"నరుడైతే దుఃఖం - నారాయణుడైతే ఆనందం"

 

శ్రీమతి రమాదేవి-శ్రీరాంబాబు దంపతులు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్లు. అనేక సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్‌లో వివిధ స్థాయిలలో సేవచేస్తూ, సహకారం అందిస్తున్నవారు. ఆచరణాత్మక ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనాలు. సహన, సంయమనాలకు, సభ్యత సహృదయతలకు సజీవ ప్రతీకలు. "ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం" అన్న సూక్తి వారి విషయంలో అక్షరసత్యం. పిరమిడ్ మాస్టర్స్ ‘జీవన్’, ‘ధృవ’ వారి పిల్లలు. "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రిక "ధ్యానజగత్" గా మారుతూన్న శుభవేళ ఈ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్స్‌తో కాస్సేపు ..


-ఎడిటర్

స్వర్ణలత:- "మీకు ధ్యానం పట్ల ఆసక్తి ఎందుకు ఎలా ఏర్పడింది? ధ్యానంలో ఎప్పుడు ప్రవేశించారు?"
రమాదేవి: ధ్యానం పట్ల ఆసక్తి అనేదీ ఏమీ లేదు గానీ అవసరం కొద్దీ నేర్చుకున్నాను. 1999 నా కాలర్‌బోన్స్ రెండూ పెరిగి నరాలు నొప్పి వచ్చేవి. అప్పట్లో మేము అమీర్‌పెట్‌లో ఉండేవాళ్ళం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ "విజయలక్ష్మి" గారు కూడా మా ఫ్లాట్స్‌లోనే ఉండేవారు. నా అనారోగ్యం గురించి మా ఇద్దరికీ స్నేహితురాలైన లక్ష్మిగారి ద్వారా తెలుసుకున్న ఆవిడ "రమ గారిని ధ్యానం చెయ్యమనండి, ఆరోగ్యం సరి అవుతుంది" అని చెప్పేవారు. లక్ష్మిగారు చాలాసార్లు చెప్పినా నేను ఏదో ఒక సాకుతో వాయిదా వేసేదాన్ని. చివరకు విజయలక్ష్మిగారు ఫోన్‌లో కోప్పడ్డారు.

సరే, ఆవిడను మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే "ధ్యానం చెయ్యలేదు" అని చెప్పడం బాగోదని జూలై 5వ తేదీన జలవాయు విహార్‌లో పత్రిసార్ క్లాసుకు వెళ్ళాను. క్రింద కూర్చున్నాం. కాళ్ళు బాగా నొప్పి పుట్టి "రాకుండా ఉంటే బాగుండేది. ఈయన ఎంతసేపు కూర్చోబెడతారో .. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయానే" అనుకుంటూ వుండగా ఒక అరగంట గడిచి నేను శరీరస్మృతి కోల్పోయాను. ఎక్కడవున్నానో, ఏం జరుగుతుందో తెలియలేదు.

‘ఓకే’ చెప్పిన తరువాత కళ్ళు తెరిచినప్పుడు నాకు గాలిలో తేలిపోతూన్నట్లు, ఆనందపు అంచులు తాకినట్లు అనిపించింది. ఆ ధ్యానంలో నాకు ఊదా, ఆకుపచ్చ రంగులు కనిపించాయి. అది నా భ్రమ అయివుండవచ్చు అనుకుని సార్‌ని అడుగగా "ఇప్పుడు నీ కళ్ళ ఎదురుగా నేను కనిపిస్తున్నది ఎంత సత్యమో అదీ అంతే సత్యం" అన్నారు.

అప్పటి నుంచి సార్ క్లాస్ ఎక్కడ జరిగినా వెళ్ళేదాన్ని. ఆ తరువాత పత్రిసార్ మా ఇంట్లో సెంటర్ ఆరంభించారు. కూకట్‌పల్లి ప్రాంతంలో అదే మొదటి సెంటర్.

