" సర్వ జీవకోటి మేలు కొరకు పిరమిడ్ నిర్మాణం "

 

 

నా పేరు "పుల్లపురాజు (భువనేశ్వరి రాజు)". నా తల్లిదండ్రులు భూశిరెడ్డి మరి వెంకటరమణమ్మ గార్లు; నాకు అక్క, ఒక తమ్ముడు వున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న మాది వ్యవసాయ కుటుంబం. బేతంచర్ల మండలం "కొట్టాల" గ్రామ వాస్తవ్యులైన లక్ష్మీరెడ్డి, వరలక్ష్మి దంపతుల కూతురు హేమలతను నేను వివాహం చేసుకున్నాను.

 

రాళ్ళ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన బేతెంచెర్లలో వ్యాపారరీత్యా నివసిస్తూ "మహానందయ్య కాంప్లెక్స్" లో అద్దెకు వుండడం వలన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహానందయ్యగారి ఆధ్వర్యంలో వారి కాంప్లెక్స్ పై ప్రతి మంగళవారం సాయంకాలం నిర్వహిస్తూన్న ధ్యాన తరగతులకు నేను హాజరు అయ్యేవాణ్ణి.

 

క్లాసులు వినేవాడిని కానీ ధ్యానసాధన మాత్రం చేసేవాడిని కాదు. "మన శరీరధర్మం మాంసాహారం కాదు .. శాకాహారమే" అని దోన్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ గారి ద్వారా విని అది ఎంతో నచ్చి అప్పటినుంచి మాంసాహారం తీసుకోవడం మానుకున్నాను.

 

బేతంచెర్లలో భీమవరం పిరమిడ్ మాస్టర్ "తటవర్తి వీరరాఘవరావు" గారిచే ఒకరోజు ధ్యానం క్లాసు జరిపించినప్పుడు అందులో ఎంతో స్ఫూర్తిని పొంది భీమవరంలో జరిగే మూడు రోజుల క్లాసులో పాల్గొనడం జరిగింది. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజూ ధ్యానం చేయడం అలవాటు అయ్యింది! "ధ్యానం చేయడం, శాకాహారిగా మారడం" వలన నేను పొందిన ఆనందానుభూతులు ఇతరులు కూడా పొంది ఆరోగ్యంగా మరి ఆనందంగా జీవించాలని ధ్యానప్రచారం చేయడం ప్రారంభించాను. ఇందులో భాగంగా పదకొండు వేల శాకాహార పుస్తకాలు తెప్పించి బేతెంచెర్ల మండలంలోని 32 గ్రామాలలో విస్తృతంగా పంచాను.

 

ఒకసారి హైదరాబాద్ "అశోకా గార్డెన్స్" లో పత్రీజీ పుట్టినరోజు ఆహ్వానికి బేతంచెర్ల ధ్యానులం అందరం కలిసివెళ్ళి అక్కడ కార్యక్రమం అయిపోయిన తరువాత పత్రీజీ కారు ఎక్కేటప్పుడు నేను డోర్ తీశాను. అప్పుడు పత్రీజీ కోపంగా నా వైపు చూసి "ఎవరు నువ్వు?" అని అడిగారు.

 

"బేతంచెర్లలో ఇంతగా క్లాసులు నిర్వహిస్తూ, పాంప్లెట్స్ పంచుతూ, ధ్యాన ప్రచారం చేస్తున్నా సరే .. సార్ నన్ను గుర్తించలేదు" అని నేను చాలా నిరుత్సాహ పడిపోయాను. కానీ పత్రీజీ పలికిన "ఎవరు నువ్వు?" అన్న మాట నన్ను పదేపదే ఆలోచింప చేయడంతో పత్రీజీ పుస్తకాలు, క్యాసెట్స్ క్షుణ్ణంగా చదవడం, వినడం చేసాను. ప్రతి పుస్తకంలోనూ పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు నన్ను ఆకర్షించాయి. అందులో ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, శాకాహారిగా మారడం నేను ముందు నుంచే పాటిస్తున్నాను. 18 ఆదర్శ సూత్రాలలో ఇక పిరమిడ్ నిర్మాణం చేయడం ఒక్కటే మిగిలింది.

 

"ధ్యానం చేయడం మన ఆత్మ ఎదుగుదల కొరకు, ధ్యాన ప్రచారం చేయడం ఇతర ఆత్మల ఎదుగుదల కొరకు మరి పిరమిడ్ నిర్మాణం సర్వ జీవకోటి మేలు కొరకు" అని తెలుసుకుని పిరమిడ్ నిర్మాణం చెయ్యాలని నిర్ణయించుకున్నాను!

