" కమ్యూనిజమ్ నుంచి ధ్యానిజమ్ వరకు "

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు ముఖ్యనగరం అయిన విజయవాడ సమీపంలో ఉన్న "తాడేపల్లి" లో పవిత్ర కృష్ణానది ఒడ్డున నిర్మించబడిందే .. మానస సరోవర ధ్యానఆశ్రమం! కనువిందు చేసే ప్రకృతి రమణీయత నడుమ ఒకవైపు కనకదుర్గ అమ్మవారి కొండ .. ఇంకోవైపు గుణదల మేరీమాత, సీతానగరం కొండలతో .. ఆశ్రమం ముంగిట్లో గలగలా పారే కృష్ణమ్మ పలుకరింపులతో తీర్చిదిద్దబడిన ఈ శక్తిక్షేత్రం .. ఆశ్రమ వ్యవస్థాపకులు "కళ్ళం రామిరెడ్డి" గారి మేధో సృజనకు నిలువెత్తు నిదర్శనం!

 

"ఆధ్యాత్మికత" అనే పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా వ్యతిరేకించే కరుడుగట్టిన కమ్యూనిస్టు కళ్ళం రామిరెడ్డి గారు .. ధ్యానంలోని శాస్త్రీయతను గుర్తించి .. తాను ధ్యానిగా మారి .. ధ్యాన జ్ఞాన శాకాహార ప్రచారాల కోసం ఏకంగా కోట్లరూపాయల విలువైన తమ స్వంత స్థలంలో కోటిరూపాయలు వెచ్చించి అద్భుతమైన "సిద్ధార్థ ధ్యాన పిరమిడ్" ను నిర్మించి .. గొప్ప ఆధ్యాత్మికవేత్తగా రూపొందిన వైనం మాటల్లోనే విందాం ..

-ఎడిటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా "నూతక్కి" మా స్వగ్రామం. నా వయస్సు 62 సంవత్సరాలు. నేను గత 33 సంవత్సరాలుగా LIC ఏజెంట్ వృత్తిలో ఉన్నాను.

వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టిన నేను కుటుంబ పరిస్థితుల రీత్యా 10వ తరగతిలోనే చదువు ఆపివేసి మా అమ్మకు చేదోడుగా మా పొలంలో పని చేస్తూ .. వ్యవసాయ కూలీగా ఇతరుల పొలాల్లో కూడా పనిచేస్తూండేవాడిని.

 

కుటుంబ పోషణ నిమిత్తం అపరాలు మరి ధాన్యం కొని అమ్మే దళారిగా, మెడికల్ షాప్ ఓనర్‌గా, LIC ఏజెంట్‌గా .. ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతూ, ఎత్తుతూ పెరిగి పెద్దయి .. చిన్నప్పుడు నేను కలలో కూడా ఊహించని ఆర్థిక స్థితికి అతి తక్కువ కాలంలోనే చేరుకున్నాను.

 

ఈ క్రమంలో .. నేను 17 సంవత్సరాల వయస్సులో ఉండగా నాకు మా ఊళ్ళో CPM కమ్యూనిస్టు పార్టీ కి నాయకుడిగా ఉన్న "శ్యామల అంజిరెడ్డి" గారితో పరిచయం ఆయ్యి .. అది నా జీవితాన్ని క్రొత్తమలుపు త్రిప్పింది. వారి స్ఫూర్తితో పార్టీకి చెందిన సాహిత్యాన్ని బాగా చదివి .. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రభావితుడనై "పార్టీయే సర్వస్వం" అన్న స్థాయికి వెళ్ళిపోయాను.

 

నాలో ఉరకలు వేస్తూన్న ఉత్సాహాన్ని గమనించిన అంజిరెడ్డిగారు .. మా గ్రామంలోని ఆరుగురు సభ్యులు వున్న గ్రామకమిటీలో నన్ను కూడా ఒకనిగా చేర్చి "గ్రామయువజన సంఘం కార్యదర్శి" గా నాకు బాధ్యతలను అప్పగించారు.

