" పత్రీజీని అర్థం చేసుకోవాలంటే .. వారంతటి స్థాయికి ఎదగాల్సిందే "

 

 

ప్రపంచ వాణిజ్యరంగంలో విజయకేతనాలను ఎగురవేస్తోన్న భారతదేశ వ్యాపార దిగ్గజాలకు సెక్రెటేరియట్ & కాంప్లియన్స్ లీగల్ సలహాదారులుగా వ్యవహరిస్తోన్న శ్రీ దాట్ల హనుమంత రాజుగారు .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు అత్యంత సన్నిహితులు.

 

25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న D.హనుమంత రాజు & కం, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రెటరీస్" సంస్థకు వ్యవస్థాపకులుగా ఉన్న వీరు .. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ICSI)కు ట్రెజరర్‌గా, సెక్రెటరీగా, వైస్-ప్రెసిడెంట్‌గా పలు హోదాలను చేపట్టి ప్రెసిడెంట్‌గా 2009 సంవత్సరంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన "కార్పొరేట్ గవర్నెన్స్" అవార్డ్‌ను అందుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 దేశాలలోని B-స్కూల్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా తమ విజ్ఞానాన్ని పంచుతూ వారు 2013 సంవత్సరంలో 27 గం||27 ని|| 27 సెకన్ల పాటు ఏకధాటిగా బోధన చేసి "లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్" లో నమోదు అయ్యారు!

 

అనేక మంది బీద విద్యార్థులకు దేశవిదేశాలలో చదువుకోవడానికి సహాయం చేస్తూన్న ఈ దాతృత్వ గుణ సంపన్నులు .. గత 46 సంవత్సరాలుగా హైదరాబాద్ .. గుర్రంగూడలో ఉన్న షిరిడీ సాయి సంస్థాన్‌కు మేనేజింగ్ ట్రస్టీగా మరి తమ స్వస్థలం గుంటూరు అమరావతి దగ్గరలో ఉన్న బలుసుపాడు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

 

2009లో తమ బంధువు ద్వారా పత్రీజీ పరిచయాన్ని పొంది .. ధ్యానంలోని విశిష్ఠతను తెలుసుకుని అప్పటి నుంచీ "పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్)"కు ట్రస్టీగా మరి 2014 నుంచి "పిరమిడ్ నిత్య అన్నదాన ట్రస్ట్ (హైదరాబాద్)" కు వైస్ ఛైర్మన్‌గా PSSMలో తమ సేవలను అందిస్తున్నారు.

 

జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ .. అనేకానేక విజయకీర్తి సోపానాలను అధిరోహించిన D.హనుమంతరాజు గారు "ప్రాపంచిక విజయాలన్నీ తాత్కాలికాలే; ఆధ్యాత్మిక విజయాలే శాశ్వతమైనవి" అంటూ తమ మనోభావాలను "ధ్యాన జగత్" పాఠకులతో పంచుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ..

 

వాణి: "కార్పొరేట్ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే మీరు ‘ధ్యాన జగత్’ కొరకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు! మీ గురించి తెలియజేయండి!
హనుమంతరాజు గారు: గుంటూరు జిల్లా అమరావతి దగ్గర ఉన్న "బలుసుపాడు" గ్రామానికి చెందిన ఒకానొక సామాన్య వ్యవసాయదారుల కుటుంబంలో నేను జన్మించాను.

 

నా బాల్యం చాలా వరకు మా అమ్మమ్మగారైన శ్రీమతి ఉప్పలపాటి వెంకాయమ్మ గారి దగ్గరే గడిచింది. ఆమె చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ మూర్తి! ఆత్మవిశ్వాసంతో మరి స్థిరచిత్తంతో ఆమె కుటుంబ వ్యవహారాలను నడిపే తీరు నాకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చేది.

 

ప్రతి ఒక్క పనిని కూడా .. అది ఎంత చిన్నదైనా లేదా మరెంత పెద్దదైనా .. దానిని ఆమె చక్కబెట్టే విధి విధానం ఎంతో అంకితభావంతో కూడుకుని ఉండేది. "ఈ రోజు నేను ఇంత గొప్ప ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాను" అంటే దానికి కారణం మా అమ్మమ్మ గారి వ్యక్తిత్వం యొక్క ప్రభావం నా మీద బలంగా ముద్రించబడడమే!

