" పిరమిడ్ సాంకేతికత వ్యాప్తియే నా జీవిత లక్ష్యం "

 

 

"డెహ్రడూన్" అని పిలవబడే "ద్రోణభూమి", హిమాలయపాదశ్రేణిలో ఆధునిక పిరమిడ్ నిర్మాణాలకు తలమానికమైన పిరమిడ్ హోమ్ డివైన్ ను నిర్మించారు "శ్రీ సతీష్ అగర్వాల్". 2014, డిసెంబర్ 2వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీచే "పిరమిడ్ హోమ్ డివైన్"కు ప్రాణప్రతిష్ట జరుపబడింది. అక్కడి మణిద్వీపం పిరమిడ్ ఆ అద్భుత శక్తిక్షేత్రంలో మనోహర ప్రకృతితో అత్యంత ఆకర్షణీయంగా అలరారుతూ వుంది. తమ స్వీయ అనుభవాల ద్వారా ధ్యానశక్తిని గుర్తించి కరుణ, సౌశీల్యతలతో జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ఆయన ఒక సజీవ ఉదాహరణ. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాక అత్యంత సమర్థతగల వ్యాపారవేత్త, మంచి వక్త, పిరమిడ్ వాస్తు సలహాదారు. "రుచి అగర్వాల్" ఆయన శ్రీమతి, కుమార్తె "స్వభావి", కుమారుడు "తేజస్వి". శ్రీ సతీష్ అగర్వాల్ గారి నుంచి కొన్ని విషయాలు "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకోసం ..

ఎడిటర్

స్వర్ణలత: "నమస్కారం సతీష్ అగర్వాల్ గారూ! అద్భుత మణిద్వీప పిరమిడ్ ను నిర్మించి మహోన్నత శక్తిక్షేత్రంగా మలచిన మీ గురించి కొన్ని విశేషాలు వివరిస్తారా!"


శ్రీ సతీష్ అగర్వాల్: నాకు మా అమ్మగారి ద్వారా మత ఆసక్తులు, ధార్మికత అలవాటై పెంపొందింది. మా తల్లి సర్గీయ కమలాదేవి గొప్ప మహిళ. ఆమె భగవద్గీతను కంఠతా పట్టడమే కాక అనేక భజనలు పాడేవారు. ఆమె ప్రార్థనలు, భజనలలో నేను ఆమెతో పాటు కూర్చునే వాడిని. ఆమె కోసం నేను కొన్ని పుస్తకాలు చదివి వినిపించే వాడిని. ఇప్పటి నా సంస్కారాన్ని నేను నా తల్లితండ్రుల నుంచి పుణికి పుచ్చుకున్నాను.

 

స్వర్ణలత: "మీరు ఆధ్యాత్మికతలోకి ప్రవేశించటానికి ప్రేరణ ఏది?


శ్రీ సతీష్ అగర్వాల్: 1995లో మా తల్లి గారు మరణించినప్పుడు ఆమె చితి కోసం వాడిన కట్టెలను చూడగానే "ఈ చెక్కలను ఆమె ప్రకృతికి ఋణపడింది; ప్రకృతికి వాటిని తిరిగి అందించాలి" అనే ఆలోచన ఉదయించింది.

 

అప్పటి నుంచీ నేను మొక్కలు నాటడం మొదలుపెట్టి, నా చుట్టుప్రక్కల వారిని కూడా మొక్కలు నాటడానికి ప్రోత్సహించి, ఆ మొక్కలు ఉచితంగా సరఫరా చేసేవాడిని. ఇప్పటి వరకూ లక్ష మొక్కలు పంపిణీ చేశాను!

 

ఇది ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచి, మనం దైవం అని పిలిచే ఆ పరమోన్నత శక్తికి "ఈ ప్రకృతే సజీవ, అంతిమ ప్రదర్శన" అని నేను తెలుసుకున్నాను. "మనం ప్రకృతికి అనుగుణంగా వుండి, ప్రకృతి నియమాలను అనుసరించాలి; అప్పుడు ప్రకృతిలో ప్రకృతి శక్తి యొక్క పంచతత్వాలనూ, సర్వదిక్కులనూ, కాలాన్నీ, విశ్వాన్నీ అంతటినీ కనుగొనగలం" అని తెలుసుకోవటమే నాలో ఆధ్యాత్మిక అవగాహనకు నాంది అని చెప్పవచ్చు.

