" ధ్యానం నాకు ఆత్మజ్ఞానంతో జీవించడం నేర్పింది "

 

 

ధ్యాన - ఆత్మజ్ఞాన శక్తితో శాస్త్రీయమైన ప్రయోగాలను చేపడుతూ తమను తాము ఉద్ధరించుకుంటూన్న పిరమిడ్ మాస్టర్‌లలో వైజాగ్ పిరమిడ్ మాస్టర్ K.మహేశ్వరి గారు అగ్రగణ్యులు! జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని .. కర్మ సిద్ధాంత అవగాహనతో జీవిస్తూ "బాలవికాస్" సేవల ద్వారా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ విశేష కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చే తల్లితండ్రులకూ మరి పిల్లలకూ తమ స్నేహహస్తాన్ని అందిస్తోన్న మహేశ్వరి గారు తమ ధ్యాన జీవిత అద్భుతాలను మనతో పంచుకుంటున్నారు ..


T.వాణి.


వాణి: " మీ ధ్యాన ప్రవేశం గురించి చెప్పండి మేడమ్! "


మహేశ్వరి: 1996 సంవత్సరంలో నేను హోమ్‌సైన్స్ సబ్జెక్ట్‌తో B.Sc డిగ్రీ చదువుతూన్నప్పుడు నా మేనమామ కొడుకు "డా||GK"గారి ద్వారా నాకు చాలా తమాషాగా ధ్యానపరిచయం జరిగింది! ఒకరోజు ఏదో విషయం మీద మా నాన్నగారు నన్ను తీవ్రంగా కొట్టారు. ఇక దాంతో నేను చాలా ఆవేశంతో "ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుని చుట్టాలందరితో ఆయనను తిట్టిస్తే .. ఆయన అంతకంతా బాధపడతారు! అప్పుడు గానీ నా బాధ ఆయనకు తెలియదు" అనుకుని "ఎలా చావాలి?" అని తర్జన భర్జన చేసుకున్నాను.

 

"ఎలుకలు మందు మింగాలా? .. ఉరి వేసుకోవాలా? .. లేక మేడ మీదనుంచి దూకి చావాలా? .. ఎలాగైనా సరే ఆత్మహత్య మాత్రం చేసుకుని మా నాన్నకు బుద్ధిచెప్పాలి" అదే నా టార్గెట్! ఆ వయస్సు అలాంటిది మరి!!

 

అయితే చిన్నప్పటి నుంచి నా మొండి పట్టుదల గురించి తెలిసిన మా అమ్మ ఆ తీవ్ర ఆవేశం నుంచి నా మనస్సును మళ్ళించడానికి మా అక్క "P.S.జ్యోతి" అంటే "డా||GK" గారి వదిన ఇంటికి పంపించింది. "చచ్చిపోతాను" అని ఏడుస్తూన్న నన్ను .. "నాన్నగారి కోపం సంగతి తెలుసుకదా ఊరుకో" అని అందరూ సముదాయిస్తూంటే .. "డా||GK" మాత్రం "సరే! నువ్వు ఎలాగైనా చావాలి అనుకున్నావు కదా! నేను డాక్టర్‌ని కనుక సులభంగా చనిపోయే ఉపాయం నీకు చెబుతాను రా" అన్నాడు.

 

వెంటనే ఏడుపు ఆపేసిన నేను "ఇదేంటి? అందరూ నన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతూంటే .. ఈయన మాత్రం సూయిసైడ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేస్తానంటున్నాడు" అని ఆశ్చర్యపోయాను! అప్పుడు .. "డా||GK" "అవును! అందరిలాగే నీ జీవితాన్ని కూడా కొన్ని అనుభవాలకోసం కోపిష్ఠి నాన్నతో సహా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు! ఇదంతా మరచిపోయి ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి కోపాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని మధ్యలోనే జీవితంలోంచి తప్పుకుంటే .. మళ్ళీ తరువాతి జన్మలో కూడా ఇవే అనుభవాల కోసం ఇలాంటి కోపిష్ఠి నాన్నతో పాటు కోపిష్ఠి అమ్మను కూడా ఎంచుకుని పుట్టాల్సి వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి?