 

అలా ప్రశాంతంగా సాగుతూన్న నా జీవితంలో ఒక విషాదం నన్ను ఎంతగానో బాధపెట్టింది. అనారోగ్య కారణం వలన మా అమ్మను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్స్ "క్యాన్సర్ నాల్గవ స్టేజీలో వుంది; ఆమె ఆరు నెలలకు మించి జీవించదు" అని చెప్పారు.

 

అమ్మను బేతంచెర్లకు తీసుకుని వచ్చి ధ్యానం చేయించడం మొదలుపెట్టాను. ఆ తరువాత మళ్ళీ ట్రీట్‌మెంట్ కొరకు హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో ఉంచినప్పుడు అమ్మ "బెంగళూరు మెగా పిరమిడ్‌లో వుంటాను; నన్ను అక్కడకు తీసుకుని వెళ్ళండి" అని కోరింది. ఆమె కోరిక మేరకు బెంగళూరులోని మెగా పిరమిడ్‌లో ఉంచి ధ్యానం చేయిస్తూండగా .. అయిదవ రోజు ఉదయం 11.00 గం||లకు ధ్యానంలో పత్రీజీ దర్శనం ఇచ్చి "ఇక నువ్వు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపో" అని స్పష్టంగా సందేశం ఇచ్చారు.

 

మరుసటి రోజు మా తమ్ముడు అమ్మను తీసుకువెళ్ళడానికి బెంగళూరు మెగా పిరమిడ్‌కు వచ్చి జీపులో తీసుకుని వెళ్తూండగా పిరమిడ్ వ్యాలీ గేటు బయటకు రాగానే అమ్మ ఆత్మ హాయిగా తన శరీరాన్ని వదిలివేసింది. అయినా ఆమె శరీరం ఎంతో తేజోవంతంగా వుంది! అమ్మ చివరి రోజులలో పిరమిడ్‌లో వుండి ఆ శక్తిని తీసుకోవడం మరి ధ్యానంలో పత్రీజీ ఇచ్చిన సందేశం నాకు పిరమిడ్ మీద గట్టి నమ్మకాన్ని కల్గించాయి. 2010 మే 15 వ తేదీన బేతంచర్ల శేషారెడ్డి హైస్కూల్‌లో పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో "బేతంచెర్లలో పిరమిడ్ నిర్మిస్తాను" అని సభాముఖంగా ప్రకటించాను.

 

నా స్వంత స్థలం రెండు ఎకరాలలో 51'x51' పిరమిడ్ నిర్మించడానికి పత్రీజీ అనుమతి తీసుకుని పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ "ఆంజనేయశర్మ" గారిచే భూమిపూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం. పిరమిడ్ నిర్మాణానికి ముందు మా మామగారు లక్ష్మిరెడ్డి గారితో కలిసి రాష్ట్రంలోని అన్ని పిరమిడ్‌లను దర్శిస్తూ పిరమిడ్ యాత్ర చేశాను. ప్రతి పిరమిడ్‌లో కూడా ధ్యానం చేసి "బేతంచెర్లలో మేము నిర్మించదలచిన పిరమిడ్ గొప్ప శక్తిక్షేత్రంగా కావాలి" అని సంకల్పించాం.

 

సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి పిరమిడ్ ఇంజనీయర్ శ్రీశివరామనాయుడు గారి పర్యవేక్షణలో కడ్తాల్ కైలాసపురిలో నిర్మించిన మహేశ్వర మహాపిరమిడ్‌ టెక్నాలజీతో ఈ పిరమిడ్ కూడా నిర్మించడమైంది. నాకు ధ్యానంలో వచ్చిన దృశ్యాల ప్రకారం అండర్ గ్రౌండ్ సహా పిరమిడ్ ముఖద్వారం కింగ్స్‌ఛేంబర్‌లు ఈ పిరమిడ్‌లో డిజైన్ చేయబడ్డాయి.

 

ఈ పిరమిడ్ నిర్మాణంలో వుండగా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడకు వచ్చి ధ్యానం చేసి గొప్ప అనుభూతిని పొందేవారు. శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం వలన ఇంతటి గొప్ప పిరమిడ్ ఇక్కడ రావడం జరిగిందని ధ్యానంలో అనుభవం పొందినవారు చెప్పారు.

 

ప్రారంభోత్సవం రోజు పత్రీజీ కూడా ఈ పిరమిడ్‌కు "శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యానమందిరం" అని పేరు పెట్టడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. అనుకున్న విధంగా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా పిరమిడ్ నిర్మాణం చకచకా పూర్తి అయ్యి .. గురుపౌర్ణమి రోజున పత్రీజీ ఆధ్వర్యంలో వేలాదిమంది ధ్యానుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది!

