"ధ్యానం ద్వారా అన్నీ సాధ్యమే"

 

నా పేరు "కీర్తి". MBA పూర్తి చేసిన నేను మా నాన్నగారయిన కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ M.C.ఓబయ్యగారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. కాలేజీ చదువును సమర్ధవంతంగా పూర్తి చేసుకుంటూనే .. ధ్యానంలో నేను ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నా వివాహం కడప పట్టణానికి చెందిన ఒకానొక సంపన్న కుటుంబంలోని ఇంజనీయర్‌తో జరిగింది. నా సంసార జీవితం ఆనందంగా సాగుతూ ఉండగా .. నాకు రెండుసార్లు గర్భధారణ జరిగి .. కారణమే తెలియకుండా అబార్షన్‌లు అయ్యాయి. నేను చాలా బాధపడిపోయి "ఎందుకు ఇలా జరుగుతోంది?" అని మా నాన్నగారిని అడిగాను. దానికి మా నాన్నగారు "గంటా, రెండు గంటలు ధ్యానం చేసినంత మాత్రాన మనం కోరుకున్నవి అన్నీ జరుగవు. నీ సమస్యకు పరిష్కారం లభించాలంటే కనీసం నువ్వు రోజుకు ఆరుగంటలకు తక్కువ కాకుండా ధ్యానం చెయ్యమ్మా!" అని సలహా ఇచ్చారు.

మా నాన్నగారి సలహా మేరకు నేను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ కొద్దిరోజులకే గర్భం ధరించి 10వ నెలలో పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చాను! వాడు రెండు సంవత్సరాల వయస్సుతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు మళ్ళీ గర్భధారణ జరిగింది.

ఏడవనెలలో స్కానింగ్ చేసి డాక్టర్ "గర్భంలోని బిడ్డ యొక్క చిన్నప్రేగు ముడుచుకుని పోయి వాపు ఏర్పడింది; లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి ‘డైలేటెడ్ డియోడినమ్’ అనే సమస్య వస్తుంది. పుట్టాక ఈ బిడ్డతో మీరు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక అబార్షన్ చేయించుకోండి" అని చెప్పారు. నలుగురు గైనకాలజిస్ట్‌లు కూడా ఇదే విషయాన్ని నిర్థారణ చెయ్యడంతో మాకు ఏమీ పాలుపోలేదు!

చెన్నై, హైదరాబాద్‌లలోని సూపర్ స్పెషలిస్ట్‌లకు కూడా చూపించగా "డెలివరీ అయిన 24 గం||లలోపు బిడ్డకు సర్జరీ ద్వారా ప్రేగును కట్ చేసి జాయింట్ చెయ్యాలి; చాలా రిస్క్‌తో కూడుకున్నదే అయినా .. బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇందుకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి" అని చెప్పారు. డాక్టర్ల సూచనలను అనుసరిస్తూ నా భర్త హైదరాబాద్‌లో మేము ఉండటానికి ఇల్లు కూడా తీసేసుకున్నారు.

నేను మాత్రం మా నాన్నగారి సలహా మేరకు ధ్యానం చేసి నాబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని సంకల్పిస్తూ సద్గురువుల సహాయం కోరుతూ ధ్యాన సాధనను మరింతగా పెంచాను. ఇంతలో డెలివరీకి సమయం దగ్గర పడడంతో నా భర్త నన్ను హైదరాబాద్‌కు తీసుకుని వెళ్ళడానికి కారు తీసుకుని వస్తూండగా అది మధ్యలోనే చెడిపోయింది.

ఆ తరువాత వేరే కారు కోసం బైక్‌లో వెళ్తూండగా .. అది కూడా చెడిపోయింది. ఇంతలోనే నొప్పులు మొదలు కావడంతో నన్ను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తీసుకునిపోగా వాళ్ళు "ఇక్కడ చాలా కష్టం; అంబ్యులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకుని వెళ్ళి అక్కడికక్కడే డెలివరీతో పాటు పాపకు సర్జరీ కూడా చేయించుకోండి" అని సలహా ఇచ్చారు.

అయితే మా నాన్నగారు డాక్టర్లను పదే పదే అభ్యర్థించగా వారు నాకు డెలివరీ చేశారు. వెంటనే పాపకు స్కానింగ్ చేసి చూడగా అంతకు ముందు అనుకున్నట్లుగా పాప చిన్న ప్రేగులో ఎలాంటి సమస్య కనపడలేదు! అంతా సవ్యంగా ఉండడంతో పాటు పాప హుషారుగా ఆడుకుంటూ పాలు కూడా మామూలుగా త్రాగి జీర్ణించుకోవడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు!

"సంకల్ప శక్తితో కడుపులో పెరుగుతూన్న బిడ్డను కూడా రక్షించుకోవచ్చు" అని నా అనుభవం తెలియజేసింది. ఇలా ధ్యానశక్తితో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూసిన మా కుటుంబ సభ్యులం అంతా చాలా ఆనందించాం! ఈ సంఘటన ద్వారా నేను ఎలాంటి సమస్యనైనా క్రమంతప్పని ధ్యాన సాధనతో అధిగమించవచ్చనీ .. హాయిగా ఆనందమయ జీవితాన్ని జీవించవచ్చనీ .. అసాధ్యాలన్నింటినీ సుసాధ్యాలు చేసుకోవచ్చనీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

ఈ క్లిష్ట పరిస్థితులలో నాకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ .. ఆత్మశక్తితో నన్ను ముందుకు నడిపించిన మా నాన్నగారికీ, నా సద్గురువులు షిరిడీ సాయిబాబా మరి బ్రహ్మర్షి పత్రీజీ గార్లకూ ప్రత్యేక కృతజ్ఞతలు.


M.కీర్తి - కడప - ఆంధ్రప్రదేశ్

-+91 94406 78866.

Go to top