" ఏకలవ్య శిష్యురాలిని "

 

పేరు: D. విజయశ్రీ
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం: ప్లానింగ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు. ముందుగా పత్రీజీకి ఏకలవ్య శిష్యురాలు ధ్యాన నమస్కారాలతో ..

 

ధ్యాన సాధనకు ముందు, రోజుకి రెండు నిద్రమాత్రలతో రెండు, మూడు గంటలసేపు నిద్రపోయే పరిస్థితి నాది. ధ్యాన అభ్యాసం మొదలుపెట్టి మాకు ధ్యాన ప్రక్రియను నేర్పి, మమ్మల్ని ధ్యానం వైపు నడిపిస్తోన్న .. శ్రీమతి ‘ సూర్యప్రభ ’ గారికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాం. ఆ ధ్యాన మూర్తి అడుగు జాడలలో నడుస్తూ రోజూ ఉదయం బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుండి 5 గంటల వరకు ధ్యానం చేస్తూ .. ఇప్పుడు ఒక్క నిద్రమాత్ర కూడా వేసుకోకుండా నాలుగు గంటల సమయం పూర్తిగా నిద్రించటం అనేది నాకు ఆనందాన్ని మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ధ్యానం చేస్తూ .. మాస్టర్లందరినీ కలుస్తూ అనేక విషయాలు నేర్చుకుంటున్నాను.

 

ప్రతి ఒక్కరం అనేక సమస్యలతో జీవిస్తూంటాం. అయితే, ధ్యానం చేయటం ద్వారా సమస్యలన్నీ తొలిగిపోయి ఆనందంగా జీవిస్తాం.

 

ధ్యాన కాలవ్యవధి పెరిగే కొద్దీ నాకు "ఇవాళ ఇది జరుగుతుందేమో " అనే ఒక స్పష్టమైన భావన రావటం .. ముందే తెలియటం, ఆ సంఘటన అలాగే జరగటం, ఇంట్లో అయినా ఆఫీసులో అయినా నేను స్పష్టంగా గమనించాను.

 

ముఖ్యంగా పౌర్ణమి రోజున ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి నాకు ఎవరో కొంతమంది వ్యక్తులు తెల్లటి దుస్తులతో కనిపించారు, ఆరుబయట పచ్చిక బయళ్ళలో వారితో నేను నడుస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియలేదు. కళ్ళు మూసిన ప్రతిసారీ వాళ్ళ వెంబడి నేను ఉంటున్నాను. మళ్ళీ ధ్యానం అయి లేచాక ఏదో కొత్త ఉత్సాహం, శక్తి నాలో నిండిపోయి శరీరం తేలికైన భావన కలుగుతోంది.

 

ఒక్కొక్కసారి గాలిలో తేలుతున్న ఫీలింగ్ అన్నీ తలచుకుంటే నాకు ఎంతో కాస్మిక్ ఎనర్జీ అందుతూన్న వైనం స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. దానివల్ల పత్రీజీ చెప్పిన విధంగా శాకాహార ప్రపంచాన్ని మనం తయారు చేసుకుని, ప్రకృతిలో జరిగే పలు అనర్థాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ, ఇతరులకు చెయ్యి అందించే స్థితికి చేరతాం. అప్పుడే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన ప్రపంచాన్ని మనం చూడవచ్చు. చివరిగా ధ్యాన మాస్టర్స్ అందరికీ కోటానుకోట్ల ధ్యాన నమస్కారాలు.


సందేశం : మనమందరం ధ్యానం చేద్దాం. చక్కటి ధ్యానానుభవాలతో జ్ఞానవంతంగా జీవిద్దాం.

Go to top