" ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక విద్యను అందించడమే నా లక్ష్యం "

 

 

"శ్రీ B.శివరామప్ప" గారు కర్నూలుకు చెందినవారు. BSNLలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా2007, ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసి అనంతరం PSSMకు పూర్తి కాల సేవలు అందిస్తూ ప్రస్తుతంPyramid Spiritual Science Academy - PSSAకు వైస్ ఛైర్మన్ మరి మేనేజింగ్ ట్రస్టీ బాధ్యతలు నిర్వహిస్తూ అకాడెమీని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ఆయన నుంచి అకాడెమీ గురించిన విశేషాలు మన కోసం ...


M.స్వర్ణలత

 

స్వర్ణలత :"నమస్కారమండీ, మీరు ధ్యానంలోకి ఎప్పుడు ఎలా ప్రవేశించారు?"


శ్రీ శివరామప్ప: నమస్కారం! 1997 అక్టోబర్‌లో నేను బెంగళూరులో మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రీజీని కలిసాను. అప్పుడు వారిని నేను "నాకు మీ ఆశీర్వాదం కావాలి" అని అడిగాను. దానికి ఆయన "నా ఆశీర్వాదం ఎందుకు నీకు? నీకు కావలసింది ఏదైనా స్వయంగా సాధించుకునే శక్తి నీలో వుంది; ధ్యాన సాధనతో దానిని వెలికి తెచ్చుకో" అన్నారు. దాని పర్యవసానమే ఆనాటి నుంచి సాగుతూన్న నా ధ్యాన జీవితం.

 

స్వర్ణలత: "PSS అకాడెమీ ఏర్పాటు చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి, ఎప్పుడు వచ్చింది?"


శ్రీ శివరామప్ప: 2010 లో బెంగళూరు PSSM పనులు చూస్తూ వుంటూండగా ఒకసారి పత్రీజీతో కలిసి బెంగళూరులోని యోగ విశ్వవిద్యాలయం లో ధ్యానశిక్షణకు వెళ్ళాము. పత్రీజీ వారికి ఎంతో విపులంగా ధ్యాన ప్రయోజనాలను వివరించారు. అది నా మనస్సులో హత్తుకుపోయింది.

 

తిరుగు ప్రయాణంలో నేను " వారు యోగవిద్యను బోధనా అంశంగా అందిస్తున్నట్లే మనం కూడా ధ్యానాన్ని బోధనా అంశంగా అందిస్తే ఎలా వుంటుంది సార్?" అన్నాను. దానికి సార్ వెంటనే "చాలా ఉపయోగం వుంటుంది; తప్పకుండా చెయ్యాలి .. అది నీ పనే, నువ్వే చెయ్యాలి" అన్నారు.

 

అప్పుడు నేను బెంగళూరు PSSM పనులు వేరే వాళ్ళకు అప్పగించి "పిరమిడ్ అకాడెమీ ఆఫ్ స్పిరిచ్యువల్ సైన్సెస్" కోర్సులను తయారు చెయ్యడం .. పత్రి సార్ వాటిని సరిదిద్ది .. సమగ్రరూపం ఇవ్వడం జరిగి 2010 లో అకాడెమీ ప్రారంభమైంది. 2011 లో దాని పేరు PSSAగా మార్చబడింది.

 

స్వర్ణలత: "అకాడెమీ ఏర్పాటుకు ఎవరెవరు, ఎలా కృషి చేశారు?"


శ్రీశివరామప్ప: నిజానికి కోర్సులో బోధనాంశాల సమీకరణ, రూపకల్పన, ప్రోస్పెక్టస్‌తో సహా అన్నీ చేసింది పత్రీజీ, మరి నేను, అని చెప్పక తప్పదు. ఆఫీసు ఏర్పాటుకు మన తరగతులకు వచ్చిన సహాయం ఎంతో వుంది.

 

స్వర్ణలత: "అకాడెమీ పుస్తకాలు ఎవరు, ఏ ప్రాతిపదికన తయారు చేశారు?"


