" ధ్యానం ద్వారానే ఆరోగ్యం, మనశ్శాంతి మరి ఆనందం "

 

 

పేరు: C.V.సరళా రాణి
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ

 

 

పాఠకులందరకీ ధ్యానాభివందనాలు.

 

పరిగెత్తే కాలం ఒరవడికి రాలిపోయే క్షణాలలో అతి విలువైన క్షణాలంటూ నా జీవితంలో ఉన్నాయంటే .. " అవి నేను ధ్యానం చేసిన క్షణాలే " అని చెప్పాలి. ఎందుకంటే నెట్టినా పోని ఆలోచనలతో, కట్టేసినా ఆగని తలపులతో .. జీవన వాహినిలో నిరంతరం ఎదురయ్యే అనేక సంఘర్షణలతో విసిగి వేసారిపోయిన మనస్సుకు ప్రశాంతతను, ఆత్మస్థైర్యాన్ని .. అలసిన మెదడుకు విశ్రాంతిని, చురుకుగా పని చేయడానికి శక్తిని అందిస్తూ .. నన్ను నన్నుగా చూపుతూ, నన్ను నన్నుగా మిగిల్చింది ‘ పిరమిడ్ ధ్యానమే ’!

 

ధ్యానం విలువ తెలిసినా, సరియైన విధానం ఏమిటో తెలిసేది కాదు. అప్పుడప్పుడు నేను డిస్ట్రబ్ అయినప్పుడు నాకు తెలిసిన పద్ధతిలో ధ్యానం చేసేదానిని. కానీ పిరమిడ్ ధ్యానం తెలిసిన తరువాత, "ఇదే సరియైన విధానం" అనిపించింది. ఈ విధానం గురించి నాకు తెలియచేసిన శివరమ్యకు, ప్రోత్సహించిన అనురాధకు కృతజ్ఞతలు.

 

నాకు చాలా రోజులుగా స్పాండిలైటిస్, నిద్రలేమి సమస్యలు ఉండేవి. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఆ సమస్యలు ఏ మందులు వాడకుండానే దూరం అయ్యాయి. ధ్యానం ద్వారా ఆనందం, ఆరోగ్యం మరి మనశ్శాంతి పొందగలమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కనుక నాకు తెలిసినవారందరనీ ధ్యానం చేయమని ప్రోత్సహిస్తున్నాను.

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా ప్రచురించబడిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటిని దాదాపుగా చదివాను. పత్రీజీ గారి " తులసీదళం ", లోబ్‌సాంగ్ రాంపా గారి బుక్స్ "మరణంలేని మీరు", " థర్డ్ ఐ", పీటర్ రిఛెలు వారి " ఆత్మాయణం", పరమహంస యోగానంద గారి " ఒక యోగి ఆత్మ కథ ", మానవుని నిత్యాన్వేషణ స్వామిరామా గారి " హిమాలయ యోగులు ", రమణ మహర్షి గారి పుస్తకాలు, " లాహిరి మహాశయుల చరిత్ర ", ఓషో గారి " అష్టావక్రగీత " మరియు అమీష్ ట్రిపతి గారి " శివా ట్రయాలజీ " అంటే చాలా ఇష్టం.

 

ప్రతిరోజూ చక్కగా ధ్యానం చేస్తూ అనేక ధ్యానానుభవాలు పొందుతూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను మరి కౌన్సిలింగ్ చేస్తున్నాను.

 

బెంగుళూరులోని పిరమిడ్ వ్యాలీలో నిర్వహించబడిన గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్స్ ప్రోగ్రామ్‌కి నేను వెళ్ళినప్పుడు ఎంతో శక్తివంతంగా అయిపోయాను. నాలోకి ఎంతో దివ్యశక్తి ప్రవేశించింది. దేశ విదేశాల నుండి వచ్చిన గొప్ప గొప్ప స్పిరిచ్యువల్ సైంటిస్టులను చూడటం, వారిని కలవటం, వారితో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు ఆ ప్రోగామ్‌లో కలిగాయి.

 

ధ్యానమహాచక్రం నా జీవితంలో ఎంతో గొప్ప మార్పు తీసుకువచ్చింది. అన్ని వేల మంది ఒకే చోట కూర్చుని గంటలు గంటలు ధ్యానం చేస్తూ, కలిసిమెలిసి వసుధైక కుటుంబంలా జీవించటం అన్నది ఎంతో గొప్ప విషయం. ఇంతటి గొప్ప సంఘంలో నేను భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నాను.

 

ఈ భూమి మీద మనిషి చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే అది ధ్యానం చేయటం.


ఈ భూమి మీద మనిషి చేయవలసిన సేవ ఏదైనా ఉంది అంటే అది ధ్యానాన్ని బోధించడం.


నా యొక్క లక్ష్యం పత్రీజీ జ్ఞానాన్ని ప్రపంచానికంతటికీ అందించడమే.

 

సందేశం: " ఒక సద్గురువును పొందడమే నీ జీవితంలో నువ్వు సాధించవలసిన మహత్కార్యం, ముక్తి మార్గం" అంటారు ‘ఓషో’. నేను ఎటువంటి సాధన చేయకుండానే పత్రీజీని గురువుగా పొందినందుకు చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. మనమంతా ధ్యానం చేద్దాం. మనమంతా భాగ్యవంతులమవుదాం.

Go to top