" అసలు సత్యాన్ని తెలుసుకోవాలనుంది "

 

 

పేరు : K.శివరమ్య
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పంచాయతీరాజ్

 

పూజ్య గురువులైన పత్రీజీకీ నా ఆత్మప్రణామాలు. పాఠకులందరికీ నా ఆత్మాభివందనాలు. నా ధ్యాన ప్రస్థానంలోని కొన్ని ధ్యానానుభవాలను, ఆధ్యాత్మిక యాత్రల అనుభూతులను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నతనంలోనే కలిగిన నా తండ్రి వియోగం నా జీవితంలో చావు పట్టుకలంటే ఏమిటనే ప్రశ్నను ఉదయింప చేసింది. నా ఇష్టదైవమైన ఈశ్వరుడే నాకు అన్నింటికీ ఆధారమనిపించేది; జీవితంలో అన్నీ ఉన్నా కూడా నాలో ఏదో తెలియని అశాంతి .. "జీవితమంటే ఇంతేకాదు ఇంకా ఏదో ఉంది" అనిపించేది.

 

2008లో పరమహంస యోగానందగారి "ఒక యోగి ఆత్మకథ" అనే పుస్తకపఠనంతో నా జీవితంలో ధ్యానమనే అధ్యాయం మొదలయ్యింది. ఆ పుస్తకం చదువుతున్న రోజులలో నా కలలో శ్రీ యుక్తేశ్వర గిరి గారు కన్పించటం, ధ్యానం చేయాలనిపించి కూర్చున్నప్పుడు నా రెండు కనుబొమ్మల మధ్య క్షణ మాత్రం వెలుగు కన్పించడం నన్ను ధ్యాన మార్గం వైపు మళ్ళేటట్లు చేసాయి. మనల్ని ధ్యాన మార్గంలోకి తీసుకు రావటానికి మన మీద దయతో గురువులు పరోక్షంగా కొన్ని అనుభవాలను కలిగిస్తారనిపించింది.

 

ధ్యానం మొదలు పెట్టిన కొద్ది రోజులకు పూజ్య గురువు పత్రీజీగారి దర్శన భాగ్యం లభించింది. ఆ రోజు ఆయన ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన నుండి వచ్చే తరంగాలు నా నుదుటిని తాకి ఆ ప్రాంతం ఉత్తేజితమవటం నేను అనుభూతి చెందాను.

 

ఆయన సారధ్యంలో జరిగిన హిమాలయ ధ్యానయాత్రకు నేను వెళ్ళగలననిగానీ, దానికి ఇంట్లో వాళ్ళే నన్ను ప్రోత్సహించి పంపిస్తారని గానీ కలలో సైతం ఊహించలేదు! ఈ యాత్రకు అన్ని సన్నాహాలు చేసుకున్నాను. కానీ యాత్ర 5 రోజులు ఉందనగా ఎప్పుడూ రాని విపరీతమైన వెన్నునొప్పి మొదలయ్యింది. చివరికి యాత్ర నుండి విరమించాలని నిశ్చయించుకున్న తరుణంలో నా కలలో "షిరిడీ సాయి" కన్పించి నాకు తన చేతిని అందించటం, ఉదయం లేచేసరికి వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోవటం జరిగింది. ఈ కల నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక సద్గురువు తన భక్తులను ఎలా కాపాడతాడో అర్థమయ్యింది. ఈ హిమాలయ ధ్యానయాత్ర నా జీవితంలో మరుపురాని మధురస్మృతి ! ఈ యాత్రానుభవాలను కొన్నింటిని మీతో పంచుకుంటాను.

 

హిమాలయ ధ్యాన యాత్ర:

 

దేశం నలుమూలల నుండి వచ్చిన ధ్యానులందరం పూజ్య గురువు పత్రీజీ సారధ్యంలో వసుధైక కుటుంబంగా బస్సులలో ఈ యాత్రకు బయలుదేరాము. ఒక్క ప్రక్క ఎత్తైన పర్వతాలు మరియొక ప్రక్క ఎంతో లోతైన లోయలు మధ్యలో వంపులు తిరిగిన మార్గం గుండా మా ప్రయాణం కొనసాగింది. మార్గమధ్యంలో కొండ చరియలు విరిగిపడిన ఆనవాళ్ళు, బస్సులు వెళ్ళడానికి వీలుకాని క్లిష్టమైన మార్గంలో కర్రల సాయంతో నడక, గుర్రాలపై కూడా ప్రయాణించాము. మామూలుగా అయితే ఇది ఎంతో ప్రమాదకరమైన ప్రయాణం కానీ ఒక సద్గురువు సారధ్యంలో వెళ్ళటం వలన మా రక్షణ భారమంతా ఆయనపై వేసి మేము ఈ యాత్రలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నాము.