 

బలుసుపాడులో హైస్కూల్ చదువు తరువాత నేను అమరావతి ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ప్రముఖ సాహితీవేత్త శ్రీ వావిలాల సుబ్బారావుగారు అక్కడ మాకు తెలుగు లెక్చరర్‌గా ఉండేవారు. అమరావతిలో గ్రాడ్యుయేషన్ తరువాత నేను హైదరాబాద్ JNTU నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాను. ఆ తరువాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ICSI)లో ఫెలో మెంబర్‌గా చేరి CS, CA మరి CWA విద్యార్థులకు బోధకుడిగా పనిచేశాను.

 

ICSI లో వివిధ హోదాలలో పనిచేస్తూ 2009లో అధ్యక్షుడిగా అప్పటి భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్గారి చేతుల మీదుగా "కార్పొరేట్ గవర్నెన్స్" అవార్డును కూడా అందుకున్నాను. పార్లమెంట్ చట్టసభ విధివిధానాలను అనుసరించి ఆ పదవికి గాను నాకు కేంద్రమంత్రి హోదా కూడా లభించింది.

 

ఇప్పటివరకు నేను 25 దేశాల సందర్శించి .. 15 దేశాల B-స్కూల్స్‌లో గౌరవ ఆచార్యుడిగా బోధన చేశాను. 2009లో 27 గం|| 27ని|| 27 సెకన్ల నాన్ స్టాప్ టీచింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాను. గత 15 సంవత్సరాలుగా నేను "వార్త" దినపత్రికలో "కాలమ్నిస్ట్"గా ఉన్నాను. ICSIలో ప్రస్తుతం చెలామణిలో వున్న సిలబస్ నేను రూపొందించిందే! ఇంకా ప్రముఖ ఆర్ధిక సలహాదారులు శ్రీ P.V.రత్నం గారితో కలిసి అకౌంటెన్సీ మరి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో నేను ఎన్నో పుస్తకాలు రచించాను. ఇదంతా కూడా "నా జీవితం" అనే నాణేనికి ఒకవైపు మాత్రమే!

 

వాణి: "మీ ధ్యానజీవితం ఎలా మొదలైంది?"


హనుమంతరాజు గారు: ఏదైనా నాణేనికి విలువ ఉండాలంటే దాని రెండు వైపులా కూడా నిర్దిష్ట ప్రమాణాలు ముద్రించి ఉండాలి కదా!! అలాగే నా జీవితంలో కూడా ప్రాపంచిక విభాగం అద్భుతంగా సాగుతూ .. ఒకానొక మనిషి జీవితంలో ఎంతటి విజయాలను సాధించాలని కోరుకుంటాడో అంతటి ఘన విజయాలను అందుకుని కూడా .. "ఇంకా ఏదో కోల్పోతున్నాను" అన్న భావనలో వుండేవాడిని.

 

నా విజయాలకు నా స్నేహితులూ, బంధువులూ నన్ను వేనోళ్ళతో పొగుడుతూన్నా కూడా లోలోపల ఏదో తెలియని "వెలితి" నన్ను వెంటాడుతూండేది. ఆ "వెలితి" ఏమిటో .. నేను ధ్యానాభ్యాసం మొదలుపెట్టాక కానీ నాకు తెలియలేదు!

 

1980లో నేను కంపెనీ సెక్రెటరీన్ విద్యార్థులకు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఒక విద్యార్థి అప్పుడప్పుడూ క్లాస్‌కి హాజరు కాకపోయేవాడు. కారణం అడిగితే .. "ధ్యానం క్లాసుకి వెళ్ళాను; ‘సుభాష్ పత్రి గారు’ అని కర్నూలు నుంచి వచ్చి ధ్యానం నేర్పిస్తారు అని చెప్పేవాడు.

