" ధ్యానప్రచారం ద్వారా విలువలతో కూడిన విద్య "

 

 

నా పేరు "గిరిరాజ". నేను 2002 సంవత్సరం అక్టోబర్ 17 వతేదీన నెల్లిపట్ల మాదిగవాడ మండల ప్రజాపరిషత్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజే మా స్కూలు CRC మీటింగ్‌లో ఒక ఉపాధ్యాయుడు "జేజేలు రెడ్డి" గారి ద్వారా పిరమిడ్ ధ్యానాపరిచయం పొందాను.

 

ఆ మర్నాటి నుంచి నేను కూడా ప్రతి తరగతికి ముందు పిల్లలతో అయిదు నిమిషాలు ధ్యానం చేయించి పాఠం మొదలుపెట్టేవాడిని.

 

కొంతకాలానికి నాకు అక్కడి నుంచి అయ్యరెడ్డిపల్లె MPP స్కూల్‌కు బదిలీ అయ్యి అక్కడ A.N. బాలాజీనాయుడు అనే పిరమిడ్ మాస్టర్‌తో పరిచయం జరిగింది. వారి సహకారంతో నా ధ్యానసమయాన్ని మరింత పెంచుతూ స్కూల్లో పిల్లలతో అరగంట సామూహిక ధ్యానం చేయించడం మొదలుపెట్టాను.

 

పిల్లలలో ‘కుదురు’ పెరగడంతో పాటు వారికి తరచుగా వచ్చే చిన్న చిన్న వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టడం మేము గమనించాం.

 

చదువుతో పాటు వారిలో కథలు, పాటలు, ఆటలువంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పెరుగుతూన్న నైపుణ్యాలు మాకు చాలా సంతోషాన్ని కలుగజేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి కూడా ఈ విషయాలను పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తం చేసారు.

 

సమాజప్రక్షాళనకు కూడా ధ్యానం ఒక్కటే మార్గం కనుక మా ఉపాధ్యాయులం అంతా కలిసి పిల్లలతో ధ్యానప్రచారానికి చక్కటి వ్యూహం చేశాం. తల్లితండ్రులను స్కూలుకు పిలిపించి .. వారి వారి పిల్లలతో వారి పాదాలకు వందనం చేయించి "సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల వంటి మీరు ఇక నుంచి ధ్యానం చేసి శాకాహారుల్లా జీవించండి" అని ధ్యానం యొక్క గొప్పదనాన్ని పిల్లలతో చెప్పించాము.

 

ఈ కార్యక్రమం వల్ల తల్లితండ్రులు కూడా ఎంతో చలించిపోయి ధ్యానం చేస్తామనీ, శాకాహారుల్లా ఉంటామనీ తమ తమ పిల్లలకు మాట ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి స్కూల్లో సాయంత్రం ఒక గంట ధ్యానం ఏర్పాటు చేసి .. పిల్లలే తమ తల్లితండ్రులను ఆ కార్యక్రమానికి తప్పక వెంటతీసుకుని వచ్చేలా చూశాం.

 

మెల్లి మెల్లిగా తల్లితండ్రుల్లో కూడా చక్కటి మార్పు వచ్చి అకారణంగా పోట్లాడుకోవటాలూ త్రాగుడు వంటి వ్యసనాలకు దూరం కావడం మాకు పిల్లల ద్వారా రిపోర్ట్‌లు వస్తూండేవి.

 

ఒకసారి పాఠశాల పని నిమిత్తం పలమనేరులో ఉన్న MEO కార్యాలయానికి వెళ్ళిన నేను MEO A.వాసుదేవనాయుడు గారు మీటింగ్‌లో బిజీగా ఉండడంతో వారి పిలుపు కోసం నిరీక్షిస్తూ అక్కడే ధ్యానం చేస్తూ కూర్చున్నాను. అది చూసి వారు ధ్యానం గురించి వివరాలు అడుగగా వారిచే అక్కడే పదినిమిషాలు పాటు ధ్యానం చేయించి వారికి ఒక రాగి పిరమిడ్ తయారు చేసి ఇచ్చాను.

 

కొన్ని రోజుల తరువాత వారిని కలిసినప్పుడు వారు ఎంతో ప్రసన్నంగా .. ఇదివరలో ఎంతో కోపంగా ఉండే తనలో చాలా మార్పు వచ్చిందనీ .. తనను కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులూ మరి అధికారులూ ఇప్పుడు తనతో చాలా సామరస్యంగా మాట్లాడుతున్నారనీ చెప్పారు. ఆ తరువాత కొంత కాలానికే వారికి DyEO గా ప్రమోషన్‌తో తమ స్వస్థలం చిత్తూరుకు బదిలీ కావడంతో వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిత్తూరు DyEOఆఫీసులో ఒక పిరమిడ్‌ను కూడా నిర్మించడం జరిగింది.

 

ఇలా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నాకు ధ్యానప్రచారం ద్వారా విలువలతో కూడిన విద్యను బోధిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చుదిద్దగలిగే అవకాశం కలిపించిన పత్రీజీకి కృతజ్ఞతలు!

 


V.గిరిరాజ

దుగ్గినవారి పల్లి

చిత్తూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్

Go to top