రాంబాబు గారు: మాది కృష్ణాజిల్లా చౌటపల్లి. మా పిన్నిగారి భర్త (బాబాయి) కమ్యూనిస్ట్. ఆయన ప్రభావంతో ఆ భావజాలం, ఆ పద్ధతుల పట్ల నాకు ఆసక్తి కలిగింది. ఆయన ఇచ్చిన సమాచారం వల్ల రష్యాదేశపు సహకారంతో ఏర్పాటు చేయబడిన ఎలక్ట్రానిక్స్ ప్రత్యేక విభాగంలో హైదరాబాద్ గవర్నమెంట్ పాలీటెక్నిక్ కాలేజీలో నాలుగు సంవత్సరాల కోర్సు చేశాను. ‘గుడి’, ‘దేవుడు’ అనేవి నా డిక్షనరీలోనే లేవు. మా పెళ్ళి కూడా దండలు మార్చుకోవటమే.

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు చదివాను. 1991లో మా మేనల్లుడి ప్రోత్సాహంతో బయటకు వచ్చి కర్మాగారం స్థాపించాను. 1999 వరకూ వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. 1999 ఆగస్ట్‌లో రమ "మన ఇంట్లో ధ్యానకేంద్రం ప్రారంభిద్దాం" అంది. "తనకు కూడా ఒక ఏక్టివిటీ ఉంటుంది కదా" అని నేను "సరే" అన్నాను.

నాకు అప్పుడప్పుడు ఎలర్జీ వల్ల జలుబు వచ్చేది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చుట్టుప్రక్కల వారంతా కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఆ రోజు కూడా చాలా నాకు జలుబు వుంది. అయినా నేను వాళ్ళందరితో కలిసి దాదాపు 2,3 గంటలు ధ్యానం చేశాను. జలుబుతో నా షర్ట్ అంతా తడిసిపోయింది. అదే చివరిసారి. ఇక నాకు ఎప్పుడూ జలుబు చేయలేదు. అప్పటినుంచీ ధ్యానసాధనను కొనసాగిస్తున్నాను.

స్వర్ణలత: "ధ్యానం తరువాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి?"
రమగారు: మొట్టమొదటి రోజు పత్రిసార్ క్లాస్ తరువాత అందరితో అనుభవాలు చెప్పిస్తూ నన్ను పిలిచి "ఈవిడకు చాలా గొప్ప అనుభవం వచ్చింది, వినండి" అని పిలిచినప్పుడు "నాకు కూడా గుర్తింపు వచ్చింది;; నేను కూడా అందరిలాంటి దానినే" అని హృదయం ఆనందంతో గంతులు వేసింది. అంతకు ముందు "నేను నల్లగా వుంటాను, నాకు సరిగ్గా వినపడదు, అందరిలా చురుకుగా వుండను" అనుకుంటూ ఆత్మన్యూనతతో బాధపడేదాన్ని! మొట్టమొదటిసారి అందరి ముందు మాట్లాడి అంతవరకు నాలో ఉన్న ఆత్మన్యూనతను పోగొట్టుకుని సంతృప్తి పొందాను.

ఆ పైన నాలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో పెరిగింది అంటే ఒక రోజు రాత్రి బయటకు మా అబ్బాయితో వెళ్తూ వుండగా హఠాత్తుగా ఒక ఊరేగింపు రావడంతో మా ముందు వెళుతున్న కారు ఆగింది, మా కారు కూడా వెంటనే బ్రేక్ వేసినా ముందు కారుకు గుద్దుకుంది. నేను, మా బాబు వెళ్ళి ఆ కారు వ్యక్తితో "ఏమైనా నష్టం వాటిల్లితే మేం సరిచేయించి ఇస్తాం" అని చెపుతున్నాము. ఆయన "సరే" అంటున్నారు.

ఇంతలో అక్కడ వున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చి మా బాబు ధృవ చెంపపై కొట్టి "ఏం చేశావు?" అని అరిచారు. అప్పుడు నేను వెంటనే ఆయన కాలర్ పుచ్చుకుని " అసలు ఇక్కడ ఏం జరిగిందో మీరు చూసారా? ఆయన మీకేమైన ఫిర్యాదు చేశారా? ఊరేగింపు వస్తూంటే ముందే ఎందుకు ట్రాఫిక్ నియంత్రించలేదు?" అని నిలదీశాను. దాంతో చుట్టుప్రక్కల జనం గుమిగూడారు. ఆ ఇన్సెపెక్టర్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు!

అంతకుముందు ఎవరిదగ్గరైనా, ఏ విషయమైనా నేనే సర్దుకుపోయే దానిని. ఇప్పుడు అవసరమైన చోట ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను.