 

"జీవితం ఒక ఆట లాంటిది. ఇక్కడ ప్రతి ఒక్క పాత్రను అర్థం చేసుకుని జీవిస్తూ అనుభవజ్ఞానంతో ఆడి ఆటను రక్తి కట్టించాలి. అందుకు ధ్యానం చెయ్యాలి! ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానంతో జీవిస్తూంటే జీవితం ఒక పసందైన ఆటలా ఉంటుంది" అంటూ నాతో గంటసేపు ధ్యానం చేయించాడు.

 

ఓషో పుస్తకం "హుష్ .. నిశ్శబ్దం" నాకు ఇచ్చి చదవమన్నాడు. ఒక్కొక్క పేజీ చదువుతూంటే .. నన్ను నేనే అర్థం చేసుకుంటూన్న భావన! మూడు రోజుల పాటు పుస్తకం చదవడం .. ధ్యానం చెయ్యడం .. ధ్యానంలో ఏవేవో రంగులూ, విజన్స్ చూస్తూ వాటిని "డా||GK"తో పంచుకోవడం! అలా పూర్తిగా ఒక క్రొత్త లోకంలో ఉండిపోయాను! అంతే ఇక ఆ నాటి నుంచి ధ్యానమే నా జీవితం అయిపోయింది. "రిచార్డ్ బాక్" పుస్తకాలు బాగా చదివేదాన్ని.

 

వాణి: "యువరక్తం ఉప్పొంగుతూ ఉన్నప్పుడే మీకు ధ్యాన పరిచయం జరిగిందన్న మాట! చాలా బాగుంది .. ఆ తరువాత .. "


మహేశ్వరి: మెల్లి మెల్లిగా నాలో ఆవేశం పాలు నియంత్రించబడుతూ .. నా ఆత్మవిశ్వాసం సరియైన దారిలోకి మళ్ళించబడుతూ .. నా ఆలోచనలలోని స్పష్టత నాకే అర్థం అవుతూ వచ్చింది. ధ్యాన ప్రచారం నా జీవితంలో ఒక ముఖ్యభాగం అయిపోయింది. ధ్యానంలో ఎప్పుడూ చుట్టూ చిన్ని చిన్ని పిల్లలతో నేను ఆడుకుంటూన్నట్లు నాకు విజన్స్ వచ్చేవి. కాలేజీలో చదువుతో పాటు .. అథ్లెటిక్స్‌లో కూడా రాణిస్తూ "డా||GK" చెప్పినట్లు జీవితాన్ని ఒక అందమైన ఆటలా ఆడుతూ ఉండగా 1999లో నాకు పెళ్ళి జరిగింది.

 

పెళ్ళి అవుతూనే తిరుపతి పద్మావతి మహిళా విద్యాలయంలో నాకు M.Sc "ఛైల్డ్ డెవలప్‌మెంట్"లో సీటు రావడంతో నేను వెళ్ళి అక్కడ హాస్ట‌ల్‌లో చేరిపోయాను. మధ్య మధ్యలో వైజాగ్‌లో ఉన్న నా భర్త దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళినప్పుడల్లా .. మా నాన్నగారి కంటే పదింతల కోపంతో పాటు వందశాతం మూర్ఖత్వం పాలు కూడా కలిగి వున్న నా భర్త .. నన్ను అదనపు కట్నం కోసం మరి కానుకల కోసం వేధిస్తూ విపరీతంగా కొట్టేవాడు. జీవితం నరకప్రాయం అవుతూ ఉన్నా కూడా "డా||GK" చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టుకుని నేను ఎక్కడా తొణకకుండా, బాధపడకుండా .. నా భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదానిని.