 

"చదువు మానేసి ఇలా ధ్యానాలు చేస్తూ తిరిగితే ఇక నువ్వు జీవితంలో బాగుపడవు" అని నేను అతడిని మందలించేవాడిని కానీ .. అతడు మాత్రం నా మాట లెక్కచేయకుండా అలా వెళ్తూనే ఉండేవాడు. ఒకసారి 2009 లో .. అప్పట్లో నాకు ప్రెసిడెంట్ అవార్డు రావడంతో దేశవిదేశాల ప్రముఖులు డాక్టర్లు, ఇంజనీయర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు! "ఇంతకంటే గొప్ప గౌరవం ఈ జీవితానికి ఇక ఏముంటుంది?" అనుకుంటూన్న తరుణంలో .. మా బంధువు వెంకట్రామరాజుగారు నన్ను మెహిదీపట్నంలో "స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్"లో జరుగుతోన్న ధ్యాన శిక్షణా కార్యక్రమానికి తీసుకువెళ్ళారు.

 

అక్కడ స్టేజీ మీద దివ్యతేజస్సుతో వెలిగిపోతూ బ్రహ్మర్షి పత్రీజీ కనిపించారు! ఎన్నెన్నో వ్యాపార విజయాలను కైవసం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్తలలో కూడా కనపడని అద్భుతమైన తేజస్సును నేను వారిలో చూసి ఆశ్చర్యపోయాను!

 

కడ్తాల్‌లో నిర్మించబోయే పిరమిడ్‍ను గురించి ఆ రోజు కార్యక్రమంలో ట్రస్టీలు మాట్లాడాక పత్రీజీ కూడా ఆ పిరమిడ్ విశిష్టతను అందరికీ వివరించారు. అనంతరం జరిగిన ఒక గంట వేణుధ్యానంలో ధ్యానామృతాన్ని గ్రోలిన నాకు కళ్ళు తెరవగానే "కడ్తాల్ ట్రస్ట్‌లో నేను కూడా మెంబర్‌గా చేరి చారిత్రాత్మకమైన ఆ పిరమిడ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలి" అని ఆత్మపూర్వకంగా అనిపించింది! క్లాస్ అయిపోయిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం!

 

చిన్నప్పటినుంచీ మా అమ్మమ్మ దాతృత్వపుగుణాన్ని పుణికిపుచ్చుకున్న నేను .. చదువుకునే బీదపిల్లలకు విదేశాలలో విద్యను అభ్యసించడానికి కావలసిన ఆర్థిక సహాయాలను అందిస్తూండేవాడిని. అనేకానేక గుళ్ళకు నాకు తోచినంత సహాయం మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూండేవాడిని. కానీ ఈ రోజు "ఆ మహాపిరమిడ్ నిర్మాణంలో ట్రస్టీగా పాలుపంచుకోవాలి" అన్న కోరిక మాత్రం నన్ను క్షణం నిలువనీయలేదు.

 

మళ్ళీ "స్పిరిచ్యువల్ ఇండియా" కార్యాలయానికి వెళ్ళి .. అక్కడి ఇన్‌ఛార్జ్ మల్లికార్జున్‌ని కలిసి "మళ్ళీ గురువుగారిని కలవాలంటే ఎలా?" అని అడిగాను. "ఈ సారి వారు వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను .. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి" అని చెప్పాడు. క్షణం ఒక యుగంలా కొన్నాళ్ళ పాటు వాళ్ళ ఫోన్ కోసం ఎదురుచూసాక ఒక సారి ఫోన్ రాగానే .. వెళ్ళి గురువుగారిని కలిసాను.

 

నన్ను చూస్తూనే ఎంతో ఆదరణతో పలుకరించిన పత్రీజీ .. ప్రక్కనే వున్న గుజరాత్ పిరమిడ్ మాస్టర్ "రీటా కెప్టెన్ మేడమ్" ను నాతో మాట్లాడమని చెప్పారు. నా ప్రొఫైల్ అంతా విన్న రీటా మేడమ్ వెళ్ళి పత్రీజీతో ఏంచెప్పారో తెలియదు కానీ .. నా కోరికను వెల్లడించక ముందే వారు .. "స్వామీజీ! మీరు మా ట్రస్ట్‌మెంబర్‌గా వుండి .. ట్రస్ట్ యొక్క ఆర్ధిక సంబంధమైన లావాదేవీలను ప్రణాళికబద్ధంగా నిర్వహించకూడదా?!" అన్నారు.

