"ధ్యానం ద్వారానే జ్ఞానం .. ఆత్మానందం"

చీరాలకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారులు "శ్రీవేమా ఆదిశేషు" గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్! ధ్యానం అంకితత్వం కలిగి ధ్యానప్రచార కార్యక్రమాలలో విస్తృతంగా పాలుపంచుకుంటూ PSSMకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిశేషు గారితో కొంచెం సేపు ...

-M. స్వర్ణలత

స్వర్ణలత : "నమస్కారం ఆదిశేషు గారూ! .. మీకు ధ్యానం పట్ల ఆసక్తి ఎందుకు, ఎలా కలిగింది? ధ్యానంలోకి ఎప్పుడు ప్రవేశించారు?"
శ్రీ ఆదిశేషు : 2003 ప్రాంతంలో నేను అనారోగ్యానికి గురైనప్పుడు "A.శ్రీనివాస్" అనే పిరమిడ్ మాస్టర్ నాకు ధ్యానం గురించి చెప్పబోగా నేను తీవ్రంగా వ్యతిరేకించి "మందులకు తగ్గనిది ధ్యానంలో తగ్గుతుందా?" అని వినలేదు.

2006లో నేను రుమటాయిడ్ చికెన్ గున్యాకు గురై చాలాకాలం అనారోగ్యంతో బాధపడి, ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితిలో మా బంధువులలో ఒకరు TB వ్యాధికి గురై ప్రతి హాస్పిటల్‍లోనూ "ఇక ఆశలేదు .. ముదిరిపోయింది, తగ్గదు" అని చెప్పినప్పుడు, మా పెద్దనాన్న కొడుకు "ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా; ఒక్కసారి ధ్యానం చేసి చూడండి" అని తటవర్తి వీరరాఘవరావు గారి మూడురోజుల క్లాసుకు - భీమవరం తీసుకువెళ్ళాడు!

"అక్కడ మూడు రోజులలోనే ఆయన కోలుకుని నాలుగు నెలల నుంచి ఏది తిన్నా వాంతి అయ్యే అతను ఆహారం తీసుకోగలిగాడు; ఇప్పుడు బాగున్నాడు" అని మా నాన్నగారు చెప్పినా నేను నమ్మకుండా " ఇదంతా ఒట్టి మోసం, కళ్ళు మూసుకుంటేనే వ్యాధులు తగ్గితే ఇంక వైద్యులు, మందులు ఎందుకు??" అని పోట్లాడాను.

తరువాత చీరాల, మహాత్మ గాంధీ హౌసింగ్ కాలనీలో రామ మందిరంలో నాన్నగారు తటవర్తి వీరరాఘవరావు గారి ధ్యానశిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. అప్పుడు దీనిలో వున్న "మాయను బయటపెట్టడం కోసం" నేను అక్కడకు వెళ్ళాను.

అక్కడ ఆయన ఒక గంట ధ్యానం చేయించగా నేను కూడా ధ్యానం చేశాను. ఆ ధ్యానస్థితిలో చెమటలతో నా ఒళ్ళంతా తడిసిపోయి, కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారి, తీవ్రమైన ఆవలింతలు వచ్చి, శరీరమంతా తిమ్మిర్లు ఎక్కి పులకరింతకు గురై చికెన్ గున్యాకు గురవటం వలన కదలని కాళ్ళు చేతులు కదిలి, రోగనిరోధక శక్తి వచ్చింది!

వెంటనే నేను లేచి పరుగెత్తి ఆయనను ఆనందంగా కౌగలించుకుని "జీవితంలో ఇక నేను ధ్యానాన్ని వదలను, పిరమిడ్ కడతాను" అని చెప్పి మరునాడే పిరమిడ్ కట్టడం ఆరంభించాను. వైజాగ్ మాస్టర్ "కిషోర్" గారు 20 'x20' అడుగుల పిరమిడ్ నిర్మించారు. అనాటి నుంచి ప్రతి రోజూ ధ్యానం చేస్తూ నాకు తెలిసిన వారందరికీ ధ్యానం చెప్పసాగాను.

స్వర్ణలత: "ధ్యాన ప్రచారంలో మీ అనుభవాలు?"
శ్రీ ఆదిశేషు : నేను ధ్యానం నేర్పిన వాళ్ళందరూ తాము పొందిన మార్పులు, అనుభవాలు చెపుతూంటే వింటూ, వారు నన్ను గురువుగా భావిస్తూ ఇస్తున్న గౌరవానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను!

స్వర్ణలత: " మీ కుటుంబ సభ్యుల ధ్యానాసక్తి గురించి ..?"
శ్రీ ఆదిశేషు: నా భార్య, పిల్లలు, అమ్మ, నాన్నగారు అందరూ ధ్యానులే. అన్నదమ్ములు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తారు.

స్వర్ణలత: ధ్యానం ద్వారా మీ జీవితంలో, ఆలోచనలలో వచ్చిన మార్పులు?"
శ్రీ ఆదిశేషు: అవి అన్నీ ఇన్నీ అని చెప్పడానికి వీలులేదు. కానీ .. కొన్ని .. అద్భుతానుభవాలు .. ఎంతో క్లిష్టమై సంవత్సరాల తరబడి చేయవలసిన పనులు కూడా ఎంతో తేలికగా, వెంటనే, రోజులలో పూర్తి అయ్యేవి. తలచుకున్న పని వెంటనే, రోజులలో పూర్తి అయ్యేవి. తలచుకున్న పని వెంటనే అత్యంత సులువుగా జరిగేది.

