" దుఃఖం నుంచి .. విముక్తి "

 

 

నా పేరు "పద్మ". నేను పుట్టినప్పటి నుంచి .. నాకు 21 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు .. అంటే నాకు పెళ్ళి అయ్యేంత వరకూ నేను మా అమ్మానాన్నల దగ్గర అపురూపంగా, హాయిగా, ఆనందంగా .. "బాధ" అనే నరకానికి దూరంగా పెరిగాను.

 

పెళ్ళి అయ్యాక .. 28 సంవత్సరాల పాటు క్షణ క్షణం నరకం అనుభవిస్తూ వచ్చాను. చిన్న వయస్సులోనే నా భర్త చనిపోవడం .. ఆ దిగులుతో కొద్ది కాలానికే నా కూతురు చనిపోవడంతో నేను డిప్రెషన్‌లో కూరుకుపోయాను.

 

"నా జీవితం ఇలా ఎందుకు ఉంది? .. దీనికి మూలకారణం ఏమిటి?" అని నేను విచారిస్తున్న సమయంలో మీర్‌పేట పిరమిడ్ మాస్టర్ R.వెంకటేశ్వరరావుగారు నిర్వహిస్తూన్న ధ్యానశిక్షణా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది.

 

అక్కడ పత్రీజీ అందించిన "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని సాధన చేస్తూ .. బాధనూ కష్టాలనూ కూడా పాఠాలుగా స్వీకరించగలిగే వారి ఆత్మజ్ఞాన సందేశాలను చదువుతూ నాలో గూడు కట్టుకుని ఉన్న దుఃఖం నుంచి విముక్తి పొందాను!

 

కర్మసిద్ధాంతం అవగతం అయిన తరువాత నాలో ఉన్న దుఃఖం అంతా కరిగిపోయి నాలో గొప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడింది. "Meditation mends and moulds the mind for a Melodious Life" అని అనుభవపూర్వకంగా గ్రహించిన తరువాత .. ఇంత చక్కటి ధ్యానమార్గాన్ని పిల్లలందరికీ అందజేయాలన్న సంకల్పంతో నేను "హెడ్ మిస్ట్రెస్"గా పనిచేస్తూన్న కాన్వెంట్ స్కూల్ టైమ్‌టేబుల్‌లో ధ్యానాన్ని తప్పనిసరి చేశాను!

 

నా జీవితం ఇలా సాగుతూ ఉండగా సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా పనిచేస్తూన్న నా కుమారుడు కూడా అనారోగ్యంతో చనిపోయి నన్ను ఒంటరిని చేసి నా ఆత్మనిబ్బరానికి మరొక పరీక్ష పెట్టాడు.

 

అయినా గతంలో జరిగినట్లు డిప్రెషన్‌లో కూరుకుపోకుండా నా ధ్యానశక్తితో నేను ఆ షాక్ నుంచి తొందరగానే బయటపడ్డాను. చీకటిలోనే వెలుతురు విలువనూ .. దుఃఖంలోనే సుఖం విలువనూ తెలుసుకుంటూ ఆత్మజ్ఞాన సంపదనూ, మనశ్శాంతి సంపదనూ మరి బ్రహ్మానంద సంపదనూ కూడగట్టుకుంటున్నాను!

 

ధ్యానంలో ఎప్పటికప్పుడు పై లోకాలనుంచి నా కొడుకు అందిస్తూన్న సందేశాలను స్వీకరిస్తూ .. ధ్యానప్రచార కర్తవ్యంలో మునిగిపోయాను. ఇంత గొప్ప సరస్వతీ జ్ఞానాన్ని నాకు అందించిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను!

 

 

పద్మదేశ్ పాండే

మీర్‌పేట

హైదరాబాద్

Go to top