 

అది ఆదేశమో, ఆజ్ఞనో .. మరి వారు నాకు ఇచ్చిన వరమో తెలియదుకానీ .. నా మనస్సులోని కోరికను వారు అడగకనే తీర్చడం నాకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది! జీవితంలో ఇంతవరకు నేను సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తయితే .. ఈ విజయం నాకు మరొక ఎత్తు! అది నా సంకల్పబలానికి నిదర్శనం కూడా!!


వాణి: చాలా బాగుంది సార్ .. మరి ఇక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా సాగుతోంది?!


హనుమంతరాజు: చాలా అద్భుతంగా .. ఆత్మ తృప్తితో నేను ప్రతిక్షణం నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన కడ్తాల్ మహేశ్వర ధ్యానపిరమిడ్ చక్కటి భవిష్యత్తుని కలిగి రాబోయే కాలంలో ప్రముఖ దర్శనీయస్థలంగా హైదరాబాద్ కీర్తికిరీటంలో నిలువబోతోంది. ఈ శక్తిక్షేత్రంలో ధ్యానంచేసిన ఎటువంటివారైనా ఆధ్యాత్మికంగా ఉన్నత దిశగా పరిణామం చెందడం ఖాయం!

 

వాణి: వ్యాపార రంగంలో ఎన్నెన్నో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలనూ మరి వ్యాపార దిగ్గజాలనూ చాలా దగ్గరగా పరిశీలించిన మీరు .. ధ్యానం అక్కడ ఏ విధంగా ఉపయోగపడబోతోందో చెప్పండి!


హనుమంతరాజు: ఇది చాలా ముఖ్యమైన విషయం! ఎందుకంటే మేధోపరంగా ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పటిష్టమైన ఆర్ధికవిధానాలతో విజయాలను చవిచూసిన అనేక మంది వ్యాపార దిగ్గజాలు కూడా .. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తమ మానసిక సమతుల్యతను కోల్పోతూంటారు. తమలోని దైవత్వం పట్ల ఎరుకను కోల్పోయి వారు భీరువుల్లా మారిపోతూంటారు.

 

ఎప్పుడయితే వాళ్ళు తమ చిన్నతనం నుంచే చదువుతో పాటు నిరంతర ధ్యానసాధన మరి చక్కటి ఆత్మజ్ఞానాన్ని కూడా అందుకుంటూ ఉంటారో అప్పుడు వారి సామర్థ్యం బహుముఖంగా విస్తరించి .. నిరంతరం ఒడిదుడుకులను లోనయ్యే వ్యాపార రంగంలో స్థిరచిత్తంతో వ్యవహరించగలుగుతారు.

 

అందుకే కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా తమ తమ సంస్థలలోని ఉద్యోగులకు ప్రతిరోజూ కొంత సమయాన్ని ధ్యాన సాధనకు కేటాయిస్తే వారిలో పనిసామర్థ్యం పెరిగి వారు చక్కటి సుహృద్భావ వాతావరణంలో పనిచేయగలుగుతారు. తమ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్న యాజమాన్యం పట్ల వాళ్ళు కూడా కృతజ్ఞతతో వుంటూ తమ ఆత్మ నిజస్థితిని గుర్తించుకుని .. కర్మసిద్ధాంతం పట్ల ఎరుకతో తమ జీవితాలను వున్నతీకరించుకుంటారు.

 

ఇలా ఏ రకంగా చూసినా .. సమాజంలో ప్రతి ఒక్క రంగంలో కూడా ఆధ్యాత్మిక ప్రవేశిస్తేనే .. శారీరక, మానసిక మరి ఆత్మపరమైన ఆరోగ్యంతో అవి విలసిల్లుతాయి. కనుక సమాజంలో అన్ని వర్గాల వారికి విస్తృతంగా ధ్యానాన్ని చేరవేయడమే మౌలికంగా మనం చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యం! ఇది మన సంఘపరమైన బాధ్యత కూడా!

