" బుద్ధత్వం వైపు నా ప్రయాణం "

 

 

నా పేరు " రామరాజు". నేను ప్రస్తుతం "ఇండియన్ ఎయిర్‌ఫోర్స్" రంగారెడ్డి జిల్లా, హకీంపేట విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాను.

 

నాకు ఆగస్ట్, 2006 సంవత్సరంలో ధ్యాన పరిచయం జరిగింది. నేను విజయవాడ KBN కాలేజ్‌లో B.Sc రెండవ సంవత్సరం చదువుతూన్నప్పుడు ఇంట్లోని ఆర్థిక కారణాలవల్ల చదువు ఆపేసి ఎయిర్‌ఫోర్స్‌లో "టెక్నీషియన్" గా సెలెక్ట్ అవ్వడం జరిగింది.

 

ఉద్యోగంలో చేరిన తర్వాత నా గమ్యం ఇది కాదనీ .. ఇంకా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనీ .. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, డైరెక్ట్ రాశాను. కానీ మొదటి అయిదు సంవత్సరాలు అస్సాం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో పోస్టింగ్ అయ్యి అక్కడ నేను పనిచేసే " M-8 హెలికాప్టర్ రిస్క్ ఆపరేషన్స్" వల్ల సమయం లేక మధ్యలోనే చదువులు మానేసాను.

 

తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ గారి "విజయానికి ఐదు మెట్లు", శివ్‌ఖేరా గారి " మీరు విజయాన్ని సాధించవచ్చు" లాంటి పుస్తకాలు చదివి, "జీవితంలో విజయం సాధించాలంటే ఉద్యోగం చేసే వాడికి చాలా కష్టం, బిజినెస్ మార్గం ద్వారా మాత్రమే డబ్బు, కీర్తి, హోదా, విజయం సాధించవచ్చు" అనుకుని ఒక "నెట్‌వర్క్ మార్కెటింగ్" బిజినెస్‌ని మొదలుపెట్టాను.

 

అప్పుడు నేను ఢిల్లీలో VVIP హెలికాప్టర్లకు టెక్నీషియన్‌గా ఉండేవాడిని. వాస్తవానికి ఒక సైనికుడిగా నేను బిజినెస్ చేయకూడదు .. మరి బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు ఉంచుకోకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నేను ఢిల్లీ అంతా తిరిగి బిజినెస్ చేసేవాడిని.

 

బిజినెస్‌లో విజయం సాధించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. ఎన్నెన్నో సెమినార్లకు హాజరయ్యాను. ఎన్నో వ్యక్తిత్వవికాస పుస్తకాలనూ, సానుకూల ఆలోచనా దృక్పథం ఉన్న పుస్తకాలనూ చదివాను కానీ బిజినెస్‌లో మాత్రం విఫలం అయ్యాను. ఉన్న డబ్బంతా పోయింది. అయినా "Winners never quit, quitters never win" అనే సూత్రం ప్రకారం బిజినెస్ చేస్తూనే ఉన్నాను.

 

ఈ విషయం ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో దావానలం లాగా ప్రాకి నన్ను మణిపూర్ రాజధాని ఇంఫాల్ ‌కు బదిలీ చేశారు. నేను అప్పటికే ఈశాన్య రాష్ట్రంలో అయిదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశాను కనుక మళ్ళీ నాకు ఈశాన్య రాష్ట్రంలో పోస్టింగ్ రాకూడదు! అది కూడా మారుమూల ఇంఫాల్ కి బదిలీ చేసేసరికి నాకు దుఃఖం ఆవహించింది. ఒకవైపు వ్యాపారంలో నష్టం మరో వైపు ఇలాంటి బదిలీ .. ఇంకోవైపు నాకు అదే సంవత్సరం పెళ్ళి కావడం, ఢిల్లీలో అయిదు సంవత్సరాలు ఆనందంగా ఉండవచ్చని అనుకుంటే ఈ బదిలీ నన్ను కుదిపివేసింది.

