" నా లోని భయాన్ని ఎదిరించాను "

 


నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక గురువులందరికీ నా పాదాభివందనాలు. శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారి పుస్తకాలు చదివి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఏది తినాలి? ఏది తినకూడదు .. ఇలా అన్నీ వారి దగ్గర నేర్చుకుని ఆచరణలో పెట్టి అంతకు ముందు మాంసాహారిగా ఉన్న నేను శాకాహారిగా మారిపోయాను. చక్కగా యోగాసనాలు వేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేదానిని.

 

నాకు ఉన్న ఒకే ఒక కష్టం .. బాధ .. నా భర్త! చీటికీ మాటికీ కారణం లేకుండానే ఏదో ఒక మాట అని నన్ను బాధపెట్టేవారు. కఠినంగా .. మొరటుగా మాట్లాడుతూ నన్ను ఏడిపించడమే ఆయనకు ఆనందంగా ఉండేది. నాతో పాటు గుళ్ళకూ గోపురాలకూ వచ్చేవారు .. పూజలూ, అభిషేకాలూ చేయించడం చేసేవారు కానీ .. నా విషయానికి వచ్చేవరకు మాత్రం అకారణంగానే తిట్టేవారు.

 

అయినా అవేవి మనస్సులో పెట్టుకోకుండా నేను లేడీస్ టైలర్‌గా పని చేస్తూ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ శాకాహారం గురించీ, యోగాసనాల గురించీ చెబుతూండే దానిని. ఈ క్రమంలోనే నేను TVలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరి శ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారి ప్రవచనాలు వింటూ "ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా అవి మనస్సును బహు కొద్దిగా మాత్రమే శుద్ధి చేస్తాయి! కానీ, కేవలం ధ్యానం ఒక్కటి మాత్రమే మనల్ని సంపూర్ణంగా శుద్ధి చేస్తుంది. మనిషి జన్మ తీసుకుంది ... ధ్యానం చేసి స్వీయ ఆత్మ గురించి తెలుసుకుని తనను తాను ఉద్దరించు కోవడానికే" అని తెలుసుకున్నాను.

 

అప్పటినుంచి "ధ్యానం ఎలా చెయ్యాలి?" అన్న శ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారి గ్రంథాన్ని చదువుతూ అందులో చెప్పినట్లు ధ్యాన సాధన చేస్తూ కూర్చున్నాను.

 

కొంతసేపటి తరువాత నా శరీరం కదలడం లేదు కానీ లోపల ఏదో కదులుతూ ఉన్నట్లు అనిపించింది చాలా గమ్మత్తుగా అనిపించి .. కళ్ళు తెరచి చూశాను. మళ్ళీ కాస్సేపటికి కళ్ళు మూసుకోగానే అదే అనుభూతి!"బహుశః ఋషులు తపస్సు చేసి ఆనందించిన అనుభూతి ఇదేనేమో " అనిపించింది!

 

ఈ క్రమంలో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ PSSM వారి "యోగపరంపర", "అహింస" "శాకాహారం" పుస్తకాలు చూసి అవి కొన్ని చదివాను! బాగా ఆకలి అయినవాడికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికినట్లు అయ్యింది నాకు. అందులో ఇచ్చిన దిల్‌సుఖ్‌నగర్ పిరమిడ్ సెంటర్‌కి పోన్ చేసి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుని మళ్ళీ కొన్ని పుస్తకాలు తెచ్చుకుని చదవడం మొదలుపెట్టాను!

 

మా వారు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. " ఈ జన్మనే చివరి జన్మగా చేసుకుంటూన్న క్రమంలో ఇక ఎవ్వరికీ భయపడకూడదు" అన్న ఆత్మ విశ్వాసంతో మా వారికి గట్టి సమాధానం చెప్పాను.

 

అంతే ! ఇక అప్పటినుంచీ వారు నా పట్ల గౌరవభావంతో మెలగడం మొదలుపట్టారు!!

 

పత్రీజీ సందేశాలు, శాకాహార విశిష్టత, పిరమిడ్ శక్తి .. అన్నీ శ్రద్ధగా చదువుకుంటూ .. ధ్యానం చేసుకునే దానిని మా ముగ్గురు పిల్లలను శ్రద్ధగా చదివిస్తూ ధ్యానం కూడా చేయించే దానిని!

 

"ప్రతి ఒక్క యోగి ఒక పిరమిడ్‌ను తప్పక కట్టాలి" అన్న పత్రీజీ సందేశాన్ని ఆదేశంగా తీసుకుని మా వారితో చెప్పగా వారు "సరే" అనడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది! ఇదంతా ధ్యానమహిమ తప్ప మరొకటి కాదు! వారి సహకారంతోనే మా ఇంటిపై 10'X10' "ఆరోగ్య పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించుకుని పత్రీజీ చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయించుకున్నాము!

 

ప్రస్తుతం మా పిరమిడ్‌లో నిరంతర ధ్యాన కార్యక్రమాలు, ధ్యాన సప్తాహాలు, మౌనధ్యాన తరగతులు జరుగుతున్నాయి. మా ఇంటి చుట్టుప్రక్కల వారందరికీ మా పిరమిడ్ ద్వారా చక్కటి ధ్యాన ప్రచారం జరుగుతోంది. ఇంతటి గొప్ప అవకాశం మాకు అందించి ధ్యాన ప్రచారం ద్వారా మా జన్మలను ధన్యం చేయిస్తున్న పత్రీజీకి మేం కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

 

శ్రీలక్ష్మీ

వారాసిగూడ

సికింద్రాబాద్
99895 19446

 

 

Go to top