రాంబాబు గారు: ధ్యానసాధనకు ముందు మాంసాహారం చాలా అలవాటుగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తరువాత మూడునెలలు మాంసం తిన్నాను. తిన్న ప్రతిసారీ తీవ్రమైన కడుపునొప్పి వచ్చేది. 2000 సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీ పార్టీలో "నేను మాంసాహారం మానివేశాను" అని చెప్పి మానేశాను అంతే! "విగ్రహారాధన", "ఎవరిమీదైనా ఆధారపడటం" ఇవి రెండూ సహజంగా నాకు నచ్చని అంశాలు. అవి రెండూ PSSM లో ముఖ్యాంశాలు అవటం నాకు నచ్చింది.

"ఐన్‌స్టీన్, న్యూటన్ లాంటి వాళ్ళు చెప్పినవి చేసి గౌరవిస్తాం. రాముడు కృష్ణుడు కూడా ఆ కాలపు శాస్త్రవేత్తలే అయివుంటారు కనుకనే వారిని ప్రార్థించి, పూజించి గౌరవిస్తాం" అని నేను అనుకునే వాడిని! అంతకు ముందు (చదువుకునే రోజులలో) పరీక్షలకు ముందు గుడికి వెళ్ళే వాళ్ళను చూసి "ముందు సరిగ్గా చదవకుండా గుడికి వెళితే సరిపోతుందా?" అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఒక విషయం తాలూకు భారం మన మీద లేనప్పుడు, ఎవరో సహాయం చేస్తారు, చేస్తున్నారు అనుకున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా వుంటుంది కదా. ఆ విధంగా పనిచేసి మనస్సును తేలిక పరచేది థాట్ పవర్ అని అర్థమవుతోంది.

స్వర్ణలత: "మీ ధ్యాన ప్రయాణంలో కుటుంబ సభ్యులు కూడా తోడు వున్నారా? వాళ్ళ సహకారం ఎలావుంది?"
రమగారు: నేను ధ్యానసాధన మొదలుపెట్టిన కొన్ని రోజులకే రాంబాబు గారు కూడా మొదలుపెట్టారు. మా పిల్లలు "జీవన్", "ధృవ"లు కూడా అప్పటి నుంచే ధ్యానంలో ఉన్నారు. నిజానికి నా ధ్యాన సందేహాలన్నీ మా జీవన్ తీర్చేవాడు! మొదట్లో ధృవ "ధ్యానం చేస్తే మాంసాహారం మానవలసి వుంటుంది కనుక నేను ధ్యానం చెయ్యను" అనేవాడు. నేను "నీకు కావలసింది పెడతానులే! ధ్యానం చెయ్యి" అని చెప్పేదానిని. వాడు ధ్యానం చేస్తూ రెండు నెలలలోనే ఆ అలవాటు మానివేశాడు.

మా నాన్నగారికి 1999 నవంబర్‌లో హార్ట్‌ఎటాక్ వచ్చింది. అప్పటికే నేను ధ్యానం పట్ల గాఢ ఆసక్తి పెంపొందించుకుని, ఎక్కడ ధ్యానం క్లాస్ జరిగినా వెళ్తూ, ధ్యానకేంద్రం నడుపుతూ ఉన్నాను. అప్పట్లో సికింద్రాబాద్‌లో ఒక ధ్యానకేంద్రం వుండేది. "ఎలాగైనా సరే ధ్యానం చెయ్యాల్సిందే" అని పట్టుబట్టి మరీ నాన్నగారిని అక్కడకు తీసుకువెళ్ళాను. క్లాస్‌కు వెళ్ళిన పదిరోజుల తరువాత మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చింది. డాక్టర్లు "90% ఆశలేదు" అన్నారు అందరూ ఏడుస్తున్నారు.

నాకు మనస్సులో ఏ భయమూ వెయ్యలేదు. "ఆయన చక్కగా కోలుకుంటారు" అనిపించింది. మాస్టర్లు ఆయన చుట్టూ వుండటం కనిపించింది. అదే మాట ఇంట్లో వాళ్ళతో చెప్తే ఒక్కటే తిట్లు. "ఆయనకు అంత సీరియస్‌గా వుంటే ‘అంతా మాస్టర్లు చూసుకుంటున్నారు, కోలుకుంటారు’ అని చెప్తున్నావా? నువ్వూ, నీ ధ్యానమూ .. నీకు బుద్ధిలేదు" అని. నేను "ఆయుష్షు వుంటే బ్రతుకుతారు లేకపోతే లేదు; మన ప్రయత్నం మనం చేస్తాం! అంతే!" అన్నాను.