 

ఇంఫాల్ కు వెళ్ళిన తర్వాత నేను ఎంతో ఆలోచించాను. "ఈ భౌతిక జీవితంలో ఎంతోమంది ధనవంతులనూ, వ్యాపారస్థులనూ చూశాను. డబ్బు, హోదా, కీర్తి అన్నీ ఉన్నా అందరిలోనూ ఏదో వెలితి ఉంది ... ఏమిటిది? " ‘తెర వెనకాల జీవితం .. తెరముందు జీవితాన్ని నడిపిస్తుంది’ అంటారు; ఏమిటి ఈ తెర వెనుక జీవితం ?" అనే ప్రశ్నలు నాలో మొదలయ్యాయి.

 

2006వ సంవత్సరంలో మా వూరు గుంటూరు జిల్లా మంగళగిరికి సెలవులలో వెళ్ళినప్పుడు నాకు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన కార్యక్రమం గురించిన కరపత్రం అందింది. ఆ కరపత్రంలోని ధ్యానం వల్ల లాభాలలో "ధ్యానం వల్ల అస్తమా తగ్గుతుంది" అన్న వాక్యం నన్ను ప్రభావితం చేసి ఆ కార్యక్రమానికి హాజరు అయ్యేలా పురికొల్పింది. ఎందుకంటే మా అమ్మగారు గత 12 సం||ల నుంచి ఆస్తమాతో బాధపడ్తున్నారు. ఆమెను ఎన్నెన్నో ఆసుపత్రులకు తీసుకెళ్ళి విసిగిపోయాను. " మా అమ్మగారికి ధ్యానమార్గం దారి చూపిస్తుంది" అన్న ఆశతో వెళ్ళి తంతే బూరెల గంపలో పడ్డట్టు జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ చేతుల్లో పడ్డాను!

 

కానీ వారి విలువను మొదటి చూపులో నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటో అప్పటికి నాకు ఏమీ తెలియదు. పత్రిసార్ నలభై నిమిషాలు ధ్యానం చేయించారు; నాకేమీ అనుభవం రాలేదు. ఒక అరగంట వారు ప్రసంగించారు; నాకేమీ అర్థం కాలేదు. అయితే ఒక్కే ఒక్క విషయం నాకు అర్థం అయ్యింది ఏమిటంటే జీవితంలో ఆనందంగా ఉండాలంటే మాత్రం త్రికరణశుద్ధితో మనసా, వాచా, కర్మణా ఒకే విధంగా ఉండాలని!

 

అది విని " నేను అలా ఉన్నానా?" అని. నన్ను నేను పరిశీలించుకున్నాను, బిజినెస్ చేసేటప్పుడు నా కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతూ లోపలేమో తిట్టుకుంటూ ఉండేవాడిని. త్రికరణశుద్ధిగా ఉండడం నేర్చుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను.

 

క్లాసు అయిన తర్వాత హాలు బయటకు వచ్చి చూస్తే ఎన్నో పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని పుస్తకాలు వ్రాసారంటే అందులో ఏదో సబ్జెక్టుండే ఉంటుందన్న నమ్మకంతో అక్కడ మంగళగిరి పిరమిడ్ మాస్టర్లను ఒక పుస్తకం సూచించమని అడిగాను.

 

వారు "తులసీదళం" అనే పుస్తకాన్ని ఇచ్చారు. ఆ ఒక్క పుస్తకం నా జీవితాన్ని మార్చింది! అందులో శివుడు, మహావతార్ బాబాజీ, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, జీసెస్, మహమ్మద్ .. వీరంతా మహానుభావులనీ, మనం కూడా వారిలా కావాలనీ పత్రీజీ సూచించారు.

 

నాకు చిన్నతనం నుంచి ఉండే ప్రశ్న "భగవంతుడి అవతారాలకీ, ఈ ప్రవక్తలకూ గల తేడా ఏమిటి? కృష్ణుడు, బుద్ధుడు, జీసెస్, మహమ్మద్ ఏం సాధించారు? వారు జనాలను కాపాడటం కోసం భూమికి దిగివచ్చారా?" అని. వాటికి సమాధానాలు పత్రిసార్ చాలా చక్కగా ఆ పుస్తకం ద్వారా విశదీకరించారు.

 

మన జీవితాన్ని నిర్దేశించే మూడు సత్యాల గురించి "తులసీదళం" లో చెప్పడం జరిగింది.


మొదటిది: "మనం కోరుకున్నది మనకు లభించదు! .. మనకు అర్హమైనది మనకు లభిస్తుంది!!"


