" మౌన ధ్యాన సాధన "

 

 

నా పేరు "లోకనాధ్ రెడ్డి". నేను "లైఫ్ యూనివర్సిటీ"లో "సోల్ కోచ్" తరగతుల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా మౌన ధ్యానానుభవాలను మీ అందరితో పంచుకోవటం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. "లైఫ్ యూనివర్సిటీ"లో నా స్నేహితులు, సహోద్యోగులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు నేను 41 రోజులు మౌనాన్ని ఆచరించాలనే అంతః ప్రేరణను పొందాను. ఇక అప్పటి నుంచీ "ఎక్కడ వుండి మౌనవ్రతాన్ని సాధన చేద్దామా?" అనే ఆలోచనే అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉండేది.

 

2015 జనవరి రెండవ తేదీన డా||న్యూటన్ గారితో సహా మేమంతా లైఫ్ యూనివర్సిటీని సందర్శించినప్పుడు ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టగానే నా మౌనధ్యానాన్ని అక్కడే వుండి మొదలుపెట్టమని ఆ ప్రాంగణం సాదరంగా ఆహ్వానించినట్లు అనిపించింది. డా||న్యూటన్ గారి అనుమతితో నేను జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మౌనవ్రతం ఆచరించాను.

 

41 రోజుల్లో ఏ ఒక్క క్షణం కూడా నాకు విసుగ్గా అన్పించలేదు. భవిష్యత్ గురించి ఊహించటం కానీ లేదా రాబోయే క్షణం గురించి వేచి ఉండటం కానీ చేయకుండా సంపూర్ణంగా నాతో నేను ఉన్నాను. మన నిత్యజీవిత కార్యకలాపాల్లో మనం కాలానికి బద్ధులైపోయి వుంటాము. మరి కాలానికి బందీలైపోతే ఇక కాలరహిత స్థితిని ఎలా అనుభూతి చెందగలం?

 

"మౌనం" అనేది నేను ప్రస్తుత వర్తమాన క్షణంలో గాఢంగా నిమగ్నం కావటానికి సహకరించింది. రేపటి గురించి భవిష్యత్‍లో నేను సాధించబోయే వాటి గురించి నాకు ఏ ఆందోళనా లేదు కనుక ఈ ప్రస్తుత క్షణం గురించి ఒక అద్భుతమైన అవగాహన .. ఒక సంపూర్ణమైన ఎరుక నాలో కలిగింది. ఆ నిశ్చల, నిర్గుణ స్థితిలో స్థల, కాలాలకు అతీతమైన పరిధిని నేను అనుభూతి చెందాను.

 

ప్రకృతితో మమేకం: ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తూ ఉండేవాడిని. ప్రాతః, సంధ్యా సమయాలలో సూర్యుడిని చూడటం ఎంతో ఉత్తేజభరితంగా ఉండి నాలో గొప్ప ఉత్సాహాన్నీ, శక్తినీ నింపేది. ఏ రెండు సూర్యోదయ, సూర్యాస్తమయాలూ ఒకేలా ఉండక పోవటం నేను గమనించాను.

 

ప్రతి దినం ఎంతో ప్రత్యేకమైనదే. ప్రతి ఒక్కక్షణం కూడా మనకు వైవిధ్యభరితమైన అనుభవాలను ఇస్తుంది. కానీ మనమే మన మనస్సుకు ఆంక్షలు పెట్టుకుని ఈ అద్భుత ప్రపంచాన్ని పూర్ణంగా ఆస్వాదించ లేకపోతున్నాం. జీవన మాధుర్యాన్ని చవిచూడటానికి అనుక్షణం అప్రమత్తంగా, ఎరుకతో ఉండాలి. అప్పుడే జీవితం తన మహత్యాన్ని మనకు వెల్లడిస్తుంది.

 

"లైఫ్ యూనివర్సిటీ" పరిసరాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో పక్షులు ఏ జంకూ, గొంకూ లేకుండా నా దగ్గరకు రావటం, నా చుట్టూ చేరటం జరిగేది. వాటికి ఏ హానీ కలిగించని స్థిమితమైన, ఆలోచనారహితమైన మనస్సుతో నేను ఉండటాన్ని నా నుంచి వెలువడే ప్రశాంతమైన ప్రకంపనల ద్వారా అవి సులువుగా గుర్తించాయి.

 

ఎన్నో అందమైన నెమళ్ళు ఆ ప్రాంతానికే వన్నె తెచ్చేవి. ఉదయాన్నే వాటి రాగాలను వింటూ మేల్కోవటం నాకు ఎంతో ఆనందాన్నీ, ఉత్తేజాన్ని ఇచ్చేది.

 

స్వాధ్యాయం: మౌనధ్యాన సాధనలో భాగంగా నేను దాదాపు 30 గ్రంథాలు చదివాను. "ఫకీర్" .. "డైయింగ్ టు బి మి" .. "ఆన్ వీల్స్ ది మిస్టరీ ఆఫ్ హిమాలయాస్" .. "రిగ్రెషన్ థెరపీ: ఎ హ్యాండ్ బుక్ ఫర్ ప్రొఫెషనల్" .. "జర్నీ ఇన్ టు నేచర్" మొదలైన గ్రంథాలు నాకు ఎన్నో అతీంద్రియ అనుభవాలు అందించాయి.