 

ఈ క్రమంలో నా PG పూర్తికావడం .. నాకు ఒక ఇంటర్నేషనల్ NGOలో మంచి జీతంతో ఉద్యోగం రావడం .. పాప పుట్టడం జరిగిపోయింది. నేను నిండు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త .. డెలివరీ అయ్యాక మా వాళ్ళు పెట్టాల్సిన కట్నకానుకల కోసం ముందే గొడవపెట్టుకుని నా కడుపుపై గట్టిగా తన్నడంతో అందరూ నేను చనిపోయాననే అనుకుని నన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. డాక్టర్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు.

 

ఆ తరువాత ఒకానొక సమయంలో నా భర్త నన్నూ నా పాపనూ చంపడానికి ప్రయత్నించినప్పుడు మా నాన్నగారు ఎంతో బాధపడిపోయి .. ఇరుపక్షాల పెద్దవాళ్ళతో మాట్లాడి పరస్పరాంగీకారంతో నాకు విడాకులు ఇప్పించారు! ఇలా "కేవలం నా పాప ‘నేహ (పూర్వి)’ ఈ భూమి మీదకు రావడానికే మా ఇద్దరికీ పెళ్ళి జరిగింది; ఈ క్రమంలో నా భర్తతో చేదు జీవితం నా ఆత్మకు ఒక అనుభవం మాత్రమే" అని నేను ఎంతో నిబ్బరంగా అర్థం చేసుకున్నాను. ఇదే .. ధ్యానం నాకు ఇచ్చిన ఆత్మజ్ఞాన శక్తి మహిమ!

 

వాణి: "మీకు ఒక పెద్ద ఆక్సిడెంట్ జరిగింది కదా! ఆ వివరాలు ..?"


మహేశ్వరి: పాపను చూసుకుంటూ .. డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా మంచి జీతంతో ఒక అంతర్జాతీయ NGO లో ఉద్యోగం చేసుకుంటూ అమ్మానాన్నలు మరి ఇతర కుటుంబ సభ్యుల సంరక్షణలో హాయిగా ఉంటూండగా .. నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది.

 

2004 సంవత్సరంలో ఒక రోజు .. సంవత్సరంన్నర వయస్సున్న పాపను ఋషికొండ బీచ్‌లో ఉన్న ఒక స్విమ్మింగ్‌పూల్‌లో నేను ఆడిస్తూండగా మా తమ్ముడు దానిని ఫోటోలు తీస్తున్నాడు. ఈలోగా ఆ పూల్‌లో ఉన్న 30 అడుగుల ఎత్తయిన స్లయిడర్‌పై నుంచి ఒక బలిష్టమైన యువకుడు వేగంగా జారుతూ వచ్చి అనుకోకుండా తన కాళ్ళతో బలంగా నా పొట్టలో గుద్దుకున్నాడు.

 

కళ్ళు బైర్లు కమ్మిన నేను చేతిలోని పాపను నీళ్ళలోకి విసిరేసి విపరీతమైన బాధతో లుంగలు చుట్టుకుపోతూ పూల్‌లో స్పృహ తప్పి పడిపోయాను. పాపను ఎవరో పట్టుకుని కాపాడగా మా తమ్ముడు నన్ను వైజాగ్ హాస్పిటల్‌లో చేర్పించాడు.

 

రకరకాల స్కానింగ్‌లు చేసి కడుపులో ఉన్న లివర్ ముక్కలు ముక్కలుగా చితికిపోయి కడుపంతా రక్తస్రావమై పోతోందని తేల్చారు. లివర్‌ని కుట్టి సరిచేసే పరిస్థితి లేకపోవడంతో అనేక తర్జనభర్జనల తరువాత డాక్టర్‌లు చెప్పిన దానిని బట్టి నా కుటుంబ సభ్యులు నా మీదా ఆశలు వదులుకున్నారు. "ఒక వేళ ఏ అద్భుతమో జరిగి బ్రతికి బట్టకట్టినా .. మంచానికే అంకితం" అని తేల్చుకుని శోక సముద్రంలో మునిగిపోయారు.

