" ధ్యానం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది "

 

 

నా పేరు "వినీల"


నా జన్మస్థలం రాజమండ్రి అయినా పెరిగింది మాత్రం విశాఖపట్టణంలో, మేము ముగ్గురు అక్కచెల్లళ్ళం .. మరి వారిలో నేను రెండో సంతానం.

 

నేను M.B.A లోHR మరి మార్కెటింగ్‌లో పట్టాపొందాను. చదువు పూర్తి అయిన తర్వాత చెన్నైలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగంలో చేరటానికి చెన్నైకి ఓల్వో బస్‌లో వెళ్తూండగా ఉదయం 5గం||ల సమయంలో ఒక లారీకి మా బస్ "ఢీ"కొని పెద్ద ప్రమాదం జరిగింది.

 

ఆ ప్రమాదంలో చాలా మంది చనిపోగా .. డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న నేను మాత్రం బస్సు నుండి ఎగిరి బయట రోడ్డుపై పడ్డాను. నా కుడికాలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌కు గురై కుడి పాదం కదలిక కోల్పోయింది. నన్ను స్పృహలేని స్థితిలో చెన్నై అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. 15 ఆపరేషన్స్‌తో కొన్ని నెలల పాటు నేను హాస్పిటల్‌లో వుండవలసి వచ్చింది. మా నాన్న గారు ఆపరేషన్స్ కొరకు 25 లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు.

 

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి తిరిగి విశాఖపట్టణంకు వచ్చి ప్రతినెల చెకప్ కొరకు చెన్నై వెళ్తూ వాకర్ సహాయంతో నడిచేదానిని. ఈ స్థితిలో ఒక రోజు మా ఇంటి దగ్గర ఉన్న "శ్రీదేవి" ఆంటీ ధ్యానం నేర్పించే వెంకట్ సార్‌ను (డాక్‌యార్డ్ ఎంప్లాయి) పరిచయం చేసారు.

 

వారు "ధ్యానం అంటే ఏమిటి?" అది చేస్తే ఏం జరుగుతుందో వివరించి నాతో గంటసేపు ధ్యానం చేయించారు. ఈ విధంగా నా ధ్యాన జీవితం ప్రారంభమైంది!

 

సుమారు రెండు నెలల పాటు ధ్యానం చేసిన తరువాత నేను నా గత జన్మలను తెలుసుకున్నాను! ఒకానొక జన్మలో నాకు మా చెల్లితో వున్న సంబంధాన్ని కూడా తెలుసుకున్నాను. ధ్యానం చెయ్యకముందు ప్యాంట్ కూడా తొడుగుకోలేనంతగా వాచిపోయి ఉన్న నా కుడికాలు నుండి ఒక రోజు అధికంగా చీము కారి 105డిగ్రీల జ్వరం కూడా వచ్చింది.

 

డాక్టర్ దగ్గరకు వెళ్తే యాంటీబయోటిక్ ట్యాబ్‌లెట్స్ ఇచ్చి వారం రోజులు వాడమని చెప్పారు. కానీ నేను నా తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని "ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను; అలా తగ్గకపోతే మందులు వాడుతాను" అని చెప్పాను. వారు చాలా ఖంగారు పడ్డారు కానీ నాకు ఒక అవకాశం ఇచ్చారు.

 

అయిదు రోజుల పాటు ధ్యానంలో వుంటూ పళ్ళ రసాలు మాత్రమే త్రాగి పడుకునే దానిని. రెండు రోజులకు నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చి మూడవ రోజు రాత్రి నా కుడికాలులో వుండే చీము అంతా బయటికి వచ్చేసి అక్కడంతా ఎండిపోయింది! కాలు వాపు కూడా తగ్గడం మొదలయ్యింది!

 

ఇది అంతా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు రాత్రి లేచి గెంతాలని కూడా అనిపించింది. ధ్యానంలో విశ్వమయప్రాణశక్తిని తీసుకుంటూ మందులు లేకుండా నా అంతట నేనే నా గాయాన్ని తగ్గించుకోవడం నాకు ఒక అద్భుతంలా అనిపించి మనలో మనకు తెలియని ఏదో శక్తి దాగి వుందని తెలుసుకున్నాను. ఆ తరువాత నుండి ఇప్పటి వరకూ రోజూ ధ్యానం చేస్తూ ఎన్నెన్నో క్రొత్త క్రొత్త విషయాలను వెంకట్ సార్ ద్వారా తెలుసుకుంటూ, గ్రూప్ మెడిటేషన్ చేస్తూ, ఆత్మ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ తెలిసిన వాళ్ళకు జ్ఞానం నేర్పిస్తూ జీవితం గడుపుతున్నాను.

 

ఈ క్రమంలో ఒకరోజు " నేను ఎందుకు ఈ మార్గంలోకి ఆకర్షించబడుతున్నాను? నా స్నేహితులందరూ ప్రాపంచిక జీవితంలో స్థిరపడ్డారు కానీ నాకెందుకు ఇలా జరుగుతోంది?" అన్న ప్రశ్నలు నాలో పుట్టాయి.

 

అప్పుడు ధ్యానంలో ప్రపంచంలో భూకంపాలు, అగ్ని పర్వతాల ప్రేలుళ్ళు మరి సునామీలతో ప్రజలు చనిపోతున్నట్లుగా కనిపించింది. తరువాత పత్రీజీ కనిపించి" ఇవన్నీ సంభవించకుండా ఉండాలంటే మనం అందరం ధ్యానం చెయ్యాలి" అని చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్నాక నెను ఎందుకు ఈ మార్గంలోకి వచ్చానో అర్థం అయ్యింది.

 

ప్రతిరోజూ నేను మా ఇంటి దగ్గరలో వున్న "వైశాఖి పార్కు" లో ఉన్న పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ అక్కడ వచ్చినవాళ్ళతో నా అనుభవాలు పంచుకుంటూ వుండేదానిని! హుద్ -హుద్ తుఫాన్ తరువాత పత్రీజీ ఆ పిరమిడ్ దగ్గరకు వచ్చి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నా ప్రక్కనే కూర్చొని .. ఒక స్నేహితుడిలా ఎన్నో విషయాలు మాట్లాడి "ఏమైనా సందేహాలు వున్నాయా?" అని అడిగారు. నా మెదుడు ఏమీ సమాధానం చెప్పలేదు! ఈ రోజంతా చాలా ఆనందంగా అనిపించింది.

 

ఇప్పుడు నా కాలు పూర్తిగా బాగుపడింది. అన్ని రకాల డ్రెస్సులు వేసుకుంటూ, నా జీవితాన్ని నేను ఎలా గడపాలని అనుకున్నానో అలాగే హాయిగా గడుపుతూ వైజాగ్‌లో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. డాక్టర్లూ మరి మందులూ లేకుండా నిత్యం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జనసాంగత్యం చేస్తూ ఆనందంలో గడుపుతున్నాను.

 

నా జీవితాన్ని ఈ మార్గంలోకి తీసుకువచ్చిన పత్రీజీకి శతకోటి వందనాలు! మరి నన్ను ధ్యానం వైపుకు ప్రోత్సహించిన శ్రీదేవి ఆంటీకీ, వెంకట్ సార్‌కూ, మా చెల్లెలు సునీతకూ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

 

నా జీవిత అనుభవాలను ఇతరులకు తెలియపరచి నా ద్వారా మిగతా వారిని ధ్యానంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూన్న "డా||GK" గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

వినీలా

రాజమండ్రి

సెల్: 9533963152, 9951335700

Go to top