 

ఆనాటి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.00 గం||ల నుంచి రాత్రి 8.30 గం||ల వరకు పిరమిడ్ మాస్టర్స్‌ను పిలిపించి క్లాస్‌లు జరుపుకోవడం, ప్రతి పౌర్ణమికి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా క్లాసులు చెప్పించడం, ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ బేతంచెర్ల పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది.

 

శారీరకంగా, మానసికంగా అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి పిరమిడ్‌లో ధ్యానం చేసుకుని పూర్తి స్వస్థత పొంది ఆరోగ్యంగా ఆనందంగా వెళ్తున్నారు. ఆధ్యాత్మిక ప్రగతి కొరకు కూడా వచ్చి ధ్యానం చేసుకుని ఆనందానుభూతిని పొందుతున్నారు.

 

పత్రీజీ కూడా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్‌తో .. "బేతంచెర్ల పిరమిడ్‌ను సందర్శించండి" అని చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది! ఈ పిరమిడ్ ప్రాంగణంలోని పూలమొక్కలు, తలసీవనంతో పాటు పత్రీజీచే నాటబడిన రావిచెట్టు, పూలతీగలు అందరికీ ఆనందానీ, ఆహ్లాదాన్నీ అందజేస్తాయి. బుద్ధికి పదునుపెట్టే అద్భుతమైన గ్రంథాలతో కూడిన లైబ్రెరీ ఇక్కడ వుంది. బుద్ధుని శిల్పం, బ్రహ్మంగారి శిల్పం, హంసలు మరి కృష్ణార్జునులతో కూడిన రథం, ఏనుగుల శిల్పాలు చూపరులకు గొప్ప అనుభూతిని ప్రసాదిస్తాయి! "ఈ పిరమిడ్ .. అన్ని పిరమిడ్స్‌లో ఒక కోహినూర్ వజ్రం"అని పత్రీజీ నోటి వెంట కొనియాడబడింది. పత్రీజీ చేతుల మీదుగా ఇక్కడ "భీమ వంటశాల" ను ప్రారంభించడం జరిగింది. క్లాసులు నిర్వహించబడటానికి 300 మంది కూర్చునే విధంగా నిర్మించబడిన విశాలమైన హాలులో ఆధ్యాత్మికంగా శిఖరాగ్రస్థాయిలో వున్న మహనీయుల చిత్ర పటాలను ఏర్పాటు చేయడమైంది.

 

మా అత్తమామలు వరలక్ష్మి, లక్ష్మిరెడ్డి గార్లు ఇక్కడే నివాసం వుంటూ .. ధ్యానం చేసుకునేందుకు ఇక్కడికి వస్తూన్న పిరమిడ్ మాస్టర్స్‌ని చక్కగా ఆదరించడం జరుగుతోంది! నా భార్య హేమలత చాలా కాలం నుంచి చెవిలో చీముకారడం మరి చెవి నొప్పితో బాధపడుతూ డాక్టర్‌ను సంప్రదించగా "ఆపరేషన్ చెయ్యాలి .. ఆపరేషన్ చేస్తే రక్తం తక్కువగా వుండడం వల్ల మూతి చొట్టపోతుంది" అని చెప్పి రక్తం పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు ఆమె "ఆపరేషన్ వద్దు; ధ్యానం ద్వారానే చెవినొప్పి పోగొట్టుకుంటాను" అన్న విశ్వాసంతో ధ్యానం చేసి చెవినొప్పి నుంచి సంపూర్ణ విముక్తిని పొందింది. ధ్యానం చేయడం వలన నా భార్య ఆలోచన విధానంలో కూడా మార్పువచ్చి నేను చేస్తున్న ధ్యానసేవా కార్యక్రమాలలో నాకు అన్ని విధాలుగా సహాయసహకారాలను అందిస్తోంది.

 

"శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యానమందిరం" మూడవ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో 2015 జూలై 31 వ తేదీ గురుపౌర్ణమి సంబరాలను బేతంచెర్ల .. శేషారెడ్డి హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించటానికి గురువుగారు అనుమతి తెలిపారు! ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని పిరమిడ్ సొసైటీల సభ్యులు పాల్గొని విజయవంతం చెయ్యాలని అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం!

 

 

బండ్లమూరి పుల్లపురాజు

బెతెంచెర్ల
కర్నూలు జిల్లా - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
+ 91 94402 59540.

Go to top