 

అందుకే దేశవిదేశాలలో నేను నా వృత్తిపరమైన బోధనలను అందించడానికి విద్యాసంస్థలకూ మరి కార్పొరేట్ ఆఫీసులకూ వెళ్ళినప్పుడు ధ్యానం యొక్క శాస్త్రీయతను వారికి వివరించి వారిచే ధ్యానం చేయిస్తూంటాను. ఇందుకు గాను "Meditation for Professionals .. Unknown - Known" అని నిజ జీవిత ఉదాహరణలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తయారు చేసుకున్నాను. వెళ్ళిన చోటల్లా దానిని నేను ప్రదర్శిస్తూంటాను.

 

వాణి: "పత్రీజీతో మీ అనుబంధం .."


హనుమంతరాజు: పత్రీజీ వంటి జ్ఞానిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు! వారిని అర్థం చేసుకోవాలంటే వారంతటి స్థాయికి మనం కూడా ఎదగాల్సిందే! కార్పొరేట్ సెక్టర్‍లో విజయసూత్రంగా ఎంచే "The success of an organisation depends upon its weakest link" అన్నదానిని తు.చ. తప్పకుండా పాటిస్తూ వారు అన్ని వర్గాలవారినీ ఆత్మీయంగా కలుపుకుపోతూంటారు.

 

ఒక్కోసారి ఎంతో అస్తవ్యస్తంగా కనిపించే సందర్భాలలో మరి అత్యంత సంక్లిష్టంగా కనిపించే వ్యక్తులతో కూడా వారు వ్యవహరించే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటూ ఒక విజేతగా ముందుకు సాగే వారి ఉన్నత కార్యనిర్వహణా శైలి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

 

వారి మాట, నడత మరి ఆలోచన అన్నీ కూడా త్రికరణశుద్ధిగా ఉంటూ .. "ఒక నడుస్తోన్న విజ్ఞానకోశం"లా ఉంటారాయన. "ప్లాన్, యాక్షన్ మరి విజన్ .. అన్న మూడు ప్రాథమిక అంశాలను ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటూ మనం ఏ పని చేపట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది" అన్నది కార్పొరేట్ గవర్నెన్స్‌లో అతి ముఖ్యమైన సూత్రం!

 

ఇదే సూత్రాన్ని మన స్పిరిచ్యువల్ గవర్నెన్స్‌లో కూడా అమలు పరుస్తూ పత్రీజీ విజయగర్వంతో ముందుకు దూసుకువెళ్తూ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ఒక్కొక్క దేశంలో వారు అక్కడి పిరమిడ్ మాస్టర్ల సమన్వయంతో చేపడుతోన్న ధ్యానప్రచారోద్యమ తీరు .. దేశ విదేశాల్లో విజయకేతనాలను ఎగురవేస్తోన్న మల్టీనేషనల్ కంపెనీల సునిశిత పనితీరుకు ఎంతమాత్రం తీసిపోదు!!

 

వారి ఆధ్వర్యంలో వెలువడుతూన్న పలు భాషలకు చెందిన పత్రికల ద్వారా ఎంతో గొప్ప నవీన ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రజలను చేరుతోంది. వృత్తిపరంగా ఎన్నెన్నో మ్యాగజైన్స్‌నూ, జర్నల్స్‌నూ నిరంతరం అధ్యయనం చేసే నేను "ధ్యాన జగత్" (పూర్వం "ధ్యానాంధ్రప్రదేశ్")ను కూడా శ్రద్ధగా చదువుతూంటాను.

 

ఆధ్యాత్మిక పరంగానే కాదు ప్రాపంచికంగా కూడా ఆ పత్రిక ఎంతో జ్ఞాన సమాచారాన్ని అందిస్తోంది. ఒక్కోసారి అందులోని శాస్త్రీయమైన కాన్సెప్టులను నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళే కంపెనీ సెక్రెటరీస్, CA, CWA క్లాసుల్లోని విద్యార్థులకు ఉదహరిస్తూంటాను కూడా! అంతటి అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడిన వ్యక్తిత్వ వికాసపు ఆర్టికల్స్‌ను కలిగివున్న పత్రిక అది! ముఖ్యంగా అందులోని పత్రీజీ సందేశాలు .. ప్రతిఒక్కటీ ఆణిముత్యాలే! ఒక్క పేజీ కూడా వదలకుండా చదువుతాను! ఎంతో విలువైన ఆ పత్రికను ప్రతి ఒక్కరూ క్రమం తప్పక చదవాలి!

