" దేవుళ్ళను, దేవతలను చూసేదాన్ని"

 

 

పేరు: D.పద్మ
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : స్కిల్ డెవలప్‌మెంట్

 

పాఠకులందరికి ధ్యానాభివందనాలు.

 

ధ్యానులకు, జ్ఞానులకు మరి జ్ఞానోపదేశకులకు వందనాలు. నేను చిన్నతనం నుండి భక్తి మార్గంలో ఉన్నాను. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేదానిని. ప్రతిరోజూ విష్ణు సహస్ర నామం, లలితా సహస్ర నామం, హనుమాన్ చాలీసా, షిరిడీ సాయిబాబా హారతులు మొదలైనవన్నీ పారాయణం చేసేదాన్ని .. కళ్ళుమూసుకుంటే ఎంతో మంది దేవుళ్ళను దేవతలను, గుడులను మరి హిమాలయాలను చూడడం జరిగేది.

 

అలాంటి నాకు సరియైన ధ్యాన పరిచయం శ్రీమతి సూర్యప్రభ, అసిస్టెంట్ సెక్రెటరీ మేడమ్ ద్వారా కలిగింది. ఒకరోజు మేడమ్, నేను బస్‌లో ఒకే సీట్‌లో కూర్చున్నాం. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. బయటకు వచ్చాక మేడమ్ గారు నా అనుభవం గురించి అడిగారు. ఆ రోజు ధ్యానంలో "షిరిడీ సాయిబాబాను దర్శనం చేసుకున్నాను" అని చెప్పాను. ఆ రోజు నేను "దివ్యచక్షువు", "సూక్ష్మశరీరయానం" గురించి మేడమ్ ద్వారా తెలుసుకున్నాను. ఆఫిస్‌లో జరిగే సీనియర్ మాస్టర్ల క్లాసులకు తప్పక హాజరు అవుతూ ధ్యానంకు సంబంధించిన ఎన్నో విషయాలను మాస్టర్ల ద్వారా తెలుసుకుంటున్నాను.

 

మా కుటుంబంలో జరిగిన కొన్ని ఇబ్బందుల వలన నెగెటివ్ థింకింగ్స్ ఉండి నేను డిప్రెషన్‌లోకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా మేడమ్ (గురువు) గారు డిప్రెషన్ రావడానికి గల కారణాలు చెబుతూ మన ఆలోచనలు ఎలా ఉంటే అటువంటి ఫలితాలను మనం పొందుతామని, కనుక మన ఆలోచనలు తప్పక పాజిటివ్‌గా ఉండి తీరాలని వివరంగా నాకు తెలిపారు. ఇలాంటి ఎన్నో ఎన్నో సలహాలను, సూచనలను నాకు ఇచ్చారు. ఆ సమయంలో నాకు మేడమ్ అండగా ఉండి .. మానసిక స్థైర్యాన్నీ, ధైర్యాన్నీ ఎలా పెంచుకోవాలో, జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో తెలిపారు. ఆ సమయంలోనే కాక అనుక్షణమూ నన్ను మామూలు స్థితిలోకి తీసుకొని రావడానికి చేసిన, చేస్తూ వున్న ప్రయత్నానికి ఆమెకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

 

నేను ఈ విధంగా, సంతోషంగా ఉండడానికి "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని క్రమం తప్పక రోజూ రెండు గంటలు చేయడం, విశ్వ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారి C.D.లను వినడం. ఇంకా న్యూ ఎనర్జీ, మైండ్ పవర్, జీవితాన్ని పండుగ చేసుకో, ఆనందంగా జీవించడం ఎలా మొదలైన పుస్తకాలు చదవడం వల్ల నేను మామూలు మనిషిగా కాగలిగాను.

 

ధ్యానం నా జీవితంలో ఎంతో మార్పును, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళిందని చెప్పగలను. ఇంతటి సరియైన సులభమైన ధ్యాన మార్గాన్ని మన అందరికీ ఇచ్చిన విశ్వగురువులు పత్రీజీకి మరి మా మేడమ్ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను.

 

సందేశం: ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం ద్వారా భౌతిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడంతోపాటు, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతాం. కనుక మనమందరం ధ్యానం, ధ్యానప్రచారం చేద్దాం.

Go to top