" గురువు వాక్కు నాకు వేదవాక్కు"

 

 

నా పేరు "క్రిష్ణప్ప". మాది సాధారణ కుటుంబం. మా తల్లిగారు సుబ్బమ్మ, తండ్రిగారు మల్లయ్య! 11 మంది సంతానంలో నేను మొదటివాడిని. 16-07-1940లో జన్మించిన నేను మదనపల్లిలోని "గిరిరావు థియోసోఫికల్ ఉన్నత పాఠశాల"లో SSLC వరకు చదివి .. ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేనందున స్వర్గీయ T.N.నాగిరెడ్డిగారి సహాయంతో 22-09-1963న పంచాయితీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరాను. 31-07-1998 న సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ గావించబడ్డాను.

 

నేను 26-02-2003 లో "ఆనాపానసతి ధ్యానం"లో ప్రవేశించాను. మొదటిరోజు ధ్యానంలో శ్రీ ఆంజనేయ స్వామివారు తమ తోకను సింహాసనంగా చేసుకుని చాలా ఎత్తులో కూర్చున్నట్లుగా కనపడింది! అప్పుడు "శ్రీమతి J.అనురాధమ్మ" గారు పిరమిడ్ ధ్యాన తరగతులను నిర్వహించేవారు.

 

ఆ రాత్రి నాకు మదిలో ఒకే ఆలోచన! "ధ్యానంలో ఇంత శక్తి వున్నదా?! అద్భుతాలు జరుగుతాయా?! ఏమిటి ఈ విచిత్రం?!" అనుకున్నాను. మర్నాడు ధ్యానతరగతిలో శ్రీమతి అనురాధమ్మ గారితో ధ్యాన కార్యక్రమాలకు నన్ను కూడా వినియోగించుకోమనీ .. ఏ పని చెప్పినా చిత్తశుద్ధితో నిర్వహించగలననీ కోరాను. ప్రస్తుతం నేను "మదనపల్లి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సెక్రెటరీ"గా ధ్యానకార్యక్రమాలు నిర్వహిస్తున్నాను!

 

16-04-2003 తేదీన అఖండ ధ్యానం ముగింపు సందర్భంగా పరమ గురువులు బ్రహ్మర్షి పత్రీజీ మదనపల్లెకు రావడం, ఆనాటి కార్యక్రమంలో గురువుగారు నన్ను దగ్గరకు చేర్చుకుని మాట్లాడమని చెప్పడం జరిగింది! గురువుగారి స్పర్శతో నాలో తెలియని, వర్ణించలేని ఆనందం, సంతోషం కలిగింది! ఆ మరుసటి రోజే నా ఎరువుల షాపు వ్యాపారాన్ని వేరే వాళ్ళకు అప్పగించి నా పూర్తి సమయాన్ని ధ్యాన కార్యక్రమాలకు కేటాయించాను.

 

2003 ఆగస్టు మాసంలో పత్రీజీ వాయల్పాడుకు వస్తున్నారని తెలిసి అందరం వెళ్ళడం జరిగింది. ఆరోజు ఆదివారం శ్రీకోదండరామ స్వామి వారి దేవాలయంలో ధ్యానం జరుగుతోంది. ఆ సమయంలో గురువుగారు కొందరిని పిలిచి "మీరు మాంసాహారం భుజించి వచ్చారు కనుక ప్రక్కకు వెళ్ళండి; మాంసాహారం మహా పాపాహారం" అని చెప్పారు. ఆ సన్నివేశం మరి గురువు గారి వాక్కు నన్ను ఎంతగానో ప్రభావితం చేసి ఆ రోజు నుంచి నేను మాంసాహారాన్ని పూర్తిగా త్యజించి శుద్ధ శాకాహారిగా మారిపోయాను!

 

మా ఇంటిపై పిరమిడ్ నిర్మించి .. ఆ పిరమిడ్‌ను గురువుగారు దర్శించి మాతో ధ్యానం చేయించిన రోజు శ్రీకృష్ణుల వారు కుచేలుని గృహానికి వచ్చినంత ఆనందం కలిగింది! 2005లో బెంగళూరు "మైత్రేయ బుద్ధా పిరమిడ్" విశ్వాలయంలో జరిగిన ధ్యాన తరగతిలో పత్రీజీ అన్ని జంతువులపట్ల మిత్రత్వ భావనతో మెలగాలనీ, ఏ జీవినీ చంపడం, హింసించడం చేయకూడదనీ చెప్పారు.