 

అంబరాన్నంటే ఆ హిమాలయ శ్రేణుల సోయగానికీ, అబ్బురపరచే ఆ లోయల సౌందర్యానికీ, ఉదయభానుని అరుణ కిరణాలు సోకి పసిడి వర్ణంలో మెరిసే హిమగిరుల అందానికీ, శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ మహా వృక్షాల రాజసానికీ, మార్గం పొడవునా పయనించే స్వచ్ఛమైన గంగా ప్రవాహ ఝురికీ, ప్రేమతో పలకరించే మలయ మారుతాల స్పర్శకూ, ఆ ఆహ్లాదప్రశాంత ప్రకృతిలో మా హృదయాలు ఎంతో ఆనందంలో పరవశించాయి. ప్రకృతిసిద్ధంగా పర్వతశ్రేణులలో ఏర్పడిన శక్తి క్షేత్రాలైన పిరమిడ్లను కొన్ని చోట్ల దైవరూపాలను పోలిన పర్వతశ్రేణులను దర్శించినప్పుడు ప్రకృతిని సృష్టించిన ఆ దైవమే ప్రకృతిలో ప్రతిబింబించటం ఎంతో అద్భుతమనిపించింది ఆ అనుభూతులకు అక్షర రూపం ఇవ్వటం చాలా కష్టమే.

 

ఆధ్యాత్మికతకు నెలవై దేవతలు, మహర్షులు నడయాడే ఆ స్వర్గధామంలో గురు సాంగత్యంలో ఆశ్రమాలలో విశ్రమిస్తూ, గురువు చెప్పే ఆత్మజ్ఞాన ప్రబోధాలను అవగతంచేసుకుంటూ ఆ ప్రశాంత ప్రకృతిలో మమేకమై ధ్యానం చేసి ఎంతో విశ్వశక్తిని, ఎన్నో అనుభవాలను, అనుభూతులను పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను. బదరీనాథ్ క్షేత్రంలో ఆ స్వామి దివ్యమంగళరూపాన్ని చూసి భక్తిభావంతో పరవశులమయ్యాము.

 

ఆ హిమాలయాలలో ఉన్న ద్వారాహాట్‌లోని శ్రీ మహావతార్ బాబాజీ గుహకు వెళ్ళగానే బాగా ఎండగా ఉన్న ఆ ప్రాంతం చిరుజల్లులతో వర్షించడం బాబాజీ మా అందరికీ పలికిన ఆత్మీయ ఆహ్వానంలా అనిపించింది. బాబాజీ, లాహిరీ మాహాశయ వంటి మహాత్ములు ధ్యానం చేసిన గుహలో దివ్యశక్తి తరంగాల మధ్య పూజ్య గురువు పత్రీజీతో కలిసి ధ్యానం చేసి ఆత్మానుభూతిని పొందటం ఆ గురువులందరూ మా మీద కురిపించిన కరుణా కటాక్షాలే ! పూలలోయలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆహ్లాదకర అద్భుత ప్రకృతిలోని విన్నూత పుష్పాలు వాటినుండి వచ్చే దివ్య పరిమళాలకు మా హృదయాలు ఎంతో పులకించాయి. అక్కడి ప్రతి పువ్వు ఒక ఋషి పుంగవుడిలా సాక్షాత్కరించింది.

 

ఈ యాత్ర తర్వాత నాకు ధ్యానం పట్ల మరింత మక్కువ పెరిగింది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం నా జీవితంలో భాగమయ్యాయి. వీటి ద్వారా నా జీవితంలో కొంత మార్పు వచ్చింది. నాకు కలిగిన ప్రతి సంశయాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నివృత్తి చేసి ఈ ధ్యానమార్గానికి నన్ను దూరం కాకుండా అన్ని విధాలా విశ్వాసాన్ని కలిగించి నన్ను కాపాడి, నడిపించిన పూజ్య గురువులందరికీ నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను? .. వారి బాటలో పయనించటం తప్ప! "సంశయాల నుండి వచ్చిన విశ్వాసం అతి బలమైనది" అని స్వామిరామా అంటారు.

