" ఇది నాకూ మరి నా కుటుంబానికీ గొప్ప వరం "

 

 

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన శ్రీ నల్లమిల్లి విజయభాస్కర రెడ్డి గారు .. చిన్నతనం నుంచే కుటుంబపరంగా వచ్చిన వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్తగా మరి తాపేశ్వరంలోని "అదితి గ్రూప్" .. "వేడుక మెగా ‌& మినీ సెంట్రల్ A/C ఫంక్షన్ హాల్స్" అధినేతగా ఎదిగారు. సామాజిక సేవాతత్పరులైన వీరు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా జిల్లాలో విశేషమైన సేవలు నిర్వహించారు. "మహాత్మాగాంధీ సేవాసమితి" అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దాని ద్వారా బీద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించడం .. నేత్రదానాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ చేస్తూన్న ధ్యాన ప్రచారం ద్వారా ధ్యానంలో ఉన్న గొప్పదనాన్నీ మరి శాస్త్రీయతనూ స్వయంగా అనుభవించి .. ధ్యానాన్ని మరింత మందికి చేరువ చేయాలన్న సంకల్పంతో తూర్పు గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులుగా .. జిల్లా వ్యాప్తంగా విస్తృత ధ్యానప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూన్నారు.

 

ఈ క్రమంలో జూలై 14 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన గోదావరి పుష్కరాల సందర్భాన్ని పురస్కరించుకుని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ .. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం-పేరవరం గ్రామాల పరిధిలో .. గోదావరి నది ఒడ్డున ఇరవై అయిదు ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటూన్న "శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తిక్షేత్రం"లో ఏడురోజుల పాటు భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహాన్ని నిర్వహించింది.

 

బ్రహ్మర్షి పత్రీజీ అధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ విశేష కార్యక్రమం కొరకు ఉభయగోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ పుష్కర స్నాన ఘాట్‌ను, యజ్ఞవాటిక, ధ్యానకుటీరం మరి అన్నదాన మండపాలను నిర్మించి పుష్కరాలకు వచ్చే వేలాది మంది ధ్యానులకు ధ్యాన-జ్ఞాన ప్రచారాలను నిర్వహించారు! ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీవిజయభాస్కర రెడ్డి గారి బృందాన్ని అభినందిస్తూ .. వారి ద్వారా కార్యక్రమ నిర్వహణా విశేషాలను తెలుసుకుందాం ..


M.స్వర్ణలత

స్వర్ణలత: "మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు?"


శ్రీ విజయభాస్కర రెడ్డి: నేను నా భార్య అన్నపూర్ణ ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఆమె రోజూ ఇంట్లో ధ్యానం చేసుకుంటూ ధ్యాన అనుభవాలు పొందుతూ .. విశ్వగురువైన పత్రీజీ గురించి నాతో చెబుతూండేది. కొద్దికాలానికే మండపేటలో "శ్రీ కొనగళ్ళ సత్యనారాయణ శ్రీమతి విజయకుమారిల ధ్యానమందిరాన్ని" ప్రారంభించడానికి పత్రీజీ వస్తున్నారని తెలుసుకుని వెళ్ళి వారిని కలిశాను. వారి సమక్షంలో ధ్యానం చేసి .. "ఈరోజు నుంచి నేను శాకాహారిగా జీవిస్తాను" అని మాట ఇచ్చాను.

 

ఇక అప్పటి నుంచి నాలుగేళ్ళపాటు పత్రీజీ మా ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వారితో కూడా తిరుగుతూ .. ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని మరి సత్యంలో ఉన్న విశిష్ఠతనూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ తరువాత ఒకరోజు పత్రీజీతో "సార్! ఈ రోజు నుంచీ మీరు ఏది చెబితే అది చేస్తాను" అన్నాను! వెంటనే వారు నన్ను తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి "అధ్యక్షుని"గా నియమించారు.

 

స్వర్ణలత: "గోదావరి పుష్కరాల సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాలి" అన్న ఆలోచన ఎలా వచ్చింది?