రెండురోజుల తరువాత ఆయన ICU నుంచి బయటకు వస్తూనే "అమ్మా! నువ్వు నన్ను ధ్యానం క్లాసుకు తీసుకు వెళ్ళకపోతే ఇప్పుడు నన్ను చూసే దానివి కాదు. ఈ పదిరోజుల నుంచి నాలో జరుగుతూన్న ప్రోసెస్ అంతా నాకు తెలుస్తోంది" అన్నారు. ఆ తరువాత మా అమ్మ, నాన్నగారు కూడా ధ్యానం చెయ్యటం ప్రారంభించారు!

రాంబాబు గారు: రమ మా అక్క కూతురు. సూర్యప్రకాశంగారు మా పెద్దక్క మధుసూధనరావు గారు మా బావగారు. మా అన్నదమ్ములు అక్కలు, వాళ్ళ పిల్లలూ .. అందరూ కూడా ధ్యానసాధనలో ఉన్నారు.

స్వర్ణలత: "మీ ధ్యానానుభవాలు తెలియచెయ్యండి!"
రమ గారు: నిజానికి "అది ఆధ్యాత్మిక అనుభవం" అని తెలియదు కానీ నేను సాయిబాబా పూజ చేసే రోజులలో ఆయన ప్రత్యక్షంగా వచ్చారు! ‘ఆయనే బాబా’ అని ఆయన వెళ్ళిన తరువాత తెలిసింది. ధ్యానం మొదలుపెట్టిన 19వ రోజు జ్యోతి నాలో ప్రవేశించింది. "పూజలు చెయ్యనవసరం లేదు" అని తెలిసింది.

ధ్యానం మొదలైన క్రొత్తల్లో మా "ధృవ"ను ధ్యానంలో కూర్చోబెట్టి చూస్తున్నాను. అతని సిల్వర్ కార్డ్ బయటకు వచ్చి అతని ముందు "మరో ధృవ" కూర్చుని ధ్యానం చెయ్యటం కనిపించింది. కొత్తల్లో ఒక రోజు పత్రిసార్ క్లాస్‌కు వెళ్ళి, "ధ్యానం చేసిన తరువాత తెలియనిది ఏదో తెలిసింది" అని చెప్పి ఆయనను పట్టుకుని పావుగంట ఏడ్చాను. ఏం తెలియదో తెలియదు. ఏం తెలిసిందో అంతకంటే తెలియదు.

ఒకసారి ట్రెక్కింగ్‌లో జీవన్ 80 అడుగులు లోతు ఉన్నచోట పడిపోయాడు. క్రింద బండమీద పడుతూ ఉండగా ఆంజనేయస్వామి ప్రక్కకు తోశాడని అప్పుడు బురదలో పడితే పత్రిసార్ తలమీద కొట్టి బురదని బైటికి తోశారని చెప్పాడు. ఆ విషయం పత్రిసార్‌తో చెప్పగా ఆయన "ప్యూర్ సోల్స్‌ని కాపాడటానికి స్పెషల్ వింగ్ ఉంది" అని చెప్పారు.

ఒకసారి ధ్యానయజ్ఞంలో పత్రిసార్ మా ఇంట్లో క్లాస్‌ల గురించి పరామర్శించారు. నేను ఉత్సాహంతో "చాలా చాలా బాగా జరుగుతున్నాయి" అనగానే ఆయన "ఇంటికి వస్తేనే చెపుతావా?" అన్నారు. అప్పుడు "ఏం చెయ్యాలా?" అని రెండు నెలలు తపన చెంది వివేకానంద నగర్ ఆల్విన్ కాలనీలో క్లాసులు, స్కూల్ పిల్లలకు క్లాసులు తీసుకునే దానిని. అయినా "అందరూ విని వెళుతున్నారు కానీ మళ్ళీ రావటం లేదు" అని సార్‌తో అన్నాను. అప్పుడు సార్ ఒక గుప్పెడు గింజలు నాకు ఇచ్చి "ఇవి జల్లితే రేపటికి మొక్కలు వస్తాయా?" అన్నారు.

