" బ్రహ్మర్షి పత్రీజీ పిరమిడ్ వ్యాలీ గురుకులం "

 

 

నా పేరు "సాయి శంకర్ రెడ్డి".

 

" MA" చదివిన నేను టీచర్ ఉద్యోగం కోసం "D.Sc" పరీక్ష వ్రాసి .. అందులో ఉత్తీర్ణుడిని కాలేక తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన సమయంలో మా అక్క మరి ఆమె పిల్లల ద్వారా "ధ్యానం" గురించి తెలుసుకున్నాను.

 

వెంటనే తిరుపతి పిరమిడ్ మాస్టర్ భవానీ జయప్రకాశ్ మరి A.V. సాయికుమార్ రెడ్డి గార్ల శిక్షణలో మొట్టమొదటి సారి ఒక గంట పాటు ధ్యానం చేశాను. ధ్యానంలో నా శరీరం బాగా బరువెక్కి తిమ్మిర్లు కమ్మి... "ఇక ప్రాణం నిలువదేమో" అన్నంత భావన కలిగింది. అయినా అలాగే కళ్ళు మూసుకుని కూర్చుని ఆ వింత బాధను అనుభవించాను. అలా రెండు మూడు రోజుల ధ్యానం తరువాత దీర్ఘకాలంగా నన్ను బాధిస్తూన్న కడుపు నొప్పి, తలనొప్పి మరి నడుము నొప్పుల నుంచి శాశ్వత ఉపశమనం లభించడం నాకు చాలా ఆశ్వర్యాన్ని కలిగించింది!

 

ఆ తరువాత కొన్నాళ్ళకే నేను ఎంతో కష్టపడి కూడా ఉత్తీర్ణుడను కాలేని "D.Sc" పరీక్షలో అతి తేలికగా ఉత్తీర్ణుడను అయ్యి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేను కోరుకున్న చోటనే నియమింపబడ్డాను!

 

తెలుగు ఉపాధ్యాయునిగా ప్రాథమిక, మాథ్యమిక మరి ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూనే .. "అన్నమయ్య భాష" అన్న అంశం పై Ph.D చేసి "అన్నమయ్య పదప్రయోగ సూచిక" ను రూపొందించాను!

 

ఆ తరువాత పుంగనూరు జూనియర్ కాలేజీ లో లెక్చరర్‌గా పదోన్నతి పొంది .. చాలా సంవత్సరాలు "ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం" అధ్యక్షునిగా పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్‌లో స్టేట్ కౌన్సిలర్‌గా గౌరవ బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

 

పదవీ నిర్వహణలో భాగంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో మరి లెక్చరర్‌లతో విద్యాసంస్థల యాజమాన్యాలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ధ్యాన ప్రచారానికి నాకు చక్కటి అవకాశం లభించింది.

 

శాస్త్రీయమైన "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని చేయడం ద్వారా తమ కార్యదక్షతలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన ఉపాధ్యాయులు తమ తమ విద్యాసంస్థలలో దానిని ప్రవేశపెట్టి చక్కటి ప్రయోగపూర్వక ఫలితాలను పొందడం జరిగింది .. జరుగుతోంది.

 

దీనికి తోడు పుంగనూరు మండలం లయన్స్ క్లబ్‌కు "జనరల్ సెక్రెటరీ" గా కూడా ఉన్న నేను అనేకానేక ధ్యాన శాకాహార కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు శాస్త్రీయమైన జీవనవిధానంలోని గొప్పదనాన్ని తెలియజేస్తూ వచ్చాను. ఒకప్పుడు జీవితంలో పైకి రాలేక నిరాశా నిస్పృహలతో కూరుకుపోయిన నేను ఈ రోజు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలా ఎదిగాను!

