"కసారా"

కెనడా దేశానికి చెందిన 21 సంవత్సరాల లేతప్రాయంలో ఉన్న కసారా .. ఆధ్యాత్మిక బోధకురాలిగా, నూతన యుగ తత్త్వవేత్తగా తమ తరానికే మార్గదర్శనం వహిస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు .. చిన్నతనం నుంచే వారు తమ అసాధారణ ఆధ్యాత్మిక ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ, ధ్యానం గురించిన CDలు పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. వివిధ దేశాలలో వర్క్‌షాపులు, సెమినార్లు, లెక్చర్లు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే కసారా గారితో కాస్సేపు ..

"ఇంత చిన్నతనంలో మీకు ఆధ్యాత్మికత పట్ల అభిరుచి ఎలా కలిగింది?"
"మూడుసంవత్సరాల వయస్సు నుంచే నేను మా నాన్నగారితో కలిసి ధ్యానం చేసేదాన్ని. నాకు గుర్తున్నంత వరకు బాల్యంలో నేను ‘ఏంజెలికా మంత్రం’ తో ధ్యానం చేయడాన్ని ఇష్టపడేదాన్ని.
"అత్యున్నతమైన ఆధ్యాత్మిక నేపధ్యం కలిగి ఉన్న ‘కాయా ముల్లర్’ మరి ‘క్రిస్టీన్ ముల్లర్’లు నా తల్లిదండ్రులు. వారు కూడా ఇంతకు మునుపు GCSSలో పాల్గొన్నారు. నేను వారితో కలిసి అనేక దేశాలు పర్యటిస్తూ, ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ .. ఆత్మజ్ఞానాన్ని విస్తరించుకుంటున్నాను."

"కలల శాస్త్రం గురించి తెలియజేయండి!"
"మానవులందరికీ, ధ్యానం మరి కలల సంకేతాలను గురించిన జ్ఞానాన్ని శాస్త్రీయంగా అందజేయడమే నా ప్రణాళిక! ‘కలలు కనడం’ అంటే మన అంతర్గత చైతన్యాన్ని మనం స్వయంగా దర్శించడం. సాధారణంగా మనం మన అచేతనా జ్ఞాపకాలనే కలలుగా కంటాం. నిద్రించబోయే ముందు మనకు ఉన్న సందేహాలను గురించి మనల్ని మనం ప్రశ్నించుకుంటే .. నిద్రలో వాటికి సరియైన సమాధానాలను పొందుతాం.

"మనం మన కలలపట్ల అత్యంత ఎరుక కలిగి వుండి వాటిని గౌరవించడం మొదలుపెడితే మన జ్ఞాపకాలలోని సకారాత్మకతనూ మరి నకారాత్మకతనూ మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం.

"జీవితంలో కలలు సంకేతాలకు అంతటి ప్రాధాన్యత ఉంది. నేను చదివిన `The Souls Code - The Dictionary' అన్న పుస్తకం కలల విశ్లేషణకు ఎంతగానో తోడ్పడుతోంది."

" ‘ఏంజెలికా మంత్ర’ అంటే ఏమిటి?"
"మనకు ఇష్టమైన ఒక ఏంజెల్ (దేవదూత) .. ఎవరైనా సరే వారి నామాన్ని పదే పదే ఉచ్ఛరించినప్పుడు అది మన చైతన్యాన్ని సకారాత్మకంగా మార్పు చెందించడం మొదలుపెడుతుంది.

"కాయా ముల్లర్ రచించిన `The Book of Angels - Hidden Secrets' అన్న పరిశోధనాత్మక గ్రంథంలో ఏంజెల్స్ గురించిన ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి.

"నేను 72 ఏంజెలికా మంత్రాలను పఠించగలను. ఏంజెలికా మంత్రం ద్వారా మనం మన చైతన్యాన్ని విస్తరించుకోవచ్చు మరి మన చైతన్యాన్ని ఆ ఏంజెల్ యొక్క చైతన్యంతో మమేకం చేయవచ్చు!"

"జీవితం పట్ల మీ అవగాహన ఏమిటి?"
"మన జీవితంలో ఒక్కోసారి మనల్ని బాధించే లేక కోపానికి గురిచేసే ఒకానొక అంశమే నిజానికి మన గురించి మనం అవగాహన చేసుకోవడానికి గాఢమూలంగా ఉంటుంది కనుక ఆ దిశగా సమస్యలను గురించి ఆలోచించి వాటికి పరిష్కారాన్ని పొందాలి."

"మీరు రచించిన పుస్తకాలు?"
" `Spiritual Diary of a Nine Years Child' ఇది క్రొత్తతరాలను ఉన్నతంగా అర్థం చేసుకోవడంలో పిల్లలకూ, తల్లితండ్రులకూ మరి వైద్యులకూ తోడ్పడుతుంది. "మనలో అనంతంగా నిక్షిప్తమై ఉన్న స్వీయ సామర్థ్యం సంపూర్ణంగా ఉపయోగింపబడాలి కనుక యుక్తవయస్సులో అడుగుపెట్టే వారంతా కూడా ఆధ్యాత్మిక అవగాహనను పొంది .. జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి నేను రచించిన `The SpiritualDiary of a Teenager' అన్న పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది!"

Go to top