" నేర్చుకున్న ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను "

 

 

నా పేరు "నాగేశ్వరరావు". 1930 సంవత్సరం జనవరి 1వ తేదీన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని "కోనూరు" అనే కుగ్రామంలో వ్యాపారం చేసుకునే శ్రీసుబ్బారావు, శ్రీమతి శేషారత్నం దంపతులకు నేను జన్మించాను. మా ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఊటుకూరు"కు రోజు నడిచి వెళ్ళి అక్కడ స్కూల్‌లో SSLC చదువుకున్నాను.

 

ఆ తరువాత కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉండే మా అక్క దగ్గర ఉంటూ 1956 నుంచి 1999 వరకు "పదిరూపాయల జీతం నుంచి మొదలుపెట్టి ఎనభై రూపాయల జీతం వరకు" అనేక సంస్థలలో గుమాస్తా ఉద్యోగాలు చేస్తూ ఎంతో లోకజ్ఞానాన్ని పొందాను. ఆ సమయంలోనే నాకు పెళ్ళి కావడం నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టడం జరిగింది.

 

జగ్గయ్యపేటలో ఉన్నప్పుడే 1956లో "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జగ్గయపేట శాఖ"లో నేను సభ్యుడిగా చేరి కర్రసాము, వ్యాయామం, సూర్యనమస్కారాలు, కరాటే వంటి విద్యలన్నీ నేర్చుకున్నాను. చిన్నప్పటినుంచే ముక్కుసూటిగా మాట్లాడటం, తప్పుచేసిన వాళ్ళతో డైరెక్టుగా మాట్లాడటం వంటి అలవాట్లు నాకు ఉండడంతో .. నీతి-నిజాయితీలకూ క్రమశిక్ష్ణలకూ మారుపేరుగా ఉండే RSSలో నేను క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి "బౌద్ధిక్ ప్రముఖ్"గా అనేక సేవాకార్యక్రమాలను నిర్వహించాను.

 

ప్రస్తుత ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రెటరీ "శ్రీరామ్ మాధవ్"గారితో మరి RSS జాతీయస్థాయి ముఖ్యనేత "శ్రీ బాగయ్య" గారితో కలసి నేను అప్పట్లో పనిచేశాను. ఎమర్జెన్సీ కాలంలో RSS ముఖ్యనేతలు అరెస్టు అయినప్పుడు వారి విడుదల కోసం నేను నిరాహార దీక్షచేసి .. రెండు నెలల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాను.


వీటన్నింటికీ తోడు జగ్గయ్యపేట డిగ్రీ కాలేజీలో తెలుగు ప్రొఫెసర్ "TLN ఆచార్యులు" గారి అధ్యక్షతన పట్టణానికి చెందిన డాక్టర్లు, ఇంజనీయర్లు, టీచర్లు వంటి మేధావుల సభ్యత్వంతో "టౌన్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ (TIC)"ని స్థాపించాం. ఆ కమిటీ ద్వారా అనేక సామాజిక అంశాలపై పోరాటం చేస్తూ జగ్గయ్యపేటలో RTC బస్టాండ్ నిర్మాణం కోసం పన్నెండు లక్షల రూపాయాలను మంజూరు చేయించుకున్నాం.

 

TIC ద్వారా "కళాంజలి" సాంస్కృతిక కార్యక్రమాలనూ, మురికివాడల్లో ఉచిత వైద్యశిబిరాలనూ మరి భగవద్రామానుజ గోష్ఠులనూ నిర్వహిస్తూ అందులో పాల్గొన్న వారికి శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి వారిచే బహుమతులు ఇప్పించేవాళ్ళం. అప్పటికే "ఆంధ్రప్రభ" మరి "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" దినపత్రికలలో కొంతకాలం పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన నేను .. ఆ అనుభవంతో TIC ద్వారా "శుభం" అనే ఒక మాసపత్రికను కూడా నెలకొల్పి వేల సంఖ్యలో దానికి చందాదారులను చేర్పించడం జరిగింది. ప్రొ||TLN ఆచారిగారు దానికి సంపాదకులుగా ఉండేవారు.