 

అలా నన్ను నేను తీర్చిదిద్దుకోగలిగిన ధ్యానవిద్యను నాకు అందించిన పత్రీజీకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానవిద్య ప్రచారమే లక్ష్యంగా జీవిస్తున్నాను! ధ్యానం వల్ల రెండురోజులలోనే నేను ఇంత శక్తి పొందితే మరి ఆ ధ్యానాన్ని అందరికీ అందజేస్తూన్న పత్రీజీ ఇంకెంత శక్తివంతులుగా ఉంటారో అనుకుని వారిని చూడడానికి తపన పడ్డాను.

 

నా సంకల్పం ఫలించి త్వరలోనే పత్రీజీ ధ్యానకార్యక్రమం మా ఊళ్ళో ఏర్పాటు కావడం జరిగింది. J.P.సార్ ద్వారా విషయం తెలుసుకున్న నేను వెళ్ళి పత్రీజీని కలిసి వారితో కరచాలనం చేసి ముందు వరసలో కూర్చోబోయాను.

 

ఆ ప్రక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి "ముందువరసలో కూర్చోబోకు; ఆయనకు కోపం వస్తే కొట్టేస్తారు" అని చెప్పాడు. దాంతో నేను జాగ్రత్తగా వెనుకనుంచి తిరిగి వచ్చి జనాలమధ్యలో కూర్చున్నాను .. భయంగా! ఇంతలో "శివప్రసాద్" అనే ఒక టీచర్ వేదికపై పత్రీజీకి ఒక మంచి డ్రెస్‌ను సమర్పించుకున్నారు.

 

సార్ వెంటనే వేదిక దిగి .. అక్కడే క్రింది వరుసలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్న ఒక "బ్లైండ్ మాస్టర్" కన్నయ్య దగ్గరికి వెళ్ళి .. ప్రేమగా అతని చేతుల్లో ఆ డ్రెస్‌ని పెట్టారు! అద్భుతమైన దృశ్యం అది! విచిత్రమైన ఆనందానుభూతితో పత్రీజీ పట్ల నాలో ఉన్న అపోహలు పటాపంచలై నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

 

అయితే విచిత్రం ఏమిటంటే .. కన్నయ్య బాగా ధ్యానం చేస్తున్నాడని .. శివప్రసాద్ కు గతంలో అతని పట్ల ద్వేషం మరి అసూయ భావాలు ఉండేవి!

 

రెండు గంటల పాటు పత్రీజీ వేణునాద ధ్యానంలో అందరం ఓలలాడాక కళ్ళు తెరవగానే సార్ నా వైపు సూటిగా చూస్తూ అంతమందిలో నుంచి నన్ను వేదికపైకి పిలిచారు!

 

నేను ఆనందంగా వెళ్ళగా .. సార్ నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని .. నా ధ్యాన అనుభవాలు చెప్పించారు. ఎవరి దర్శనం కోసం నేను తపించానో .. ఎవరి మార్గదర్శనం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందో వారితో కలిసి వారి అడుగుజాడలలో నడవడం నా జన్మజన్మల పుణ్యఫలంగా భావించాను.

 

ఇక ఆ తరువాత తిరుపతిలో "పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్" ప్రారంభించి అనేక మంది ఉపాధ్యాయులకు ధ్యానం నేర్పించడం జరిగింది. పలమనేరు, చదళ్ళ, పుంగనూరు, మదనపల్లి మొదలైన పట్టణాలలో పత్రీజీ ఆధ్వర్యంలో అనేకానేక ధ్యానశిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి అభినందనలు అందుకున్నాను.

 

ఈ క్రమంలో ఒకసారి చిత్తూరు తపోవనంలో పత్రీజీ ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యానశిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాను. అందుకోసం చిత్తూరు పట్టణం అంతా కరపత్రాలు పంచడం, ధ్యానం పోస్టర్లు అంటించడం, బ్యానర్లు కట్టడం చేశాం.

 

పత్రీజీ రాకకు ముందు రోజు పడుకుని నిద్రలేవగానే .. విచిత్రంగా నా గొంతు మూగబోయింది. నోటినుంచి ఒక్క మాట, శబ్ధం కూడా రావడం లేదు. గొంతు నొప్పి గానీ, జలుబు గానీ లేదు. అయినా గొంతు ఎందుకు పలకడం లేదో అర్థం కాలేదు.