అప్పుడు అది నాకు అర్థం కాలేదు కానీ.. ధ్యానప్రచారం చేసే తొలిరోజుల్లో 8వ తరగతి చదివే ఒక విద్యార్థి .. తరువాత ఇంటర్‌లో నైరాశ్యానికి గురైనప్పుడు "అప్పుడెప్పుడో ఒకావిడ ‘ధ్యానం’ అని చెప్పింది. అది చేస్తే సరి అవుతానేమో" అనుకుని S.R.నగర్ కేంద్రానికి వెళ్ళి తనను తాను సరిదిద్దుకున్నాడు. అదే విద్యార్థి ఆ విషయం మళ్ళి నన్ను కలిసి చెప్పినప్పుడు .. "విత్తనాలు చల్లటం" అంటే ఏమిటో నాకు తెలిసింది.

ఇంకోసారి గుడిలో ధ్యానం క్లాస్‌లో ఒక పూజారికి ధ్యానం చెప్పగా ధ్యానంలో ఆయనకు సూక్ష్మశరీరం విడుదలైంది. ఆ అనుభవం గురించి మేము వివరించగా ఆయన "సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ విధంగా జరిగితే అది ఏమిటో అర్థం అయ్యేది కాదు; ఈ ధ్యానం వల్ల తెలిసింది" అని చెప్పి గజ్వేల్ పట్టణమంతా ధ్యానమయం చేశారు.

మరోసారి కూకట్‌పల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడ స్టాల్‌పెట్టి గిరిజా మేడమ్, నేను పాంప్లెట్స్ పంచేవాళ్ళం. కొందరు వాటిని మా ముందు పారవేసి వెళ్ళేవారు. మేము వాటిని మళ్ళీ ఏరుకుని తెచ్చి పంచేవాళ్ళం. "అయ్యో! ఎవ్వరూ రావటం లేదే?" అనుకుంటూ ఉండగా ఆ పాంప్లెట్ చదివి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనే ఇప్పటి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా తమ సేవలను అందిస్తూన్న కూకట్‌పల్లి సాంబశివరావుగారు!

దీనిని ధ్యానానుభవం అంటారో లేదో నాకు తెలియదు కానీ ధ్యానానికి వచ్చిన క్రొత్తల్లో మా పిల్లలు చదువులో వెనుకబడటం జరిగింది. అందరూ "ధ్యానం నీకు ఇచ్చింది ఇదేనా?" అని అడిగితే "వాళ్ళు మా సంరక్షణలోనే తమ పాత కర్మలు తీర్చుకుంటున్నారు" అని చెప్పేదాన్ని. అలాగే కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడి వాళ్ళిద్దరూ చక్కగా స్థిరపడ్డారు. వాళ్ళకు నచ్చిన విధంగా జీవిస్తున్నారు.

రాంబాబు గారు: ‘ధ్యానానుభవాలు’ అనను కానీ ధ్యానం తోడైన జీవితానుభవాల గురించి చెపుతాను. ట్రెక్కింగ్స్ వల్ల స్టామినా పెరిగింది. ఎటువంటి భౌతిక పరిస్థితులోనైనా ఉండగలగటం వచ్చింది. మన దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకోవటం జరిగింది.

అంతకు ముందు వ్యక్తుల బలహీనతలు మరి బుద్ధిలేనితనాలను గురించి నాకు కొంత కోపం చిరాకు ఉండేవి. ఇప్పుడు "అదంతా పరిణామ క్రమంలో భాగం" అని తెలుసుకుంటున్నాను.

"వ్యక్తుల బాహ్య వ్యక్తీకరణ అప్రధానం" అన్నది బాగా అర్థమై, మనిషిని మనిషిగా మాత్రమే చూసి గౌరవించటం మరింతగా వచ్చింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ: కుద్రేముఖ్ ట్రెక్కింగ్‌లో బాగా వర్షం పడి అది వెలిసిన తరువాత ఒక చోటుకు వెళితే ఒకరు మాకు ఆతిథ్యం ఇచ్చి వంట చేయించి భోజనాలు పెట్టించారు. అక్కడ ఒక పొడవు లాగూ మాత్రమే వేసుకున్న ఒక వ్యక్తి మేము తిన్న ప్లేట్లు అన్నీ తీసి శుభ్రం చేశాడు. అతనిని అక్కడ పనిమనిషేమో అనుకున్నాం.

