" ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం మరి ఆత్మ విశ్వాసం "

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన "దుర్భా లక్ష్మీ నారాయణ శాస్త్రీ (D.L.N. శాస్త్రి)" గారు "ఢిల్లీ శాస్త్రి" గారిగా పిరమిడ్ ప్రపంచానికి సుపరిచితులు, ప్రస్తుతం న్యూఢిల్లీ - గ్రేటర్ నోయిడా లోని "శారదా యూనివర్సిటీ" కి "డీన్" గా తమ సేవలను అందిస్తూన్న ఈ విద్యాధికులు .. ధ్యానం యొక్క విశిష్ఠతను స్వయంగా అనుభూతి చెంది .. దేశ రాజధాని కేంద్రంగా .. తమ జీవన సహచరి "వసంత" గారితో కలిసి ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తూన్నారు. పత్రీజీకి అత్యంత ఆప్తులు అయిన ఈ దంపతులతో ఇన్నర్ వ్యూ "ధ్యాన జగత్" ద్వారా మీ కోసం ..


వాణి: " నమస్కారం సార్! మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము .."


శాస్త్రీ గారు : వైజాగ్‌లో పుట్టి పెరిగిన నా పూర్తి పేరు దుర్భా లక్ష్మీనారాయణ శాస్త్రీ, నా భార్య శ్రీమతి వసంత మరి మా అమ్మాయిలు అలేఖ్య, అమూల్య .. మాది ముచ్చటయిన "ధ్యానకుటుంబం"!

 

నాకు ముగ్గురు చెల్లెళ్ళు, మా నాన్న శ్రీ వెంకటేశ్వర్లు గారు "ఆంధ్రా యూనివర్సిటీ"లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ‌గా పని చేసేవారు. మరి మా అమ్మ శ్రీమతి జానకీబాయి వైజాగ్ "ప్రేమసమాజం" ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేసేవారు.

 

పిఠాపురానికి చెందిన మా తాత గారు అప్పట్లో భారతీయ రైల్వేస్‌లో ఉద్యోగం చేస్తూ మధ్యప్రదేశ్‌లో ఎక్కువ ‌కాలం ఉండడం వల్ల మా అమ్మ హిందీ భాషలో చక్కటి ప్రావీణ్యాన్ని పొందారు. మా అమ్మ ద్వారా నాకు కూడా హిందీ భాషపై మంచి పట్టు రావడం అన్నది ఉత్తరోత్తరా నేను హిందీ ప్రాంతాలకు తరలి రావడానికీ మరి ఉత్తర భారతంలో ధ్యానప్రచారానికీ నాకు ఎంతగానో సహాయం చేసింది.

 

ఆంధ్రాయూనివర్సిటీ లోనే నేను B.com మరి MBA పూర్తి చేశాక "Berger పెయింట్స్" లో నా మొట్టమొదటి ఉద్యోగం రీత్యా 1985 నుంచి 91 వరకు కలకత్తా మరి అసంసోల్ లలో ఉండిపోయాను. అక్కడే నేను అనేకానేక నాటక సమాజాలలో చురుకుగా పాల్గొంటూ నా కళా జీవితాన్ని కూడా ఆవిష్కరించుకున్నాను!

 

ఆ తరువాత వెస్ట్‌బెంగాల్ మరి ముంబయిలలో వేదాంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా HCL, బోయింగ్, మద్రాస్ అల్యూమినియమ్ వంటి పేరెన్నికగన్న కంపెనీల ఉత్పత్తి విభాగాలలో "చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్" గా పని చేశాను. మంచి జీతం, చక్కటి హోదా పేరుప్రతిష్టలు, పనిలో అవార్డులు, ప్రశంసలతో ఏ లోటులేని విజయవంతమైన జీవితాన్ని జీవించాను.

 

ఉద్యోగరీత్యా దుబాయ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, అమెరికా దేశాలను పలుమార్లు సందర్శించాను. 2002 నుంచి ఇక IT రంగంలోకి వచ్చి పిల్లల చదువుల రీత్యా న్యూఢిల్లీ కి వచ్చి స్థిరపడిపోయాను.

 

వాణి: "ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి ఎలా ఏర్పడింది?"


