"హలో డాక్టర్"

మనలో ప్రతి ఒక్కరి అంతరంగంలో కూడా ఒక గొప్ప డాక్టర్ నిద్రాణస్థితిలో ఉన్నాడు. కాస్త ఎరుకతో మన శరీరం పంపే సూక్ష్మతర సందేశాలను అర్థం చేసుకుని మనం ఆ డాక్టర్‌ను చైతన్యపర్చుకున్నప్పుడు .. ఆ డాక్టర్ మన ప్రస్తుత అనారోగ్యానికి జన్మజన్మలుగా ఉన్న మన మూల కారణాన్ని వెతికి మరీ మనకు చికిత్సను అందించగలుగుతాడు! ఇది నా జీవితంలో నాకు ప్రత్యక్షంగా ఎదురైన సత్యపూర్వకమైన అనుభవం!

అప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఒకరోజు తెల్లవారుజామున 2.00 గం||లకు విపరీతమైన కడుపునొప్పితో లుంగచుట్టుకుపోయి విలవిలలాడిపోతూన్న నన్ను మా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. నరకంలంటి ఆ కడుపు నొప్పి నుంచి కొద్ది క్షణాల్లో నన్ను విముక్తురాలిని చేయడానికి డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్‌ను తలచుకుని ఓపిక తెచ్చుకుంటూ హాస్పిటల్ మెట్లు ఎక్కిన నేను బెడ్‌పై వ్రాలిపోయాను.

అంతకు ముందు నాలుగేళ్ళుగా ఇలాంటి చావో-రేవో స్థితిలో నేను ఎన్నోసార్లు హాస్పిటల్‌కి రావడంతో అక్కడి స్టాఫ్ అందరికీ నాకు ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో బాగా తెలుసు! అందుకే నిద్రకళ్ళతో ఉండే డాక్టర్ కూడా మరేమీ అడగకుండానే నాకు ఇంజెక్షన్ ఇచ్చేసి .. కేస్ షీట్ మీద నా ట్రీట్‌మెంట్ గురించిన వివరాలు వ్రాసేసుకుని వెళ్ళిపోవడం పరిపాటి అయిపోయింది.

TB, Chrons, IBS, కేన్సర్ ఇలా అన్ని రకాల జబ్బులకు సంబంధించిన పరీక్షలూ, స్కానింగ్‌లూ, నిపుణుల సలహాలతో పాటు రకరకాల అత్యాధునిక అల్ట్రాసౌండ్ ట్రీట్‌మెంట్స్ చేసి కూడా నా జబ్బుకు కారణం "ఇదమిద్ధం" అని తేల్చలేకపోయారు అందరు డాక్టర్లు!

విపరీతమైన కడుపునొప్పి, వాంతులు .. కారణం తెలియదు!! నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వడం, రెండురోజులు హాస్పటల్లో ఉంచడం తప్ప మరింకో చికిత్స లేదు! అలా నాలుగేళ్ళు నరకం అనుభవించాక ఆ మందులకు నా శరీరం ఇమ్యూన్ అయిపోయింది. దాంతో "ఇక ఇవి కూడా పనిచేయవు" అన్న చేదు నిజం మా వాళ్ళకు చెప్పారు డాక్టర్లు!

అప్పటికే రకరకాల పరీక్షలతో .. రుచీపచీ లేని చప్పిటి కూడుతో రోజుకు గుప్పెడు మందులతో చదువుకు దూరమై .. నిరాశ, నిస్పృహ, బాధ, డిప్రెషన్‌లతో నా టీనేజ్ అంతా డయాగ్నస్టిక్ సెంటర్‌లలో హాస్పిటల్‌లలో గడిపిన నేను .. ఒక రోజు "ఇక చావే శరణ్యం" అనుకున్నాను.