 

ఆ తరువాత వాటిని అన్నింటినీ ఒక గూటిక్రింద నేర్చుకోవటమే "పిరమిడ్ వాస్తు" అని తెలిసింది.

 

స్వర్ణలత: "పిరమిడ్ ధ్యానం పట్ల ఆసక్తి ఎందుకు కలిగింది?"


శ్రీ సతీష్ అగర్వాల్: 1995లో థంసానది ఒడ్డున స్వయంభూలింగం గల తపకేశ్వర ఆలయంతో అనుబంధం ఏర్పడింది. ఆ పరిసరాలలోని గుహలలో కొంతమంది ధ్యానసాధన చేయటం చూసిన నాకు ధ్యానం పట్ల ఆసక్తి కలిగింది.

 

డా||S.K. అగర్వాల్ గారి ద్వారా వడోదరలోని డా|| జితేన్ భట్ గారి పిరమిడ్లు, పిరమిడ్ వాస్తుతో పరిచయం ఏర్పడింది. 2000వ సంవత్సరంలో నాకు వెన్నుపూసలో సమస్య వచ్చింది. అప్పుడు నేను పిరమిడ్ వాస్తును అనుసరించటం ద్వారా ఆరోగ్యం బాగు చేసుకున్నాను. ఆ పైన పిరమిడ్ విషయంలో కూడా నేను అనేక ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలు పొందాను. 2004 సంవత్సరంలో.. డెహ్రోడూన్‌లోనే.. నేను బ్రహ్మర్షి పత్రీజీని కలిసినప్పుడు ఆయన నన్ను ధ్యానం కో సం పిరమిడ్ నిర్మించమని కోరారు.

 

అంతకముందు నా మిత్రులు డా||S.K.అగర్వాల్ కూడా అదే సూచించారు. దాంతో నేను 7'x7' చెక్క పిరమిడ్‌ను తయారు చేయించి దానిలో కూర్చుని ధ్యానం చెయ్యటం మొదలుపెట్టాను. అప్పుడు నేను ‘ఆధ్యాత్మికత’ గురించి తెలుసుకున్నాను. "ఈ ఆత్మ వివేక సంపద్వంతమైనది.. శరీరం అవగాహనలో బలహీనమైనది; ఆత్మకు సర్దుబాటు లేదు.. శరీరం అనుసరింవదు; ఈ రెండింటి మధ్యా ఐక్యతే ఆధ్యాత్మికత" ఆ తదుపరి డా||ఆశిష్ సెమ్వాల్ గారిని కలవడం సంభవించింది. ఆయన నాకు యోగం, ధ్యానాల ప్రాధాన్యతను విశదీకరించారు. అంతే కాక మా మధ్య అనేక ఆధ్యాత్మిక చర్చలు జరిగేవి.

 

స్వర్ణలత: "పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది?"


శ్రీ సతీష్ అగర్వాల్: చిన్న పిరమిడ్‌లో కూర్చుని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిశ్శబ్దపు శబ్దం వినడంతో సహా అనేక అనుభవాలు పొందాను. అప్పుడు ధ్యానసమయంలోనూ, నిద్రలోనూ కూడా అనేక దివ్య సందేశాలు వచ్చేవి. వాటి ద్వారా "ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నేను జన్మించాను" అనీ "మానవజాతికి ఉపయోగపడే అనన్యమైనది ఏదో నేను చెయ్యాలి" అనీ నేను గ్రహించాను.

 

అప్పుడు "పిరమిడ్ హోమ్ డివైన్" నిర్మించాలనే ఆలోచన వచ్చింది. మా బావగారు చంద్రగుప్త విక్రమ్ నన్ను ప్రోత్సహించి పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మాణానికి కావలసిన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించారు. నిజానికి ఎక్కువ మంది కూర్చుని ధ్యానసాధన చెయ్యటానికి అనువై, ఎక్కువ విశ్వశక్తిని పొందగల పెద్ద పిరమిడ్ నిర్మించాలి అన్నదే నా ఆలోచన. కానీ స్థలాభావం, ధనాభావం వలన చిన్నవైనా, అనేక పిరమిడ్‌లు నిర్మించే విధంగా ఆలోచనను మార్చుకున్నాను, చివరికి అది ఈ "పిరమిడ్ హోమ్ డివైన్" గా రూపు దాల్చింది!