శాస్త్రిగారు: మా అమ్మ పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి భక్తురాలు కావడంతో చిన్నప్పటి నుంచీ నేను కూడా మా అమ్మతో కలిసి సత్సంగాలకూ, భజనలకూ మరి నగర సంకీర్తనలకూ వెళ్తూండేవాడిని.


చాలాసార్లు పుట్టపర్తికి కూడా వెళ్ళి బాబాగారితో మాట్లాడాము. అలా చిన్నప్పటి నుంచే సత్సంగాలలో పాల్గొంటూ పెరిగిన నేను సామూహిక చైతన్యశక్తి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ వచ్చాను. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందులో నాకు వచ్చిన దానినే గ్రహించే సంస్కారం నాకు అలవాటుగా మారడం వల్లే బహుశః "PSSM" లో కూడా నేను అతి సులభంగా ఇమడిపోయాను.

 

మా నాన్నగారు కాలం చేశాక మా అమ్మ తన సోదరితో కలిసి పుట్టపర్తి లోనే స్థిర నివాసం ఏర్పరుచుకుని .. చాలా కాలం పాటు అక్కడి పాఠశాలలో "హిందీ టీచర్" గా పనిచేశారు; ప్రస్తుతం" "సనాతన సారథి" ఆధ్యాత్మిక పత్రికలో తమ సేవలను అందిస్తున్నారు!

 

వాణి: "‘PSSM' తో మీ అనుబంధం ఎలా ఏర్పడింది?


శాస్త్రిగారు : 2009 సంవత్సరంలో .. అప్పట్లో నేను "టెక్ మహీంద్రా" మరి "HCL" కంపెనీలలో లీడర్షిప్ పొజిషన్‌లో పనిచేస్తూ ఉండేవాడిని. కంపెనీల లాభనష్టాలతో మరి టార్గెట్లతో ప్రత్యక్ష సంబంధం ఉన్న విభాగాలలో నేను విపరీతమైన పని ఒత్తిడి మరి ఆందోళనల నడుమ పని చెయ్యాల్సి రావడంతో నేను తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధికి గురిఅయ్యాను.

 

దీనివల్ల నా మెదడు యొక్క రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోయి నా శరీరంలోని ఎడమవైపు భాగమంతా పక్షవాతానికి గురి అయ్యింది. రోజువారీ పనులను అతికష్టం మీద చేసుకోగలిగినా విపరీతమైన నీరసం మరి నిస్త్రాణతతో అప్పుడప్పుడూ నా శరీర భాగాలు మరి మెదడు భాగం అంతా మొద్దుబారినట్లు అయ్యేది.

 

కుటుంబంలో నేను ఒక్కడినే సంపాదించేవాడిని కావడంతో .. బ్యాంక్‌లోన్లు, కమిట్‌మెంట్‌లు మరి పిల్లల చదువులు నన్ను మరింత డిప్రెషన్‌కి గురిచేసేవి.

 

ఆ సమయంలో నా భార్య "వసంత" ఎంతో ధైర్యంతో నిబ్బరంగా ఆ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని నన్ను డాక్టర్ల చుట్టూ త్రిప్పడం, టైమ్కి మందులు వెయ్యడం చేసేది.

 

ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ అందరితో కలివిడిగా ఉండే నేను అలా సైలెంట్‌గా మరి శక్తి హీనుడిగా మారడం నా కుటుంబ సభ్యులను మరి నా స్నేహితులనూ కలచివేసింది.

 

అలాంటి సమయంలో ఒకానొక కజిన్ రెకమండేషన్ చేయగా ప్రఖ్యాత "మురళీ ఇండస్ట్రీస్" వారి నాగపూర్ క్రొత్త విభాగం అభివృద్ధి కొరకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి వెళ్ళాను.

 

స్థలం మార్పువల్ల నా ఆరోగ్యం కుదుటపడుతుందన్న ఆశతో నాగపూర్ వెళ్ళి ఆ కంపెనీ డైరెక్టర్ "మహేశ్ మాలూ" గారిని కలిసి కంపెనీ అభివృద్ధి కొరకు నా అధ్యయనం మేరకు తయారు చేసిన పటిష్టమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. నిజానికి అది చాలా మంచి ప్రజెంటేషన్ అయినా .. ఆ డైరెక్టర్ గారు దానిని సగం వరకే విని "ఇక చాలు" అనడంతో నాకు చాలా కోపం వచ్చింది.