 

18 సంవత్సరాల వయస్సులో నాకు అప్పగించబడిన ఆ బాధ్యత నన్ను వయస్సుపరంగా వచ్చే చెడు స్నేహాల నుంచి దూరం చేసి .. నీతి, నిజాయితీ, సామాజిక స్పృహ, దృఢవిశ్వాసం, క్రమశిక్షణ వంటి ఉన్నత లక్షణాలను నేను అలవరచుకోవడానికి సహాయం చేసింది.

 

పార్టీ సిద్ధాంతాల పట్ల గౌరవంతో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే కుటుంబంలోని అమ్మాయి "రమణి" ని పట్టుబట్టి మరీ పెళ్ళిచేసుకుని .. ఆమె సహచర్యంలో జీవితాన్ని పండించుకుని ఇద్దరు బిడ్డలకు తండ్రిని అయ్యాను.

 

కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను మూలం నుంచి అవగాహన చేసుకుంటూ .. నమ్మిన విషయాలను ఏ మాత్రం ఊగిసలాట లేకుండా ఆచరించడం చిన్నతనం నుంచే నాకు అలవడిపోయింది.

 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోద్ధులు "శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య" గారి వంటి ప్రముఖలతో పొందిన సమీప సాన్నిహిత్యం నన్ను మరింతగా ఎదిగించి క్రమంగా నేను "తాలుకా యువజన సంఘం కార్యదర్శి" పదవిని చేరుకునేలా చేసింది.

 

విగ్రహారాదనలూ, మంచి-చెడు ముహూర్తాలు చూడడం, కర్మకాండలు జరిపించడం వంటి మూఢనమ్మకాలను నిర్ద్వందంగా ఖండిస్తూ స్వీయశక్తి పట్ల విశ్వాసంతో ఉండాలని ప్రచారం చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా నేను నమ్మిన సిద్ధాంతాన్ని నా మీదే ప్రయోగించుకుని అందరికీ ఋజువులు చూపేవాడిని.

 

అందుకు ఉదాహరణగా : నాకు 35 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు .. అనారోగ్యంతో బాధపడుతూ మా నాన్న చనిపోయిన సందర్భంలో మా నాన్నకు కర్మకాండలు చేయనని నేను వ్యతిరేకించినప్పుడు ఊరు ఊరంతా ముక్కుమీద వ్రేలు వేసుకున్నారు. బంధువులంతా ఎదురుతిరిగి పంతులుగారిని తీసుకువచ్చి "ఈ కర్మకాండలు చేయకపోతే నీకూ, నీ పిల్లలకూ, నీ వారసులకూ ఎన్నో అరిష్టాలు, కష్టాలు వస్తాయి" అంటూ నన్ను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారు.

 

అయినా నేను తొణకకుండా "ఇది నేను నమ్ముతున్న వాస్తవాన్ని ఋజువు చేసుకోవడానికి వచ్చిన అవకాశం. మీరన్నట్లుగా నాకు కష్టాలు, నష్టాలు వస్తే మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకుండా అది మిగతావరందరికీ కనువిప్పు కలిగిస్తుంది. ఏమీ జరగపోతే ‘నేను నమ్మిందే యథార్థం’ అని తెలుస్తుంది" అని చెప్పాను.

 

సంస్మరణ దినంగా .. 15వరోజు .. అందరినీ భోజనాలకు రమ్మంటే "మేము రాము" అని తెగేసి చెప్పారు. ఇక దాంతో భోజన ఖర్చు కోసం కూడబెట్టుకున్న 25,000 రూపాయలతో వాస్తు బాగాలేక నష్టాలపాలై మూతబడిన ఒక మెడికల్ షాపును కొన్నాను.

 

ఇక్కడ కూడా బంధువుల నుంచి వ్యతిరేకతే!


"వాస్తుకు విరుద్ధంగా ఉన్న ఆ షాపు వల్ల గతంలో ఎంతో మంది నష్టపోయారు. కనుక ఇప్పుడు దానిని కొంటే నీ గతి కూడా అధోగతే" అని బెదిరించారు. అయినా వారి మాటలను లెక్క చేయకుండా షాపును కొని అమావాస్య రోజే ప్రారంభించాను.