శ్రీ శివరామప్ప: ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్ర రాజదాని అయిన రాయపూర్‌లోని "కంగేర్ వ్యాలీ పాఠశాల" లో 2011 లో ధ్యాన తరగతులు నిర్వహించేటప్పుడు ఒక విద్యార్థి తండ్రి ద్వారా వచ్చిన సూచనతో ఛత్తీస్‌ఘడ్ విశ్వ విద్యాలయపు వాల్యు ఎడ్యుకేషన్ సిలబస్ ఆధారంగా పత్రీజీ పర్యవేక్షణలో రూపొందించబడ్డాయి.

 

పరిచయం చేయబడిన ప్రతిచోటా PSSA పాఠ్య పుస్తకాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పటి వరకు 150 పాఠశాలలలో 18,000 మంది విద్యార్థులకు మన PSSA పాఠ్య పుస్తకాలు చేరాయి.

 

స్వర్ణలత: "అకాడెమీ నిర్వహణ విధానం తెలియచెయ్యండి !"


శ్రీ శివరామప్ప : 2013, అక్టోబర్‌లో .. బెంగళూరులోని కోరమంగళ ప్ర్రాంతంలో అకాడెమీ కార్యాలయం ప్రారంభించాము. ఆరుగురు కార్యాలయ సిబ్బంది, ఒక మేనేజర్; కోర్సులు మరి పుస్తకాల పంపిణీ ఇక్కడి నుంచే జరుగుతుంది.

 

జిల్లాల వారీగా దాదాపు 30 మంది "PSSA మాస్టర్లు" పని చేస్తున్నారు. వీరు పాఠశాలల యాజమాన్యాలతో సంప్రదించి బోధన అమలు జరిగేటట్లు చేస్తారు.


"PSSA" కు పత్రీజీ ఛైర్మన్‌గా ఉన్నారు. రాయ్‌పూర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ శైలేంద్ర జైన్ అకాడెమీ వైస్ ఛైర్మన్‌గా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. నేను వైస్ ఛైర్మన్ మరి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నాను. అకాడెమీ త్రై మాసిక సమావేశాలలో పాల్గొని పత్రీజీ సలహాలు, సూచనలు ఇస్తూ వుంటారు.

 

విద్యార్థులకు "వాల్యూ ఎడ్యుకేషన్" పుస్తకాలు తరగతి వారీగా ఒక్కొక్క తరగతికి ఒక్కటి చొప్పున 6వ తరగతి నుంచి 12 వ తరగతులకు, డిగ్రీ కోర్సు తయారు చేశాం. ప్రతి పాఠశాలలో ‘మోరల్ సైన్స్ పీరియడ్స్’ ను ఆధ్యాత్మిక విద్యకు కేటాయించమని కోరుతున్నాం.

 

పుస్తకాల ప్రింటింగ్ శ్రీ శైలేంద్ర జైన్ ఆధ్వర్యంలో రాయపూర్‌లో జరుగుతున్నాయి. వారాంతంలో PSS అకాడెమీ బెంగళూరు కార్యాలయం లో ధ్యానశిక్షణ జరుగుతోంది.

స్వర్ణలత: "అకాడెమీ ఎక్కడెక్కడ పరిచయం చేయబడింది?"


శ్రీ శివరామప్ప: మన అకాడెమీ అంశాలు మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలలో కూడా బోధించ బడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ జిల్లాలతో పాటు చెన్నై, త్రివేండ్రం, ముంబయి, నాగపూర్, భువనేశ్వర్‌లలోనే కాక మలేషియా, ఈజిప్ట్, వియత్నాం దేశాలలో కూడా పరిచయం కాబడి మంచి స్పందన లభిస్తూంది. " PSSA సింగపూర్", " PSSA వియత్నాం" కూడా త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి.

 

స్వర్ణలత: "మీరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే విధానం, దానికై తీసుకుంటున్న జాగ్రత్తలు తెలపండి!"


శ్రీ శివరామప్ప: వివిధ పాఠశాలలో మన పాఠ్యంశాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణను ఇస్తాం. ఆ యా పాఠశాలల ఉపాధ్యాయులే మన కార్యకర్తలు. ఆధ్యాత్మికత ప్రత్యేకించి ఏ కొందరికోసమో కాదు. అందుకనే ఆ పాఠశాలలో వారికే శిక్షణను ఇస్తాం. వీడియోల ద్వారా వారికి బోధిస్తున్నాం! ప్రతి ఉపాధ్యాయుడూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నాడు. విద్యార్థులకు మేలు చేసే ఈ అంశాలను వారు స్వాగతిస్తున్నారు.

