" అమెరికాలో ధ్యానప్రచార భేరి "

 

 

నా పేరు "పుష్పావతి". మా ఆడపడుచు మరి విశాఖపట్టణం సీనియర్ పిరమిడ్ మాస్టర్ T.వీరజగదీశ్వరి గారి ద్వారా 2003లో నేను ధ్యానపరిచయం పొందాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ అనేకానేక ధ్యాన మరి సూక్ష్మశరీరయాన అనుభవాలను పొందుతూ గత ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూన్న గర్భసంచికి చెందిన అనారోగ్యం నుంచి ఆపరేషన్ అవసరం లేకుండా విముక్తి పొందాను.

 

2004 సంవత్సరంలో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో కొన్ని వేలమందితో జరిగిన ధ్యానయజ్ఞంలో పాల్గొని పత్రీజీ వేణునాద ధ్యానంలో అద్భుతమైన అనుభూతులను స్వంతం చేసుకున్నాను. అప్పటినుంచి నా పూర్తి సమయాన్ని వినియోగిస్తూ నేను మా వారు D.రాఘవరెడ్డి గారు మరి మా ఆడపడుచుతో కలిసి మా చుట్టుప్రక్కల గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించాను. గ్రామస్థులకు ధ్యానం నేర్పిస్తూ వారు తమ తమ అనారోగ్యాల బారి నుంచి బయటపడి వ్యక్తం చేసే ఆనందాన్ని మేం కూడా పంచుకుని ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకునేవాళ్ళం. ఈ క్రమంలో ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న మా అబ్బాయి కోరిక మేరకు మేము 2015 మే 1వ తేదీన అమెరికా వెళ్ళాము.

 

మా అబ్బాయి D.రమేష్ మరి కోడలు శిరీషలతో ధ్యానం చేయిస్తూ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ధ్యానప్రచారం చేశాం. ఈ క్రమంలో జూలై 1,2,3 తేదీలలో డెట్రాయిట్‌లో జరిగిన తెలుగు మహాసభలు (తానా)లో పాల్గొనడానికి మా అబ్బాయి ప్రయత్నాలు చేస్తూ .. మా ఆడపడుచును కూడా రమ్మనడం జరిగింది.

 

అప్పటికే V.మాడుగులలో "విశ్వకాంతి పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మాణాన్ని పూర్తిచేసి ఉన్న ఆవిడ అమెరికా రావడానికి తన ఆర్థిక అశక్తతను తెలియజేయడంతో లండన్‌లో ఉన్న మా అమ్మాయి రాధ మా ఆడపడుచుతో పాటు విశాఖపట్టణం ఇందిరా లక్ష్మి మేడమ్‌తో కూడా మాట్లాడి అమెరికా రావడానికి తనే వాళ్ళకు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసింది. ఎప్పుడో మేము గ్రామాలలో ధ్యానప్రచారం చేసేటప్పుడు "ఎప్పటికైనా అమెరికా వెళ్ళి ధ్యానప్రచారం చెయ్యాలి" అనుకునేవాళ్ళం! ఆనాటి మా సంకల్పం కార్యరూపం దాల్చి వీరజగదీశ్వరి మరి ఇందిరా లక్ష్మి గార్లు డెట్రాయిట్ తానా మహాసభలలో పాల్గొనడానికి రావడంతో మా "అమెరికా ధ్యానప్రచార భేరి" మొదలయ్యింది.

 

మా అబ్బాయి మరి కోడలు సంపూర్ణ సహకారంతో డెట్రాయిట్‌లోని వెంకటేశ్వరస్వామి, బాబా ఆలయాలలో ధ్యానశిక్షణ కార్యక్రమాలు నిర్వహించాము. ఇందుకుగాను కాంతి పిక్చర్స్ N. శ్రీనివాస రెడ్డి గారు మాకు ఎంతో సహాయం చేశారు. ఇలా డెట్రాయిట్‌తో పాటు వాషింగ్‌టన్ DC, వర్జీనియా మేరీ ల్యాండ్, చికాగో రాష్ట్రాలలో పది ధ్యాన పరిచయ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను చికాగోలో ఉంటున్న ఇందిరా లక్ష్మిగారి సోదరులు M. సత్యనారాయణ, M. కృష్ణగార్లు మరి నా స్నేహితురాలు అరుణ తోట మాకు తమ సహాకారాన్ని అందించారు. మామూలు గృహిణులుగా ఉన్న మమ్మల్ని ఇలా ఒక బృందంగా చేసి అమెరికా దేశంలో ధ్యానప్రచారం జరిపించే అవకాశం ఇచ్చి మా జన్మలను ధన్యం చేసిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం!

 

D. పుష్పావతి 

ద్వారంపూడి 

తూ||గో||జిల్లా

Go to top