రెండవది: "అర్హమైనది దక్కకపోవచ్చు గానీ.. మన నిజమైన అవసరం మాత్రం తప్పకుండా తీరుతుంది!"


మూడవది: "మన అవసరాలు తీరకపోవచ్చు గానీ.. మన ద్వారా సమాజ ప్రగతికి అవసరాలేమైతే ఉన్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి!"


ఈ మూడు సత్యాలను అర్థం చేసుకున్న నాకు నా జీవితంలో వ్యాపారంలో అంత కష్టపడినా .. ఫలితం ఎందుకు రాలేదో అర్థం అయ్యింది. సమాజ శ్రేయస్సు గురించి భూమి మీదకు వచ్చినవాడిని .. డబ్బు, కీర్తి, హోదా, వెనుక పడడం ఏమిటి?" ఇది నా జీవిత ప్రణాళికకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే వ్యాపారంలో నేను విఫలం చెందాను" అని అర్థం అయ్యింది.

 

"తులసీదళం" పుస్తకం చదవడం పూర్తికాగానే, శాకాహారిగా మారిపోయాను. "ఇప్పటిదాకా మాంసాహారాన్ని ఎలా తినగలిగాను?" అని పశ్చాత్తాపపడ్డాను. వెంటనే మంగళగిరి మాస్టర్స్ దీపాల సాంబశివరావు, దీపాల బుజ్జి గార్లనూ "ధ్యానరత్న" శంకరరావు గారినీ కలిసి చదవవలసిన పుస్తకాల గురించి తెలుసుకున్నాను.

 

రిచార్డ్‌బాక్ వ్రాసిన "మహాపరిసత్యాలు" లోబ్‌సాంగ్ రాంపా రాసిన "తపస్వి" పుస్తకాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. పత్రిసార్ అన్ని క్యాసెట్స్, C.Dలు ఉత్సాహాన్ని, విజ్ఞానాన్నీ అందించాయి. నా జీవిత ద్యేయాన్ని తెలిపాయి. ఇంఫాల్ లోని "Flight Cades" కి ధ్యానం గురించీ చెబుతూండేవాడిని.

 

2007, ఏప్రిల్ నెలలో నాకు ఇంఫాల్ నుంచి చంఢీఘర్‌కు బదిలీ అయ్యింది. "చంఢీఘర్‌లో ఏదో ఒక మెడిటేషన్ సెంటర్‌లో ధ్యానం చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఉందాం" అనుకున్నాను కానీ .. అక్కడ ఏ ధ్యానకేంద్రం లేదు! "ఇక్కడ ఉత్తర భారతదేశంలో ధ్యానం ఎవ్వరూ చెయ్యరు. ఇక్కడ అంతా పూజలు, భజనలు, ప్రార్థనలే. నీకు ధ్యానం తెలిస్తే ధ్యానం చేసుకో. ధ్యానకేంద్రం ఎందుకు?" అని నా ఫ్రెండ్స్ నన్ను నిరుత్సాహపరచారు.

 

"తెలుగునాట గ్రామ, గ్రామాలలో పట్టణాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్న ధ్యానం గురించి ఈ ఊరివారికి ఎందుకు తెలియదు?" అని ఆశ్చర్యపడ్డాను. నేను అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన అంతర్వాణి ఏమిటంటే "ఎవరికోసమో నువ్వు ఎందుకు ఎదురుచూస్తావు? నువ్వే ధ్యానప్రచారం మొదలు పెట్టవచ్చు కదా!" అని.

 

నా అంతర్వాణి సందేశం ప్రకారం నేను వెంటనే నా ఎయిర్‌ఫోర్స్ సహోద్యోగులకు ధ్యానం నేర్పడం మొదలుపెట్టాను. కరపత్రాన్ని ముద్రించి గుళ్ళల్లోనూ, పార్కులలోనూ పంచడం మొదలుపెట్టాను. ఆంధ్రా నుంచి కరపత్రాలను, బ్రోచర్లనూ, లను, పుస్తకాలను తీసుకువెళ్ళి చంఢీఘర్‌లో పంచుతూ మా ఇంట్లో ప్రతి ఆదివారం క్లాసులు మొదలుపెట్టాను.