 

పేపర్ స్లిప్పులు వ్రాస్తూ ఒక మూగవాడిలా రోజంతా పని చేశాను. మర్నాడు పత్రీజీ వచ్చాక .. అందరితో రెండు గంటలసేపు వేణునాద ధ్యానం చేయించాక ఒక్కొక్కరినే వేదికపై పిలిచి మాట్లాడమంటూ నన్ను కూడా పిలిచారు. నోరు పెగలక, నా అవస్థ చెప్పలేక వేదికపైకి ఎక్కగానే నా వీపు మీద ఒక దెబ్బవేసి .. "ఒక పాట, పాట పాడు" అన్నారు.

 

విచిత్రంగా .. నా గొంతునుంచి అన్నమయ్య పాటలు ఒకదాని వెంట ఒకటి వచ్చేశాయి! ధ్యానంపై నేను వ్రాసిన పాటలు పాడుతూ ఉంటే సార్ చిన్నపిల్లవాడిలా చప్పట్లు చరుస్తూ .. నృత్యాన్ని కూడా చేయడం ఒక మాహాద్భుత దృశ్యం!

 

2015 డిసెంబర్ "ధ్యానమహాచక్రం -6" సందర్భంగా కడ్తాల్ .. కైలాసపురిలో .. కైలాసపురిలో పత్రీజీని కలిసి నా చిరకాల స్వప్నం అయిన "పిరమిడ్ గురుకులాన్ని" స్థాపించడం గురించి చెప్పగానే వారు తమ అంగీకారాన్ని తెలిపారు. వెంటనే ఐరాల మండలం కాణిపాకం సమీపంలోని "గోవిందరెడ్డిపల్లి" దగ్గర గార్గేయ నది ఒడ్డున పర్వత పాదాల చెంత అయిదు ఎకరాల విస్తీర్ణంలో "బ్రహ్మర్షి వ్యాలీ పిరమిడ్ గురుకులం" నిర్మాణానికి రూపకల్పన చేశాం!

 

23'x23' కొలతలతో కూడిన "23 పిరమిడ్ క్లాస్ రూమ్‌ల" తో, విశాలమైన ఆటస్థలంతో పాటు ప్రకృతి వ్యవసాయంతో ధ్యానం, కూరగాయలు పండించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము.

 

2016-17 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల నమోదు కార్యక్రమం మొదలుపెట్టాం. వ్యాపార విద్యావిధానానికి భిన్నంగా .. సాంప్రదాయ చదువులతో పాటు విద్యార్థి యొక్క భౌతిక, మానసిక, ఆత్మపరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యేక విద్యావిధానం ఇక్కడి ప్రత్యేకం!

 

ఒక రాముడిలా, ఒక బుద్ధుడిలా, ఒక కృష్ణుడిలా, ఒక జీసస్‌లా ఎదగడానికి కావలసిన సకల లక్షణాలతో పుట్టిన బిడ్డను అవే లక్షణాలతో ఎదగనిచ్చి .. ఈ సమాజానికి ఒక చక్కటి ఉపకరణంలా అందించడమే మా బ్రహ్మర్షి వ్యాలీ పిరమిడ్ గురుకులం యొక్క లక్ష్యం!

 

గతంలో ఉపాధ్యాయులుగా పనిచేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఇక్కడ బోధన జరుపబడుతుంది. అలాగే వివిధ విభాగాలలో సర్వీస్ చేయగోరు వాలంటీయర్స్‌కు "బ్రహ్మర్షి వ్యాలీ పిరమిడ్ గురుకులం" ఆహ్వానం పలుకుతోంది!

 

వివరాలకు M.పవిత్ర, రాగానిపల్లి రోడ్, కొత్తపేట, పుంగనూరు మం||, చిత్తూరు జిల్లా.


సెల్: 94416 33845, 87905 18092

 

డా|| T.సాయి శంకర్ రెడ్డి
పుంగనూరు - చిత్తూరు జిల్లా

Go to top