" ధ్యానసాధనతో సంతాన భాగ్యం "

 

 

నా పేరు "కృష్ణమోహన్ దేవ్". నేను సేల్స్ మరి మార్కెటింగ్ ఉద్యోగం రీత్యా 2009 సంవత్సరంలో విశాఖపట్టణంలో నివాసం ఉన్నప్పుడు నా చెల్లెలు "పద్మజ" ద్వారా ఆనాపానసతి శ్వాసమీద ధ్యాస ధ్యానం గురించి తెలుసుకున్నాను.

 

అప్పటికే నాకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలు అయ్యి .. సంతానం లేకపోవడంతో పాటు ఆర్థికంగా మరి ఉద్యోగపరంగా కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను. "ధ్యానం చేస్తే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి" అని చెప్పిన మా చెల్లెలుతో "భౌతికంగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధించలేని సమస్యలు .. కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానం చేస్తే పరిష్కారం అవుతాయా? నీ పిచ్చి కానీ!" అని వాదించేవాడిని.

 

ఆమె కరాసాలోని "శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం"లో మరి తన ఇంట్లో నిరంతర ధ్యాన సాధన చేసుకుంటూ చాలా వరకు మౌనంలో ఉంటూ తాను పొందిన గొప్ప గొప్ప ధ్యాన అనుభవాలనూ మరి పత్రీజీ ధ్యాన చైతన్య విశేషాలనూ నాకు చెబుతూ .. ధ్యానానికి సంబంధించిన పుస్తకాలను నాకు ఇచ్చి చదవమని చెప్పేది.

 

"ఆత్మ పరిణామ క్రమంలో దైవారాధన మొదటి మెట్టు అయితే ధ్యాన సాధన ఆఖరి మెట్టు; మరి ఆ మెట్టును చేరుకోవడానికి కావాల్సిన ప్రథమ అర్హత శాకాహారిగా మారడం" అని తెలుసుకుని నేనూ, నా భార్య "విజయశ్రీ" శాకాహారులుగా మారి "మేం సంతానవంతులం కావాలి" అని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేశాం.

 

ఆ సమయంలో మా చెల్లెలు కర్మసిద్ధాంతం గురించీ, ధ్యానం ద్వారా ఆత్మోద్ధరణ గురించీ అనేకానేక విషయాలు చెబుతూ ఒక గురువులా మమ్మల్ని చైతన్యపరచేది. మా ధ్యాన సంకల్పం ఫలించి నా భార్య గర్భవతి అయ్యి 2010 నవంబర్ నెలలో చక్కటి ఆడబిడ్డను కనడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది!

 

అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి వైద్య విధానాల ద్వారా దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి .. ఇక లాభం లేదన్న నిరాశా నిస్పృహలతో ఉన్న మా జీవితాలలో ధ్యానశక్తితో జన్మించిన మా చిన్నారి "మేఘనశ్రీ" ఆనందపు వెలుగులను నింపింది. ఇప్పుడు మా పాపకు అయిదు సంవత్సరాలు!!

 

ఇంత గొప్ప ధ్యానాన్ని మాకు పరిచయం చేసిన ప్రియతమ గురువు పత్రీజీకి మా చెల్లెలు పద్మజకు వేల వేల కృతజ్ఞతలు! 2011లో జరిగిన సింహాచలం ధ్యాన మహాచక్రం-II లో నేను నా కుటుంబంతో సహా పాల్గొని 11 రోజుల పాటు సేవ చేసుకున్నాను. ఆ తరువాత మా స్వగ్రామం నరసన్నపేటకు తిరిగి వచ్చి .. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని గ్రామగ్రామాలలో విస్తృత ధ్యానప్రచారాన్ని నిర్వహిస్తూ వచ్చాను. ఇలా నేను నా ధ్యానప్రపంచంతో మమేకమై ఆనందంగా సాగిపోతూన్న తరుణంలో "శ్రీకాకుళం మెగా శాకాహార ర్యాలీ" నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడటం నా అదృష్టం!

 

2015 మే 13వ తేదీన విశాఖపట్టణం పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ అప్పాజీ, నందప్రసాదరావు, ధ్యాన ఆరోగ్యకేంద్రం నిర్వాహకులు కృష్ణారావు గార్ల ఆధ్వర్యంలో శ్రీకాకుళం విశ్వైక్యతా పిరమిడ్ ధ్యానకేంద్రంలో జిల్లా ధ్యానులందరినీ సమావేశపరిచి ప్రణాళికా బద్ధమైన రూట్ మ్యాప్‌ను రూపొందించాం.

 

జూన్ 4 వతేదీ నుంచి 14 వ తేదీ వరకు 11 రోజులపాటు వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ అధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అంతటా 700కి.మీ. భారీ శాకాహార ర్యాలీ నిర్వహించాం. ఆ 11 రోజుల పాటు మాస్టర్లందరూ తమ తమ స్వంత పనులను ప్రక్కన పెట్టి ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు.

 

ఒక స్కూల్ బస్సుతో పాటు ఆరు టాటా మేజిక్ వాహనాలతో, డిజె సౌండ్ సిస్టమ్‌లో శాకాహార గీతాలను ఆలపిస్తూ .. "వైజాగ్ అప్పాజీ"గారు ప్రింట్ చేయించిన 50,000 అహింసా ధర్మ యజ్ఞ కరపత్రాలను ప్రజలకు పంచడం జరిగింది!

 

ర్యాలీలో భాగంగా పిరమిడ్ ధ్యానకేంద్రాలను సందర్శించినప్పుడు .. వారు మమ్మల్ని ఆహ్వానించిన తీరు .. ఆప్యాయంగా మాకు భోజన సదుపాయాలను కలుగజేసిన తీరు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అరకు నుంచి వచ్చిన 30 మంది సాంప్రదాయ థింసా నృత్య కళాకారులు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని ఆద్యంతం ర్యాలీకి ఆకర్షణలా నిలిచారు.

 

ఇలా లక్షలాదిమంది ప్రజలను శాకాహారం పట్ల చైతన్య పరుస్తూ శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టంలా నిలిచిన ఈ "మెగా శాకాహార ర్యాలీ" నిర్వాహకులందరినీ 2015 జూన్ 21 వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున విశాఖపట్టణం, TTD కల్యాణ మండంపంలో బ్రహ్మర్షి పత్రీజీ స్వయంగా చందనం పూసి మరీ సన్మానించడం మా భాగ్యంగా భావిస్తున్నాము! ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం మాకు అందించిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను!

 

తోట వెంకటకృష్ణ మోహన్ దేవ్
నరసన్నపేట - శ్రీకాకుళం జిల్లా
-98488 28848.

Go to top