 

నా చావు బ్రతుకులను గ్యారెంటీ లేదని మా వాళ్ళతో అంగీకార పత్రంపై సంతకం చేయించుకున్న డాక్టర్లు నా కడుపంతా కోసి 26 కుట్లు వేసి .. చితికిపోయిన లివర్‌ని ఒక మెష్‌లో అమర్చిపెట్టారు. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా మందులు వాడడం మానేసిన నా శరీరం .. అప్పుడు వాడుతూన్న మందుల సైడ్ ఎఫెక్ట్‌లతో మరి అంతర్గత రక్తస్రావాలతో, ఇన్‌ఫెక్ష‌న్‌లతో నరకాన్ని అనుభవించింది.

 

ICU బయట మా అమ్మ ఏడవడం .. మరి "నా బిడ్డను బ్రతికించండి" అంటూ మా నాన్న డాక్టర్లను ప్రాధేయపడడం. లీటర్లకొద్దీ రక్తం స్రవిస్తూనే ఉండగా అంతర్గత అవయవాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల రోజురోజుకీ దిగజారిపోతోన్న ఆరోగ్యంతో ఆక్సిజన్ మాస్క్‌లో నేను దాదాపు పదిరోజులు పడి ఉన్నాను. అప్పుడు జరిగింది ఒక అద్భుతం!

 

ఒకరోజు అర్థరాత్రి 1.00 గం||కు పత్రీజీ .. ICUలో ఉన్న నా దగ్గరికి వచ్చారు! తమ కుడి చేతిని నా చేతిలో ఉంచి ఎడమ చేతితో నా తల తట్టి "ఇప్పటి వరకు మీరు అనుభవించింది గతజన్మల కర్మఫలితం మేడమ్! ఈ ఆక్సిడెంట్ తరువాత మీ జీవితం ఫ్రెష్‌గా మొదలయ్యింది కనుక ఇకనుంచి మీ సంకల్పం ప్రకారమే మీ జీవితం సాగుతూ ఉంటుంది. ఈ ప్లానింగ్ అంతా కూడా మీరు ఎంపిక చేసుకుని వచ్చిందే" అన్నారు.

 

నాకు భలే కోపం వచ్చింది! "ఎవరయినా ఒక సినిమా హీరోలాంటి మంచి భర్తనో, హాయిగా సాగే అందమైన జీవితాన్నో కోరుకుంటారు కానీ .. నా టేస్టేంటీ .. ఇంత దరిద్రంగా ఉంది?! సారేదో నన్ను అనునయించడానికి చెప్తున్నారులే" అనుకుంటూండగా వారు .. తమ చేతిలో ఉన్న ఆల్బమ్‌ను తెరిచి అందులో ‘శైశవ ఆత్మ’ నుంచి ‘వృద్ధాత్మ’ వరకు ఆత్మ చేసే ప్రయాణాన్ని ఒక సినిమాలాగా చూపించారు!

 

"రకరకాల అనుభవాల జ్ఞానం కోసమే మనం ఇలా జన్మలు తీసుకుంటూ ఉంటాం; అంతా బాగుంటుంది .. హాయిగా పడుకోండి" అని ఫ్లూట్ వాయిస్తూ ఆ రాత్రంతా నా ప్రక్కనే ఉన్నారు. వారి చేతి గుండా నా తలలోకి ఒక వెచ్చటి శక్తి ప్రవాహం రావడం నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందాను!!