 

"ఆంధ్రులకు అతి చెడ్డదినం అయిన అమావాస్య .. ప్రక్కరాష్ట్రంలోని తమిళులకు అద్భుతమైన దినం కనుక మంచి - చెడూ అన్నవి మన భావాల్లో, మనస్సుల్లో తప్ప ఈ సృష్టిలో లేవు" అని నేను నమ్మేవాడిని, ఈ ప్రకృతి సిద్ధాంతాన్ని ఋజువు చేస్తూ .. "శైలజ మెడికల్ షాపు" బిజినెస్‌తో నా దశ బాగా తిరిగి నా పేరు "శైలజ రామిరెడ్డి" గా చుట్టుప్రక్కల గ్రామాల్లో స్థిరపడిపోయింది.

 

ఇలా "నీ వల్ల కాదు" అని ఎవరైనా ఏదైనా సందర్భంలో నాతో అన్న మాటలను నేను ఛాలెంజ్‌గా తీసుకుని ఆ పనిని విజయవంతంగా చేసి చూపించే వాడిని. అదే అలవాటుతో నేను ఒక మామూలు ఏజెంట్‌గా LIC లో చేరి " జోనల్ మేనేజర్" స్థాయికి ఎదిగి సంస్థ అధికారులచే ఘనసన్మానాన్ని పొంది " LIC రామిరెడ్డి" గా కూడా ప్రసిద్ధి పొందాను.

ఇలాంటిదే ఇంకో సందర్భంలో .. మేము మా గ్రామంలో ఉన్నప్పుడు మా ప్రక్కింటావిడ సీతారావమ్మగారు తన కరుకైన మాటలతో ఊరివాళ్ళందరితో పోట్లాడుతూ మాకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఆవిడ నోటికి ఊరివాళ్ళంతా భయపడేవారు.

 

ఒకసారి ఇలాగే అకారణంగా ఆమెతో గొడువ మొదలై అది చిలికి చిలికి గాలివానగా మారి హద్దూ అదుపూలేని తన నోటినే ఆయుధంగా మార్చుకుని ఆమె మమ్మల్ని తిట్టిపోస్తూ.. అప్పుడే రంగులు వేయించిన మా ఇంటి గోడలపై పేడముద్దలు కొడుతూ నా పై చేయి కూడా చేసుకుని నా సహనానికి గొప్ప పరీక్షను పెట్టింది.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా స్నేహితుడు "మెకానిక్ వెంకటరెడ్డి" గారి ఆత్మీయ సలహా మేరకు నేను నిస్సహాయంగా నా కుటుంబంతో సహా విజయవాడకు తరలివెళ్ళి పొయాను.

 

LIC లోనుతో ఒక ఇల్లు కొనుక్కుని పిల్లలను స్కూల్‌లో చేర్చి "హమ్మయ్య" అనుకున్నాను. అదే సమయంలో నా స్నేహితుడు నేను లేని సమయంలో ప్రముఖ వాస్తుశాస్త్రజ్ఞలు "గౌరు తిరుపతి రెడ్డి" గారిని మా ఇంటికి తీసుకుని వచ్చాడు. వారు మా ఇల్లు చూసి "ఈ ఇల్లు వాస్తుకు వందశాతం విరుద్ధంగా ఉంది" అని చెప్పడంతో నా స్నేహితులు దానిని అమ్మివేయమని పోరుపెట్టారు.

 

కానీ "మూఢనమ్మకాలకు వంద శాతం వ్యతిరేకిని" అయిన నేను "అందులోనే ఉండి అభివృద్ధిచెంది చూపిస్తాను" అని వారితో ఛాలెంజ్ చేసి .. "మన మతిని బట్టే మన గతి" అని నిరూపించాను. అప్పుడు నేను ఒక లక్షరూపాయలు పెట్టి కొన్న వాస్తు విరుద్ధంగా ఉన్న ఇల్లు ఇప్పుడు పాతిక లక్షలకు పైగ ధర పలుకుతోంది!

 

ఈ క్రమంలో ఊళ్ళో ఉన్న మెడికల్ షాపును మరి కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మివేసి ఆ వచ్చిన డబ్బుతో విజయవాడ చుట్టుప్రక్కల స్థలాలను అతి తక్కువ రేట్లకు కొనడం జరిగింది. అవి ఇప్పుడే కోట్లకొద్దీ విలువ చేసే ఆస్థిగా మారి ఒకప్పుడు పూట గడవని స్థితిలో ఉన్న నన్ను ఈ రోజు కోటీశ్వరుడిని చేశాయి.