 

ఆ తర్వాత డా|| G.K కాల్రా అనే ఒక రిటైర్డ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ .. ను కలిసి ఆయన వైద్య చికిత్స చేస్తూన్న "సూద్ భవనం" లో ధ్యాన తరగతులను మొదలుపెట్టాను. అదే ఈ రోజు పెద్ద "పిరమిడ్ ధ్యాన మందిరం" గా రూపుదిద్దుకుంది!

 

డా|| G.Kకాల్రా గారి భార్య "శ్రీమతి సంతోష్ కాల్రా" గారు కూడా 35 సంవత్సరాలు హిందీ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమె సాయంతో పత్రిసార్ తెలుగు సందేశాలను హిందీలోకి అనువాదం చేసి "ధ్యాన భారత్" హిందీ ద్వైమాస పత్రికకు పంపడం మొదలు పెట్టాను. అప్పట్లో "ధ్యానభారత్" ను శ్రీమతి రచనా గుప్తా గారు లూథియానా నుండి నిర్వహించేవారు.

 

ధ్యాన ప్రచారం బాగా కావాలంటే హిందీ సాహిత్యం యొక్క అవసరాన్ని నేను గుర్తించి శ్రీమతి సంతోష్ కాల్రా గారి సాయంతో "తులసీదళం" పుస్తకాన్ని హిందీలోకి అనువాదం చేయడం జరిగింది. ఆ తర్వాత "జోనాధన్ లివింగ్‌స్టన్ సీగల్","టోల్‌టెక్ నాలుగు ఒప్పొందాలు", ఆత్మాయణం", "అమృతబిందు", "అమృతకలశం" వంటి పది పుస్తకాలను ముద్రించడం జరిగింది!

 

2010లో పత్రీజీ నాకు "ధ్యానభారత్" పత్రిక యొక్క బాధ్యతలు తీసుకుని చంఢీఘర్ నుంచి పబ్లిష్ చెయ్యాలని చెప్పారు. "సార్! ఇది నా వల్ల ఎలా అవుతుంది? ధ్యాన ప్రచారం చెయ్యగలను కానీ .. ఈ పని నేను చెయ్యలేను" అని చెప్పాను.

 

అప్పుడు పత్రిసార్ "అయ్యా!బాబూ! మనం ఈ భూమి మీదకు ఒక గొప్ప ఛాలెంజ్‌తో వచ్చాం. నువ్వు ఏది చెయ్యగలవో అదే చేయగలిగితే ఒక మాస్టర్‌కీ, సామాన్యుడికీ తేడా ఏమిటి? నువ్వొక పిరమిడ్ మాస్టర్‌వి. పిరమిడ్ మాస్టర్లు ఎంతటి సాహసానికైనా పూనుకోగలరు" అని చెప్పారు.

 

ఇక సార్ ఆదేశాన్ని పాటించాలని .. మ్యాగజైన్‌కి కావలసిన "ఎడిటర్" కోసం వెదుకుతున్నాను. ఒక వారం రోజుల్లో శ్రీమతి షంపా, శ్రీమతి సుమన్‌శర్మల పరిచయ భాగ్యం దొరికింది. వీరు ధ్యానం చేసిన రెండు రోజులకే మ్యాగజైన్ ఎడిటింగ్‌కి ఒప్పుకోవడం విశేషం!

 

"ఇక ఆర్థిక వనరులు ఎలా వస్తాయి?" అని ఆలోచిస్తున్నప్పుడు డా||G.K.కాల్రా గారి స్నేహితుడు మరి పారిశ్రామికవేత్త "శ్రీ విజయ మిట్టల్" గారి పరిచయం దొరికి "ఈయనే నాకు సరియైన వ్యక్తి" అనిపించింది. ప్రతిరోజూ 15 రోజులు పాటు ఆయన చేత ఒక గంట ధ్యానం చేయించాను.

 

నేనెప్పుడూ నోరు తెరిచి మ్యాగజైన్‌కి కావలసిన ఆర్థిక సహాయం కోరలేదు కానీ 15 రోజులు తర్వాత సూద్ భవన్‌లో నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొని వారు "రామరాజూ!! నువ్వెంతో సేవ చేస్తున్నావు; నీకు నేను ఏ విధంగా సహాయపడగలను?" అని అడిగి మ్యాగజైన్ గురించి విని 2010 నుంచి 2012 దాకా మూడు సంవత్సరాల పాటు మ్యాగజైన్‌కి ఆర్థిక సహాయం అందించారు!

