" అంతా మనలోనే ఉంది "

 

 

పేరు: K.P. లక్ష్మీ నరసమాంబ
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

విశ్వ కళ్యాణ సాధనకు సారధ్యం వహిస్తున్న బ్రహ్మర్షి పత్రీజీకి నా హృదయపూర్వక నమఃస్సుమాంజలి. ధ్యాన సాధన చేస్తున్న సహోద్యోగులకు అభినందనాంజలి. నాకు ధ్యానం గురించి పరిచయం చేసింది నా సహోద్యోగిని తులసి.

 

నాకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. శ్రీ లలితామ్మ వారిని ఆరాధిస్తాను. లలితా సహస్ర నామం పాడుకుంటూనే పనులన్నీ చేసుకోవడం అలవాటు. గుడికి వెళ్ళినా, పూజ చేసినా "నాకు ఇది కావాలి" అని కోరను. మనసార "శ్రీమాతా" అని తలచుకొని పడుకోవడం అలవాటు నిద్రలోనే మెలకువ, అంతా వెలుతురు. చుట్టూ ఏవో వలయాలు తిరుగుతున్నట్లు ఉంటుంది. పట్టుకోవాలని చేయి చాస్తే మాయమైపోయేది. అప్పుడప్పుడూ ఏవో మాటలూ, పాటలూ వినిపించేవి. కళ్ళు తెరచి చూస్తే ఏమీ వుండేది కాదు. అదంతా ఏమిటో అర్థమయ్యేది కాదు. ధ్యానం చేయటం మొదలుపెట్టాక అందరూ వారి వారి అనుభవాలు చెబుతూంటే నాకు జరిగేది ఏమిటో అర్థం అవుతోంది.

 

ధ్యానం అంటే నాకు ఇష్టం ఉండటం వల్ల, ధ్యానం క్లాసుకు వెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తూ నేను వెళ్ళిన మొదటి రోజే "స్పిరిచ్యువల్ రియాలటీ" మెడిటేషన్ C.D. చూడటం జరిగింది. మెడిటేషన్ సమయంలో "కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎలా ప్రసరిస్తుంది .. నాడీమండలంపై ఎలా ప్రభావం చూపిస్తుంది" అనేది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. వెంటనే వారిని అడిగి C.D.తీసుకొని ఆఫీసులో మా సహోద్యోగులకు, ఇంట్లో మా వారికి, బంధువులకు మరి స్నేహితులకు చూపించటం జరిగింది. వెంటనే పిరమిడ్ క్యాప్స్ తెప్పించి ధ్యానం చేయటం మొదలు పెట్టాం.

 

ధ్యానం చేసే సమయంలో తల పూలకొమ్మవోలాగా ముందుకో, వెనక్కో లేదా పక్కకో వాలిపోతూంటే ఎందుకో అర్థమయ్యేది కాదు "అయ్యో! నా తల ఇలా వంగిపోతున్నదేమిటి?" అనుకొనేదాన్ని. "ఎనర్జీ మనలో ప్రవహిస్తున్నప్పుడు అలా అవుతుంది" అని తరువాత తెలిసింది. ఇంట్లో కంటే సచివాలయంలోని "L" బ్లాకులో అందరితో కలిసి ధ్యానం చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీస్ రావడం గమనించాను. ధ్యానం చేయడం వల్ల మనస్సులోనూ, వెలుపలా ఎంతో ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతుంది. ధ్యానం చేయడం ద్వారా అనారోగ్యాల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. నా ద్వారా వీలైనంతమందికి ధ్యానాన్ని అందించటానికి ప్రయత్నిస్తాను.

 

సందేశం: మనమందరం అనునిత్య ధ్యానసాధన, ధ్యాన ప్రచారం ద్వారా సర్వ శుభాలనూ పొందుదాం.

Go to top