 

అదే ఇంట్లో పెరిగి పెద్దయిన మా ఇద్దరు అబ్బాయిలు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకుని సావ్ట్‌వేర్ ఇంజనీయర్లుగా అమెరికాల్లో మరి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కులమతాలకు అతీతంగా, కట్నకానుకలు ప్రసక్తి లేకుండా మా అబ్బాయిల ఇష్టప్రకారమే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మాకు కూతుళ్ళు లేని లోటును కోడళ్ళతో తీర్చుకుంటున్నాం.

 

ఈ రోజు వాళ్ళు పిల్లా పాపలతో హాయిగా జీవిస్తూ మేము చేసే ప్రతి ఒక్క ధార్మిక కార్యక్రమానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

 

ఒకానొకనాడు తన ఈర్ష్యా అసూయలతో మమ్మల్ని గ్రామంలో ఉండనీయకుండ తరిమివేసి నేను విజయవాడకు చేరి గొప్ప కొటిశ్వరుడిని కావడానికి సహాయపడిన మా ప్రక్కింటి "గయ్యాళి సీతారావమ్మ" గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూంటాను.

 

ఆవిడే ఆనాడు నాపట్ల అలా నిర్దయగా ప్రవర్తించకపోయి ఉంటే ఈనాటికీ నేను ఆ చిన్ని గ్రామంలోనే ఒక మామూలు రైతుగా స్థిరపడి ఉండిపోదును.

 

ఇలా మూఢనమ్మకాల మీద యుద్ధం చేస్తూ కమ్యూనిస్ట్ భావజాల సంపదతో నిండి ఉన్న నేను "ధ్యానమార్గం" లోకి రావడం కూడా విచిత్రంగానే జరిగింది!

ఆరోగ్యం పట్ల మొదటినుంచి కూడా శాస్త్రీయంగా వ్యవహరించే నేను. ఉన్నంతలో హయిగా జీవిస్తూ .. నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉండేవాడిని.

 

నాకు చెడు చేయడానికి ప్రయత్నించిన వారిని కూడా నా అభివృద్ధికి మార్గదర్శకులుగా తలుస్తూ.. SSY, MMY కోర్సులు చేసి ఆయా సంస్థలు బోధించే ఆరోగ్యసూత్రాలను పాటిస్తూండేవాడిని.

 

అలాంటి తరుణంలో "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్"కు చెందిన ఒక మిత్రుడు నాకు ధ్యానం గురించి చెప్పాడు. "కళ్ళుమూసుకుని కూర్చుంటే ఆరోగ్యం పొందడమేమిటి? పిచ్చికాకపోతే?" అని అతనిని వేళాకోళం చేసి.. "కళ్ళు తెరిచి అందమైన దృశ్యాలు చూస్తే ఆనందం; చెవులు ద్వారా వీనులు విందైన సంగీతం వింటే ఆనందం; నోటితో కూనిరాగాలు తీస్తే ఆనందం; మరి ఒళ్ళుమరిచి డ్యాన్స్ చేస్తే ఆనందం" అంటూ నాకు తెలిసి నేను పాటించే ఆనంద సూత్రాలను అతనికి బోధించాను.

 

అన్నీ విన్న అతడు శాంతంగా.. "దేనికైనా టైమ్ రావాలి; అప్పుడు అసలైన ఆనందం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది" అన్నాడు!

 

ఆ తరువాత కొంత కాలానికే ఆ ‘టైమ్’ వచ్చింది! అప్పటికే ఎనిమిది సంవత్సరాలుగా మోకాళ్ళనొప్పులతో బాధపడుతూ క్రమంగా మంచానికే పరిమితమైపోయిన నా భార్య "రమణి".. ఇక మందులు మ్రింగలేని పరిస్థితికి వచ్చింది. దాంతో ఆమె బలవంతం మీద నేను మా ఫ్రెండ్ ఇచ్చిన ధ్యానకరపత్రంలో ఉన్న మాచవరంలోని ‘పిరమిడ్ హౌస్’ గురించి వాకబుచేశాను.

