" ధ్యానంతో నడుము నొప్పి మాయం "

 

 

నా పేరు "సువర్ణ". నేను 2008 సంవత్సరంలో వరంగల్‌లోని ఒకానొక ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఉన్నప్పుడు విపరీతమైన నడుము నొప్పికి గురి అయ్యాను. ఆర్థోపెడిక్ డాక్టర్‌కు చూపించుకోగా పరీక్షలు చేసి వెన్నెముకలో L3, L5 డిస్క్‌లు ప్రక్కకు జరిగాయి కనుక బెడ్ రెస్ట్‌లో ఉండమని చెప్పారు. నడుము నొప్పితో పది నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితికి వచ్చిన నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయుర్వేదం మరి నేచురోపతి ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటూ వేలకు వేలు ఖర్చు పెట్టుకున్నాను.

 

ధ్యానం గురించి ఇదివరకే తెలుసుకుని ఉండడంతో 2015 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు పట్తు విడవకుండా 40 రోజుల పాటు మండల ధ్యానం చేశాను. ముందు కాస్సేపు కూడా కూర్చోలేని నేను రోజురోజుకీ నడుము నొప్పి తగ్గడంతో గంటలు గంటలు ధ్యానంలో కూర్చునే స్థితికి వచ్చేశాను. దాంతో ఫిబ్రవరి 11వ తేదీన భీమవరంకు వెళ్ళి అయిదురోజుల 50 గం||ల మౌనధ్యాన కార్యక్రమంలో పాల్గొని రోజుకు 10గం||లు లేవకుండా కూర్చుని ధ్యానం చేయగలిగాను. ఆ అయిదురోజుల ధ్యానంతో నా నడుమునొప్పి సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది.

 

ఇక దాంతో "నా లాగే అనారోగ్యంతో బాధ పడుతున్న వారందరికీ ధ్యానశక్తిని అందుబాటులోకి తేవాలి" అనుకుని "గార్ల"లో మా ఇంటిపై పిరమిడ్‌ను కట్టాలని సంకల్పించుకున్నాను. ఇల్లందు పిరమిడ్ మాస్టర్ .. "సంకల్పాల పుల్లారావు"గారితో పిరమిడ్ నిర్మాణానికై సంకల్పం తీసుకుని .. మేదరమెట్ల రామారావు గారి పర్యవేక్షణలో 12'X12' "శ్రీ వెంకటేశ్వర పిరమిడ్"ను నిర్మించాము.

 

ఈ పిరమిడ్ నిర్మాణానికి ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షురాలు నలజాల సరోజ గారు ఎంతో సహకారాన్ని అందించారు. ఆగస్ట్ 9వ తేదీన ఉయ్యూరు పిరమిడ్ మాస్టర్ M.స్వర్ణలత గారు మరి వరంగల్ పిరమిడ్ మాస్టర్ జున్నూతుల కిషన్ రెడ్డిగారు విచ్చేసి పిరమిడ్‌ను ప్రారంభించి కార్యక్రమానికి హాజరయిన వందమంది పట్టణ ప్రజలకు ధ్యాన విశిష్ఠతను తెలియజేసి వారితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ "లక్ష్మణ్ నాయక్" గారు అందరినీ అభినందించారు. ఇటువంటి గొప్ప గొప్ప పనులు మనతో చేయిస్తూ మన జన్మలను దివ్యం చేస్తూన్న పత్రీజీకి కృతజ్ఞతలు.

 

B.సువర్ణ గార్ల

ఖమ్మం జిల్లా
81214 19571.

Go to top