 

ఆయన తీరికగా కూర్చుని తన సెల్‌ఫోన్‌లో ముంబయికి చెందిన కొందరు సినిమా యాక్టర్ల ఫోటోలు అవీ చూస్తూ .. నాకు కూడా వాటిని చూపించి వారితో తమ పరిచయం గురించి వివరించారు.

 

"ఇంత ముఖ్యమైన బిజినెస్ మీటింగ్‌ను ప్రక్కన బెట్టి ఈయన ఇలా ఫోటోలు చూస్తూ కూర్చున్నాడేమిటీ?! అనుకుంటూ ఉండగానే ఆయన ‘గ్రూప్ మెడిటేషన్’, ‘పిరమిడ్’ మరి ‘పత్రీజీ’ ల ఫోటోలను చూపించి "వారు నాకు మంచి ఫ్రెండ్" అని చెప్పారు!

 

"ఇంత చిన్న వయస్సులో ఈయనకు ఆ గెడ్డం ముసలాయనతో స్నేహమేంటబ్బా?!" అనుకుంటూ ఉండగానే ఆయన "ఎప్పడయినా ధ్యానం చేశారా?" అని అడిగారు

.

అయితే అదివరకే ఏవేవో ధ్యానాలూ అవీ చేస్తూండడంతో "చేశాను" అని చెప్పాను. దాంతో ఆయన "పదండి కాస్సేపు ధ్యానం చేద్దాం" అని "ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస ధ్యానం" గురించి నాకు వివరించి .. నాతో చేయించారు. తరువాత నాకు "స్పిరిచ్యువల్ ఇండియా" మరి "ది సీక్రెట్" పుస్తకాలు ఇచ్చి లంచ్ చేయించి పంపారు!!

 

ఇంటికి వచ్చాక విషయమంతా తెలుసుకున్న "వసంత" చాలా సంతోషించింది. ఎందుకంటే అంతకు ముందు విజిట్లలోనే డాక్టర్లు నాతో "మెడిటేషన్ చేయించడం మంచిది" అని ఆమెతో చెప్పి ఉన్నారు.

 

దాంతో తను వెంటనే ఇంటర్నెట్లో PSSM వెబ్‌సైట్‌లను వెతికి .. "PSSM" గురించి చదివి.. న్యూఢిల్లీలో ఎక్కెడెక్కడ మెడిటేషన్ సెంటర్లు ఉన్నాయో చూసుకున్నాం. "ఇంద్రపురి"లో "భానుప్రసాద్" అనే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్వహిస్తూన్న మెడిటేషన్ సెంటర్ వివరాలు చూసి అక్కడికి వెళ్ళాం.

 

MA, M.tech వంటి ఉన్నత చదువులు చదివి .. ఎక్కడో ఆంధ్రదేశంలో ఉన్న తమ వాళ్ళందరినీ వదిలి పెట్టి అక్కడికి వచ్చి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా అతి కష్టం మీద ఆ సెంటర్‌ని నడిపిస్తూన్న ఆ పిరమిడ్ యువత ను చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది. సరే అక్కడి వివరాలన్నీ తెలుసుకుని వచ్చేశాం!

 

మర్నాడు మధ్యాహ్నం 12.00 గం||లకు మా కంపెనీ తాలూకు బిజినెస్ మీటింగ్ ఒకటి అంతకు ముందే ఏర్పాటు కాబడి ఉండడంతో "సరే, ఈలోగా పది నిమిషాలు సెంటర్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్దాం" అనుకుని వెళ్ళాను! "ఎలాగూ వచ్చారు కదా, ఒక పది నిమిషాలు ధ్యానం చెయ్యండి" అన్నాడు భాను!

 

మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టి కళ్ళు మూసుకుని అక్కడ పిరమిడ్ క్రింద కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచాను! దాదాపు గంటన్నర సేపు అసలు నేను ఈ లోకంలోనే లేను!! కళ్ళు తెరిచి చూస్తే .. టైమ్ "12.30" అయ్యింది! నా సెల్ఫోన్‌లో 30 మిస్డ్ కాల్స్!!

