"మౌనధ్యానం .. బ్రహ్మాండంగా చేయవచ్చు"

 

నా పేరు "చంద్రమోహన్". తెలంగాణా రాష్ట్రం మహబూబ్‌నగర్ కు చెందిన నాకు 2000 సంవత్సరంలో ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యానపరిచయం జరిగింది. అప్పటికి నా పరిస్థితి..

గత రెండు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ పాస్ కాలేక ఇంట్లో బయటా అందరితో చీవాట్లు తినడం; చదువు మీద ఇష్టం లేక .. ఇంట్లో వాళ్ళ తిట్లు భరించలేక ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఇంట్లోంచి పారిపోవాలని గట్టిగా నిర్ణయించుకోవడం. "ఈ జీవితం ఏంటి అసలు? .. మనమెందుకు పుట్టాం?" అని తెగ ఆలోచించే వాడిని.

ఆ సమయంలో నా స్నేహితుడు "శ్రీకాంత్" ద్వారా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయబడిన పత్రీజీ ధ్యానశిక్షణా తరగతికి వెళ్ళాను. ఆ రోజు నేను ధ్యానంలో పొందిన ఆనందాన్ని మాటలలో వర్ణించలేను!

ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ జీవిత పరమార్థం తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూనే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి .. B.Sc మరి MBA పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి జీతంలో "HRఎక్సిక్యూటివ్" గా ఉద్యోగంలో చేరాను!

పత్రీజీ ధ్యాన శిక్షణా తరగతులు ఎక్కడ జరిగినా వారాంతాలలో వెళ్ళి హాజరు అయ్యి వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని అందుకునే వాడిని. అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు నాకు స్ఫూర్తిని కలుగజేసేవి.

2007 సంవత్సరంలో ఉద్యోగరీత్యా నేను బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ కావడంతో సమయం దొరికినప్పుడల్లా "పిరమిడ్ వ్యాలీ" లో జరిగే కార్యక్రమాలలో వాలంటీయర్‌గా పాల్గొనే వాడిని.

ఆ తరువాత 2009 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి "ధ్యానకస్తూరి" పత్రిక నిర్వహణలో పాలు పంచుకుంటూ "అయ్యప్ప","అనిత" మరి"కృష్ణ చైతన్య" గార్ల సహకారంతో "PSSM పబ్లిషింగ్" విభాగం పనులను నిర్వహిస్తున్నాను. పత్రీజీతో కలిసి అనేకానేక ధ్యానప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఆ యా విశేషాలను PSSM వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ ఉన్నాను.

2011 సంవత్సరంలో చెన్నై పిరమిడ్ మాస్టర్ "షాలిని"తో నా వివాహం జరిగిన తరువాత పత్రీజీ ఆదేశం మేరకు 2012 నుంచి పిరమిడ్ వ్యాలీలోనే ఉంటూ .. "బుక్ స్పేస్" ను నిర్వహిస్తున్నాను.

ఈ క్రమంలో "7 రోజుల పాటు కేవలం నీళ్ళు మాత్రమే త్రాగి మౌనధ్యానం చెయ్యాలి" అని నాకు అంతర్గత సందేశం వచ్చింది. అందుకు పత్రీజీ అనుమతిని కోరగా "బ్రహ్మాండంగా చేయవచ్చు" అని ప్రోత్సహించారు. దాంతో 2015 సెప్టెంబర్ 1 వతేదీ నుంచి 7 రోజుల పాటు కేవలం నీటిని త్రాగుతూ .. మౌనంగా ఉంటూ, ధ్యానం చేసుకుంటూ నా శరీరంలో జరిగే మార్పులనూ మరి ఆలోచనలనూ సునిశితంగా గమనిస్తూ వచ్చాను.

వారం రోజులు గడిచేసరికి శరీరం అంతా చాలా తేలికగా మారిపోయింది. నీటిపై ఎంతో గౌరవం ఏర్పడుతూ అది నా శరీరంలోని కణ కణంలో చేరగానే పూర్తి క్రిస్టల్ వాటర్‌గా మారిపోవడం నేను గమనించాను!

నా రోజువారీ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ .. ధ్యానానికీ మరి స్వాధ్యాయానికీ ఎక్కువ సమయం కేటాయించే వాడిని. శరీరానికి నీరు, మనస్సుకు ఉల్లాసం, బుద్ధికి జ్ఞానం, ఆత్మకు ధ్యానం .. ఇలా సమపాళ్ళలో అందిస్తూ నన్ను నేను ఒక క్రొత్త మానవుడిలా ఆవిష్కరించుకున్నాను.

చిట్టచివరి రోజు రెండు గంటల అఖండధ్యానం తరువాత ఆకాశమంత ఎత్తులో బుద్ధుడు కనపడటంతో నా శరీరం అంతా ఆనందంతో నిండిపోయింది! ఆ రోజు నుంచి నాలో వచ్చిన మార్పు .. ప్రతి ఒక్కరిలో బుద్ధత్వాన్ని చూడడం .. మరి వారిలోని బుద్ధత్వం పట్ల గౌరవభావంతో మెలగడం!

ఏడు రోజుల మౌనధ్యాన స్వాధ్యాయ సాధనలో నా వాక్‌క్షేత్రం శుద్ధి చేయబడి .. నా ఆలోచనలపై నేను నియంత్రణను పొందగలిగాను. నాలో ఆత్మవిశ్వాసం పాలు మరింత పెరిగి నా ఉద్వేగాల పట్ల నాకు స్పష్టమైన ఎరుక లభించింది. ఆకలివేసినంత మటుకే అన్నం తినడం .. అవసరమైనంత వరకే మాట్లాడటం నాకు అలవాటు అయ్యాయి.

ఇలా నా ఆత్మోన్నతికి సరియైన సమయంలో తగు సూచనలు అందిస్తూ నన్ను అనుక్షణం సరియైన మార్గంలో నడిపిస్తూన్న పత్రీజీకి ఆత్మప్రణామాలు అర్పించుకుంటున్నాను.

 

చంద్రమోహన్ - మహబూబ్‌నగర్

Go to top