 

"ధ్యాన్ చంఢీఘర్" తర్వాత, "ధ్యాన పంజాబ్" అని లక్ష్యం పెట్టుకుని పంజాబ్‌లోని అన్ని పట్టణాలకూ వెళ్ళి ధ్యానం నేర్పించాను. తర్వాత "ధ్యాన హర్యానా" లక్ష్యంగా, పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ లక్ష్యం పెట్టుకున్నా, దాని ప్రకారమే దానికి సంబంధించిన మాస్టర్లు పరిచయం కావడం, వారి ద్వారా ధ్యానతరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.

 

"ధ్యాన్ హర్యానా" లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు హర్యానా గవర్నమెంటు డిపార్ట్‌మెంట్ "ఆయుష్" ఆయుర్వేద డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అయిన డా||సంగీత నెహ్రా గారి పరిచయం కావడం జరిగింది. ఆమె భర్త సోనీపత్ జిల్లా సూపరింటెండెంట్ గారి సహకారంతో హర్యానా రాష్ట్రమంతా క్లాసులు పెట్టించాము!

 

ఉత్తర భారతదేశంలో ఎంతో పేరు ఉన్న వ్యక్తి "శ్రీ భూపేందర్ జైన్". ఆయన వాళ్ళ గురువు గారైన "బ్రహ్మర్షి గురువానంద" గారి ప్రవచనాలకు క్లాసులు ఏర్పాటు చేస్తూంటారు. వారు PSSM సిద్ధాంతాలు నచ్చి పత్రీజీని కూడా ప్రత్యక్షంగా కలిసి అనేక ధ్యానశిక్షణా తరగతులను ఏర్పాటుచేశారు.

 

ఈ సందర్భంగా ఒక సంఘటనను చెప్పుకోవాలి. ఒకసారి నేను డా||సంగీతనెహ్రా గారు హర్యానా రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి డాక్టర్లందరికీ పత్రిసార్ ద్వారా ధ్యానశిక్షణా తరగతులను ఏర్పాటు చేశాం.

 

పది లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హర్యానా ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తూన్న ఆ కార్యక్రమం కోసం 500 మంది డాక్టర్లు హాజరయ్యారు. అక్కడి వాతావరణం అంతా కేకలతో, శబ్దాలతో ఉంది!

 

చంఢీఘర్ పోలీస్ కమీషనర్, ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆయుర్వేద ఇంకా కొందరు పురప్రముఖులు స్టేజీ మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. వీళ్ళను మేమంతా కంట్రోల్ చేసి కూర్చోపెట్టలేని స్థితి.

 

అంతలో డా||సంగీత నెహ్రా గారు మైక్ అందుకుని ప్రారంభ ఉపన్యాసం చేసి పత్రిసార్‌ని ఆహ్వానించడం జరిగింది. మైకు సరిగా పనిచేయడం లేదు .. స్టేజీ క్రింద ఉన్నవారు, పైన ఉన్నవారు వినే స్థితిలో లేరు. అంతలోనే పత్రిసార్ స్టేజీకి మరొక మూల ఉన్న ఇంకొక మైకుని స్టేజీ మధ్యలోకి తెచ్చుకుని .. ధ్యానం గురించి ఐదు నిమిషాలు మాట్లాడారు. ఎవ్వరూ వినలేదు.

 

ఐదు నిమిషాల పరిచయ వాక్యాల తర్వాత, పత్రిసార్ అందరినీ 20 నిమిషాలు ధ్యానంలో కూర్చోమన్నారు. ఎవ్వరూ కూర్చోలేదు. ఇక దాంతో అప్పటిదాకా శాంతంగా ఉన్న సార్ వెంటనే ఉగ్రనరసింహస్వామి అయ్యి "ధ్యానం అంటే నవ్వులాట కాదు; ఇక్కడికి మనం కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. భూమి మీద ఉన్న అత్యున్నత విషయమే ధ్యానం" అనేసరికి అందరూ కళ్ళుముసుకుని కూర్చున్నారు. అంతా నిశ్శబ్దం! స్టేజీ మీద ఉన్న అతిధులు, MLA, సహాయ మంత్రి, కమీషనర్ అంతా కూడా "మాకు ధ్యానం అవసరం లేదు" అన్నట్లుగా చూస్తున్నారు. ఒక్కసారి పత్రిసార్ వెనక్కి తిరిగి వారిని కూడా గద్దించారు. అంతే వాళ్ళు కూడా బుద్ధిగా కళ్ళు ముసుకుని కూర్చున్నారు. అంతా కంట్రోల్ .. పిన్‌డ్రాప్ సైలెన్స్! 40 నిమిషాలు ఏకధాటిగా ధ్యానం చేశారు. ఎవ్వరూ కళ్ళు తెరవలేదు!