 

ఇంతకు అద్భుతం ఏమిటంటే ఎంతో సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ .. ఎన్నో రోజుల క్రితమే షెడ్యూల్డ్ కాబడి కూడా అనుకోని కారణాల వల్ల మధ్యాహ్నం 3.00గం||లకు వాయిదా పడిందని మా ఆఫీస్ వాళ్ళు నా సెల్‌ఫోన్‌కు చెయ్యడం! నేను స్పందించకపోవడంతో మా ఇంట్లో వాళ్ళకు చేస్తే వాళ్ళు ఖంగారు పడడం!!

 

నాకు చాలా ఆశ్చర్యం వేసింది. "ధ్యానంలో ఏదో శక్తి ఉంది" అని మొట్టమొదటిసారి అనిపించింది. ఇక అప్పటినుంచి వారాంతపు రోజులలో మేము క్రమం తప్పకుండా "ఇంద్రపురి పిరమిడ్ సెంటర్." కి వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళం.

 

వాణి: "ధ్యానంలో ఏవైనా అనుభవాలు.."


శాస్త్రి గారు : ఈ క్రమంలో ఒకసారి సెంటర్‌లో పౌర్ణమి ధ్యానం జరిగింది. ఆ చక్కటి సామూహిక ధ్యాన కార్యక్రమంలో అర్థరాత్రి 2.00 గం|| ల నుంచి తెల్లవారు 6.00 గం||ల వరకు నాలో నేను లేను! చాలాసేపటి వరకు విపరీతమైన శక్తిప్రవాహం నాలో ప్రవహిస్తూ నా శరీరం ఒక ఉండలా మారి గిరగిరా తిరిగిపోయింది. వరుసగా నాలుగు పౌర్ణమిల పాటు ఇలాగే జరిగింది!అంతకు ముందు ఉన్న నా అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గుముఖం పట్టడం నాకే అర్థం కావడంతో మెల్లిమెలిగా నేను వాడుతూన్న మందులను తగ్గిస్తూ వచ్చాను!

 

అతి కొద్ది కాలంలోనే సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో కూడిన ఆరోగ్యవంతుడిని కావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. "అంతా ఓకే" అని రిపోర్టులు వచ్చాయి!!

 

ఇంత గొప్ప ధ్యానం గురించి అందరికీ తెలియజేయాలన్న తపనతో ఎక్కడికి వెళ్ళినా ధ్యాన కరపత్రాలు పంచుతూ ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌లుగా పనిచేస్తున్న తెలుగు పిరమిడ్ మాస్టర్లు "పల్లవి", "కృష్ణలు" కూడా కలవడంతో ఇక్కడ పార్కులలో చక్కటి ధ్యాన ప్రచారం నిర్వహించేవాళ్ళం. "ఇంద్రపురిలోని ధ్యానకేంద్ర నిర్వహణ బాధ్యతను తీసుకోవాలి" అని ఆ సమయంలో నాకు చాలా బలంగా అనిపించింది!

 

ఈ క్రమంలోనే ఢిల్లీలో పత్రీజీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నేను, వసంత ఆ కార్యక్రమానికి వెళ్ళి పత్రీజీని కలిశాం! వారు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ "ఎక్కడున్నావయ్యా ఇన్నాళ్ళూ?!" అన్నారు ఆప్యాయంగా! అప్పటి వరకు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను చూసి ఉన్న నేను వారి స్నేహానికీ మరి సింప్లిసిటీకి ఆశ్చర్యపోయాను!

 

"ఇక్కడే ఉన్నానండీ ఢిల్లీలో" అన్నాను సంతోషంగా! "అయితే ఢిల్లీని మీరే చూసుకోవాలి" అన్నారు! అది ఆజ్ఞో, ఆదేశమో, మార్గదర్శనమో తెలియదుకానీ ఆ రోజు నుంచీ ఢిల్లీలో జరుగుతూన్న అన్ని కార్యక్రమాలనూ నేనే నిర్వహిస్తూ వస్తున్నాను.

 

2010 సంవత్సరం నుంచి న్యూఢిల్లీలో జరిగిన ధ్యాన కార్యక్రమాలకూ మరి "అంతర్జాతీయ ఫ్లూట్ ఫెస్టివల్" లో పాల్గొనడానికి న్యూఢిల్లీకి వచ్చిన పత్రీజీ మా ఇంట్లోనే బసచేయడంతో వారితో మా ఆత్మీయ అనుబంధం మరింత బలపడింది!