 

అంతరంగంలో నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా నా భార్య మాట కాదనలేక ఆమెను తీసుకుని "పిరమిడ్ హౌస్" కి వెళ్ళి అందరూ బుద్ధిగా కూర్చుని ధ్యానం చేసుకుంటూంటే నేను మాత్రం రెండు కళ్ళూ తెరిచి పత్రీజీ వేణునాదం కేసెట్‌ను వింటూ కూర్చున్నాను.

 

రెండుమూడు రోజుల తరువాత మ్యూజిక్ వింటూ కళ్ళు మూసుకున్నాను కానీ ..కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్న జక్కా రాఘవరావుగారు చెప్పినట్లు "శ్వాస మీద ధ్యాస" మాత్రం పెట్టలేదు.

 

అప్పుడే బెంగళూరు పిరమిడ్ వ్యాలిలో జరిగే బుద్ధపూర్ణిమ ఉత్సవాల గురించీ ‘ఊటీ ట్రెక్కింగ్’ గురించీ వారు చెప్పగా విని ..ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి ఏదో ఒక విహార యాత్రకు వెళ్ళే అలవాటు వున్న నేను వెంటనే ‘ఓకే’ చెప్పాను.

 

బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి విచ్చేసిన వేలమందిలో ..స్నానం చెయ్యాలన్నా ‘క్యూ’! భోజనం చెయ్యాలన్నా ‘క్యూ’! చిన్న వెదురు పొదలాంటి ‘వసతి’! "ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానురా దేవుడా" అనుకున్నాను.

 

సాయంత్రం అయిదు గంటలకు కార్యక్రమం ప్రారంభం అయ్యి "బ్రహ్మర్షి పత్రిజీ వస్తున్నారు" అని అనౌన్స్ చేశారు! "‘స్వామీజీ’ అంటే కాషాయ వస్త్రాలు తొడుక్కుని ..ముఖానికి అడ్డబొట్లో, నిలువు నామాలో పులిమేసుకుని .. మెడనిండా రుద్రాక్ష మాలలతో ఉంటారు" అనుకున్న నాకు .. అందరిలాగే అతి సామాన్యమైన లాల్చీ పైజామా వేసుకుని వెలిగిపోతున్నా ముఖంతో హుషారుగా స్టేజీపైకి వచ్చి మైక్ అందుకున్న పత్రీజీని చూసి ఆశ్చర్యం వేసింది!

 

స్టేజి మీదకు వస్తూనే .. "మీరందరూ ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని మొదటి ప్రశ్న వేశారు పత్రీజీ.

 

"ధ్యానం కోసం" అందరూ బుద్ధిగా జవాబు చెప్పారు. "అలాంటప్పుడు ఇక్కడ ‘అది లేదు’ ‘ఇది లేదు’ అని ఎవరైనా కంప్లయింట్స్ చేస్తే నాలికలు అడ్డంగా తెగ్గోస్తాను" అన్నారాయన!

 

"ఇదేంటి? స్వామీజీలు, గురువులూ ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి కదా! ఈయనేంటి ‘నాలుకలు తెగ్గోస్తాను’ అంటాడు. ఇంకోసారి ఈయన కార్యక్రమాలకు రాకూడదు" అని నిర్ణయించుకున్నాను!

 

అయితే వారి మాట మేరకు అక్కడున్న వాళ్ళంతా పిరమిడ్‌లో కూర్చుని గంటలు గంటలు ధ్యానం చేయడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

 

ధ్యానం గురించి ఏ మాత్రం సదభిప్రాయం లేని నేను నాలాంటి ఇంకా కొందరు "తప్పించుకు తిరిగే బ్యాచ్" తో కలిసి పిరమిడ్ బయటే కూర్చుని.. పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటూన్న వాళ్ళను గురించి వేళాకోళాలు ఆడుకుంటూండే వాడిని. అయినా ..మనస్సులో మాత్రం "పిరమిడ్‌లో ఏదో శక్తి ఉండే ఉంటుంది; లేకపోతే ఇంతమంది ‘వన్ వే’ లాగా లోపలికే ఎందుకు వెళ్తున్నారు?" అని మీమాంస!