అంతా అయ్యక పత్రిసార్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు సార్ ఆ ఎంగిలి ప్లేట్లు తీసిన వ్యక్తిని పిలిచి "మీ గురించి చెప్పండి" అన్నారు. అతను "నేను ఏలకుల ఎస్టేట్‌కు యజమానిని; ఒక్కొక్క ఎకరానికి నాకు సంవత్సరానికి యాభై వేల ఆదాయం వస్తుంది; అటువంటివి అయిదు వందల ఎకరాలు వున్నాయి" అని చెప్పారు. సార్ సరదాగా "మీ చెవిప్రోగుల ఖరీదు ఎంత?" అంటే ఆయన "ఐదు లక్షలు" అన్నారు!

"అంతే కాదు ‘ఒక రాత్రి పూట ఒక గురువు గారు తన పరివారంతో వస్తారు; నువ్వు ఆతిధ్యం ఇవ్వాలి’ అన్న సందేశం నాకు పది సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆనాటి నుంచి ఈ గురువు గారి కోసం ఎదురు చూస్తున్నాను" అని చెప్పారు. మొదటిసారి తుంబురు తీర్థం ట్రెక్కింగ్‌కు వెళ్ళాం. అప్పుడు నా వద్ద ఫోన్ లేదు. ఆఫీస్ వాళ్ళు నన్ను టెండర్ గురించి అడగటానికి శివప్రసాద్ గారికి ఫోన్ చేసారు. నేను టెండర్ గురించి ఆఫీస్ వాళ్ళతో "3300 రూ||" అని చెప్పాను. ఎప్పుడూ మొత్తం కూడితే ‘9’ అంకె వచ్చే విధంగా టెండర్ వేస్తాం.

కానీ ఈ సారి నా నోటినుంచి 3,300 అని వచ్చింది. అయినా ఆ టెండర్ మాకే వచ్చింది. అంతే కాదు ఆ మిగిలిన 30రూ||ల తేడా వల్లే ఆ ఆర్డర్ మాకు వచ్చింది. మానససరోవరం వెళ్ళేముందు ఒక కాంట్రాక్ట్ కుదిరింది. రెండు నెలలలో వాళ్ళకు ప్రొడక్ట్ ఇవ్వాలి. నేను మా ఆఫీస్‌లో సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాను. పవర్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్‌తో ఎంతో జాగ్రత్తగా వుండాలి .. నేను ప్రత్యక్షంగా లేను కనుక ఆ కంపెనీ నేను ప్రోడక్ట్ అందించలేను అనుకుంది. కానీ నెలా పదిహేను రోజులలో మేం దానిని పూర్తిచేసి కబురు చేస్తే వాళ్ళు నమ్మలేదు. వచ్చి చూసి టెస్ట్ చేసుకుని సంతృప్తి పొంది తీసుకు వెళ్ళారు!

నేను ప్రత్యేకించి ఎక్కడికీ వెళ్ళి ధ్యానాలు చెప్పను కానీ మా ఆఫీస్‌కు ఎన్నో కేడర్లలో వాళ్ళు ఎంతో మంది ప్రతిరోజూ వస్తూ వుంటారు. వారందరికీ నేను ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు తప్పనిసరిగా ఇస్తాను. వారిని ధ్యానం గురించి చెపుతాను.

గొప్ప గొప్ప విందులలో సంతృప్తిగా ఉండదు కానీ .. ధ్యాన మిత్రుల ఇళ్ళల్లో మరి ధ్యాన ఉత్సవాలలో ఆహారాన్ని ఎంతో ఆస్వాదిస్తాను. నిద్ర అవసరంకూడా తగ్గిపోయి .. రోజుకు 4-5 గం||లు సరిపోతుంది. మా షష్టిపూర్తి సందర్భంగా మా పిల్లలు ఏర్పాటు చేసిన వీడియో ప్రోగ్రాం ద్వారా మా కుటుంబపు బంధుమిత్రులు అందరికీ ధ్యానం గురించి తెలియచేశామని అనిపించింది.

