" నా మార్గదర్శి.. పత్రీజీ "

 


నా పేరు "సునీత". పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ అడుగుజాడలలో నడుస్తూ నేను ధ్యానసాధనను ఏనాడైతే నా జీవితానికి జోడించానో, ఆనాటి నుండి నేటి వరకు ప్రతి దినం ఒక పండుగలా, ఆనందంగా జీవిస్తున్నాను. పత్రి గారు నాకు ఒక తండ్రిలా, ఒక గురువులా, ఒక స్నేహితుడిలా, ఎప్పటికప్పుడు జీవితం పట్ల ఇష్టాన్నీ, అవగాహననూ పెంచుతూ వచ్చారు. ఇటువంటి ఒక గురువు దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం.

 

2004 జనవరి 3వ తేదీ నా ధ్యాన జీవితం మొదలైంది. 5నెలల నిరంతర సాధన తర్వాత మొట్టమొదటిసారి ధ్యానస్థితిని చవిచూశాను. ఆ తర్వాత ఎన్నో ధ్యాన అనుభవాలతో పొందిన జ్ఞానం, నా జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ మాస్టర్స్ వచ్చి వారి వారి జ్ఞానాన్ని మాకు అందించారు.

 

ఇలా నా ఆధ్యాత్మిక జీవితంలో నేను తొందరగా ఎదగడానికి నా ధ్యాన అనుభవాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌తో సత్సంగాలు, పత్రిగారి యొక్క సాంగత్యం మరి నా ధ్యాన ప్రచారం అన్నీ కూడా సహకరించాయి. ఇప్పుడు ఇక జీవితం, ధ్యానం, ఆధ్యాత్మికత వేరువేరుగా కాకుండా అన్నీ ఏకమై ఆనందంగా జీవిస్తున్నాను.

 

నేను నా జీవనాధారం కొరకై చిన్నపిల్లల "ప్లే స్కూలు" .. "సాయి విశాల్ కిడ్స్ సెంటర్" ఆరంభించాను. నేను ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెట్టానో అప్పుడే "ఈ జ్ఞానాన్ని చిన్నపిల్లలకు చిన్న వయస్సులోనే ఇవ్వాలి" అని గుర్తించాను. మా స్కూలు పిల్లలతో నేను ఒక ప్రయోగం చేశాను.

 

మా స్కూలుకి రెండు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలే వస్తారు. ఒక సంవత్సరం పాటు ఆ పిల్లలతో ధ్యానం చేయించి వారి తల్లితండ్రులకు ధ్యాన విశిష్టతను తెలిపి పిల్లలు వేరే స్కూల్‌కు వెళ్ళాక కూడా దీనిని జీవితంలో ఒక భాగంగా అలవరచాలని చెప్పి పంపుతాము. స్కూల్ సిలబస్‌లో కూడా "A" for Atma, "A" for Ahimsa అంటూ ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతూ, కథల రూపంలో వారికి ఆత్మజ్ఞానం బోధిస్తున్నాము. వీటివలన చిన్న పిల్లల్లో ధైర్యం, ఏకత్వం మరి సహజత్వం లాంటి గుణాలు పెంపొంది వారిలో ఎన్నో కళలలో నైపుణ్యం పెరుగుతోంది.

 

ఒక సంవత్సరం పాటు మా స్కూల్లో శిక్షణ పొంది వేరే స్కూల్సుకు వెళితే ఆ చిన్నారుల అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మార్పు సమాజానికి ఎంతో అవసరం. అందుకే మేము స్కూల్స్‌లో మరి అన్ని విద్యా సంస్థలలో ధ్యాన విశిష్టత గురించి తెలుపుతున్నాము. మా ఈ సేవను గమనించి Federation for Accelerated Community Empowerment (FACE) సంస్థవారు 19th APril 2015న న్యూఢిల్లీలో ‘రాష్ట్ర విభూషణ్’ అవార్డుతో నన్ను సత్కరించారు! ఆ సభలో ఆ రోజు నాతో పాటు ఇంకో 46 మందికి దేశాభివృద్ధి కొరకై వివిధ రంగాల్లో సేవలందిస్తున్నందుకు అవార్డులిచ్చారు.

 

అంతమందిలో నాకు మాత్రమే సభలో సందేశం ఇవ్వడానికి అవకాశం లభించింది! నేను "ధ్యాన సాధన మాత్రమే విద్యార్థులకు సరియైన జ్ఞానం ఇవ్వగలదు" అని వివరిస్తూ అయిదు నిమిషాల పాటు అందరిచే ధ్యానం చేయించాను. సభ ముగిసిన తరువాత ప్రతి ఒక్కరూ "మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది; ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది దేశానికి చాలా అవసరం" అంటూ నన్ను అభినందించారు. ఇంతటి గుర్తింపు పొందేలా నన్ను తీర్చిదిద్దిన పత్రీజీకీ, నాకు సహయ సహకారాలందించిన నా తల్లితండ్రులకూ, నా కుటుంబానికీ .. మరి నా స్కూల్ స్టాఫ్‌కూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

 

సునీతా జగదీష్

చెన్నై

Go to top