"డా||జేమ్స్ జెరెబ్"

 

అమెరికా దేశానికి చెందిన నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డా||జేమ్స్ జెరెబ్ గారు .. "మానవ చైతన్యానికీ మరి అనంత చైతన్యానికీ మధ్య వారధిగా నిలిచే ‘కళ’ .. ప్రతి ఒక్కరిలో నిగూఢంగా దాగి ఉన్న దివ్యత్వాన్ని వెలికి తెచ్చి దానిని అనంత చైతన్యంతో మమేకం చేస్తుంది" అని చెబుతారు. Art Historian గా Museum Educator గా తమ కళా హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ .. ప్రపంచ దేశాలు పర్యటించే డా||జేమ్స్ .. భిన్న సంస్కృతులకు చెందిన కళలను అధ్యయనం చేస్తూ .. రంగుల చిత్రాలు, కుడ్య చిత్రాలు, శిలలతో నమూనాలు ఏర్పరుస్తూ తమ "Star Dreaming" ప్రాజెక్ట్ ద్వారా అమెరికా దేశంలోని "సాంటా ఫె" నగరం సమీపాన 30 ఎకరాల స్థలంలో "Temple of Cosmos"ను నిర్మించి "Transformative Images for Heightened Awareness"ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

"మీ ఆధ్యాత్మిక ప్రవేశం ఏ విధంగా జరిగింది?"
"నేను 1997వ సంవత్సరంలో ఉన్నత తలాల మాస్టర్లచే ప్రాచీన కళాసంస్కృతులకు చెందిన ఒక మార్మిక అనుభవాన్ని పొందాను!

"వాళ్ళు నాకు కాన్వాస్‌పైన మరి రాళ్ళపైన చిత్రాలను గీసే విద్యను ప్రసాదించి ‘ఇంత వరకు నువ్వు చదివిన చదువు, నువ్వు చేస్తోన్న వృత్తి తాలూకు జ్ఞాపకాలనన్నింటినీ సమూలంగా వదిలివేసి .. ఇక నుంచి ఈ మార్మిక చిత్రకళను విశ్వవ్యాప్తం చెయ్యాలి .. అదే నీ జన్మ లక్ష్యం’ అని తెలియజేశారు.
"వారి సూచనలను విశ్వసించి .. ‘ఆర్కేంజల్ రాఫేల్’ అనే ఒకానొక ఉన్నత తలాల మాస్టర్ యొక్క మార్గదర్శకత్వంలో సృష్టియొక్క సృజనాత్మక మూలంతో అనుసంధానమై అవిదితమైన వాటిని అన్వేషిస్తూ కొన్ని కొన్నిసార్లు భయానకమైన అనుభవాలకు కూడా గురి అయ్యాను. నా భౌతిక జీవితాన్ని సమూలంగా రూపాంతరీకరించుకుంటూ క్రమంగా నేను చిత్రలేఖనం, ముద్రణ, జీవరాళ్ళ అమరికలలో సృజనాత్మక కళాకారుడిగా ఎదిగాను.

"ఇలా సృష్టికి అధీనుడిని అవుతూ ఉన్న కొద్దీ నా జీవితంలో మరిన్ని అద్భుతాలు సంభవిస్తూ వచ్చాయి. అన్నింటిలోకెల్లా అద్భుతం .. ఏ ఆభరణాలూ మరి గొప్పదనం లేకుండా ఒక చిన్న నీలి ఏనుగు పిల్లలాగా ‘గణేశ్ మహరాజ్’ నాకు దివ్యదర్శనం ఇవ్వడం!

"ఆ తరువాత నుంచే ఈ నూతన ప్రేమాస్పద నిర్దేశకత్వంలో నేను అసాధరణ సృజనాత్మకతనూ మరి ఆధ్యాత్మిక వివేకాన్నీ పొందాను. వినాయకునితో కలిసి ధ్యానాలు ఎక్కువ కావడంతో ఆయన నిర్దేశకత్వంలో 125 గణేశ చిత్రాలు నేను రూపొందించాను. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘గణేశ గ్రీటింగ్ కార్డులు’ అన్నీ నేను రూపొందించినవే!"
"మీకు కళల పట్ల ఆసక్తి చిన్నతనం నుంచే ఉందా?"
"లేదు! నేను ఒకసారి మా తాతగారితో కలిసి నేను అరిజోనాలోని సెడోనాకు వెళ్ళాను. అక్కడ ఆయన .. ‘నువ్వు నీ గురించి ఏమి అనుకుంటావో దానిగా మారుతావు’ అని చెప్పి చిత్రకళవైపు నన్ను ప్రోత్సహించారు. "అది మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఆటోరైటింగ్, ఛానెలింగ్ వంటి అనుభవాలను పొందుతూ ‘ఈ అనంత సృష్టి మూలంతో మనం అనుసంధానించబడడానికి కళ అన్నది ఒకానొక ఉపకరణం’ అన్న దివ్య అవగాహనను పొందాను.

"అంతకు ముందు నాకు ఎంత మాత్రం పరిచయం లేని గణేశ్ ప్రతిరూపం ఒక చిన్ని నీలిరంగు ఏనుగు పిల్లలా దివ్యదర్శనంలో కనబడడం మరి ‘ఏదో ఒకరోజు నువ్వు భారతదేశం వెళ్తావు’ అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజంగానే నేను ఇప్పుడు GCSS లో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చాను. ఇదంతా కూడా దివ్యప్రణాళికలో భాగంగా నేను తెలుసుకున్నాను.

"మీ కళారూపాలను దాని ఆధారంగా రూపొందిస్తారు?"
"నా కళారూపాలలో చాలావరకు వివిధ మతాలకూ, పురాణాలకూ మరి దేశాలకూ చెందిన పవిత్ర నిర్మాణాలే అయి ఉంటాయి. వాటన్నింటినీ నేను నా దివ్యదర్శనాలలో దర్శించి .. నా అంతరంగంలో దృశ్యరూపాలుగా చిత్రీకరించుకున్నవే!"

"మీ స్టార్ డ్రీమింగ్ ప్రాజెక్ట్ గురించి?"
" ‘స్టార్ డ్రీమింగ్’ అన్నది ఉన్నత తలాల మాస్టర్ల నిర్దేశకత్వంలో నేను చేపట్టిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్! ఇందులో భాగంగా నేను న్యూ మెక్సికో రాష్ట్రంలోని సాంటా ఫె లో 22 ఎకరాల విస్తీర్ణంలో ‘కాంతి వలయం - Temple of Illumination' ను నిర్మించాను. "ఇందులో కొన్ని వేల టన్నుల రాళ్ళను చేతితో పరచి .. సూర్యుడు, చంద్రుడు మరి ఇతర నక్షత్ర లోకాలతో వాటిని పవిత్ర అనుసంధానం జరిపి అనన్యమైన నమూనాలను రూపొందించాను. ‘విశ్వ ఆలయాలు’ - ‘Temples of Cosmos' అయిన ఈ నమూనాలు నాకు ఆధీనత, విశ్వాసం, ప్రేమ మరి వినయ సంపదను అందించాయి."

Go to top