 

వారి సూచనతో మా ఇంటికి దగ్గరలో ఒక మెడిటేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేసి న్యూఢిల్లీలో ధ్యానప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశాం. ఆ తరువాత రెండు సంవత్సరాలకు మా ఇంటిపైనే "పరినిర్వాణ" రూఫ్ టాప్ పిరమిడ్ ను నిర్మించి మా ధ్యానకేంద్రం ఆధారంగా చంఢీఘర్, లూథియానాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాం!

 

వాణి: "తీహార్ జైలులో చేపట్టిన మీరు ధ్యాన కార్యక్రమాలను వివరించండి.."


శాస్త్రీగారు: తీహార్ జైలులో ధ్యాన ప్రచారం నా జీవితంలోనే ఒక గొప్ప కార్యక్రమం! ఒక రోజు నేను మా ధ్యానకేంద్రంలో కూర్చుని పౌర్ణమిధ్యానం చేసుకుంటూ ఉంటే.. "కారాగారంలో ఉండే మహిళా ఖైదీలకు ధ్యానం నేర్పాలి" అన్న సందేశం పదే పదే నాలో నుంచి ఎవరో చెబుతున్నట్లుగా వచ్చింది!

 

ఈ విషయాన్ని వసంత తో మరి మా సెంటర్‌కి వచ్చే ‍న్యూఢిల్లీ పిరమిడ్ మాస్టర్ "నళినీ కమల్" మేడమ్‌తో చెప్పగా ఆవిడ తన ఫ్రెండ్ భర్త అయిన ‘DIG' గారిని పరిచయం చేశారు. వారి సహకారంతో తీహార్ జైలు అధికారులను కలిసి అక్కడ .. మహిళా ఖైదీలకూ మరి బాలనేరస్థులకూ .. ధ్యానశిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.

 

అత్యంత శాస్త్రీయంగా మేము నిర్వహిస్తోన్న పిరమిడ్ ధ్యాన కార్యక్రమాలు జైలు అధికారులకు నచ్చడంతో వారు సంవత్సరం పాటు న్యూఢిల్లీలోని అన్ని సబ్ జైళ్ళలో ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు! ఈ కార్యక్రమాల ద్వారా ఖైదీలలో చక్కటి మానసిక పరివర్తన కలగడం .. తాము చేసిన తప్పులకు వారు పశ్చాత్తాపపడడం .. అధికారులకు ఎంతగానో నచ్చింది.

 

ఆ సమయంలో పత్రీజీ కార్యక్రమం కూడా తీహార్ జైల్‌లో ఏర్పాటు చేయబడి పలువురు జైలు అధికారులు అందులో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వైజాగ్ పిరమిడ్ మాస్టర్ "N.S.కిషోర్" సహకారంతో ఖైదీలకు పిరమిడ్ నిర్మాణం వర్కషాప్‌లు కూడా నిర్వహించాం.

 

వాణి: "చాలా బాగుంది సర్! మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన PSSM జాతీయ కార్యక్రమాల వివరాలు .."


శాస్త్రిగారు : పత్రీజీ ఏ పని చెప్పినా చేయడనికి నేను ఎప్పుడూ సంసిద్ధునిగా ఉంటాను. వారి సూచన మేరకు నవీన ఆధ్యాత్మికవేత్తలను అందరినీ ఒకానొక ఉమ్మడి వేదికపై చేర్చడానికి ఏర్పాటుచేయబడిన IFSS కార్యక్రమాలను చంఢీఘర్, డెహ్రాడూన్ మరి న్యూఢిల్లీలలో నిర్వహించడం జరిగింది.

 

అది నాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అన్నింటినీ మించి 2016 మార్చి 12, 13 తేదీలలో న్యూఢిల్లీలోని శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రంలో మొట్టమొదటి సారిగా "జాతీయ శాకాహార-ఆధ్యాత్మిక సమ్మేళనం" ఏర్పాటు చేయబడింది. "లేహ్-లడఖ్" కి చెందిన "మహాబోధి అంతర్జాతీయ ధ్యానకేంద్రం" వ్యవస్థాపక అధ్యక్షులు "భిక్కు సంఘసేవ" గారితో పాటు మరెందరో ఆధ్యాత్మిక వేత్తలు, శాకాహార ప్రచార కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుఅయ్యారు.

