"సింథా గొంజాలెజ్"

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ వక్త మరి నవీన ఆధ్యాత్మిక గ్రంథ రచయిత్రి సింథా గొంజాలెజ్ .. "యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్" నుంచి "ట్రాన్స్‌పర్సనల్ సైకాలజీ"లో డాక్టరేట్ పట్టాను పొందారు. గత 30 సంవత్సరాలుగా "ఫ్యామిలీ కౌన్సిలర్‌"గా మరి "వ్యక్తిత్వ వికాస నిపుణురాలి"గా అనేకానేక అంతర్జాతీయ వేదికలపై ఉపన్యసిస్తూ .. శ్రోతలను ఉన్నత చైతన్య తలాలకు మరల్చి వారిని సూక్ష్మతర శక్తులతో శృతి చేస్తున్నారు. 17సంవత్సరాల పాటు దుబాయ్‌లో పనిచేసిన సింథా .. "స్పాంటేనియస్ పెయింటింగ్ టెక్నిక్" అనే కళతో సంగీతాన్ని మేళవిస్తూ .. వ్యక్తులను గాఢ చైతన్యస్థితికి చేర్చడం ద్వారా స్వీయ సత్యం పట్ల వారికి దివ్యత్వపు అవగాహనను కలుగచేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తిలో ఉన్న లైంగిక ఉద్వేగ జాగృతిని .. ఆధ్యాత్మిక చైతన్యంతో మేళవించి .. వారిలో లైంగిక స్వస్థతను పెంపొందించి .. తద్వారా సమాజంలో జరిగే లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు అంటూన్న సింథా .. ఆ దిశగా తమ క్షేత్ర పరిశోధనా ప్రయోగాలను చేపడుతున్నారు. లైంగికతలోని పవిత్రతను అతి సున్నితంగా వివరించే సింథా గొంజాలెజ్‌తో కాస్సేపు ..

"జీవితంలో సలహాలు ఇవ్వడానికి మరి సరిచేయడానికి అనేకానేక అంశాలు ఉండగా మీరు అతి క్లిష్టమైన, అత్యంత సున్నితమైన మరి సమాజంలో బహిరంగంగా చర్చించడానికి అంతగా గౌరవాదరాలు లేని ‘లైంగిక స్వస్థత’ అన్న అంశాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?"

"అవును .. తప్పకుండా ఉంది! 2003 సంవత్సరంలో నేను ఆఫ్రికాదేశంలోని అమెజాన్ అడవులకు వెళ్ళినప్పుడు .. అక్కడ నేను అనేక మార్మిక అనుభవాలకు గురి అయ్యాను! "ఎన్నెన్నో భయంకరమైన సర్పాలు భౌతికంగానూ మరి దివ్యదర్శనాల్లోనూ అక్కడ నా దగ్గరకు వస్తూండేవి. వివిధ కుండలినీ అనుభవాలను గురించి అవి నాకు ఉపదేశిస్తూ .. ‘లైంగికానుభవం అన్నది అత్యంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవం’ అని విశదీకరించాయి.

"‘మా నుంచి అందుకున్న ఈ సర్ప వివేకాన్ని మధ్య ఆసియా దేశాల్లో విస్తృతంగా ప్రచారం చెయ్యాలి’ అని అవి నాకు తెలిపాయి. "అమెజాన్ అడవుల నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నేను మధ్య ఆసియా దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, కువాయిట్, ఓమన్, బహ్రెయిన్, UAE దేశాలలో పర్యటిస్తూ ఈ విషయాలను ప్రచారం చేస్తున్నాను."

"మధ్య ఆసియా దేశాల సంస్కృతిలో లైంగిక విషయాలను బహిరంగంగా మాట్లాడడం .. అందునా స్త్రీలు దాని గురించి నోరు తెరవడం పూర్తిగా నిషిద్ధం కదా! మీరు అక్కడ ఈ పనిని ఎలా చేస్తున్నారు?"
"అక్కడ లైంగికత గురించి బహిరంగంగా చర్చించడం ఎన్నో ఇబ్బందులకు దారితీసే మాట వాస్తవమే! "అయితే దాని గురించి ‘Healing the Second Chakra -హీలింగ్ ది సెకండ్ చక్ర’ అని చెప్పమని నాకు ధ్యానంలో సందేశం వచ్చింది. "అంతే కాదు .. నాకు గత అనేక సంవత్సరాలుగా సముద్రంలో ఈదటం అలవాటు! అలా ఒకసారి ఈదుతూ ఉండగా ఒక సముద్ర సర్పం నా దగ్గరికి వచ్చి .. నాతో పాటే చాలా సేపు ఈదుతూ ఉండిపోయింది.

"మరుసటిరోజు నేను సముద్రపు తీరంలో ఇసుక తిన్నెలపై పడుకుని ఉండగా ఆ సర్పం నా దగ్గరకు వచ్చి .. ‘నువ్వు చేస్తున్న పనికి నేను నీకు నిర్దేశకత్వం చేస్తాను; అవసరమైనప్పుడు నిన్ను రక్షిస్తాను’ అని తెలియజేసింది. "ఇక అప్పటి నుంచి నేను నా బోధనా కార్యక్రమాలను ముమ్మరం చేశాను. లైంగికతలోని పవిత్రత ‘Sacred Sexuality' .. `Healing the Second Chakra' పేరుతో ఆరువారాల కోర్సుగా వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాను.