 

"ఒక యోగి ఆత్మకథ" లో అలహాబాద్ కుంభమేళాకు ఎంతో మంది యోగులు, సాధువులు వస్తారని, లాహిరీ మహాశయులను శ్రీ మహావతార్ బాబాజీ అక్కడే కలిసారనీ చదివినప్పుడు .. అంత మంది ఆత్మజ్ఞానులు, సాధకులు వచ్చే అలాంటి కుంభమేళాను నా జీవితంలో ఒక్కసారైనా దర్శించగలిగితే ఎంత బాగుంటుందో అనుకున్నాను. నిజంగానే నా ఈ కలను ప్రేమతో ఆ ఈశ్వరుడే సాకారం చేసాడు. 144 సంవత్సరాలకు వచ్చే మహా కుంభమేళాకు అలహాబాద్‌కు వెళ్ళేందుకు నా స్నేహితురాలు, మరో ఇద్దరు టికెట్స్ రిజర్వ్ చేసుకుంటే, అందులో ఒకరు వెళ్ళలేక పోవటం వల్ల ఆ స్థానంలో అనుకోకుండా నేను వెళ్ళటం జరిగింది.

 

స్టేషన్ నుండి కుంభమేళాకు వెళ్తున్న దారిలో శృంగేరి పీఠం వారి వేద పాఠశాల కన్పించటం, అక్కడ పూజ్య భారతీతీర్థానంద స్వామి మరి పత్రీజీ గార్ల పోస్టర్లు ఉండటం చూసాం. చాలా మంది దానులు అక్కడ బసచేసారని తెలిసి అక్కడకు వెళ్ళాం. ఆ రోజు పూజ్య గురువు పత్రీజీతో కలసి కుంభమేళాను దర్శించటం ఒక అద్భుత అనుభవం, ఆ ఆత్మానుభూతి మాటలకందనిది. అక్కడ ఉన్న మూడు రోజులు ఎంతో మంది మహాత్ములను కలిసి వారి ఆశీస్సులను పొందాము. అంతా ఈశ్వరమయం ఎటుచూసినా ఆత్మానందం. కైలాసమంటే ఇలాగే ఉంటుందేమోననిపించింది. అమావాస్య రోజు కోటికి పైగా జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. నడవటానికి కష్టం, వాహనాలు వెళ్ళలేవు. మేము నడుస్తున్నప్పుడు బాగా నడుం వంగిపోయి వర్ఛస్సుతో ఉన్న పండు వృద్ధురాలు కర్ర సాయంతో ఒంటరిగా కన్పించింది. చూసినప్పుడు ఏ ఆలోచనా రాలేదు. ఆమెను దాటివెళ్ళిన తర్వాత ఆలోచిస్తే ఆ సమయంలో అలాంటి వృద్ధురాలు అక్కడ ఉండటం అసాధ్యం కదా అన్పించింది. కుంభమేళాలో బాబాజీనే ఆ విధంగా దర్శనమిచ్చి మా కోరొక తీర్చారేమోననిపించి ఎంతో ఆనందపడ్డాము.

 

