"నన్ను నేనే ఉద్ధరించుకున్నాను"

నా పేరు "లలితా శివజ్యోతి". "కష్టం అంటే తెలియని వారికి కలుపుకుని తినడమే మహాకష్టం" అన్నంత అపురూపంగా ఒకప్పుడు నా జీవితం సాగింది. మా నాన్నగారు ‘తెలుగు పండిట్’ కావడంతో చిన్నప్పటి నుంచే నేను వారి దగ్గర కూర్చుని పురాణాలు, భగవద్గీత చక్కగా వింటూ "మనం శరీరం కాదు; ఆత్మస్వరూపులం" అని తెలుసుకున్నాను.

ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళతో బాల్యం అంతా హాయిగా గడిచిపోతూ 22 సంవత్సరాల వయస్సులోనే నాకు గవర్న్‌మెంట్ ఉద్యోగం వచ్చి .. 23 సంవత్సరాల వయస్సులోనే నాకు గవర్న్‌మెంట్ ఉద్యోగం వచ్చి .. 23 సంవత్సరాల వయస్సులో వివాహం ఆ వెంటనే బాబు పుట్టడం జరిగిపోయింది.

జీవితం ఇలా సాఫీగా ఏ లోటూ లేకుండా జరుగుతూ ఉండగా .. నా శరీరంలో Post Cerebral Arteryకి సమస్య వచ్చి హై B.P.తో కాళ్ళు, చేతులు, కళ్ళు అనారోగ్యానికి గురి కావడం జరిగింది. ఇక దాంతో నా శరీరంలోని నాడీ వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, విసర్జకవ్యవస్థలు అన్నీ కూడా ప్రభావితం చెంది నడవలేక, వ్రాయలేక, చూడలేక పూర్తిగా మంచానికి అతుక్కుపోయాను. అప్పటివరకూ "అంతా బాగుంది" అనుకున్న నా కుటుంబంలో అప్పుడు సమస్యలు మొదలయ్యాయి!

"పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే" అనుకుంటూ నా శరీరాన్ని మందుగోలీలతో నింపుతూ, ఇంజెక్షన్‌లతో తూట్లు పొడుస్తూ క్షణం క్షణం ఆక్సిజన్ సిలిండర్ల ఆసరాతో జీవిచ్ఛవంలా బ్రతుకు ఈడుస్తూ, శారీరకంగా నరకం అనుభవిస్తూ ఇక మానసికంగా మరి ఆత్మపరంగా కూడా అలసిపోయిన నేను చావుకోసం ఎదురుచూడసాగాను.

అప్పుడు కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్ అయిన మా బాబాయి P.సుబ్రహ్మణ్యంగారు నన్ను చూడడానికి వచ్చి నాతో పదినిమిషాల పాటు "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేయించారు. వారు ఇచ్చి వెళ్ళిన "తులసీదళం" పుస్తకాన్ని చదువుతూ ధ్యానం చేసేదాన్ని.

2011వ సంవత్సరంలో సింహాచలంలో జరిగిన "ధ్యానమహాచక్రం -II" కార్యక్రమానికి వెళ్ళి అక్కడ పత్రీజీని ప్రత్యక్షంగా చూసి .. అప్పటినుంచి వారి ఫోటో ముందు కూర్చుని ధ్యానం చేసేదాన్ని. అంతకుముందు ధ్యానంలో పదినిమిషాల కంటే ఎక్కువగా కూర్చోలేకపోయిన నేను అప్పటి నుంచి గంటసేపు నిశ్చలంగా ధ్యానంలో కూర్చోగలగడం నాకే ఆశ్చర్యం కలిగించింది. చనిపోవడానికి మానసికంగా సిద్ధమైన నాలో ధ్యానశక్తి మళ్ళీ జీవితం పట్ల ఆశను చిగురింపజేయడంతో ఇక మందులన్నీ మానేసి .. ధ్యానంలో వచ్చే అనేకానేక సందేహాలను నా ముందు ఫోటోలో ఉన్న గురువుగారికే విన్నవించుకునేదానిని.

వారి నుంచి తృప్తికరమైన సమాధానాలను పొందుతూ రోజుకి అయిదారుగంటల చొప్పున ధ్యానం చేయడం మొదలుపెట్టాను. విశాఖపట్టణంలో ఉన్న పిరమిడ్ మాస్టర్ల వివరాలను సేకరించుకుని వారితో మాట్లాడుతూ డా||G.K. గారి దగ్గర "ధ్యాన ఆరోగ్యం" వర్క్‌షాప్‌లో పాల్గొని కౌన్సిలింగ్ తీసుకున్నాను.

ఈ భూమి మీదకు రాకముందే ఈ శరీరంలో జన్మ తీసుకోవడానికి మనం ఎన్నో లక్ష్యాలను పెట్టుకున్నాం; విస్తృతమైన ఆధ్యాత్మిక ఒప్పందాలు చేసుకున్నాం; అందుకు ఏమేం చెయ్యాలో లిస్టు కూడా తయారుచేసుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చాక "ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు చస్తే .. అన్నీ తెలిసినవాడు అమావాస్యరోజు చచ్చాడు" అన్నట్లు నాకు అయ్యిందని ధ్యానంలో నా గత జన్మలు అన్నీ చూసుకున్నాక నాకు అర్థం అయ్యింది.

"సుఖవంతంగా ఉండాల్సిన నా వర్తమాన జీవితం నా గత జన్మల కర్మఫలితం మూలాన ఇలా అయ్యింది" అని తెలుసుకున్నాక "పట్టుకుంటే పీడిస్తుంది - వదిలేస్తే వెళ్ళిపోతుంది" అని పత్రీజీ నాకు ధ్యానంలో ఒక గొప్ప సందేశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నేను నా అనారోగ్య విషయాన్ని త్రికరణశుద్ధిగా వదిలివేసి ధ్యాన సమయాన్ని పెంచుతూ పోయాను. ప్రస్తుతం నేను నా అనారోగ్యం నుంచి సంపూర్ణంగా విముక్తి పొంది ధ్యానశక్తితో ఒక ఆత్మజ్ఞానిలా వెలుగుతున్నాను!

ఇలా నా ఆత్మజ్ఞానంతో నన్ను నేనే ఉద్ధరించుకునేలా చేసిన నా ధ్యానశక్తికీ మరి ధ్యానం ద్వారా పరిచయం అయిన ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తూ .. నాలాంటి మరెన్నో ఆత్మదీపాలను వెలిగించాలన్న అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతూన్న పత్రీజీకి శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను!

P.L.శివజ్యోతి - అనకాపల్లి - విశాఖపట్టణం - ఆంధ్రప్రదేశ్
+ 91 88851 93898, +91 9493413779.

Go to top