శ్రీ విజయభాస్కరరెడ్డి: 2015 జనవరి 31 వతేదీన మా వివాహ రజతోత్సవ వేడుకలలో పాల్గొనడానికి తాపేశ్వరం విచ్చేసిన పత్రీజీ .. "గోదావరి పుష్కరాల సందర్భంగా మీ నాయకత్వంలో ఒక విశేష కార్యక్రమం చేద్దాం" అన్నారు. ఆత్రేయపురం మండలం రాజవరం-పేరవరం గ్రామ పరిధిలో నిర్మాణం జరుపుకుంటూన్న శ్రీవశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తిక్షేత్రంలో ఏడురోజుల పాటు "భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం" నిర్వహించటానికి అక్కడే రూపకల్పన జరిగింది. ఆ తరువాత వైజాగ్‌లో జరిగిన "అంతర్జాతీయ యోగా దినోత్సవం" తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల పిరమిడ్ సొసైటీల సభ్యులం అంతా కలిసి ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు సమావేశం ఏర్పరుచుకున్నాం.

 

ఆ సమావేశంలోనే నా అధ్యక్షతన "భగవద్గీత ధ్యానజ్ఞాన సప్తాహం కమిటీ"ని ఏర్పాటు చేసుకుని .. కార్యక్రమం కోసం ప్రాంగణంలో చెయ్యవలసిన విస్తృత ఏర్పాట్ల గురించీ, విశేష అన్నదానం గురించీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

స్వర్ణలత: "ఏ ఏ ఏర్పాట్లు చేశారు?"


శ్రీ విజయభాస్కర రెడ్డి: యజ్ఞ నిర్వహణ కొరకు 80'X150' అంటే పన్నెండు వేల చదరపు అడుగుల వైశాల్యంతో కూడిన వేదికను మరి 150'x20' అంటే మూడువేల చదరపు అడుగుల స్టోర్ మరి వంటశాలను ఏర్పాటుచేశాం. పుష్కరాల కోసం వచ్చే వేలాది మంది ధ్యానులకు ఏడురోజులపాటు నిర్వహించబోయే అన్నదాన మహాకార్యక్రమం కోసం 300'X20' అంటే ఆరువేల చ|| అడుగుల వైశాల్యంతో భోజనశాలను ఏర్పాటుచేశాం. పుస్తకాలు మరి పిరమిడ్స్ స్టాల్స్ కోసం 150'X20' అంటే మూడువేల చ|| ఆడుగుల విస్తీర్ణంలో పొడుగాటి షెడ్ ఏర్పాటుచేశాం.

 

వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ షీట్లతో కప్పడం జరిగింది. త్రాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు ధ్యానుల కనీస అవసరాల నిమిత్తం తాత్కాలిక టాయ్‌లెట్స్, బాత్‌రూమ్స్ నిర్మించడం జరిగింది. పత్రీజీ విడిది చేయడానికి పంచవటిని తలపించే "గీతాభారతి కుటీర్"ను నిర్మించాం. ఇక ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలను లైవ్‌లో చూసే విధంగా దేశవిదేశాల పిరమిడ్ మాస్టర్స్ కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ కెమెరాలను ఏర్పాటు చేశాం.

 

స్వర్ణలత: "ప్రాంగణంలో ప్రత్యేక పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేశారు కదా! దాని వివరాలు?"


శ్రీ విజయభాస్కర రెడ్డి: శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ తరపున ఈ ప్రాంగణంలో ఒక స్నానఘట్టం కావాలని ప్రభుత్వానికి లేఖ వ్రాశాం. వారు పూర్వాపరాలను పరిశీలించి ‘సి’ కేటగిరీలో పదిలక్షల రూపాయలను మంజూరు చేశారు. ఆ డబ్బుతో పుష్కర ఘాట్ నిర్మాణం సగమే పూర్తికాగే మిగతా సగం నిర్మాణం ట్రస్ట్ తరపున పూర్తి చేసి 18 షవర్లను కూడా ఏర్పాటుచేశాం. దాంతో అత్యంత సుందరమైన "గౌతమి పుష్కర ఘాట్" స్నాన ఘట్టం తయారయ్యింది! ఇలా పత్రీజీ ఆశీస్సులతో మరి ఉన్నత లోకవాసుల సహకారంతో మేము ఈ ఏర్పాట్లు పూర్తి చేయడం మా జన్మ సాఫల్యత చెందినట్లుగా భావిస్తున్నాం.