"ఎలా చావాలి?" అన్న ఆలోచనలో కూడా ఎక్కడో మిణుకు మిణుకుమంటూ బ్రతకాలన్న ఆశ! బహుశః నా ఆత్మ అందుకు సన్నద్ధంగా లేదేమో .. చిన్నప్పుడు చదువుకున్న స్వామీ వివేకానంద సందేశం నన్ను ఆ పని చేయకుండా ఆపింది. ఆ మర్నాడు మళ్ళీ యధావిధిగా లుంగచుట్టుకుపోయే కడుపు నొప్పితో మళ్ళీ హాస్పిటల్‌కు వెళ్ళిన నాకు షరా మామూలు చికిత్స చేసి నా రోగాన్ని ఉపశమింపజేసిన డాక్టర్ .. కొత్తరకం మందులు వ్రాశారు. అవి వాడుతూంటే అప్పటికే వున్న నా శారీరక బాధలు తగ్గకపోగా మరిన్ని సైడ్ ఎఫెక్టులతో క్రొత్త బాధలు మొదలుకాసాగాయి.

ఒక్క నెలలోనే ఇరవై కిలోల బరువు కోల్పోయి .. ఒక చెంచా నీళ్ళు కూడా మింగలేని పరిస్థితికి వచ్చేసాను. సన్నగా నీరసంగా అయిపోయి మంచానికి అతుక్కుపోయిన స్థితిలో నేను నెలల తరబడి హాస్పిటల్‌లో ఉండిపోయాను. మా అమ్మ నాగదేవత గుడికి వెళ్ళి నా పేరు మీద పూజలూ, మంత్ర జపాలూ, జ్యోతిష్యుల దగ్గర హోమాలు, యజ్ఞాలూ చేయిస్తూండేది. నన్ను ఎంతమాత్రం రక్షించలేని "సైన్స్" మీదా మరి "దేవుళ్ళ" మీదా రోజు రోజుకీ నాకు విరక్తి కలుగసాగింది. "చావడమా? ఇలాగే బ్రతుకు ఈడ్వడమా? .. ఏదో ఒకటి తేల్చుకుందామని చివరిసారిగా నా ఇష్టదైవం అయిన శ్రీకృష్ణుడి సలహాకోసం మా తమ్ముడిని బ్రతిమిలాడి అతి ప్రయాసతో ప్రక్కనే ఉన్న కృష్ణుడి గుడికి వెళ్ళి ..నా గోడు వెళ్ళబోసుకుని అక్కడ గోడకు చేరగలబడి కూర్చుండిపోయాను.

"కారణం తెలియని జబ్బులకు ‘అరుణ్ కుమార్’ అనబడే పూర్వజన్మ ప్రతిగమన చికిత్సకులు చక్కటి పరిష్కారం చూపుతారు" అని అక్కడ ఎవరో అనుకోవడం విని మా తమ్ముడు వెంటనే ఆ అడ్రస్ సంపాదించి నన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు. "అంత గొప్ప గొప్ప డాక్టర్లతో కానిది ఈయనతో ఏం అవుతుందిలే?" అనిపించినా .. ఇక చేయడానికి ఏమీ లేదు కనుక నోరుమూసుకుని .. ఆయన చేసే "హిప్నోటిక్ చికిత్స"కు తలవంచాను.

అరుణ్‌కుమార్ గారి హిప్నోటిక్ సజెషన్స్‌తో చికిత్స మొదలయ్యాక కొన్ని అస్పష్టమైన సంఘటనలూ, ఆకారాలూ, సందర్భాలూ నా మనోఫలకం మీద కనిపించినా .. రాను రానూ స్పష్టంగా, మాటలతో సహా నా అంతఃశ్చేతనకు అన్నీ అర్థం కాసాగాయి: 1935లో అప్పుడు నేను ఇంగ్లాండ్‌లో నా భర్త మరి నా చిన్నారి కూతురుతో ఉన్నాను. అరుణ్‌కుమార్ గారి సజెషన్స్‌తో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి చూడగా .. ఒకరోజు నా భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాక ఒక అగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆర్తనాదాలు పెడుతూన్న నా నోరు మూసి కత్తితో నా పొట్టలో పొడిచాడు. బాధతో లుంగ చుట్టుకుపోతూ నేలమీద పడి విలవిలా కొట్టుకుంటూన్న నేను నా బేబీవైపు నిస్సహాయంగా చూస్తూ నా భర్తను తలచుకుంటూ ప్రాణాలు విడిచాను.

"అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నావు?" అని అడిగిన అరుణ్‌కుమార్ గారి ప్రశ్నకు .. బాధగా .. "నొప్పి .. నొప్పి .. నొప్పి" అంటూ కడుపు పట్టుకుని విలవిలలాడాను. "అది గత జన్మలో జరిగింది .. ఈ జన్మలో అంతా ఓకే" అంటూ అరుణ్ కుమార్ గారు నాకు మెల్లగా సజెషన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ చేస్తూ నన్ను ఆ నొప్పి నుంచి బయటికి మామూలు స్థితికి తీసుకువచ్చారు. అంతే! ఇక ఆ తరువాత మరెన్నడూ నాకు కడుపులో నొప్పి రాలేదు!! ఆ నాటి నుంచి మెల్లిమెల్లిగా నేను నా సాధారణ జీవితానికి వస్తూ చక్కగా నాకు నచ్చినవి అన్నీ తింటూ .. మందులు మానేసి సంపూర్ణ ఆరోగ్యస్థితికి వచ్చేశాను.

అయితే, "శరీరం, మనస్సు, ఆత్మ ఇవన్నీ ఏమిటి?" .. "ఒక్క మందు కూడా లేకుండా నన్ను ఎలా మామూలు మనిషిని చేయగలిగారు?" .. "ఎందుకు నేను ఇలా స్వస్థత పరచబడ్డాను?" .. "నా ప్రయాణం ఎటువైపు?" అంటూ అరుణ్‌కుమార్ గారిని అనేక ప్రశ్నలు గుప్పించాను.

"వీటన్నింటికీ నీకు సమాధానం కావాలంటే ‘ధ్యానం’ చెయ్యి" అని వారు సింపుల్‌గా ఒక్కమాటలో తేల్చేశారు! వారి ద్వారానే "బెంగళూరు పిరమిడ్ వ్యాలీ" గురించి తెలుసుకుని పత్రీజీ సమక్షంలో మొట్టమొదటిసారి ధ్యానం చేశాను! అంతరంగ ప్రయాణంతో కూడిన స్వీయ ఆత్మవికాసం నాకు మొదలైంది అక్కడే!

ధ్యానంలో నా మనోఫలకం మీద ఒక్కొక్క మహాద్వారం తెరుచుకోబడుతూ పునర్జన్మను పొందిన నా జీవితానికి అర్థం, పరమార్థం నాకు అవగతం అవుతూ వచ్చాయి! అనారోగ్యం కారణంగా డిగ్రీలో అర్థాంతరంగా ఆగిపోయిన నా చదువును మళ్ళీ మొదలుపెట్టి, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేశాను!

ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటి నా గతజన్మ భర్తను కూడా నా ప్రస్తుత జన్మకు సోల్‌మేట్‌గా గుర్తించి అతనినే వివాహం చేసుకుని ఆస్ట్రేలియా దేశానికి "పర్మనెంట్ రెసిడెన్సీ వీసా" ను కూడా పొందాను. అరుణ్ కుమార్ గారి దగ్గర శిక్షణ పొంది "డ్రగ్‌లెస్ థెరపిస్ట్"గా ఆస్ట్రేలియాలో నా ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నాను!

ఈ మధ్యకాలంలో బెంగళూరులో "సమృద్ధి" అనే ఒక కౌన్సిలింగ్ సెంటర్‌ని ప్రారంభించి నాలాగే కారణాలు తెలియని జబ్బులతో బాధపడుతూన్న వాళ్ళందరికీ "ఔషధరహిత చైతన్య చికిత్సలు" వారికి వారే చూసుకునేలా శిక్షణ ఇస్తున్నాను. మా "సమృద్ధి ఇన్‌స్టిట్యూట్" ద్వారా "హలో డాక్టర్" అంటూ తమలోని వైద్యుడిని తట్టి లేపుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన వారితో కర్నాటక TV న్యూస్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు కూడా ఇప్పించడం జరిగింది!

ఒకప్పుడు బాధలు భరించలేక చీకటిగదిలో నన్ను నేనే బంధించుకుని చావు కోసం ఎదురు చూసి .. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ధ్యానసాధనను ప్రతి ఒక్కరికీ అందిస్తూ స్వీయ స్వస్థతా చికిత్సల గురించి దాదాపు 500 టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించాను!

పూర్వీ జయరాజ్ - బెంగళూరు
+ 91 97404 25754, +9196866 14861.

Go to top