" పిరమిడ్ ధ్యానం ఎంతో సులభం "

 

 

పేరు : A.K.రాజేశ్వరి
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం: ఇరిగేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యాన పరిచయం "సిద్ధ సమాధి యోగ" ద్వారా మొట్టమొదట 2000 సంవత్సరంలో జరిగింది. అప్పటి నుండి ఒక సంవత్సరం తరచుగా ధ్యానం చేయడం ద్వారా నొప్పుల (తలనొప్పి, స్పాండిలైటిస్, ఆంక్సైటి) నుండి విముక్తిని పొందాను మరి ఆధ్యాత్మికంగా కూడా కొంత వరకు ఎదిగాను. ఎప్పుడూ ధ్యానం చేయాలనిపించేది. కానీ పనుల ఒత్తిడి వలన సమయం లేక సరిగ్గా చేయలేకపోయాను. ఈ మధ్యకాలంలో కండరాల నొప్పి, టెన్షన్స్ మరి తలనొప్పి మొదలయ్యేటప్పటికి మళ్ళీ ఏదైనా క్లాసుకు వెళ్ళాలనిపించేది. అదే సమయంలో పద్మావతి మేడమ్ ద్వారా సచివాలయంలో భొజన విరామ సమయంలో సామూహిక "పిరమిడ్ ధ్యానం" చేస్తున్నారని తెలుసుకొని వారితో నేను కూడా ధ్యానం చేస్తున్నాను.

 

మొదట్లో "ధ్యానం కుదురుతుందో లేదో" అనుకున్నాను. కానీ రెండో రోజునే ధ్యానంలోకి జారుకోగానే(పూర్వపు అనుభవం) కాంతి వలయాలు వలయాలుగా కన్పించి అది ఒక శక్తివంతమైన కాంతిగా నిలిచినప్పుడు నా శరీరం శక్తిని పుంజుకొని బాహ్యస్థితిని కోల్పోయినట్లుగా అయింది. ధ్యానంలో నుంచి బయటికి రాగానే నాకు చాలా ఆనందంగా అన్పించింది. క్రమంగా నాకున్న నొప్పులు కూడా తగ్గుతూ ఆరోగ్యం బాగుపడింది. మనస్సు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా ఏ టెన్షన్ లేకుండా ఉంది.

 

ధ్యానం ద్వారా శరీరం శక్తిని పుంజుకొని అన్ని వ్యాధుల నుండి విముక్తిని పొందుతుంది. ముఖ్యంగా మనస్సు అన్ని అలజడుల నుండి బయటపడి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతాము.

 

సందేశం: నిరంతరం ధ్యాన అభ్యాసం ద్వారా ఆనందమయ జీవితాలను పొందుతాం. అందరికీ ‘ఆనాపానసతి’ ధ్యానాన్ని పరిచయం చేసి విశ్వకళ్యాణానికి దోహదపడదాం.

Go to top