ఇతరులకు ధ్యానం చెపుతున్నప్పుడు నా ధర్మం నాకు అర్థమైంది. చీరాలలో ధ్యాన సప్తాహం జరిగినప్పుడు పత్రీ సార్ వచ్చి "నువ్వు ఇదే విధంగా తెనాలిలో ధ్యానం పెంపొందించాలి" అని చెప్పారు.

"సరే" అనుకుని ఒక ఆదివారం తెనాలిలో "పంచముఖి ఆంజనేయస్వామి" గుడిలో ధ్యానం క్లాసు ఏర్పాటు చేశాను. పాతికమంది వచ్చారు. వారిలో చుండూరు నాగ మల్లిఖార్జున రావు గారు గుండెకు ఆపరేషన్ అవసరమైన స్థితిలో చక్కెర వ్యాధి వలన ఆపరేషన్ చేసే వీలులేక ఎవరో చెప్తే ధ్యానానికి వచ్చారు. ఆయనకు నేను గతంలో అనారోగ్యంగా వుండటం తెలుసు. కానీ అప్పటి నన్ను చూసి ఆశ్చర్యపోయి .. " ఇదెలా సాధ్యమైంది?" అని అడిగారు.

అప్పుడు నేను ధ్యానం గురించి చెప్పి " మీరు కూడా 40 రోజుల పాటు మీ వ్యాపార విషయాలు ప్రక్కన పెట్టి ఎక్కువ గంటలు ధ్యానం చెయ్యాలి" అని చెప్పాను.
పదిహేను రోజులలోనే ఆయన కోలుకుని ఇంటిపైన పిరమిడ్ నిర్మింప చేయడమే కాక అచిరకాలంలో ఆ పట్టణంలో మరో 30 పిరమిడ్‌లు నిర్మింప చేశారు! ఆ విధంగా నేనేమీ కష్టపడకుండానే ఆ పని పూర్తయింది. అలాగే ఎన్నో విషయాలలో జరిగింది.

ఎంతోమంది ఎన్నో సమస్యలు .. ఆర్థిక, అనారోగ్య, ప్రాపంచిక సమస్యలు అన్నీ ధ్యానం ద్వారా పోగోట్టుకున్నారు.

స్వర్ణలత: "ధ్యానం కోసం మీరు ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమాలు?"
శ్రీ ఆదిశేషు: చీరాలలో "శాకాహార గ్రామం" నిర్మాణం కోసం 15 ఎకరాల స్థలం తీసుకున్నాను. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలో బ్రాహ్మణపల్లి గ్రామంలో స్థాపించబడి వున్న "ఓంకారేశ్వర అష్టాదశ ధ్యానక్షేత్రం" యొక్క "ఓంకారేశ్వర పిరమిడ్ ట్రస్ట్" లో ఒక సభ్యునిగా వుంటూ అక్కడ కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడుతున్నాను.

అలాగే "ధ్యానజగత్" మాస పత్రిక చీఫ్ ప్యాట్రన్‌గా ఉంటున్నాను. గురువుగారు చెప్పిన ఏ పనినైనా "తు.చ" తప్పకుండా, అందరి సహకారంతో ఆచరిస్తూ నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఏ ఇబ్బందులూ లేకుండా జరగటం చూస్తున్నాను!

స్వర్ణలత: "మీ జీవితంలో మరుపురాని సంఘటన?"
శ్రీ ఆదిశేషు: 2016, మార్చి 23 న మా పాప వివాహం జరిగింది. ధ్యానులందరినీ అన్ని రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఆహ్వానించి ధ్యానకుటుంబంతో పత్రిసార్, పత్రిమేడమ్‌ల సమక్షంలో ఎంతో వైభవంగా వివాహం చేశాం! అది మా గ్రామ చరిత్రలోనే గొప్పగా, ఆధ్యాత్మికంగా జరిగింది అని అందరూ అన్నారు!

ఎంతో మంది ఆత్మ బంధువులు, ఆస్ట్రల్ మాస్టర్స్‌తో కళ్యాణం వైభోగంగా జరిగింది. వేలమందికి "ధ్యానజగత్" పుస్తకం, "కళ్యాణ వైభోగం" పిరమిడ్ పుస్తకం, పిరమిడ్‌లను బహుమతిగా ఇచ్చాము!!

24వ తేదీ ఉదయం మా సమీపంలోని రామాపురం బీచ్ వద్ద "ఫామ్ కోస్ట్ రిసార్ట్’ లో వసతి ఏర్పాటు చేసి సామూహిక ధ్యానం ఏర్పాటు చేశాం. అదెంతో ఆహ్లాదకరంగా గడిచించి!

అయితే నా జీవితంలో ప్రతిరోజూ అత్యంత ఆనందంగానే గడుపుతున్నాను.

స్వర్ణలత: "మీ సందేశం"?
శ్రీ ఆదిశేషు: నా లాగే అందరూ ధ్యానం చేస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తూ .. ఆత్మానందం, ధ్యానానందం, జ్ఞానానందం, బ్రహ్మానందాన్ని అనుభవించాలి. భూమిపైగల మానవాళి అంతా ధ్యానులుగా మారటం కోసం కృషి చెయ్యాలి.
ప్రతి ప్రాణినీ ప్రేమిస్తూ ప్రతి ఒక్కరూ శాకాహారిగా జీవించాలి. ధ్యానం చేస్తూ, ప్రకృతిని కాపాడుకుంటూ, అందరికీ ఉపయోగపడేటట్లు జీవించాలి.

ఈ ధ్యానం అందించిన పత్రీసార్ కు నా ప్రణామాలు!

 

Go to top