 

వాణి: "పిరమిడ్ నిత్య అన్నదాన ట్రస్ట్ (హైదరాబాద్)కు మీరు వైస్ ఛైర్మన్‌గా నియమించబడ్డారు .. ఆ వివరాలు .."


హనుమంతరాజు గారు: పిరమిడ్ నిత్యఅన్నదాన ట్రస్ట్ (హైదరాబాద్)కు "వైస్ ఛైర్మన్"గా పత్రీజీ నాకు బృహత్తర బాధ్యతను అప్పగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

 

గత 46 సంవత్సరాలుగా నా ఆధ్వర్యంలో షిరిడీ బాబా దేవాలయాలలో మరి మా ఊరిలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నా .. ఈ సరి క్రొత్త బాధ్యత నన్ను మరింత ఎరుక స్థితిలోకి తీసుకుని వచ్చింది.

 

కైలాసపురి వంటి గొప్ప క్షేత్రానికి వచ్చే యోగులందరూ కూడా ఎంతో గొప్ప ఆత్మశక్తి సంపన్నులు. వారు కేవలం అన్నం తినడానికి మాత్రమే అంత దూరం రారు కనుక .. వారికి భోజనం అందించడం అనేక జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తాను.

 

అందుకే కుల మత ప్రాంత లింగ బేధాలకు అతీతంగా అక్కడికి వచ్చిన వారికి రుచిగా, శుచిగా వండి .. ప్రేమగా, అప్యాయంగా కొసరి కొసరి వడ్డించడం "పిరమిడ్ నిత్య అన్నదాన ట్రస్ట్"యొక్క మౌలిక లక్ష్యం!

 

ఈ సందర్భంగా మీతో ఒక చక్కటి విషయాన్ని పంచుకుంటాను! పాత తరం తెలుగు సినీ హీరో చిత్తూరు V.నాగయ్య గారు సినిమాలలో నటించేటప్పుడు తమకు వచ్చే పారితోషకంతో మద్రాసులోని T.నగర్‌లో ఒక ఉచిత భోజనశాలను నడిపేవారు. సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తూ మద్రాసు చేరి జేబులో డబ్బులు అయిపోగా ఆకలికి అలమటించే ఔత్సాహిక కళాకారులందరికీ ఆ మెస్‌లో ఉచిత భోజనం అప్యాయంగా కొసరి కొసరి వడ్డించేవారు.

 

అలా తొలినాళ్ళలో డబ్బులు లేక ఆ మెస్‍లో ఆకలిని తీర్చుకుంటూ వేషాల కోసం ప్రయత్నించి .. ఆ తరువాతి కాలంలో గొప్పనటుడిగా ఎదిగిన పద్మనాభం గారు ఒకానొక సందర్భంలో నాగయ్య గారిని కలిసినప్పుడు వారి దాతృత్వ గుణాన్ని పొగుడుతూ తమ కృతజ్ఞతలు తెలుపుకోగా వారు ..

 

"మీరు కేవలం అన్నం తినడానికి మాత్రమే మద్రాసుకు రాలేదు కదా! మీ ఆకలిని తీర్చే అవకాశం మాకు ఇచ్చినందుకు మేమే మీకు కృతజ్ఞతలుగా ఉంటాం. ఆనాడు ఆకలితో మీరు మా మెస్‌కు వచ్చినప్పుడు అప్యాయంగా వండి వడ్డించడంలో మా వల్ల ఏమైనా లోటు జరిగి ఉంటే క్షమించండి" అన్నారట ఎంతో వినయంగా!

 

ఇలా గొప్ప గొప్ప పనులు చేయాలంటే ఎంతో గొప్ప మనస్సు ఉండాలి. మన దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకోగలిగిన అర్హత ఉండాలి.