 

మర్నాడు ప్రొద్దున్నే నన్ను చెక్ చెయ్యడానికి వచ్చిన డ్యూటీ డాక్టర్ .. గత పదిరోజులుగా మూసినకన్ను తెరవకుండా పడి వున్న నేను కళ్ళు తెరిచి కదలడం మరి నా ECG, BPనార్మల్‌గా ఉండడం చూసి అలర్ట్ అయిపోయాడు. రాత్రంతా ICU ప్రక్కనే కాచుకుని ఉన్న మా మెడికో తమ్ముడిని పిలిచి నా పరిస్థితిని వివరిస్తూంటే .. నేను ఆక్సిజన్ మాస్క్ తీసి .. "పత్రిసార్ వచ్చి రాత్రంతా ఫ్లూట్ వాయిస్తూ నా దగ్గరే ఉన్నారు. నాకు తొందరలోనే బాగయిపోతుందట" అని చెప్పాను ఆనందంగా!

 

"ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న సార్ అర్థరాత్రి ఇక్కడికి రావడం ఏంటి? దీనికి చావు కళ వచ్చి సంధి ప్రేలాపనలు చేస్తోంది" అనుకుని వాడు "సరేలే" అని నన్ను అనునయిస్తున్నాడు. అయినా నేను సార్ నాతో ఆత్మ ప్రయాణం గురించి మాట్లాడినవన్నీ వాడికి చెప్తున్నాను ఆయాసంగా!!

 

ఆ తరువాత ఆశ్చర్యం ఏమిటంటే .. అదే రోజు సాయంత్రం సార్ హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం .. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ ముగించుకుని .. తమను కలవడానికి వెళ్ళిన మా అన్నయ్యను చూస్తూనే "మీ చెల్లి దగ్గరకు వెళ్దాం పద" అంటూ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ICUలో ఉన్న నా దగ్గరకు వస్తూనే నా చేతిలో చెయ్యిపెట్టి .. నా తలపై తట్టి "అంతా బాగుంటుంది మేడమ్ .. త్వరలోనే హాయిగా లేచి తిరుగుతారు" అంటూ అచ్చంగా క్రితం రాత్రి నాతో చెప్పిన మాటలే చెప్పారు. "ఇవన్నీ మీరు ఎంచుకుని వచ్చిన జీవిత అనుభవాలే" అని ఉదయం సంధిప్రేలాపనలు అనుకున్న నా మాటలే మళ్ళీ సార్ నోటి నుంచి విని ఆశ్చర్యపోవడం మా తమ్ముడి వంతు అయ్యింది! దానికి తోడు ఉదయం నుంచి నా ఆరోగ్యంలో చక్కటి మార్పు రావడం డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

 

వాణి: "మీకు ఒక సైకిక్ సర్జరీ కూడా జరిగిందని విన్నాను!?"


మహేశ్వరి: పత్రిసార్ హాస్పిటల్‌కి ప్రత్యక్షంగా వచ్చి వెళ్ళాక "అంతా ఓకే" అనుకుంటూండగా .. శరీరంలోని భాగాలకు అకస్మాత్‌గా ఇన్‌ఫెక్షన్ సోకి అవి నీటితో నిండిపోయి నా ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలు అయ్యింది. డాక్టర్లు ఉరుకులూ, పరుగులూ .. మా అమ్మ ఏడుపులూ, పెడబొబ్బులూ! అయితే .. పూర్తి మెలకువ స్థితిలో వున్న నేను మాత్రం "నాకు బాగానే ఉంది కదా! శరీరంలో కణకణం శక్తితో నిండిపోతోంటే వీళ్ళెందుకు ఇంత ఖంగారుపడుతున్నారు? భూమి మీద నా అవసరం ఉంటే భేషుగ్గా వుంటాను; లేకపోతే హాయిగా పై లోకాలకు వెళ్ళిపోతాను. ఏదైనా సరే నేను అంగీకరిస్తున్నాను. నా పాప గురించి బాధేమీ లేదు. నేను ఎలా బ్రతికానో అలాగే ఈ లోకంలో నా పాప కూడా బ్రతుకుతుంది .. దాని జీవిత ప్రణాళిక దానిది" అనుకుంటూ ఎంతో నిబ్బరంగా ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాను.

