" ఇప్పుడు నేనే ఒక బుద్ధుడిని "

 

 

హాయ్ ..! నేను "జూలియన్ కే "!

 

సింగపూర్ దేశస్థుడనైన నేను 2012లో కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పటి వరకు నేను చేస్తూన్న మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది.

 

దాంతో నేను నా మానసిక సమతుల్యతను కోల్పోయి దిశ, గమ్యం లేని జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. ఆ స్థితిలోనే నా స్నేహితుడి సహకారంతో మరొక సంస్థలో ఉద్యోగం వెతుక్కుని కూడా అందులో నిలద్రొక్కుకోలేక డిప్రెషన్ బారిన పడిపోయాను.

 

వాస్తవానికి గతంలో నాది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉండే మనస్తత్వం! దానికి విరుద్ధంగా ఇప్పుడు ఇలా అయిపోవడం చూసిన మా అమ్మ నన్ను దగ్గరలో ఉన్న "ఓషో చక్ర మెడిటేషన్ సెంటర్" కి తీసుకుని వెళ్ళింది.

 

ఆ అవకాశం నా జీవితంలో గొప్ప మలుపుని త్రిప్పబోతుందని నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ అక్కడి ప్రశాంత వాతావరణం, ధ్యాన శక్తితరంగాలు మరి స్నేహపూరితంగా ఉన్న అక్కడి సాధకుల సమక్షం నాకు ఎంతో హాయిని కలుగజేసేది.

 

దాంతో క్రమం తప్పకుండా ఆ సెంటర్‌కు వెళ్తూ ఆ సత్సంగంలో సాధకులు తమ సాక్షీతత్వంతో నిజజీవిత సమస్యలను ఎంత చక్కగా పరిష్కరించుకుంటున్నారో వింటూ ఆశ్చర్యపోయేవాడిని.

 

ఈ ఓషో కమ్యూనిటీ ద్వారానే నేను అంతర్జాతీయ ఆధ్యాత్మిక బోధకురాలు "జ్యూడీ సటోరీ" గారిని కలవడం జరిగింది. ఈ క్రమంలోనే నేను సింగపూర్‌లో ఉన్న "పిరమిడ్ ధ్యానకేంద్రం" లో నిర్వహించబడిన వారి తరగతులకు కూడా హాజరయి .. " మనమంతా భౌతిక శరీర అనుభూతితో భూమి యొక్క అస్సెన్షన్‌లో పాల్గొనాలనే సంకల్పంతో వివిధ నక్షత్రలోకాలనుంచి ఈ భూమిమీదకు ప్రయాణమై వచ్చిన నక్షత్రలోక వాసులం" అన్న సత్యాన్ని తెలుసుకున్నాను.

 

"పిరమిడ్ మెడిటేషన్ సెంటర్" లో నిర్వహింపబడే సుదీర్ఘ ధ్యాన సాధనా సెషన్లు మొదట్లో నాకు కాస్త విసుగు తెప్పించేవి. అయితే దానికి కారణం " నా కాంతి నిరోధక సందేహపూరకమైన మనస్సే " అని తెలుసుకున్న తరువాత ఇక నాకు ధ్యానంలో మనస్సు నిలిచి .. ప్రశాంతత లభించడం మొదలయ్యింది. ప్రతిక్షణం నూతనోత్సాహంతో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా జీవించే పిరమిడ్ మాస్టర్లను చూసి నేను కూడా ఉత్సాహం తెచ్చుకునేవాడిని.

 

ఈ క్రమంలో 2013 సంవత్సరంలో సింగపూర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ "నవనీత్ కౌర్" తో కలిసి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో నిర్వహించబడిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు (GCSS) కు నేను హాజరయ్యాను!

 

"పిరమిడ్ వ్యాలీ" లోని ప్రశాంత వాతావరణాన్నీ .. అక్కడ సగర్వంగా నిలబడి ఉన్న మైత్రేయ బుద్ధ మెగా పిరమిడ్ నూ చూసి ఆనందంతో పొంగిపోయాను. తమ తమ రంగాలలో విస్తృత ఆధ్యాత్మిక పరిశోధనలను చేపడుతూన్న వివిధ దేశాల నవీన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సందేశాలను విని ఎంతో జ్ఞానాన్ని పొందాను. "ధ్యానం, ఆత్మజ్ఞానం, శాకాహారం మరి పిరమిడ్ శక్తి మాత్రమే ఎవరి జీవితాన్నయినా ఫలవంతం చేస్తాయి" అని నేను అర్థం చేసుకున్నాను.

 

2014 సంవత్సరంలో తమిళనాడులోని తిరువణ్ణామలైలో "జాక్విలన్ లాంగ్‌స్టాఫ్ ఆశ్రమం" లో జరిగిన "డెత్ అండ్ మెడిటేషన్" వర్క్‌షాప్ లో పాల్గొన్నాను. అదే సంవత్సరం నవంబర్ మాసంలో మలేసియాలో జరిగిన GCSS కార్యక్రమంలో కూడా పాల్గొని జ్యూడీ సటోరి, విక్టోరియా వెబ్బి, డా||శంకర్ నారాయణ్ గారి సందేశాలను విని ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందాను.

 

తిరిగి సింగపూర్ వెళ్ళాక మళ్ళీ ఒక గ్లోబల్ అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలో చేరి నా ఉద్యోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ డబ్బు గడిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతున్నాను!

అంతకు ముందు అభద్రతా భావంతో కూడిన కార్పొరేట్ సెక్టర్ యొక్క చీకటి రాజకీయాలకు విసిగిపోయి జీవితం మీద విరక్తిని పెంచుకున్న నేనే .. ఇప్పుడు ఒక బుద్ధుడిలా వాటిని అర్థం చేసుకుని అని నా దారికి అడ్డురాకుండా ఎరుకతో ఉంటూ .. పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మలచుకుంటూ నా జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను!

 

జీవితానికి సరియైన అర్థం తెలుసుకోలేక బాధను అనుభవిస్తూన్న సమయంలో నాకు చక్కటి ధ్యాన సాధనా మార్గాన్ని చూపించిన "నవనీత్ కౌర్" కీ మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందరికీ చేరువ చేస్తూన్న పత్రీజీ కీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ .. " ధ్యానజగత్ మహాయజ్ఞం" లో నేను కూడా ఒక సమిధలా పాలుపంచుకుంటానని మాట ఇస్తున్నాను!

 

 

e-mail: juliankay This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top