 

"సకారాత్మక ధోరణిగల సమూహం, నేర రహిత సమాజం, ప్రకృతితో సహజీవనం చేసే మానవులను రూపొందించాలి" అన్నదే నా లక్ష్యం.

 

మనుష్యులు సానుకూలతతో, స్నేహ, సహకారాలతో, ధార్మిక ధోరణలతో పరిపూర్ణమై వాటిని తమ జీవితాలలో వాస్తవీకరించుకోవటానికి ఇది వేదిక కావాలన్నదే నా ఆకాంక్ష.

 

స్వర్ణలత: "పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మాణంలోనూ, ఆ తరువాత మీ అనుభూతులు.."


శ్రీ సతీష్ అగర్వాల్: పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మాణం నిదానంగా, స్థిరంగా నడిచింది. "తరువాత ఫలితం ఏమిటి?" అన్నది నేనేమీ ఊహించలేదు. కేవలం దివ్య సూచనలను అనుసరించాను.

 

ఈ ప్రదేశంలో సృష్టించిన (నిర్మించిన)ది ఏదో నన్ను మరింత అనుసృజనకు పురికొల్పేది.


2014, మార్చి 1వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు "డిసెంబరు, 2, 2014 గీతాజయంతి రోజున పిరమిడ్ హోమ్ డివైన్ ప్రారంభోత్సవం జరుపుకుందాం" అని చెప్పారు.

 

అప్పటి నుంచీ పనులు వేగంగా చేస్తూ పత్రీజీ పై భారం వేశాను. డిసెంబర్ 2వ తేదీ నాటి ప్రారంభోత్సవ వేడుక మహాద్భుతంగా, అమోఘంగా జరిగింది!

 

చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, డిల్లీ, చండీఘర్, జలంధర్, కురుక్షేత్ర, లూధియానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి అనేకమంది పిరమిడ్ మాస్టర్లు వచ్చి తమ ఆశీర్వచనాలు అందించారు. "ఆ విధంగా జరుగుతుంది" అని నేను ఊహించనే లేదు! అప్పుడు నాకు "ఏదో గొప్పది అనన్యమైనది సృష్టించబడింది" అనిపించింది.

 

స్వర్ణలత: "పిరమిడ్ హోమ్ డివైన్ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి మీ భవిష్యత్ ప్రణాళిక?"


శ్రీ సతీష్ అగర్వాల్: పిరమిడ్ హోమ్ డివైన్ ఆధ్యాత్మిక పునాదుల మీదే నిర్మించబడింది. ప్రతి ఆదివారం, పౌర్ణమి రోజులలో ధ్యాన తరగతులు నిర్వహించబడి, ఉచిత భోజన ఫలహారాలు అందజేయబడతాయి. ధ్యానం ద్వారా ఇక్కడి దివ్యశక్తిని ప్రతివారూ అనుభూతి చెందాలన్నదే మా లక్ష్యం. ఆధ్యాత్మిక అవగాహనా సదస్సులు, వర్క్ షాప్లు నిర్వహిస్తున్నాం. ఈ మధ్యే జూలై మాసం 5,6 తేదీలలో "NCSS" నిర్వహించబడింది. సామాజిక ఉన్నతి కోసం "మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి అందరినీ ఆత్మజ్ఞానులుగా మలచాలి" అన్నదే మా లక్ష్యం.

 

స్వర్ణలత: "మీ ఆధ్యాత్మిక అనుభవాలు తెలియజేస్తారా?!


శ్రీ సతీష్ అగర్వాల్: ఆధ్యాత్మికతతో నా జీవితం సంపూర్ణంగా మార్పు చెందింది! ఇరవై సంవత్సరాల క్రితం నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని, కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞాన పరిధిలోకి వచ్చానో నా శరీరంలోకి వేరే ఆత్మ ప్రవేశించింది. దీని లక్ష్యం అంతకు ముందు వున్న దాని లక్ష్యం కంటే భిన్నమైనది నేను వ్యవహరించే, మెలిగే వ్యక్తుల సమూహం మారింది.