 

ఏవేవో క్రొత్త క్రొత్త లోకాలు! అందమైన తోటలు కనువిందు చేసే పూలూ, పక్షులూ జలపాతాలూ .. ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరకి వచ్చి నన్ను ఒక బల్ల మీద పడుకోబెట్టినట్లు గాలిలోనే పడుకోబెట్టి నా ఛాతీలోకి చెయ్యిపెట్టి నా ఊపిరితిత్తులలో నుంచి ముదురు ఎరుపురంగులో ఉన్న చెడు రక్తన్నంతా బయటకు తీసి పడేశాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు! కొద్దిసేపటికి "ఇప్పుడిక నీ శరీరంలో ఏ ప్రాబ్లమ్ లేదు; నీకు సైకిక్ సర్జరీ చేశాను" అని చెప్పాడు.

 

మర్నాడు హాస్పిటల్‌కు ఒక పల్మొనాలజిస్ట్ వచ్చి మళ్ళీ .. స్కాన్ తీయించి అప్పటి వరకూ నా శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌లకు కారణం అవుతోన్న నా ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న నల్లటి చెడు రక్తంతో పాటు అక్కడ ఊరిన నీటిని బయతికి డ్రెయిన్ చేశాడు. అప్పుడుకానీ నా ఆరోగ్యం మెరుగుపడలేదు.

 

ఇక రోజురోజుకీ అద్భుతమైన రికవరీ జరగడంతో కొన్ని సంవత్సరాల పాటు మంచం మీద పడి ఉండాల్సిన నేను కేవలం నా ధ్యానశక్తితో మూడంటే మూడు నెలలలో సాధారణ స్థితికి వచ్చేసి నన్ను ట్రీట్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా నా కారును నేనే స్వయంగా నడుపుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోయాను!

 

ఆ తరువాత తెలిసింది .. ధ్యానంలో నాకు ఆస్ట్రల్ సర్జరీ చేసింది "అలెక్స్ ఆర్బిటో" అనే ఒక మనోవైజ్ఞానిక శస్త్ర సాంకేతిక నిపుణులు (సైకిక్ సర్జన్) అని. GCSS లో పాల్గొనటానికి వారు 2010లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు వారిని ప్రత్యక్షంగా కలిసి నా అనుభవం చెప్పి వారి క్షేత్ర పరిశోధనా గ్రంధ సమాచారంలో నమోదు అయ్యాను. అమెరికాలో ఈ దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేస్తోన్న వారి టీమ్ నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి నా సైకిక్ సర్జరీ అనుభవాలను రికార్డింగ్ చేసుకోవడం కూడా జరిగింది.

 

వాణి: "చాలా అద్భుతంగా ఉంది మేడమ్ మీ సైకిక్ సర్జరీ అనుభవం! ఇప్పుడు మీ కార్యక్రమాలేంటి?"

\
మహేశ్వరి: ప్రమాదంలోంచి కోలుకున్న కొద్దిరోజులకే నా కొలీగ్ "కృష్ణ" .. "నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్ళి చేసుకుని పాపను నా బిడ్డలా చూసుకుంటాను" అని చెప్పగా విని గత వివాహపు అనుభవాలు గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను.

 

అతడు మా కుటుంబ సభ్యులను కూడా కలిసి తన స్థిర నిర్ణయాన్ని తెలిపినప్పుడు అతని మంచితనానికి వాళ్ళంతా చాలా సంతోషించి నన్ను ఒప్పించడానికి శతధాప్రయత్నాలు చేశారు. నా కోసం ధ్యానిలా, శాకాహారిలా మారడంతో పాటు పాపకూడా రోజు రోజుకూ కృష్ణకు దగ్గరవడంతో నేను ఆలోచనలో పడ్డాను. అలా 2011 వరకూ గడిచింది.