 

ధ్యానం తర్వాత అందరూ ఒక్కటే చప్పట్లు. "ఎవరు ఈ గురువుగారు? ఇంత అద్భుత ధ్యానాన్ని సరియైన విధంగా, సరియైన సమయంలో కోపాన్ని ప్రదర్శించి మరీ చేయించారంటే ఈయన సామాన్య గురువు కారు!" అంటూ శ్రద్ధగా పత్రీజీ సందేశాన్ని విన్నారు.

 

అదే క్లాస్‌లో పత్రిసార్ పిరమిడ్ శక్తిని గురించి చెప్పగా విన్న హెల్త్ కమీషనర్, హెల్త్ మినిష్టర్ గార్లు తాము కూడా పిరమిడ్ నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత సంగీతా నెహ్ర గారి విశేష కృషి వల్ల పిరమిడ్ నిర్మాణ ఫైల్ సంతకం అయ్యి ఇప్పుడు హర్యానా రాష్ట్ర ఆరోగ్య విభాగం కోటిన్నర రూపాయల ఖర్చుతో 60'x60' పిరమిడ్ నిర్మాణం చేపట్టింది.

 

ఆ రోజు ఆ కార్యక్రమాన్నిచూసి కోపాన్ని ఎంత నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవచ్చో పత్రిసార్ ద్వారా నేను నేర్చుకున్నాను!


చంఢీఘడ్ లో నేను 2012 దాకా ఏ ఏ లక్ష్యాలు పెట్టుకున్నానో, వాటిని సాధించిన తరువాత 2012 మే నెలలో నాకు చంఢీఘర్ నుండి శ్రీనగర్ కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అప్పటినుండి జీవితంలో మళ్ళీ నన్ను దుఃఖం ఆవరించింది. ఎంతో ఆనందంగా, సంతృప్తిగా, సుఖంగా సాగుతూన్న జీవితంలో పెను మార్పులు సంభవించాయి. వాటికి కారణాలు:
1. ధ్యానాన్నీ, ధ్యాన ప్రచారాన్నీ ఆపాలని నా భార్య గొడవచేసి .. ఇద్దరు పిల్లల్నీ తీసుకుని పుట్టింటికి వెళ్ళడం. 2. నన్ను శ్రీనగర్ ఎయిర్‌బేన్‌లో టెక్నికల్ విభాగానికి సూపర్‌వైజర్‌గా చేయడం. అక్కడి మైనస్ డిగ్రీల విపరీతమైన చలికి అలవాటు లేక వెళ్ళిన క్రొత్తల్లో సరియైన దుస్తులు, సరియైన నివాసం దొరక్క నానా అవస్థలు పడడం.

 

జేబులో డబ్బు ఉన్నా, తినడానికి మా మెస్ తప్ప ఇతర ఆప్షన్ లేదు. ఆ మెస్‌లో మాంసాహారం, శాకాహారంలో వెల్లుల్లి, మసాలాలు ఎక్కువగా వేసేవారు. శాకాహార ప్రచారం చేసే నాకు, మాంసాహారుల ప్రక్కన కూర్చుని భోజనం చేయడం నచ్చకపోయేది.

 

ధ్యానానికీ, పుస్తకాలు చదవడానికీ, ధ్యాన ప్రచారానికీ సమయం దొరకపోవడం నాలో అన్నింటికన్నా ఎక్కువ నిరాశనూ, నిరుత్సాహాన్నీ కలుగజేసింది.

 

ఈ పరిస్థితుల వల్ల నా జీవిత దృక్పథం అంతా ప్రతికూల ఆలోచనలతో, ప్రతికూల భావాలతో నిండిపోయింది. ద్వేషం, నిరాశ, దుఃఖం, నిస్సహాయత, కోపం, ప్రతీకారం లాంటి భావాలతో కూడి జీవితంలో రోగం అంటే ఏమిటో తెలియని నేను రెండు నెలల పాటు చిన్నప్రేవుల వ్యాధితో బాధ పడ్డాను.