స్వర్ణలత: " ‘ధ్యానాంధ్రప్రదేశ్’ అనగానే ‘రమాదేవి’ అని జ్ఞాపకం వస్తుంది. దానిలో మీ పాత్ర; రాంబాబు గారూ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్‌తో మీ అనుబంధం?"
రమ గారు: 1999లో "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రికను ఆరంభించినప్పుడు ఓషో ప్రసాద్ గారు, మురళీధర్ గారు ఉండేవారు. సార్ "2004 వరకు ఇది నీ బాధ్యత" అని చెప్పారు. నిజానికి నాకు ఏమీ రాదు. ఏమీ తెలియదు. ప్యాకింగ్‌లో సహాయం చేస్తూ అవసరమైన ధనం సమకూరుస్తూ వచ్చేదానిని. 2004 చివర్లో మీటింగ్‌కు వెళ్ళినప్పుడు నా చుట్టూ వున్నవాళ్ళతో ఇక "నాకు ధ్యానాంధ్రప్రదేశ్ బాధ్యత అయిపోయింది" అని చెప్పాను. తీరా సార్ స్టేజ్‌పైకి పిలిచేసరికి "ఇన్నాళ్ళూ రాంబాబుగారి సహాయంతో ఈ పని చేశాను; ఇప్పుడు నేను చేయగలిగింది చేస్తాను" అని చెప్పాను. ఈ మధ్య ఇంటి బాధ్యతలు మీదపడే వరకూ అక్కడే కొనసాగాను.

ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, "ధ్యానాంధ్రప్రదేశ్" నా జీవితంలో ఒక గొప్ప మలుపు! అది నాకు నా ఆలోచనలపట్ల స్పష్టతను ఇచ్చింది. అవసరమైన చోట మాట్లాడగలగడం నేర్పింది. చెయ్యవలసింది, చెయ్యగలిగి వుండి కూడా నోరుమూసుకుని వుండటం ఎంత నష్టమో తెలిసింది. ఆ నష్టం భరించకుండా వుండాలంటే తప్పనిసరిగా కర్తవ్యం నిర్వహించి తీరాలని నేను అక్కడే నేర్చుకున్నాను.
రాంబాబు గారు: హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్‌లో ‘ట్రస్టీ’గా కడ్తాల్ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యం వహించాను. తరువాత విల్లాల నిర్మాణంలోనూ ఇప్పుడు మళ్ళీ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

స్వర్ణలత: "పత్రి సార్‌తో మీ అనుబంధం వివరించండి!"
రమ గారు: సార్ ప్రతి విషయంలోనూ నేను నేర్చుకోవాల్సిన వాటినన్నింటినీ ప్రత్యక్ష సూచనలతోనూ పరోక్ష సూచనలతోనూ, తిట్టి కొట్టి కూడా నాకు నేర్పవలసినవి నేర్పారు. అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. "నువ్వు కూడా మాట్లాడటం నేర్చుకో" అని చెపితే "నాకు ఇంతే వచ్చు, నేనింతే అని ఊరుకున్నాను. అప్పుడు చెంప మీద ఒకటేసి "నేర్చుకో" అని చెప్పారు. అయినా నేను వినలేదు. ఆ రాత్రంతా ఆయన నాకు చెప్తున్నట్లు, నేను వింటున్నట్లు నాకు అనిపించింది.

మర్నాడు "అర్థమైందా?" అన్నారు. "నేను నరుడనైతే దుఃఖమని, నారాయణుడనైతే దుఃఖం ఉండదని అర్థమైంది" అని చెప్పాను. అప్పటి నుంచి అవసరమొచ్చినప్పుడు చక్కగా మాట్లాడుతున్నాను.

ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఉండగా "ఈ చెవిటిమేళంతో చస్తున్నాను, నెమ్మదిగా చెపితే వినపడి చావదుగా" అని అప్పుడప్పుడూ అనేవారు. కొంత కాలం తర్వాత దాని గురించి బాధపడటం మాని "నాకు ఇంతే వినపడుతుంది, నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇంతే" అన్న భావన రాగానే ఆయన నన్ను ఆ విషయానికి కోప్పడటం మానివేశారు! అంటే "నా వినికిడి శక్తి గురించి నాకున్న న్యూనత తొలగించడానికి అలా అనేవారు" అని నాకు అర్థం అయింది.