 

ఇంతకు పూర్వం వున్న వాళ్ళు ఇప్పుడు నా కనుచూపు మేరలో లేరు! నా గ్రాహ్యత మారి నాలాగే సానుకూల దృక్పథం వున్న వారు నాకు చేరువ అయ్యారు. నేను వాస్తు, పిరమిడ్‌ల గురించి అధ్యయనం చేసిన తరువాత మాత్రమే ఇదంతా సంభవించింది.

 

నా జీవితంలో రోజు రోజుకూ అద్భుతాలు జరిగాయి. నాకే కాదు పిరమిడ్ సాంకేతిక శక్తి పరిచయం అయిన వారికి అందరికీ ఆ అద్భుతాలు జరిగాయి, జరుగుతాయి. ధ్యానం చేస్తున్నప్పుడు నాతో పాటు ఆస్ట్రల్ మాస్టర్స్ కూర్చుని ధ్యానం చేయటం అనుభూతి చెందుతాను.
దైనందిన విషయాలకు కూడా నేను పిరమిడ్‌లు ఉపయోగిస్తాను. అవి ఎంతో గొప్ప ఫలితాలను, అత్యున్నత అనుభవాలను ఇచ్చాయి, ఇస్తాయి. ఈ పిరమిడ్ హోమ్ డివైన్లో నిర్మించబడినవన్నీ నా జీవితంలో అద్భుతాలుగా నేను భావిస్తాను.

 

స్వర్ణలత: "భవిష్యత్ ఆధ్యాత్మిక ప్రణాళిక?"


శ్రీ సతీష్ అగర్వాల్: నా జీవితం సమూలంగా 360 డిగ్రీస్ గా మారింది. "పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మించాలి" అన్న భావం ఉదయించినప్పటి నుంచి నేను పూర్తి ఆధ్యాత్మికతలోకి మళ్ళాను. నాలాగే అందరూ ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకుని జీవితం గడపటం కోసం కృషి చేస్తాను.

 

నేను తిన్నా, త్రాగినా, మాట్లాడినా, నడిచినా, నిద్రించినా అంతా పిరమిడ్ మయమే! ప్రతీదీ పిరమిడ్ తోనే ముడిపడి వుంటుంది; ‘పిరమిడ్’ అన్నది దివ్య నిష్పత్తి గల నిర్మాణం!

 

"భవిష్యత్తులో అనేక మంది ప్రజలను పిరమిడ్ జ్ఞాన గొడుగు క్రిందకు తేవాలి" అన్నదే నా అభిప్రాయం. దానివలన వారు ప్రకృతితో అనుసంధానించబడతారు. ప్రకృతే అంతిమ విషయం.

 

పిరమిడ్ మనలను ప్రకృతికీ, విశ్వానికీ అనుసంధానించే మౌలిక ఉపకరణం. పత్రీజీ యొక్క మూడు నినాదాలు.. శాకాహారం, ధ్యానం, పిరమిడ్ శక్తులకు మరొక దానిని.. మొక్కలు నాటడాన్ని.. కూడా నేను కలుపుతున్నాను.

 

పిరమిడ్ శక్తి, సాంకేతికతలను ప్రతివారికీ చేరువ చెయ్యాలి అన్నది నా కోరిక.

 

స్వర్ణలత: "మీ కుటుంబం మరి స్నేహితుల ప్రోత్సాహం ఎలా వుంది?"


శ్రీ సతీష్ అగర్వాల్: నా కుటుంబం మరి నా స్నేహితుల ప్రోత్సాహం లేకపోతే నేను ఈ విధంగా వుండేవాడిని కాదు.

 

నేను పిరమిడ్ వాస్తు నేర్చుకుని, ప్రయోగాలు చేస్తున్నప్పుడు నా శ్రీమతి రుచి అగర్వాల్ అడుగడుగునా పిల్లలు చిన్నవాళ్ళు, వారు చదువులో పిరమిడ్ వాస్తు అన్వయంతో అద్భుతమైన అభివృద్ధి సాధించారు.