 

రెండు రోజుల పాటు మనస్సులో తర్జనభర్జన అరువాత ఇక ఆగలేక విషయమేంటో తేల్చుకుందామని మూడవ రోజు నా భార్యతో సహా పిరమిడ్ లోపలికి వెళ్ళి కళ్ళుమూసుకుని నా శ్వాసను గమనిస్తూ కూర్చున్నాను.

 

అప్పుడు మొదలయ్యింది నాలో ధ్యానానంద హేళ! ఏ ఆలోచనా లేని శూన్యస్థితిలో ..నాభి నుంచి మొదలై లావాలాగా పైకి ఎగసిపడుతూన్న ఏదో తెలియని శక్తి ప్రసారంతో .. తట్టుకోలేని ఆనంద స్థితిలో కళ్ళుమూసుకుని కూర్చున్న నేను పకపకా నవ్వడం మొదలుపెట్టాను.

 

అలా ఎన్ని గంటలు ఉండిపోయానో తెలియదుగానీ కాస్సేపటికి పత్రీజీ అందరినీ కళ్ళు తెరవమని చెప్పి చప్పట్లు కొట్టిస్తూండగా కళ్ళు తెరిచి ..మా ఆవిడ భుజాలను పట్టుకుని ఊపేస్తూ.. "ఈ రోజు నాకు బ్రహ్మానందాన్ని రుచి చూపించావు.. ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేను" అంటూ ఎంతో ఉద్విగ్నంగా చెప్పాను!

 

ఆ తరువాత బస్సులో ఊటీ కి బయలుదేరాం! దారి మధ్యలో కారులోంచి దిగి పత్రీజీ మా బస్సు ఎక్కి .. మా ప్రక్క సీట్లో కూర్చుని మా ఆవిడ కోసి ఇచ్చిన మామిడి పండు తిని .. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మృదువైన వారి చేతి స్పర్శ .. నాకు ఎంతో సుపరిచితంగా తోచి .. నాలో ఎదో తెలియని పులకింతను కలిగించింది!

 

అలా ఎన్నెన్నో అనుభూతుల నడుమ ఊటీ ట్రిప్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక నేను, నా భార్య ఇద్దరం కలిసి ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాం.

 

క్రమంగా మా ఆవిడ మోకాళ్ళ నొప్పులు తగ్గడంతో ఆ తరువాత కొద్దికాలానికే కర్నాటక రాష్ట్రంలోని శ్రావణబెళగొళ విహారయాత్రకు వెళ్ళాం! అక్కడ ఆమె చకచకా 600 పైగా మెట్లు నా కంటే ముందే ఎక్కడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది!

 

ఇక దాంతో ధ్యానంలో ఉన్న శాస్త్రీయతను వివరంగా, విశ్లేషణాత్మంగా తెలుసుకోవడం పట్ల నాలో క్రొత్త ఉత్సాహం మొదలయ్యింది!

 

ఈ క్రమంలోనే భీమవరం తటవర్తి వీరరాఘవరావుగారి మూడు రోజుల రెసిడెన్షియల్‌క్లాసుకు హాజరై అనేక ఆత్మజ్ఞాన సత్యాలకు సంబంధించిన స్పష్టత పొందడం జరిగింది.

 

"ఇతరులతో పంచుకోవడం ద్వారానే మనం ఏదైనా పొందగలం" అన్న సృష్టి నియమాన్ని వారి ద్వారా విని దానిని ఆచరణలో పెడుతూ "అందరికీ ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ ఇవ్వగల పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నేను కూడా నిర్మించాలి" అని అక్కడే సంకల్పించుకున్నాను.

 

భీమవరం బయలుదేరడానికి ముందు నేను విజయవాడలో కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ఒక స్థలాన్ని "అమ్మకూడదు" అని అక్కడే నిర్ణయించుకుని మా ఆవిడ ప్రోద్బలంతో భీమవరం క్లాసులోనే "అదే స్థలంలో పిరమిడ్ కడతాను" అన్న నా నిర్ణయాన్ని తెలియజేశాను.