 

స్వర్ణలత: "అకాడెమీ బోధించే వివిధ కోర్సుల వివరాలు తెలపండి!"


శ్రీ శివరామప్ప: అవి మూడురోజుల కోర్సులు, రెండురోజులు .. సమాజంలో అందరికీ ఆధ్యాత్మికతను తెలిపే విధంగా వివరించబడ్డాయి. ప్రత్యేకించి కార్పొరేట్ కంపెనీలకు గాను రెండురోజుల వ్యవధి కోర్సు, బాలబాలికలకు ఒక రోజు కోర్సు వుంది.

 

"ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులు" గా మారేందుకు ఏడు రోజుల కోర్సు నిర్వహిస్తాం. దీని ద్వారా దాదాపు 1800 మంది సర్టిఫికేట్లు పొందారు. దూర ప్రాంత ధ్యానశిక్షణా కోర్సు రెండు నెలల వ్యవధితో జరుపబడుతుంది.

 

స్వర్ణలత: " ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?"


శ్రీ శివరామప్ప: విద్యార్థినీ విద్యార్థులకు విశేషంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరి. వారి మేధాశక్తి పెంపొందించి, స్వంత ఆలొచన ఏర్పరుచుకోవటానికి ధ్యానం ఎంతో అవసరం. విశ్వశక్తి విపులంగా గ్రహించగలుగుతారు. ఇప్పుడిప్పుడే కళాశాలలలో కూడా "ఆధ్యాత్మిక శాస్త్ర బోధకులు కావాలి" అని అడుగుతున్నారు. వారిని తయారు చేయవలసిన అవసరం ఎంతో వుంది.

 

స్వర్ణలత: "విద్యా వ్యాపార సంస్థల యాజమాన్యాలను మీరు ఎలా ఒప్పించి ఆధ్యాత్మిక విద్య పరిచయం చేశారు?"


శ్రీ శివరామప్ప: దైనందిన పోటీపరిస్థితులలో విద్య అన్నది సర్వత్రా ‘వ్యాపారం’ గా మారినా మనుష్యులందరూ ఆత్మస్వరూపులే, దివ్యజ్ఞాన సంపన్నులే! పాఠశాల యాజమాన్యానికి క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుదల, నైపుణ్యాల మెరుగుదలల గురించి కూలంకషంగా వివ్వరిస్తే వారు అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు.

 

స్వర్ణలత: " సాంప్రదాయ బోధనాంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు ఎలా కూర్చుతున్నారు?"


శ్రీ శివరామప్ప: సాంప్రదాయ బోధనాంశాలు !వివిధ భౌతిక శాస్త్రాల జ్ఞాన పరిచయం చేస్తే ఆధ్యాత్మిక విజ్ఞానం జీవిత శాస్త్రాన్ని తెలియజేస్తుంది. ఇవి రెండూ పరస్పర పురకాలే అన్న విషయం వివరిస్తున్నాం. వాటి కలయిక జీవితాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది అని చెపుతున్నాం.

 

స్వర్ణలత: "ఇంకేమైనా .. ?"
శ్రీ శివరామప్ప: మన "స్పిరిచ్యువల్ వాల్యూస్ ఎడ్యుకేషన్" కు మొన్ననే ఢిల్లీలో ECONS నుంచి Education Summit Award -2016ను, Global Management Certification Servicesనుంచి ISO 9001 : 2008 ను పొందాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆధ్యాత్మిక విద్యను అందరికీ చేరవేస్తాం.

 

పుస్తకాల వెల 6 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయిదు తరగతులకు ఇంగ్లీష్ మీడియం రూ:550/; 6వ తరగతి నుంచి 8వతరగతి వరకు మూడు తరగతులకు తెలుగు మీడియం రూ:225/- ..

 

మాకు వెన్నుదన్నుగా నిలుస్తూన్న పత్రీజీ కి ప్రణామాలు! ఎంతో సహకరిస్తూన్న పిరమిడ్ మాస్టర్లకు కృతజ్ఞతలు. థాంక్యూ

Go to top