 

పిరమిడ్ హోమ్ డివైన్ నిర్మాణం ఆరంభమైనప్పుడు మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చదువుతోంది. తన చదువులో చివరి సంవత్సరంలో పిరమిడ్ హోమ్ డివైన్ కి చెందిన డ్రాయింగ్స్ ఇచ్చేది. చదువు పూర్తి అయ్యాక పిరమిడ్ హోమ్ డివైన్ డిజైనింగ్ పాటు కావలసిన సామగ్రి తెప్పించి అమర్చటం వంటి బాధ్యతలన్నింటినీ తానే స్వీకరించింది. వాస్తవానికి నిర్వహణ బృందం నా భార్య రుచి అగర్వాల్, కుమార్తె స్వభావి, కుమారుడు డాక్టర్ తేజస్విలతో రూపొందింది.

 

నా మేనల్లుడు విశాల్ అగర్వాల్ విషయాలను వాస్తవీకరింప చేశాడు. ఈ పవిత్ర కార్య నిర్వహణకు అనేకమంది మిత్రులు ప్రోత్సహించి ఉత్తేజపరచారు.

 

స్వర్ణలత: "ఇంక పిరమిడ్ హోమ్ డివైన్ ప్రత్యేకతలు?"


శ్రీ సతీష్ అగర్వాల్: ఉత్తరాఖండ్ రాజధానీ నగరం, నగర పర్వత సంస్కృతుల మేళవింపు అయిన డెహ్రాడూన్ ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు! ఇక్కడి పిరమిడ్ హోమ్ డివైన్ ఆ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ కింగ్స్ ఛేంబర్, క్వీన్స్ ఛేంబర్‌లతో కూడి వున్న "మణి ద్వీపం" పిరమిడ్‌ను కలిగివుంది.

 

ఇంకా "సద్భావనా సంగోష్టి కక్ష్" అనే సమావేశ భవనం, పైన పిరమిడ్లతో మూడు విధాల నివాస భవనాలు, పిరమిడ్ హెల్త్ సెంటర్, శాకాహారం మాత్రమే అందించే భోజనశాల, ఆస్ట్రో థెరపీ, జిమ్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టులు, నక్షత్రవనం, రాశిచక్రపు వృక్షాలు, గోశాల, ప్రకృతి వ్యవసాయం, స్విమ్మింగ్ పూల్, ఆలయం (పిరమిడ్ పై కప్పుతో), గ్రంథాలయాలతో కూడి ఇక్కడకు వచ్చిన వారు పూర్తి విశ్రాంతినీ, శక్తినీ, జ్ఞానాన్ని పొందే విధంగా రూపొందించబడింది.

 

స్వర్ణలత:  "మీ సందేశం?"


శ్రీ సతీష్ అగర్వాల్: ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటీ విశ్వ ప్రణాళికలోని భాగమే. మనం ప్రకృతి నియమాలను గౌరవించాలి. మన రాజ్యాంగం ప్రకారం నియమాలను అతిక్రమిస్తే శిక్షార్హులమయినట్లుగా ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే వరదలు, భూకంపాలు, కరువు కాటకాల రూపంలో శిక్ష వుంటుంది.

 

మన కుటుంబంలో లాగానే ప్రతి వారితోనూ ఐకమత్య వాతావరణంలో, సంఘీభావంతో మెలిగితే మనం అభివృద్ధి చెందగలం.
ప్రతివారూ శాకాహారులుగా మారాలి. ప్రతీదీ శక్తి వినిమయ నియమం పైనే ఆధారపడి వుంటుంది. ప్రకృతి నుంచి మనం తీసుకునే ఆక్సిజన్ కోసం మొక్కలు నాటాలి, మనం మరింత ఎక్కువవెక్కువగా ధ్యానసాధన చేసి, అనుకూల దోరణ కలిగి, ప్రేమ శక్తిని వ్యాపింపచెయ్యాలి.
ప్రేమ శక్తి ప్రతి వారినీ దివ్యులుగా మారుస్తుంది. ప్రేమ, సౌభ్రాతృత్వాలను ఏ పరిస్థితిలోనైనా నిలిపి వుంచుకోవాలి. "మనం ఇచ్చిందే తిరిగి పొందుతాం" అని గుర్తుంచుకుందాం.

 

Go to top