 

ఇక విజయవాడకు తిరిగి వస్తూనే నా ఇద్దరు కుమారులకు కూడా నా నిర్ణయాన్ని తెలియజేసి వారి సహకారంతో కోటిరూపాయలు వెచ్చించి "మానస సరోవర ధ్యాన ఆశ్రమం" కు రూపకల్పన చేశాను.

 

కృష్ణానది ఒడ్డున అందమైన పూలచెట్లతో నిండిన ప్రాంగణంలో ..కింగ్స్‌ఛేంబర్ తో కూడిన "‘36X36’ సిద్ధార్థ పిరమిడ్" తో పాటు 1000 మంది కూర్చోగలిగే "ప్రవచన మండపం", "గెస్ట్‌రూములు", వంటశాల, అన్నదాన మండపం, టాయిలెట్స్ అక్కడ నిర్మించడం జరిగింది.

 

ఈ బృహత్ నిర్మాణానికి వస్తు రూపంలో, ధనరూపంలో సహాయం అందించిన విజయవాడ పిరమిడ్ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు!

 

ఈ సందర్భంగా "మానససరోవర ధ్యాన ఆశ్రమం" శంఖుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి ఒక్క ముఖ్య కార్యక్రమం అమావాస్య రోజునే జరగడం మరొక అద్భుతం! 2013, జనవరి 12వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ అధ్యక్షతన ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ సభ్యులు "శ్రీ గోకరాజు గంగరాజు" గారి చేతుల మీదుగా అమావాస్య రోజు ఆశ్రమం ప్రారంభోత్సవం జరిగింది.

 

ఆ నాటి నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు ఈ పిరమిడ్ శక్తిక్షేత్రానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా వెళ్తున్నారు.

 

నా భార్య శ్రీమతి రమణి దగ్గర ఉండి మరీ వారికి కావల్సిన ఏర్పాట్లు చూస్తూ చక్కటి ధ్యానప్రచార సేవ చేసుకుంటోంది.

 

ఇలా "ధ్యానం సర్వరోగనివారిణి" అని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్న నేను .. "ధ్యానం సకల సంకల్పదాయిని" అని ఎలా తెలుసుకున్నానో చెబుతాను:

 

చిన్నప్పటి నుంచీ ఈతలో ఏమాత్రం ప్రావీణ్యం లేని నేను మిత్రుడి ప్రోత్సాహంతో విజయవాడ "అక్వాడెవిల్స్ క్లబ్" వారి తరుపున 2012 జనవరి 26వ తేదీన విజయవాడలో "ఈత కొట్టు - బంగారు కాయిన్ పట్టు" అనే ఈత పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.

 

ఈ వయస్సులో అది నీ వల్ల కాదులే" అన్న ఇంకొక మిత్రుడి మాటను ఛాలెంజ్‌గా తీసుకుని కేవలం నా ధ్యానశక్తినే నమ్ముకుని ..ప్రతిరోజు కృష్ణానదిలో ఆ ఒడ్డునుంచి ఈ ఒడ్డువరకు ఈత కొట్టడం మొదలుపెట్టాను. పోటీ రేపనగా "మర్నాడు పేపర్లో ఫస్ట్‌ఫ్రైజ్ తీసుకునే నా ఫోటోను చూడండి" అని ముందు రోజే అందరితో గొప్పగా చెప్పాను.

 

పోటీ మొదలయ్యాక ఈత మధ్యలో చూడగా ఎవరెవరో నన్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకు కాస్త టెన్షన్ వేసింది. అయినా తమాయించుకుని లోగడ పత్రీజీతో కలిసి హిమాలయ యాత్రకు వెళ్ళినప్పుడు వారు చెప్పిన ఆత్మ సత్యాలను గుర్తుతెచ్చుకున్నాను.

 

"ఇతరులను ఓడించాలని ప్రయత్నించకుండా ..నీ శక్తియుక్తులపై దృష్టి నిలిపి వాటిని పెంపొందించుకో! నీ శక్తిపై పూర్తి ఏకాగ్రత పెట్టినప్పుడు విజయం నీదవుతుంది" అన్న వారి మాటలను ఆచరణలో పెడుతూ.. "నేను ఈత పోటిలో ఉన్నాను" అన్న విషయాన్ని వదిలివేసి .. నీటిలో వెల్లకిలా పడుకుని "శ్వాస పై ధ్యాస" ఉంచి "కాస్మిక్ ఎనర్జీని" అనుభూతి చెందుతూ బ్యాక్‌స్ట్రోక్స్‌తో ఈదడం మొదలు పెట్టాను.