అదే రోజు మా తిరుగు ప్రయాణం. రైల్వే స్టేషన్‌లో త్రొక్కిసలాటలో ప్రాణాపాయస్థితి. ప్రక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మా పరిస్థితి కూడా అంతే. కానీ ఏ దైవ హస్తమో, గురువు అనుగ్రహమో మమ్మల్ని కాపాడింది. అతి కష్టం మీద ఫుట్‌పాత్ మీదకు వచ్చాము. నా స్నేహితులు కొంతదూరంలో వేరేవారితో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలను ధరించిన ఆజానుబాహుడైన బాగా కాంతివంతంగా ఉన్న ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి "ఇంత రద్దీలో వెళ్ళకపోతే తర్వాత వెళ్ళవచ్చు కదా ! తొందరపడితే ఇలానే కష్టపడవలసి వస్తుంది" అని హిందీలో కోపంగా మందలించాడు. నాకు భయం వేసి స్నేహితుల దగ్గరకు వెళ్ళాను. ఆయన ఒక యోగిలా ఉన్నారు. "నిన్ను ఎందుకు కోప్పడ్డారు?" అంటే, జరిగింది చెప్పాను; "ట్రైన్ 15 గంటల ఆలస్యం" అన్నారు. రాత్రంతా ఆ రద్ధీలో అలాగే కూర్చున్నాము. ఆయన కూడా కొంత దూరంలో ఉండి అప్పుడప్పుడు మా వైపు చూస్తున్నారు. తెల్లవారు ఝామున 4-30 గంటలకు కొంచెం మగతగా అనిపించింది. ఆ సమయంలో నా తలపై ఎవరో మెల్లగా చేయి వేసినట్లనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఆయన వెలుతూ కనిపించారు. ఈశ్వరుడే మా రక్షణ కోసం ఆ మహాత్మని పంపారనిపించింది. కుంభమేళాలో జరిగిన ఈ ప్రత్యక్ష అనుభవాల్ని తలచుకుంటే ఈశ్వరుని ప్రేమకు ఆనంద బాష్పాలు వస్తాయి.

 

స్వాధ్యాయంలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదివాను. ఎన్నో తెలియని విషయాలను తెలుసుకున్నాను. వాటిలో కొన్నింటిని అనుభవపూర్వకంగా పొందాను. ధ్యాన సాధన వైపు నన్ను ప్రేరేపించిన "తులసీదళం" (పత్రీజీ), "ఒక యోగి ఆత్మకథ", "మానవుని నిత్యాన్వేషణ" (పరమహంస యోగానంద), "హిమాలయ యోగులు" (స్వామి రామ), భగవద్గీత, రామకృష్ణ మఠం వారి పుస్తకాలు, రమణ మహర్షి పుస్తకాలు, లాహిరి మహాశయుల చరిత్ర, ఓషో గారి చాలా పుస్తకాలు ముఖ్యంగా "అతీషా ప్రజ్ఞావేదం", "అష్టావక్రగీత", "వేదాంత", టోర్కోమ్ సెరాయిడారియన్ పుస్తకాలు, "సూక్ష్మశరీరయానం", "మహా పరిసత్యాలు", పరుసవేది" మొదలైనవి.

 

ప్రతిరోజూ ధ్యాన సాధన, ఖాళీ సమయాలలో స్వాధ్యాయం, వీలున్నప్పుడు సజ్జన సాంగత్యం. ధ్యానం ద్వారా వచ్చిన ప్రశాంతతను ఎప్పుడూ నిలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగల శక్తి పెంపొందింది. ప్రేమతత్వం పెరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి రాక ముందు ఉన్న భయం, ఆత్మ విశ్వాసం లేకపోవటం, అనారోగ్యం లాంటి సమస్యలను అధిగమించగలిగాను. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే/స్వీకరించే శక్తి వాటి నుండి ఎన్నో పాఠాలు నేర్చుకొనే దృష్టి అలవడింది. నా ఒక్కగానొక్క సోదరుని మరణ సమయంలో మనోధైర్యాన్ని కోల్పోక సమస్థితిలో ఉండడానికి ధ్యానమే కారణం. అసలైన ఆనందం బాహ్యంగా లేదు నాలోనే ఉందనేది తెలుసుకున్నాను.

 

ధ్యానంలో మనస్సు, శ్వాస ఏకమై శూన్యమవుతూ అంతర్ముఖంగా ఆత్మవైపు పయనిస్తున్నప్పుడు ఎంతో విశ్వశక్తిని పొందటం, కొన్ని అంతర్‌దర్శనాలు, గురువుల కృపతో కూడిన మార్గదర్శకత్వం, అప్పుడప్పుడూ దర్శనమిచ్చే ఆత్మవెలుగులు, కొన్ని దైవ దర్శనాలు, సూక్ష్మశరీరయానాలు, అంతరాత్మ ప్రబోధాలు మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉంది. కొన్ని గతజన్మల జ్ఞాపకాలు పొందాను. ధ్యానంలో కొన్ని సార్లు చైతన్యం విస్తరించినట్లు మరికొన్నిసార్లు చిన్నగా అయినట్లు అన్పించేది. అప్పుడప్పుడు ధ్యానంలో బాహ్యస్పృహ లేకుండా "నేను" (ఆత్మ) అనే ఉనికి మాత్రమే ఉన్నట్లనిపిస్తుంది. ధ్యానంలో వచ్చే అనుభవాలు అనుభూతులతోనే తృప్తి చెందకుండా వాటిని ప్రేరణగా తీసుకొని "శాశ్వతంగా నిలిచి వుండే సత్యాన్ని (ఆత్మస్థితిని) పొందాలి" అనే తపన కలుగుతుంది. దీనికి ఈశ్వరుని అనుగ్రహం, గురువుల కృప తప్పక తోడవుతాయనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను.