ధ్యానం కనపడని బంధనాలను విడగొడితే .. పత్రీజీ పొడిచిపొడిచి నాలోని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను తీసివేశారు. నేను భయపడ్డ రోజున వారు నన్ను భయపెట్టారు. నేను సవాలుగా తీసుకున్న రోజున వారు నాకు సవాలే విసిరారు. నేను అప్యాయత చూపించగలిగిన రోజున వారు నాకు అప్యాయతనే ఇస్తున్నారు. పత్రీజీ మనకు ఒక అద్దం!

రాంబాబు గారు: మానస సరోవరం ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు నేను సార్‌తో పాటు కార్‌లో వెళ్ళవలసి వచ్చింది. నాకు సహజంగా ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. నెమ్మదిగా ఆయనకు కావలసినవి తెలుసుకుని నేను తెచ్చేవాడిని. అలా చనువూ, సాన్నిహిత్యం పెరిగాయి.

రమ గారు: 2012 తర్వాత గ్యాప్‌లో చిన్నప్పటి టైలరింగ్ మళ్ళీ నేర్చుకుని ‘బొటిక్’ ప్రారంభించాను. నేను ఎక్కడ ఉన్నా చేయవలసింది చేస్తున్నాను అనిపిస్తుంది. ధ్యానం వలన ఏ పరిస్థితులోనైనా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. దేనినైనా ఆనందంగా తీసుకోవడం వచ్చింది. ధ్యానంలోకి రాకముందు పగటికలలు వచ్చేవి. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు "పెద్ద ఇల్లు కట్టుకుంటాం, అందరూ గౌరవిస్తారు" అనిపించేది. ధ్యానంలోకి వచ్చిన తరువాత "ఇల్లంటూ కడితే అయిదు పిరమిడ్‌లు కడతాను" అని చెప్పేదాన్ని. నా ప్రమేయం లేకుండానే అవి ఏర్పడ్డాయి.

ఆత్మజ్ఞానులైన తల్లిదండ్రులుగా మేము మా పిల్లలను వారి ఆలోచనలకు అనుగుణంగా వారిని జీవించనిస్తూ .. అందరం ఆనందంగా ఉన్నాము!

రాంబాబు గారు: ఏ విషయంలోనైనా మన ప్రయత్నం మనం చేయాలి. ఫలితం గురించి ఆలోచనలేమీ అవసరం లేదు. ‘మాటా’ , ‘చేతా’ ఒకటిగా ఉండాలి. తల్లితండ్రులను చక్కగా చూడటమే వారిని గౌరవించడం కానీ వారు పోయాక పిండాలు పెట్టడం కాదు. తమ పెద్దవాళ్ళను చూసిన వారిని వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. లేని వాళ్ళను చూడరు అంటే పరోక్షంగా మనమే నేర్పిస్తున్నాం. "ఎవరు ఎలా ఉన్నారు?" అన్నది మనకు అనవసరం .. "మనం ఎలా ఉండాలా?" అన్నదే ముఖ్యం.

స్వర్ణలత: "మీ సందేశం?"
రమ గారు: జీవితంలో మనకు అర్హత ఉన్నది మనకు లభిస్తుంది. మనం చేయవలసింది మనం చేసుకుంటూ వెళ్దాం. మా గృహ ప్రవేశం రోజున ఎ.పి.భవన్‌లో క్లాస్ కాన్సిలై సార్ వచ్చారు. ఇప్పుడు .. ఆగస్ట్ 18, 2015 రోజున .. మా షష్ఠిపూర్తి రోజున న్యూజీలాండ్ టూర్ కాన్సిలై వచ్చారు. చిత్తశుద్ధితో కోరుకున్నది ఏదైనా సంభవమే. "వస్తే ఆనందమే .. రాకపోతే బాధలేదు" అనుకున్నాను.
రాంబాబు గారు: సార్‌ని గౌరవించడం అంటే వారు చెప్పిన పనులు చేయడం .. మరి అంతరంలో వారి పట్ల గౌరవంతో ఉండడం. జీసెస్, కృష్ణుడు చెప్పినవి చేసి వుంటే ఇప్పటికే మనం ఎంతో మారి ఉండేవాళ్ళం. ఇప్పుడైనా వాళ్ళు చెప్పినవి చేద్దాం.

Go to top