 

అంతే! క్షణాల్లో పోటీ తీరు మారిపోయి ..నేనే విజేతగా నిలబడి బహుమతిని పొంది ..మర్నాడు పేపర్లో ఫోటోతో సహా వచ్చేశాను!

 

ఆ తరువాత చాలా సార్లు ఇదే ఫార్ములాను అప్లై చేస్తూ రాష్ట్రస్థాయి మరి జాతీయ ఈత పోటీల్లో కూడా పాల్గొని పతకాలు గెలుచుకుని నా ధ్యానసంకల్ప శక్తి కి మరింత మెరుగులు దిద్దుకున్నాను.

 

"ఈ వయస్సులో కూడా మీ విజయానికి కారణం ఏమిటి?" అని అడిగిన జర్నలిస్ట్‌లకూ, మిత్రులకూ "ధ్యానశక్తి, శాకాహారశక్తి మరి పిరమిడ్‌శక్తి" అని గర్వంగా చెబుతూంటాను.

 

ఒకప్పుడు.. "‘ఆధ్యాత్మికత’ అంటే లౌకిక జీవితాన్ని వదిలివేసి ..నిత్యవ్యవహారాల నుంచి తప్పించుకోవడం" అన్న అజ్ఞానపు భావనలో ఉన్న నేను ..ఇప్పుడు ధ్యానశక్తితో నా లౌకిక వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకుంటూన్నాను. ఇతరులతో మరి నా కుటుంబ సభ్యులతో నా సంబంధ బాంధవ్యాలను మరింత ఆత్మీయంగా పంచుకుంటూ ప్రతిక్షణం సచ్చిదానందాన్ని అనుభవిస్తున్నాను.

 

ధ్యానంలో ఉన్న బ్రహ్మానంద స్థితిని సంపూర్ణంగా అనుభవిస్తూ .. ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణా రాష్ట్రాలు తిరుగుతూ నా ధ్యానజీవిత అనుభవాలను అందరితో పంచుకుంటూ ధ్యానప్రచార సేవ చేసుకుంటున్నాను.

 

భగవంతుడు ఉన్నాడని ఒప్పించకుండా .. లేడని వాదించకుండా ధ్యానశక్తితో మరి ఆత్మజ్ఞాన విచక్షణతో రోజువారీ భగవంతుడి అవసరం లేకుండా జీవించగలిగే అద్భుతాన్ని అందరికీ తెలియజేస్తున్నాను!

 

కమ్యూనిజపు భావాలతో నిండి కమ్యూనిస్ట్ సాహిత్యాన్నే చదువుతూ ఇంతకాలం ఆధ్యాత్మిక గ్రంథాలకు దూరంగా ఉన్న నేను ..ధ్యానంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి "భగవద్గీత" గ్రంథాన్ని చదివాను. "సంసార మహాసాగరంలో వచ్చే అలల తాకిడిని తట్టుకోలేని వాడికి ఈత నేర్పే ..సజీవ గీత" గా దానిని గుర్తించి గౌరవిస్తున్నాను.

 

"‘ముక్తి’ .. ‘మోక్షం’ .. ‘ఆత్మ’ .. ‘పరమాత్మ’ అంటూ అరచి అరచి అరవై జన్మలు గడిపేకంటే .. నిరంతర ఆత్మధ్యానస్థితిలో ఒక్క జన్మ గడిపితే చాలు, జీవితం ధన్యం అవుతుంది" అంటూ ఆచరణయుక్తమైన ఆత్మజ్ఞాన మార్గాన్ని మనకు అందిస్తూన్న పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

నాకు నచ్చిన .. నేను మెచ్చిన .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో నేను కూడా ఒక ‘పిరమిడ్ మాస్టర్’ గా కొనసాగడం నా అదృష్టంగా భావిస్తున్నాను!!

 

 

కళ్ళంకామిరెడ్డి

తాడేపల్లి
విజయవాడ

కృష్ణాజిల్లా
నెం: +91 99591 48406

 

Go to top