నా ఆధ్యాత్మిక ప్రగతికి కారణమైన మరొక అంశం ఏమిటంటే .. ధ్యానమహాచక్రాలలో పాల్గొని ఎంతో ఉన్నత స్థితి సాధించిన గురువులతో కలిసి సామూహిక ధ్యానం చేయటం, దీని వల్లనే కడ్తాల్ అఖండ ధ్యానంలో 24 గంటలు లేవకుండా ధ్యానం చేయగలిగాను. ఒకసారి ధ్యానంలో సర్వవ్యాప్తమైన ఈశ్వర రూపాన్ని మానస సరోవరాన్ని దర్శించగలిగాను. ఎప్పుడైనా బాబాజీ రూపం ధ్యానంలో దర్శనమిస్తుంది.

 

ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక అర్థమైనదంటే ఆ పరమాత్మ మనందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు భిన్నంగా మనం లేమని, అంటే మనం ఆత్మస్వరూపులమేనని, కానీ బహిర్ముఖమైన మనస్సు, మాయచే అరిషడ్వర్గాలనే పొరలతో మన సహజస్థితి అయిన ఆత్మ కప్పబడిందని, దీని వల్లనే సుఖ దుఃఖాలనే అవస్థలకులోనై మన జీవితాలను దుఃఖమయం చేసుకుంటున్నామని, మనలో ఉన్న ఆత్మ మనం చేసే కర్మలకు న్యాయాన్యాయాలను తేల్చి కర్మ ఫలాలలను నిర్ణయిస్తుందనీ తెలుసుకున్నాను.

 

కాబట్టి మనకొచ్చే కష్టాలకు మన మనస్సే కారణమనీ, భూమి ఒక పాఠశాల లాంటిదని, ప్రతి అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని ఎన్నోజన్మల తర్వాత మన సహజస్థితిని అయిన ఆత్మను పొందుతామని తెలుసుకున్నాను కానీ ధ్యానం ద్వారా అంతర్ముఖులమై మన కర్మఫలాలను ధ్యానాగ్నిలో దగ్ధం చేస్తూ, ఈ పొరలను చేధిస్తే కొన్ని జన్మలలోనే మన సహజస్థితిని చేరి మనమే సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మను చేరుతామని, అందుకే ఈ మానవజన్మ ఇవ్వబడిందని, దీన్ని సాధించాలంటే .. నిరంతర సాధన, ఈశ్వరుని కృప, గురువు అనుగ్రహం కూడా కావాలనీ తెలుసుకున్నాను. అందుకే ఈ స్థితిని కొద్ది మంది మాత్రమే పొందుతున్నారు. కానీ చిత్తశుద్ధి, ఆత్మస్థితిని పొందాలనే తపన ఉంటే వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అప్పుడు ఈ స్థితిని పొందటం ఎవరికైనా సాధ్యమే అవుతుంది. ఎందుకంటే ఆ పరమాత్ముని బిడ్డలుగా మనందరం దీనికి అర్హులమే.

 

సందేశం: తనను తాను తెలుసుకోవటానికి పరమాత్మ మనకు ప్రసాదించిన ఈ మానవజన్మలో ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖమై గురువు మార్గదర్శకత్వంలో ఆ పరమపథాన్ని చేరటానికి మనం ఒక్క అడుగైనా ముందుకేసే ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మకు సార్థకత లభించినట్లే.

 

నా ఈ అనుభవాలను, అనుభూతులను, అసాంతం ప్రేమతో పంచుకున్నందుకు పాఠకులందరికీ హృదయపుర్వక ధన్యవాదాలు. ఈ అనుభవాలు మీలో ధ్యానం పట్ల ప్రేరణ కలిగిస్తే పరమాత్మకి కృతజ్ఞతలు.

Go to top