 

వైజాగ్ ధ్యానమహాచక్రంలో "బాలవికాస్" కొరకు నన్ను నేను మరచిపోయి పనిచేశాను. కార్యక్రమం అత్యద్భుతంగా పూర్తికాగానే నన్ను .. అభినందిస్తూ పత్రీజీ "పెళ్ళి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి మేడమ్" అని సూచించారు.

 

గురువు ఆజ్ఞను శిరసావహించి నేను తొమ్మిది సంవత్సరాలుగా నా కోసం ఎదురు చూస్తున్న కృష్ణను ఇరుపక్షాలవాళ్ళ అనుమతితో సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నాను. తొమ్మిదేళ్ళ మా పాపే పెళ్ళి పెద్దగా అన్నీ తానై వైభవంగా మా పెళ్ళి జరిపించింది! "కిట్టా డాడీ" అంటే దానికి ప్రాణం!

 

ఒక మంచి స్నేహితుడిలా కృష్ణ నా జీవితంలోకి ప్రవేశించడంతో "జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి మేడమ్" అని సార్ చెప్పిన మాట యొక్క విలువ నాకు తెలిసింది. నన్నూ, పాపనూ కంటికి రెప్పలా చూసుకుంటూన్న కృష్ణ .. ధ్యాన ప్రచారం కోసం నన్ను ఉద్యోగం కూడా మాన్పించి నా భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితాలకు చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు.

 

ప్రస్తుతం కృష్ణ ఉద్యోగరీత్యా మేం హైదరాబాద్‌కు మా మకాం మార్చాం! హైదరాబాద్ మరి సికింద్రాబాద్ జంట నగరాలలోని స్కూళ్ళలో విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు నేను ధ్యానశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాను. ఒక టీమ్‌ను ఏర్పరచుకుని "మెడిటేషన్ హెల్ప్ డెస్క్"ల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను.

 

ఛైల్డ్ డెవలెప్‌మెంట్ సబ్జెక్టుగా నేను MSc చేసి ఉండడం మరి గతంలో అనేక ఇంటర్నేషనల్ NGO లలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిర్వాహకురాలిగా పనిచేసి సంబంధిత రంగాలలో ఉన్నత స్థాయి శిక్షణను పొంది ఉండడం .. "శ్వాస మీద ధ్యాస" అనే శాస్త్రీయమైన ధ్యానప్రచారంలో నాకు చాలా చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి.

 

దానికి తోడు "2002 సంవత్సరం తరువాత పుట్టేవాళ్ళంతా ఇండిగో మరి క్రిస్టల్ పిల్లలు .. వారికి ధ్యానాన్ని తప్పక చేరవేయాలి" అని పత్రిసార్ తరచూ చెపుతూంటారు కనుక ఆ దిశగా పిల్లలకు ధ్యానాన్ని చేరువ చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. స్కూల్ యజమాన్యాల నుంచి కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది.

 

వాణి: " ‘ బాలవికాస్ మహేశ్వరి’ గా మీరు అందరికీ సుపరిచితులు; బాలవికాస్ ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది?"


మహేశ్వరి: B.Sc చదువుకుంటూ ధ్యానం చేసే తొలినాళ్ళలోనే నాకు ఎప్పుడూ నేను చిన్న చిన్న పిల్లల మధ్యలో ఉన్నట్లు విజన్స్ వచ్చేవి. వాటి పరమార్థం నాకు 2011లో అర్థం అయ్యింది.

 

PSSM లో జరిగే విశేష ధ్యాన కార్యక్రమాలు అంటే ధ్యానయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు మరి బుద్ధపౌర్ణమి ఉత్సవాలలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో పిరమిడ్ మాస్టర్లు కుటుంబ సమేతంగా తరలి వస్తూంటారు. ముఖ్యంగా పత్రీజీ ఆధ్వర్యంలో జరిగే ప్రాతఃకాల అఖండనాద ధ్యానంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తారు. అయితే చంటి పిల్లల తల్లులు మరి కాస్త ఆడుకునే పిల్లల తల్లులు తమ తమ చిచ్చర పిడుగులు చేసే అల్లరి వల్ల ఇతరులకు ధ్యానభంగం అవుతుందని ఒక్కోసారి అక్కడికి వచ్చి కూడా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతూన్నారు.