 

జీవితం ఇలా సాగిపోతూ ఉండగా హోల్‌సేల్ మరి రిటెయిల్ వ్యాపారానికి అనువుగా ఉంటుందని 1999లో ఖమ్మం జిల్లా "ఇల్లెందు"కు నేను కుటుంబ సమేతంగా తరలి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను RSS శాఖలో క్రియాశీలక సభ్యుడిగా చేరి, ఇల్లందు వాసవీక్లబ్‌ వారి ద్వారా, లోక్‌సత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేపడుతూ వచ్చాను.

 

ఈ క్రమంలోనే జగ్గయ్యపేట నుంచి వచ్చి ఇల్లందులో స్థిరపడిన అప్పటి ప్రభుత్వ న్యాయవాది భద్రాద్రి గారు 2009వ సంవత్సరంలో తమ ఇంట్లో ధ్యాన కార్యక్రమానికి పిలువగా వెళ్ళాను. ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు దాదాపు 100 మంది ధ్యానులు వచ్చి అక్కడ చక్కగా "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేసుకుని తమ ధ్యానానుభవాలను వివరిస్తూండేవారు.

 

నేను కూడా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుని, పత్రీజీ పుస్తకాలను చదివి "ఒక్క వ్యక్తి ఇంత గొప్ప ఉద్యమాన్ని ఎలా నడుపుతున్నారు?!" అని ఆశ్చర్య పోయేవాడిని. 1925 సంవత్సరంలో పూజ్యనీయ డా||హెగ్డేవార్ గారిచే అయిదుగురు సభ్యులతో స్థాపించబడిన "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" ఈ రోజు కోట్లాదిమంది కార్యకర్తలతో శాఖోపశాకులుగా విస్తరించిన తీరుకూ మరి ప్రపంచమంతా పర్యటిస్తూ, ధ్యానయజ్ఞాలతో పత్రీజీ "PSSM" ఉద్యమాన్ని నడిపిస్తూన్న తీరుకూ .. దగ్గరి పోలికలు ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

దాంతో నేను మరేమీ ఆలోచించకుండా స్వీయ అంతరంగ క్రమశిక్షణ ద్వారా ప్రపంచ సౌభాగ్యం కోసం పాటుపడుతూన్న "PSSM కుటుంబం" లో చేరిపోయాను. PSSM ధ్యానప్రచారోద్యమంలో భాగంగా అద్భుతమైన ఆత్మవిజ్ఞానాన్ని పంచుతూన్న "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రికను అందరికీ అందించాలని నాకు బలంగా అనిపించింది. ఇక దాంతో జగ్గయ్యపేట, ఇల్లందు పట్టణాలే కాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా RSS పరిచయస్థులందరికీ "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రికను చేరవేస్తూ వచ్చాను. ఈ అయిదు సంవత్సరాల్లో నేను "ధ్యానాంధ్రప్రదేశ్"కు దాదాపు అయిదు వేల మంది చందాదారులను చేర్పించడం జరిగింది!

 

ఒక్క రూపాయి ఖర్చులేకుండా .. కుల, మత, భాషా లింగబేధాలకు అతీతంగా .. అందరికీ ఆరోగ్యం, ఆనందం, అందిస్తూన్న ఇంత గొప్ప ధ్యానాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తోన్న "ధ్యానప్రచారోద్యమం"లో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి "ఇంటింటికీ ధ్యానం" అన్న నినాదంతో ప్రతి ఆదివారం ఇల్లందు పట్టణంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి ధ్యాన కరపత్రాలను అందించేవాడిని. అలా ఇప్పటికి కొన్ని లక్షల కరపత్రాలను పంచాం మరి ఇప్పటికీ పంచుతూనే వున్నాం!

 

"ధ్యాన ప్రచార కార్యకర్త"గా మరి "ధ్యానాంధ్రప్రదేశ్ ప్రమోటర్"గా నేను ధ్యానంలోకి వచ్చిన ఆరునెలలకు నా కుటుంబ సభ్యులందరితో కలిసి కొత్తగూడెంలో మొట్టమొదటిసారి పత్రీజీని కలిశాను. ఇల్లెందు పిరమిడ్ మాస్టర్ P.పుల్లారావు గారు పత్రీజీకి నన్ను పరిచయం చేయగా వారు నా గురించి చెప్పమన్నారు.