 

ఆహారం తీసుకోలేను .. విరోచనాలు, నా బాధ ఎవ్వరికీ చెప్పలేను. "ఏ డాక్టర్ దగ్గరకూ వెళ్ళరాదు .. ఏ మందులూ తీసుకోరాదు " అన్న సిద్ధాంతాన్ని జీవితంలో అమలు చేస్తున్న నేను ఇంత బాధపడ్డా, భరించాను కానీ డాక్టర్ల దగ్గరకు వెళ్ళలేదు.

 

అప్పుడు నన్ను "అస్సెన్షన్" పుస్తకాన్ని మరొకసారి చదవమని హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ సార్ చెప్పారు. అంతకు ముందే ఆ పుస్తకాన్ని చదివినా .. అనుభవం కాలేదు కాబట్టి .. ఆకళింపు చేసుకోలేదు. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థం అయ్యింది. నాకు జరుగుతూన్న ప్రోసెస్ అంతా "అస్సెన్షన్" లోని భాగమేనని.

 

"ద్వంద్వత్వం మన చైతన్యాన్ని వదిలిపోవడానికి సిద్ధపడినప్పుడు అది పూర్తి బలంతో ఒక్కసారి వెనక్కి వచ్చి .. అప్పటి వరకు మనం ఏ భౌతిక జీవిత అనుభవాలను నిర్లక్ష్యం చేస్తామో వాటినే సమస్యలుగా తీసుకుని వస్తుంది" అని తెలుసుకున్నాను. అస్సెన్షన్‌లో అతి ముఖ్యమైన భౌతిక జీవితాన్నీ, ఆధ్యాత్మిక జీవితాన్నీ సరిసమానంగా బ్యాలెన్స్ చేయవలసిన అవసరాన్ని అప్పుడు నేను గుర్తించాను.

 

ఎప్పుడైతే నేను కారణాలను విశ్లేషించుకున్నానో, అప్పుడు ఒక పేపరు తీసుకుని కాశ్మీరులో ఒక సంవత్సరం జీవితంలో నేను ఎలా ఉండాలో ప్లాను చేశాను.

 

ఎప్పుడైతే నేను పేపర్లో ప్లాన్ చేశానో ఆ తర్వాత ఒక వారం రోజులకే నన్ను హెలికాప్టర్ సూపర్‌వైజర్ బాధ్యత నుంచి ఆఫీసులోకి మార్చడం జరిగి ధ్యానానికీ, పుస్తకాలు చదువుకోవడానికీ మరి క్లాసులు నిర్వహించుకోవడానికీ సమయం దొరికింది.

 

ఈ సంవత్సర కాలంలో నా భార్యలో కూడా మార్పు వచ్చి నా దగ్గరకు రావడం, మా ఎయిర్‌ఫోర్స్‌లోనే పిరమిడ్ మాస్టర్ల టీమ్ ఏర్పడటం జరిగింది!
ఆ తరువాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యి ఇక్కడి సీనియర్ మాస్టర్ల ద్వారా మరి పత్రీజీ సాంగత్యం ద్వారా జ్ఞానం పొందాలనుకున్నాను. అనుకున్నట్లే ఇటీవల హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది!

 

ఇంకో పది నెలల్లో నేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసుకుని రిటైర్ అవుతున్నాను! ఇక్కడకు, హైదరాబాద్‌కు వచ్చాక గుజరాతీ సంఘ్ ప్రెసిడెంట్‌ని కలిసి, హైదరాబాద్‌లో నివసిస్తున్న గుజరాతీ వాళ్ళకు ధ్యానప్రచారం చేస్తున్నాను. అలాగే మార్వాడీ వాళ్ళకు ధ్యానం నేర్పిస్తున్నాను. బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు ఇప్పుడే క్లాసులు మొదలు పెట్టాను.

 

వీరి ద్వారా వీరి స్వంత రాష్ట్రాలు గుజరాత్‌లోనూ, రాజస్థాన్‌లోనూ మిగతా అన్ని హిందీ రాష్ట్రాలలో .. విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడమే నా ప్రస్తుత లక్ష్యం!!

 

 

 


P.V రామరాజు

9550917443

Go to top