 

ఒక పాపకు తల్లిగా నేను కూడా ఈ బాధను అనుభవించి ఉండడంతో తల్లులు ధ్యానం చేసుకునే సమయంలో పిల్లల సంరక్షణ బాధ్యతను వహించడానికి పత్రీజీ అనుమతితో 2011 వైజాగ్ ధ్యానమహాచక్రం నుంచి కొంతమంది వాలంటీయర్స్‌తో "బాలవికాస్" సేవలను ప్రారంభించాను. కేవలం పిల్లల సంరక్షణే కాకుండా వారి మనో వికాసం కోసం మైండ్ గేమ్స్, చిన్ని చిన్ని కథల రూపంలో ధ్యానం వలన లాభాలు తెలియజేస్తూ, శారీరక వికాసానికి ఆటలు, ఇండోర్ గేమ్స్, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం తరగతులను నిర్వహిస్తున్నాం. రోజుల పసిగుడ్లను కూడా మా సంరక్షణలో వదిలి ప్రాతఃకాలం 5.00 గం||ల కల్లా తల్లితండ్రులు ప్రాంగణంలో జరిగే ధ్యానానికి వెళ్ళిపోతూంటారు.

 

డా||న్యూటన్, డా||లక్ష్మి, డా||GK గార్ల ఆధ్వర్యంలో తల్లితండ్రులకు కూడా "ధ్యాన మాతృత్వం", "పిల్లల పెంపకం" అన్న అంశాలపై బాలవికాస్ లో ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాం. పిల్లలలో మెదడు నిర్వహణా సామర్థ్యాన్ని పెంచే విధంగా మా కార్యక్రమాలను అత్యంత శాస్త్రీయంగా రూపొందిస్తూ ఆసక్తికరమైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా వారిలో మనోవికాసాన్ని కలుగజేస్తున్నాం.

 

మా వాలంటీయర్స్ చేస్తోన్న బాలవికాస్ ప్రచారం వల్ల "కైలాసపురి" చుట్టుప్రక్కల మరి జంటనగరాలకు చెందిన స్కూల్స్ యజమాన్యాలు తమ తమ స్కూల్ బస్సులలో పిల్లలను మరి ఉపాధ్యాయులను కైలాసపురి ప్రాంగణానికి పంపించి మేం నిర్వహిస్తూన్న వర్క్‌షాపుల ద్వారా చక్కటి ఆత్మవిద్యను అందుకుంటున్నారు.

 

ఈసారి కూడా ధ్యానమహాచక్రం-VI సందర్భంగా, కైలాసపురి క్షేత్రంలో బాలవికాస్ ఏర్పాటుచేసి మరింత శాస్త్రీయంగా, మరింత సృజనాత్మకంగా పిల్లల కొరకు కార్యక్రమాలను రూపొందించబోతున్నాం.

 

మీరంతా కూడా ప్రేమపూర్వకమైన మా సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం! ఇది మన PSSM బృహత్ కుటుంబానికి రజతోత్సవ సంవత్సరం కనుక డిసెంబర్ నెలలో జరుపుకోబోయే "ధ్యానమహాచక్రం-VI"మహా సంబరాల ఏర్పాట్లకోసం ప్రణాళిక ప్రకారం పనిచేద్దాం. ప్రతి ఒక్కరిలోని ఆత్మచైతన్యాన్ని తట్టిలేపుతూ పత్రీజీ చేస్తూన్న ఈ మహాయజ్ఞంలో భాగం పంచుకుని మన జీవితాలను పునీతం చేసుకుందాం!

 

 


K. మహేశ్వరి

విశాఖపట్టణం/హైదరాబాద్
సెల్ - 98483 22115.

 

Go to top