 

ధ్యానంలోకి వచ్చేంత వరకు నా గురించి చెప్పిందంతా విని .. ‘నేను కూడా RSS కార్యకర్తనే! నీలాంటి వాడికోసమే ఎదురుచూస్తున్నాను‘ అంటూ ‘సమయపాలన’ .. ‘నిజాయితీ’ .. ‘సత్ప్రవర్తన’ .. ‘సత్యం’ .. ‘శీలం’ అన్న "RSS పంచసూత్రాలనూ" నా నోటితో పలికించి .. అందరితో చెప్పించారు. ఆ నాటి నుంచి వ్యాపారం చేసుకుంటూనే .. ధ్యానజ్ఞానప్రచారాలు చేస్తూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను.

 


జగ్గయ్యపేట ప్రస్తుత గౌరవశాసనసభ్యులు "శ్రీరామ్ రాజగోపాల్" గారి తల్లిగారికి ధ్యానం నేర్పించినప్పుడు ధ్యానశక్తితో అనారోగ్యంతో బయటపడిన ఆమె 250 "ధ్యానాంధ్రప్రదేశ్" పుస్తకాలను కొని MLA గారి లారీ డ్రైవర్లందరికీ పంచడం జరిగింది. జగ్గయ్యపేట ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ "తన్నీరు నాగేశ్వరరావు" గారు ధ్యానం నేర్చుకుని .. శాకాహార విశిష్ఠతను తెలుసుకుని .. పత్రీజీ సమక్షంలో జరిగిన ధ్యానశిక్షణా కార్యక్రమంలో తాము శాకాహారిగానే జీవిస్తాననీ ప్రమాణం చెయ్యడం అక్కడి ప్రజలకు ఎంతో స్ఫూర్తిని అందించింది!

 


నా భార్య శ్రీమతి వెంకటకుమారి 2010 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి సోకి చివరిదశలో మూడు రోజులపాటు కోమాలో ఉండిపోయింది. డాక్టర్లు కూడా అప్పుడో ఇప్పుడో చనిపోతుందని చెప్పారు. అప్పుడు ఇల్లందు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆమె బెడ్ చుట్టూ కూర్చుని సామూహిక ధ్యానం చెయ్యగా ఆమె మూడవరోజుకు లేచి కూర్చుని .. అందరినీ పేరు పేరునా పలుకరించి .. చక్కగా స్నానం చేసి ఫ్రెష్‌గా ధ్యానంలో కూర్చుని మరీ సంతోషంగా అదే రోజు తన చివరి శ్వాస విడిచింది!

 

అంత హాయిగా ఆమె తన జీవితాన్ని ముగించుకోవడం చూసి, ఎవ్వరం ఏడవకుండా .. వచ్చిన ప్రతి ఒక్కరితో ధ్యానం చేయించి ఏ కర్మకాండలూ చేయకుండా కేవలం మా సామూహిక ధ్యానశక్తితో ఆమెను ఉన్నతలోకాలకు సాగనంపాం! ప్రస్తుతం మా పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోవడంతో నేను కూడా నా పూర్తి సమయాన్ని ధ్యానానికే వెచ్చిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను.

 

నేను నేర్చుకున్న ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ఈర్ష్యా, ద్వేషాలకు అతీతంగా ఉండాలని .. ఎప్పుడో నాతో తగువులాడిన వాళ్ళ ఇళ్ళను నేనే వెతుక్కుంటూ వెళ్ళి .. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకు ధ్యానం నేర్పించి వాళ్ళతో "ధ్యానాంధ్రప్రదేశ్"కు చందాలు కట్టిస్తున్నాను. ఈ క్రమంలో బస్సుల్లో, ట్రైనుల్లో తిరుగుతూ .. ధ్యాన కరపత్రాలు పంచిపెడుతూ .. సంపూర్ణ ఆరోగ్యంతో నా ధ్యానప్రచారం చేసుకుంటున్నాను. ఈ అద్భుత అవకాశాన్ని నాకు కల్పించిన పత్రీజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

 

 

 

తొమ్మండ్రు నాగేశ్వరరావు

హైదరాబాద్
సెల్: + 91 98660 62703, +91 7416666252.

Go to top