 

"డైయింగ్ టు బి మి" చదువుతూన్నప్పుడు నేను విశ్వంతో ఏకత్వాన్ని అనుభూతి చెందాను. ఆ ఉన్నత చైతన్య స్థితిలో చెట్లు చేమలు, పూలు, కొమ్మలు, రెమ్మలు అన్నింటినీ నేను ఇప్పుడే చూస్తున్నానేమో అన్నంత క్రొత్తగా, వింతగా దర్శించాను. విశ్వంతో గాఢమైన అనుసంధానాన్నీ, లోతైన అవగాహననూ తరచూ పొందుతూ ఉండేవాడిని. ఆ సమయంలో గతంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతత పరవశం నాలో కలిగేది.మౌనం యొక్క శక్తి: మనం ఏమీ చేయకపోయినా, అన్నీ వాటంతట అవే చక్కగా సృష్టించబడుతున్నాయని మౌనంగా ఉన్నప్పుడే తెలుసుకుంటాము. కనుక మనం ఎల్లప్పుడూ సంపూర్ణ అస్తిత్వం నుంచి, సాధన నుంచి, ప్రశాంతత నుంచి మాత్రమే వాక్కును ఉపయోగించాలి.

 

నిశ్చలమైన ఎరుక స్థితికి చేరాకే, మనలోని సంభాషణల గురించి మనకు అవగాహన వస్తుంది. అప్పటి వరకూ మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నామని కూడా మనకు తెలియదు.

 

మౌనసాధనలో ఉండగా నేను ఎప్పుడూ నిరుత్సాహం, నిస్తేజం అన్నవే ఎరుగను! నా ఆలోచనలు, భావాల పట్ల పూర్తి ఎరుకతో ఉన్నాను! నాలో ఏ ఒక్క ఆలోచన కూడా నా ఏకాగ్రతను భగ్నం చేయలేకపోయింది. కేవలం ఆలోచనలు వచ్చిపోతూండేవి. ఏ తీర్పులూ, ఏ ఫిర్యాదులూ లేకపోవటం వల్ల మానసిక, భావోద్వేగపరమైన నటన కూడా లేదు.

ఆలొచనలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి. ఎలాంటి తీర్పులూ, వ్యాఖ్యానాలు చేయకుండా నిశ్చలంగా వాటిని నేను గమనిస్తూండేవాడిని.

 

ఆ నిశ్చలత్వంలో "అన్నింటిలోనూ ఉన్న ఎరుకనే నేను" అన్నది గ్రహించాను. నేను పట్టించుకున్నా, లేకపోయినా అంతర్లీనంగా ఈ లోతైన అవగాహన మాత్రం నాలో నిరంతరం కొనసాగుతూ ఉండేది. ఈ విధంగా అన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు "ఎరుక అనేదే శాశ్వతం" అని గుర్తించాను. నేను ఎంత ఎరుకతో ఉంటె అంత లోతుగా నాతొ నేను అనుసంధానం అయ్యాను.

 

ఆలోచనల మధ్య శూన్యాన్ని నేను .. ప్రతిదాన్లో వచ్చిపోయే నిశ్శబ్దాన్ని నేను. ఏ ఒక్క ఆలోచన కూడా నా ఉనికిని గ్రహించలేదు. ఎందుకంటే ఆలోచన వచ్చినప్పుడు నేను దాన్ని కేవలం గమనించాను. కనుక ఏ ఆలోచనకూ అంత ప్రాబల్యం లేకపోయింది. ఇలా నాలో రెండు కోణాలను అనుభూతి చెందాను. ఒకటి ఆలోచనా విధానం అయితే మరొకటి ఆ ఆలోచనకు అతీతమైన ఎరుక.

 

ఈ ఆలోచనలు అప్పుడప్పుడూ వచ్చి పలకరించినప్పటికీ వాటి వెనుక వున్న ఎరుక మాత్రం నిరంతరం నిశ్చలంగా ఉంది. "శ్వాస మీద ధ్యాస" ధ్యానం ద్వారా నన్ను నేను ఎరుక స్థితిగా తీర్చిదిద్దుకున్నాను.

 

మౌనసాధన వల్లే నాకు వాక్కు యొక్క విలువ తెలిసింది. ఇకపై నా వాక్కు ఇతరులకు శ్రేయస్సు, ప్రేరణ ఇచ్చేవిగా మాత్రమే ఉండాలి కానీ తీర్పులూ, చాడీలు చెప్పటానికి కాకూడదని నిర్ణయించుకున్నాను. 42వ రోజు మౌనవ్రతం ముగించి .. "మొదట ఏం మాట్లాడాలి" అని డా|| న్యూటన్ గారిని అడిగినప్పుడు వారు " ‘ మాతృదేవో భవ’, ‘పితృదేవోభవ’, ‘ఆచార్యదేవో భవ’ " అని పలకమని చెప్పారు. "శ్వాస మీద ధ్యాస" - అనే అత్యంత సరళమైన ధ్యానపద్ధతిని ప్రపంచానికి ప్రచారం చేస్తున్న పత్రీజీకి మరి లైఫ్ యూనివర్శిటీలో సాధన చేసుకోవటానికి అనుమతించిన డా||న్యూటన్ గారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

99122 29020

Go to top