" ఇంటిపై పిరమిడ్ .. కుటుంబంలో సామరస్యం"

 

నా పేరు "రత్నకుమారి". నేను 2007 సంవత్సరంలో శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు గుడి ముందు "పిరమిడ్ ధ్యానం ఉచితంగా నేర్పబడును" అన్న బోర్డు చూసి లోనికి వెళ్ళాను.

అక్కడ ధ్యానకేంద్రం నిర్వాహకులు చెప్పినట్లు ధ్యానం చేసి ఎంతో గొప్ప అనుభూతిని పొందాను. ఆ తరువాత ఒక ఫంక్షన్ కోసం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు అక్కడ మా బంధువు "ప్రమీల" గారు "ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను నాకు ఇచ్చారు. అది చదివి ధ్యానప్రచారంలోని గొప్పదనాన్ని తెలుసుకుని మా ఇంటి చుట్టుప్రక్కల ప్రదేశాలలో ధ్యానప్రచారం చేస్తూ వచ్చాను.

ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని "ఉసిరికాయల పల్లి" లో కట్టిన 35'x35' పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రీజీ వస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళాను.

అప్పుడే నాకు కూడా "మా ఇంటిపై పిరమిడ్ కట్టాలి" అన్న సంకల్పం బలంగా కలిగింది. దానికి మా ఇంట్లో వాళ్ళందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకావడంతో పాటు .. నన్ను ధ్యానప్రచారానికి కూడా వెళ్ళవద్దని ఆంక్షలు పెట్టారు. దాంతో "పిరమిడ్ కట్టాలి" అన్న తపన నాలో మరింత తీవ్రం అయ్యి .. ఇల్లందు పిరమిడ్ మాస్టర్ "సంకల్పాల పుల్లారావు" గారితో సంకల్పం చేయించుకున్నాను.

ఖమ్మం మాస్టర్లు నలజాల సరోజ మేడమ్, రఘురామ్ ప్రసాద్ మరి పిరమిడ్ ఇంజనీయర్ రామారావు గార్లు నా అభ్యర్థన మేరకు మా ఇంటికి వచ్చి పిరమిడ్ నిర్మాణం కొరకు మా వారిని ఒప్పించడానికి వారితో మూడు గంటలసేపు మాట్లాడారు. అయినా వారు పిరమిడ్ నిర్మాణానికి "ససేమిరా" అన్నారు.

నేను ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా నా బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రామారావు గారి సహకారంతో మా ఇంటి పై 12'x12' పిరమిడ్ నిర్మాణాన్ని ప్రారంభించాను. 2013 నవంబర్ 27వ తేదీన భీమవరం పిరమిడ్ మాస్టర్ తటవర్తి రాజ్యలక్ష్మి గారు వచ్చి దానికి "ఆనంద పిరమిడ్" అని ప్రారంభోత్సవం చేశారు.

విచిత్రం ఏమిటంటే అంతవరకూనా కార్యక్రమాలపట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్న మా వారు, కొడుకు, కోడలు అందరూ పిరమిడ్ ప్రారంభోత్సవం అయిన నాటినుంచి నాకు పూర్తి అనుకూలంగా మారిపోయి .. నా పనుల పట్ల తమ గౌరవాన్ని చూపించడం మొదలుపెట్టారు! ఇదే ధ్యానశక్తి యొక్క గొప్పదనం!

ఇదివరలో నేనేం చేసినా తప్పుపట్టే వాళ్ళంతా కూడా నాతో ప్రేమాభిమానాలతో ఉంటూ ఇంటిని స్వర్గధామంలా మార్చేశారు! నేను చెయ్యాల్సిన పనిపట్ల లక్ష్యంతో మౌనంగా ఉంటూ నా ధ్యానశక్తితో నేను సాధించిన ఘనవిజయం మా ఇంటిపై "ఆనంద పిరమిడ్" నిర్మాణం.

మా గ్రామంలో ఉన్న "వెంకటేశ్వర రావు" అనే వ్యక్తి తన ఆరు సంవత్సరాల బాబుకి "గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయి .. ఆపరేషన్ చేయకపోతే బాబు ప్రాణాలకే ముప్పు .. మరి ఆపరేషన్ చెయ్యాలంటే లక్షలు ఖర్చు అవుతాయి" అని తెలియడంతో ఏమీ పాలుపోక మా ఆనంద పిరమిడ్ కు వచ్చి రోజూ తాను ధ్యానం చేస్తూ బాబును అందులో పడుకోబెట్టేవాడు.

ఆరు నెలల తరువాత పరీక్ష చేయిస్తే "ఒక్క రంధ్రం మాత్రమే ఉంది .. అది కూడా దాదాపుగా మూసుకుపోయింది" అని డాక్టర్లు చెప్పారు! ఆ బాబు ఇప్పుడు చాలా అరోగ్యంగా ఉండి చక్కగా స్కూలుకు వెళ్తున్నాడు.

"ప్రతి ఒక్క ధ్యాని కూడా తమ తమ ఇళ్ళపై పిరమిడ్‌లు కట్టుకోవడం వల్ల ఆ ఇళ్ళు శక్తిక్షేత్రాలుగా మారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు నెలకొంటాయి" అని నేను స్వానుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను.

ఇంత గొప్ప పిరమిడ్ ధ్యానాన్ని అందరికీ అందజేస్తూన్న పత్రీజీ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

రత్నకుమారి - బయ్యారం - ఖమ్మంజిల్లా
+91 95058 98621

Go to top