 

నేను 27గం|| 27ని|| 27 సెకన్ల పాటు "నాన్‌స్టాప్ టీచింగ్" చేసి రికార్డ్ నెలకొల్పినప్పుడు మీడియా మరి పత్రికల వాళ్ళు "ఎందుకు మీరు ఈ పనిచేశారు?" అని అడిగారు. అప్పుడు నేను వాళ్ళకు "అర్హత కోసం" అని చెప్పాను! క్లాస్ రూమ్‌లో పాఠాలు బోధిస్తూ "కదలకుండా కూర్చుని వినలేరా?!" అని సాధారణంగా విద్యార్థులను మందలిస్తూంటాం. అలా మందలించే ముందు "కదలకుండా నిలబడి పాఠాలు చెప్పే అర్హత అసలు నాకు ఎంత వరకు ఉంది?" అని నన్ను నేను పరీక్షించుకున్నాను .. రికార్డు కూడా స్థాపించాను.

 

ఇలా అర్హతను బట్టే సమర్థత వస్తుంది కనుక నాలో అలాంటి అర్హతను గుర్తించే బహుశః పత్రీజీ నాకు "పిరమిడ్ నిత్య అన్నదాన ట్రస్ట్" బాధ్యతలు అప్పగించి ఉంటారు. వారి ఆజ్ఞను శిరోధార్యంగా ఎంచి .. M.నిర్మలాదేవి మేనేజింగ్ ట్రస్టీగా .. A.మధుమోహన్, డా||B.ఇందిర, సుబ్బరాజు, పత్తి రవికుమార్, V.రమణ గార్లు ట్రస్టీలుగా చక్కటి టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ట్రస్ట్ యొక్క కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము.

 

అందరి సహకారంతో కేవలం 40 రోజులలో "కైలాసపురి క్షేత్రం"లో అన్ని హంగులతో కూడిన "అన్నపూర్ణేశ్వరి అన్నదాన ప్రాంగణం" నిర్మించడం జరిగింది. సుశిక్షితులైన వంటవాళ్ళచే అక్కడ ప్రతిరోజూ రుచికరమైన మరి శుచికరమైన భోజనం వండించబడి పిరమిడ్ సందర్శకులకూ, ప్రాంగణంలో సిబ్బందికీ మరి వివిధ కారణాలతో పిరమిడ్‌లో ధ్యానదీక్షలు చేసుకోవడానికి దూరప్రాంతాల నుంచి వచ్చి అక్కడ డార్మెటరీలలో ఉండే ధ్యానులకూ రెండుపూటలా అప్యాయంగా వడ్డించబడుతోంది.

 

ఇది ఇంకా విస్తృత స్థాయిలో నిర్వహించబడాలంటే పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహకారం చాలా అవసరం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో విస్తరించి ఉన్న పిరమిడ్ బృహత్ కుటుంబ సభ్యులందరూ స్పందించి తమ తమ సంపాదనలోంచి కొంతశాతం ద్రవ్యాన్ని నిత్య అన్నదాన ట్రస్ట్‌కు క్రమం తప్పకుండా వితరణ చేస్తూ ఉంటే మనం మరింత మంది యోగులకు తృప్తిగా భోజనం పెట్టగలుగుతాం.

 

ఇది మన PSSM ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి అయిన రజతోత్సవ సంవత్సరం! ఈ శుభ సందర్భంగా డిసెంబర్ 14 నుంచి 31 వ తేదీ వరకు కైలాసపురిలో వేలాదిమంది ధ్యానయోగుల సమక్షంలో ధ్యానమహాచక్రం-VIలో ప్రయోగాత్మకంగా ముందు ఏడురోజులపాటు "సామూహిక మౌన ధ్యానం" .. ఆ తరువాత ఏడురోజులపాటు రజతోత్సవ సంబరాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా కైలాసపురికి విచ్చేసే ఆత్మ దేవుళ్ళందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి .. అప్యాయంగా వారికి భోజనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మనల్ని మనం ఉద్ధరించుకునే గొప్ప అవకాశం కనుక ఈ అరుదైన అదృష్టాన్ని మనకు అందించిన పత్రీజీకీ మరి "కైలాసపురి క్షేత్రం" లో తృప్తిగా భోజనం చేసి వెళ్ళబోయే ఆత్మ దేవుళ్ళందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం!

 

 

9848045001

email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top