"స్త్రీలకూ, పురుషులకూ వేర్వేరుగా .. మరి స్త్రీ, పురుషులు ఇద్దరికీ లైంగికతలోని పవిత్ర అంశాలను శాస్త్రీయంగా బోధిస్తున్నాను. దుబాయి మరి బహ్రెయిన్ దేశాలలో స్త్రీలకు వారి ప్రత్యేక అభ్యర్థన మేరకు నెలకు ఒకసారి ‘తంత్ర’ పేరు మీద సాయంకాలం తరగతులను నిర్వహిస్తున్నాను.

"అంతర్జాలంలో ‘Tantra Tuesday' అనే ‘బ్లాగ్’ ను ఆవిష్కరించి ఈ అంశంపై ప్రత్యేకమైన బ్లాగ్‌లు కూడా వ్రాస్తూంటాను."

"దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది?"
"చాలా బాగా ఉంది! అత్యంత సాంప్రదాయ బద్ధమైన ప్రాంతాల నుంచి కూడా ప్రజలు నా వర్క్‌షాపులకు వచ్చి .. నా బోధనల పట్ల తమ గౌరవ ప్రతిపత్తులను కనబరుస్తారు. ఈ మధ్యనే పోలీస్ శాఖ వారు రేడియో, టెలివిజన్‌లలో ‘Sexual abuse at Home' అన్న అంశంపై నా ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ‘మానవ చైతన్యంలో చక్కటి మార్పు వస్తోంది’ అనడానికి ఇదే నిదర్శనం!"

"మీ బోధనాంశాలు ఎలా ఉంటాయి?"
"దీనిలోని ముఖ్య అంశం .. లైంగిక శక్తిని చక్రాల ద్వారా ఉన్నత స్థితికి నిర్దేశించడం; శ్వాస మరి దృశ్య చిత్రణలతో ఆ శక్తిని దారి మళ్ళించే విధానాన్ని తెలియచేయటం. "మనలో నిమ్న స్థానంలో ఉన్న మూలాధార మరి స్వాధిష్ఠాన చక్రాలనుంచి కుండలినీ శక్తిని ఉన్నత స్థానాలలో ఉన్న చక్రాల గుండా సహస్రార స్థితికి చేర్చినప్పుడు మన హృదయంతో పాటు ఇతర సహజ అవబోధ కేంద్రాలన్నీ విచ్చుకుని విశ్వనిర్దేశకత్వానికి ద్వారాలు తెరవబడతాయి.

"అంత గొప్ప స్థితిలో మనం .. స్వస్థతకూ, రూపాంతరీకరణకూ, ఉన్నత ప్రేమకూ ‘లైంగికత’ అన్నది గొప్ప ఉపకరణగా తెలుసుకుంటాం. అంతే కాకుండా ఆక్సిటోసిన్ ఆధారిత లైంగికతకూ మరి అడ్రీనలిన్ ఆధారిత లైంగికతకూ మధ్య ఉన్న గొప్ప తేడా మనకు తెలుస్తుంది. "అడ్రీనలిన్ హార్మోన్ అన్నది క్రింది మూడు చక్రాలను ఉత్తేజితం చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ అన్నది హృదయం నుంచి పై చక్రాలను ఉత్తేజితం చేస్తుంది."

"మీ ప్రణాళిక, గమ్యం ఏమిటి? దానివల్ల మీరు ఏం సాధిస్తారు?"
"పాఠశాలలలో విద్యార్థినీ, విద్యార్థులకూ .. మరి యుక్తవయస్సులో ప్రవేశించేవారందరికీ .. ఎరుకతో కూడిన లైంగిక సంబంధాలను గురించి నేను బోధిస్తూంటాను. లేతప్రాయంలో ఉన్నప్పుడే వారికి ఈ శాస్త్రం పట్ల అవగాహన లభిస్తే ఇక వారు జీవితంలో ఎన్నటికీ మరి ఎవ్వరితో కూడా విచ్చలవిడిగా ప్రవర్తించరు. లైంగిక వ్యాపారం చేసే వారినీ మరి ఆ వ్యాపార బాధితులనూ చేరి నేను ఈ విషయాలను వారికి తెలియజేస్తున్నాను.

"ఈ అవగాహన ఏర్పడితే మానవ సంబంధాలను అగౌరవపరిచే నీచసంస్కృతికి మనం అడ్డుకట్ట వేయవచ్చు. ఇతరుల వైపు తొంగి చూడడం .. వారి కోసం వెంపర్లాడడం .. ఇతరుల జీవితాలలోని విషయాలను గురించి గాలి కబుర్లు చెప్పడం ఆగిపోతుంది.

"నిజానికి మనుష్యులలో సరిగ్గా నిర్దేశించబడని ఈ అత్యున్నత శక్తి వక్రీకరణకు లోను కావడం వల్లనే భూమిపై అనేక అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే నేను దీనిని ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరించి అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాకు ఉన్నత తలాల మాస్టర్లచే అప్పగించబడిన పవిత్రమైన బాధ్యత!"

Go to top