరిగింది.

 

ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరితో ‘ధ్యానం’ చేయించాలి. ‘ధ్యాన ప్రచారం’ చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోకి రావాలనీ, వారి ఆరోగ్యాలను బాగు చేసుకుని, వారి కర్మలను తొలగించుకోవాలనీ, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనీ కోరుకుంటూ ఈ బాటలో అందరినీ ముందుకు తీసుకువెళ్తూ, ఒక దిక్సూచిగా మరి మార్గదర్శిగా ఉంటున్న మన బ్రహ్మర్షి పత్రీజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆధ్యాత్మిక రంగంలో భూమి మీద అందరికీ సహాయపడుతున్న ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను.

 

సందేశం: ధ్యానం చేయడం ద్వారా మన అంతర్వాణి మనల్ని ఆనందమయ జీవితం వైపు నడిపిస్తుంది. కనుక మనమందరం ధ్యానం చేద్దాం. ఆనందంగా జీవిద్దాం.

Go to top