" జీవితం ఒక ఆట "

 

 

పేరు: A.విజయలక్ష్మి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నా ధ్యానానుభవాలను ఇలా మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను, నా మిత్రులు కలిసి గత ఆరు నెలలుగా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అరగంట సేపు ధ్యానం చేస్తున్నాం. అప్పటి నుండి నా మానసిక స్థితిలో కొంచెం, కొంచెంగా మార్పు కన్పిస్తున్నది. కోపం నియంత్రించుకోగలుగుతున్నాను. ఎదుటి వ్యక్తి మీద సద్భావన కలుగుతోంది. తద్వారా చాలామంది మిత్రులు, హితులను సమకూర్చుకోగలిగాను.

 

ధ్యానం క్రమం తప్పకుండా చేస్తూ మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదువుతున్నాను. సచివాలయంలో ధ్యానం తర్వాత చివరి అయిదు నిమిషాలు తోటి ధ్యానుల అనుభవాలను పంచుకోవడం, అక్కడ చర్చించుకునే ఎన్నో మంచి విషయాల వలన జీవితం అంటే ఏమిటి .. నీతి-నియమాలతో, దయ, కరుణలతో మరి సేవాభావంతో పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకుంటున్నాను. "నేనే" అన్న ఆలోచన పోయి " మనం " అనే విశాలమైన, విశ్వజనీయమైన భావన కలుగుతున్నది.

 

ఆధ్యాత్మిక పుస్తకాల గురించి నా ధ్యానమిత్రుల ద్వారా తెలుసుకుని చదవగలుగుతున్నాను. మన జన్మకు ఒక అర్థం, సార్థకత ఉండాలి. సమాజానికి మన ద్వారా కొంత ఉపకారం జరగాలి అన్న నా లక్ష్యానికీ, ఆలోచనలకూ ... పుస్తకాలు కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ మరి ప్రోత్సాహాన్నీ ఇస్తున్నాయి. ధ్యానం వలన నాలో మానసిక మార్పులే కాకుండా ఆధ్యాత్మకంగా కూడా ఎంతో మార్పు వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఆటు-పోట్లు ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, వాటిని ఎలా స్వీకరించాలి మరి ఎలా సమతాస్థితిలో అన్ని వేళల్లో ఉండాలి అనే విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.

 

"ఇలాగే ధ్యానం చేస్తూ, నా ధ్యానమిత్రుల సహకారంతో నా లక్ష్యాలను, ఆశయాలను సాధించుకుంటూ, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో, పరిపూర్ణ జీవితాన్ని సాధించగలను" అన్న నమ్మకం కలిగింది. నా తోటి మిత్రులను కూడా ధ్యానం చేసి తద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిగా సంపూర్ణ జీవితం జీవించమని కోరుతూ వుంటాను.

 

సందేశం: జీవితం అన్నది ఒక అద్భుతమైన ఆట, ధ్యానం చేయటం ద్వారా ఈ ఆటను సరిగ్గా అర్థం చేసుకొని చక్కగా ఆడగలం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం; ఆటను అద్భుతంగా ఆడుదాం.

Go to top