 

వ్యాలీలో మా అందరికీ గోదావరి నెం:6 గుడిసెలో వసతి కల్పించారు. అందరం అందులో నిద్రించాం. అందులో ఒక రంధ్రంలో ఒక సర్పం వుంది. దానిని చూసిన వెంటనే గురువుగారి మిత్రత్వం నాకు స్పృహకు వచ్చి సర్పం విషయం ఎవ్వరికీ చెప్పకుండా నేను మాత్రం దానిని గమనిస్తూ కూర్చున్నాను. ఆ విధంగా అయిదు రోజులు గడిచింది. ఆరవ రోజు ఆ సర్పాన్ని అందరికీ చూపించాను. వెంటనే గుడిసెలో వున్న వారందరూ నా భార్యతో సహా పిరమిడ్‌లోకి వెళ్ళి పడుకున్నారు కానీ .. నేను మాత్రం అందులోనే నిద్రించాను. చివరి రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అంతమందిలో కూడా గురువుగారు నన్ను మాత్రమే స్టేజీపైకి పిలిచి ఇక్కడ జరిగిన అనుభవం అందరికీ వివరించమనడంతో నేను నాకు జరిగిన సకలప్రాణికోటితో మిత్రుత్వ అనుభవం గురించి చెప్పాను. మన ప్రతి కదలిక గురువు గారికి తెలుస్తుందన్న మాట!

 

ఈ విధంగా ధ్యానపరంగా, కుటుంబపరంగా ఎన్నో అనుభవాలు జరిగాయి. రెండు సార్లు మరణం అంచుల వరకు కూడా వెళ్ళి బ్రతకడం జరిగింది. ఇన్ని జరిగినా "క్షేమంగా బయటపడడం మాత్రం ధ్యానశక్తి వల్లనే" అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

 

2007లో "ధ్యాన గ్రామీణ" ప్రచార రధాన్ని ఏర్పాటు చేసుకుని మదనపల్లె చుట్టుప్రక్కల గ్రామాలలో, పాఠశాలలో, కాలేజీలలో ధ్యానప్రచారం చేశాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ A.V.సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన మదనపల్లెలో అనేక ధ్యాన కార్యక్రమాలు, ప్రతి నెలా పౌర్ణమి ధ్యానాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించాం. గత ఐదు సంవత్సరాలుగా నీరుగట్టువారిపల్లె "శ్రీ వేణు" గారి ఇంటిలోని "శ్రీ సదానంద పిరమిడ్ ధ్యానమందిరం"లో ప్రతిరోజూ 6గం||ల నుంచి 8గం||ల వరకు ధ్యానం స్వాధ్యాయం, సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

 

2015 మే 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు బెంగళూరు వ్యాలీలో జరిగిన "PSSM రజతోత్సవాలు" పురస్కరించుకుని బళ్ళారి సీనియర్ మాస్టర్ మల్లికార్జున్ మస్కీ గారి నేతృత్వంలో పది రోజుల పాటు మా ధ్యాన గ్రామీణ వాహనంలో వ్యాలీ చుట్టుప్రక్కల 201 గ్రామాలలో యాభైవేల కరపత్రాలను పంచి అందరినీ రజతోత్సవాలకు రావలసిందిగా ఆహ్వానించాం!

 

రజతోత్సవాల సందర్భంగా విచ్చేసిన అశేషధ్యానుల సమక్షంలో పత్రీజీ ఈ దీనుని సత్కరించి ముఖం నిండా ముద్దులాడి నా జన్మను ధన్యపరచారు! పరమగురువులు పత్రీజీ ఆదేశానుసారం చివరి శ్వాస వరకు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్య కార్యక్రమాలను నా శరీరాన్ని అంకితం చేయడమే నా ఈ జన్మ లక్ష్యం!!

 

 


అడివిపల్లి క్రిష్ణప్ప

తంబళ్ళపల్లి
చిత్తూరు జిల్లా - ఆంధ్రప్రదేశ్
సెల్: + 91 94415 11976.

Go to top