" నా జన్మ లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నాను "

 

నా పేరు "భీమన్నసాగర్". నేను 2006 సంవత్సరం డిసెంబర్ నెలలో ధ్యానంలోకి వచ్చి ధ్యానశక్తిని తెలుసుకుని వెనువెంటనే ధ్యానప్రచారం మొదలుపెట్టాను.

ఈ క్రమంలో ఒక రోజు నేను మా ఇంట్లో ఉన్న 2'x2' పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేసుకుంటూండగా వచ్చిన ఆస్ట్రల్ మాస్టర్స్ సందేశాన్ని ఆదేశంగా తీసుకుని "పిరమిడ్ నిర్మాణమే నా జీవిత పరమార్థం" అని తెలుసుకున్నాను.

ఆ తరువాత శ్రీశైలంలో జరిగిన ధ్యానయజ్ఞం లో ఏర్పాటు చేసిన "పిరమిడ్ వర్క్‌షాప్" లో చేరి పిరమిడ్ నిర్మాణ విధానాన్ని శాస్త్రీయంగా నేర్చుకున్నాను.

"ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేషన్ మరి వెల్డింగ్ వర్క్స్" వృత్తిలో ఉన్న నేను ఇంటికి తిరిగి వస్తూనే మా ఇంటిపై ఖచ్చితమైన కొలతలతో కూడిన 15'x15' పిరమిడ్ నిర్మాణం చేశాను.

మేడమ్ స్వర్ణమాల పత్రిగారు విచ్చేసి మా పిరమిడ్‌ను ప్రారంభోత్సవం చేసి దానికి "ధ్యానసాయి పిరమిడ్ సెంటర్" అని నామకరణం చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది.

ఆ తరువాత "బడంగ్‌పేట" లో మా అబ్బాయి చదివే "సిల్వర్ డ్రాప్స్ హైస్కూల్" యజమాన్యంతో మాట్లాడి వారికి పిరమిడ్ ధ్యానం యొక్క గొప్పతనాన్ని చెప్పి వారి స్కూల్ ప్రాంగణంలో "15'x15' సిద్ధార్థ పిరమిడ్" ను నిర్మించడం జరిగింది.

జంటనగరాలలోనే మొట్టమొదటిసారిగా ఒక స్కూలులో నిర్మించబడి .. ఎందరో విద్యార్థులకు వరదాయినిగా మారిన సిద్ధార్థ పిరమిడ్ ధ్యానమందిరాన్ని పత్రీజీ వచ్చి ప్రారంభోత్సవం చేసి అక్కడి విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందించారు. "పిరమిడ్ నిర్మాణకర్త" గా నేను ఆ రోజు స్టేజీపై నా ఆనందాన్ని అందరితో పంచుకున్నాను.

ఆనాటి నుంచి సిల్వర్ డ్రాప్స్ హైస్కూల్‌లో అన్ని సెలవు రోజుల్లో మరి పౌర్ణమి రోజులలో క్రమం తప్పకుండా ధ్యాన తరగతులు జరుగుతున్నాయి.

ఇలా జంటనగరాలలోని పాఠశాలల్లో మొట్టమొదటి ధ్యానపిరమిడ్‌ను నిర్మించిన రికార్డుతో నేను .. ఇంకా "108 పిరమిడ్‌లు నిర్మించాలి" అని మా వర్క్‌షాప్‌లోనే 40 మంది మీర్‌పేట మాస్టర్లతో కలిసి సంకల్ప ధ్యానం చేశాను.

అనుకున్నట్లుగానే జంటనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాలలో విస్తృతంగా తిరుగుతూ .. ఇప్పటి వరకు 108 పిరమిడ్‌ల నిర్మాణాలను పూర్తిచేసాను! ప్రతి పిరమిడ్ ప్రారంభోత్సవం నాకు ఒక పండుగలా గడిచేది!

మనం ఏ జన్మలక్ష్యం కోసం ఈ భూమి మీద పుట్టామో దానిని పూర్తిచేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను.

 

భీమన్న సాగర్ - మీర్‌పేట - హైదరాబాద్
సెల్ : +91 98667 96962

Go to top