 

స్వర్ణలత: "ఈ సందర్భంగా ఇంకా మీ అనుభూతులు తెలుసుకోగోరుతున్నాం?"


శ్రీ విజయభాస్కర రెడ్డి: "ప్రతి ప్రాణిలోనూ దైవత్వం కొలువుదీరి ఉంది కనుక .. జీవహింస మాని శాకాహారాన్ని భుజిస్తూ .. ఒక ఆత్మజ్ఞానిలా జీవించాలి. "ఇతరులకు చేతనైనంత ప్రాపంచిక సేవ మరి ధ్యానప్రచార సేవను త్రికరణశుద్ధిగా చేయడం వల్ల పుణ్యం వస్తుంది" అని నా నిశ్చిత అభిప్రాయం. ఇది వదిలేసి జీవహింస చేస్తూ .. నదీస్నానాలూ, పుష్కరస్నానాలూ, సముద్ర స్నానాలూ చేస్తూ, దేవాలయాల చుట్టూ తిరిగి పూజలు చేయడం వలన పుణ్యం వస్తుంది అనుకోవడం భ్రమ!

 

ఇంత గొప్ప ధ్యానజ్ఞానయజ్ఞం నిర్వహణ బాధ్యత పత్రీజీ నాకూ, నా కుటుంబానికీ ఇచ్చిన గొప్ప వరం! ఇందుకోసం నా వ్యాపార లావాదేవీలన్నీ ఒకింత ప్రక్కకు పెట్టి .. ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాను. నా భార్య అన్నపూర్ణ కూడా అన్నదానం కమిటీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ స్టేజీ దగ్గర కార్యక్రమాలను కూడా పర్యవేక్షించింది. ఈ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్స్ చేసిన సేవలు వెలకట్టలేనివి! ఆర్థిక వనరుల సమీకరణతో పాటు ప్రాంగణంలో వారు నిర్వహించిన విధులు అందరికీ ఆదర్శం! అన్నింటినీ మించి అన్నదాన నిర్వహణ కోసం కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల పిరమిడ్ మాస్టర్స్ అందించిన ఆర్థిక సహాయం మరువలేనిది!

 

ఇక పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని ఇతర పుష్కరఘాట్‌లలో సాధారణ ప్రజలు త్రొక్కిసలాటగా స్నానాలు ఆచరిస్తూ .. గందరగోళ వాతావరణం సృష్టించిన దృశ్యానికీ .. మన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌతమీ ఘాట్‌లో దృశ్యానికీ చాలా వ్యత్యాసం ఉంది.

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ కూడా ఒక మెడికల్ క్యాంప్, పోలీస్ క్యాంప్‌లు ఏర్పాటు చేయబడినా అవి నామమాత్రంగా ఉంటూ ధ్యానుల క్రమశిక్షణకు ఆ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది. రోజూ జరిగే ప్రాతఃకాల ధ్యానంలో వాళ్ళు కూడా విడతలవారీగా వచ్చి అందులో పాల్గొని సంతోషించారు. ఇక ప్రతిరోజూ పత్రీజీ అందించిన భగవద్గీత సప్తాహం అందరి జ్ఞానార్తిని తీర్చింది.

 

ఇంతటి అద్భుతమైన కార్యక్రమం జరగటం వలన ఈ ప్రాంగణం అంతా కూడా మరింత శక్తివంతంగా మారింది. ఈ సందర్భంగా పత్రీజీ "శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ రాష్ట్రస్థాయి కమిటీ"ని ఏర్పాటు చేశారు. పిరమిడ్ గ్రాండ్ మాస్టర్స్ కూర్పుతో ఏర్పాటు చేయబడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో 184'x184' బృహత్ పిరమిడ్ నిర్మాణం పనులు మరింత వేగవంతంగా జరుగనున్నాయి.

 

దేశవిదేశాలలో స్థిరపడివున్న ఉభయగోదావరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ పిరమిడ్ నిర్మాణ మహాయజ్ఞంలో పాల్గొంటే .. వచ్చే 2016 సంవత్సరం గురుపౌర్ణమి నాటికి సగర్వంగా పిరమిడ్ ప్రారంభోత్సవం నిర్వహించుకుందాం!

Go to top