 

దాదాపు 800 మంది ధ్యానులు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని శాకాహార విశిష్ఠతను ప్రపంచానికి తెలియజేశారు.

 

వాణి: "మీ భవిష్యత్ ప్రణాళిక.."


శాస్త్రీగారు: పిరమిడ్ వ్యాలీ బెంగళూరు, కైలాసపురి, హైదరాబాద్ లలో లాగే భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా పెద్ద ధ్యాన పిరమిడ్ రావాలి.

ఆ దిశగానే ఉత్తర భారతదేశవ్యాప్తంగా ఉన్న ధ్యానులనూ, పిరమిడ్ మాస్టర్లనూ సంఘటిత పరుస్తూ .. పనిచేయడమే నా లక్ష్యం!!


వాణి: "హలో ‘వసంత’ గారూ! పిరమిడ్ ధ్యానకుటుంబపు ఆదర్శ గృహిణిగా మీ అనుభవాలను కూడా మేము వినగోరుతున్నాము.."


వసంత గారు: శాస్త్రీ గారి అనారోగ్యం కారణంగానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలు.. బాగా సంపాదిస్తూ నన్ను ప్రేమగా చూసుకునే విద్యాధికులయిన నా భర్త! ఇలా ఏ లోటు లేని మా సంసారం మా వారి అనారోగ్యంతో ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయ్యాం! నేను చాలా ఒత్తిడికి గురి అయ్యాను! కానీ అది నన్ను నేను నిలకడగా ఉంచుకుంటూ నా భర్తనూ, పిల్లలనూ చూసుకోవాల్సిన పరిస్థితి! వారి వైద్యం కోసం ఎందరో డాక్టర్ల దగ్గరికి తిరిగే వాళ్ళం! రోజుకు పన్నెండు రకాల మందులు ఇవ్వాల్సి వచ్చేది.

 

భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉండేది! అటువంటి సమయంలో "ధ్యానం మా పాలిటి వరం" లా లభించి మా వారినే కాదు మా కుటుంబాన్నంతటినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చివేసింది!

 

వాణి : "టీనేజీలో ఉన్న ఇద్దరు కూతుళ్ళతో మీరు ధ్యాన ప్రచార కార్యక్రమాలను ఎలా సమన్వయపరచుకునేవారు?
వసంత గారు: నేను భక్తి సాంప్రదాయా ప్రధానమైన కుటుంబంలో పెరిగి పెద్దయ్యాను. ఇతరులకు సేవ చేయడం .. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడం వంటి సంస్కారాన్ని మా అమ్మ "శ్రీమతి వర్థని" మరి మా నాన్న "శ్రీ రామ జోగిశాస్త్రీ" గార్లు నాకు అందించారు! చిన్నప్పటి నుంచీ నేను మా అమ్మతో కలిసి గుడికి వెళ్తూ .. పూజలు చేస్తూ ఉన్నా .. నా మనస్సులో దేవుడి గురించీ మరి భక్తి గురించీ ఎన్నెన్నో ప్రశ్నలు వస్తూండేవి. పెద్దవాళ్ళను అడిగినా .. సరియైన సమాధానాలు వచ్చేవి కావు.

 

ఏదో మ్రొక్కుబడిగా వాళ్ళతో కలిసి పూజలూ అవీ చేసేదానిని కానీ నా అంతరంగంలో గొప్ప అంతర్మధనం సాగేది! అది అలా పెరిగి పెద్దదయ్యి .. ఇక నాకు 40 యేళ్ళ వయస్సు వచ్చేసరికి "పూజలు, జపాలు చెయ్యడం తగ్గిస్తూ వచ్చాను. "ఇంకా తెలుసుకోవలసింది ఏదో వుంది.. ఈ తతంగాలలో ఎంతో ద్వంద్వత్వం ఉంది" అనిపించేది. ధ్యానంలోకి వచ్చాక కానీ ఊహ తెలిసినప్పటి నుంచీ నేను దేనికోసం ఆర్తి చెందుతున్నామో నాకు అర్థం కాలేదు.

 

వాణి: "అయితే మీకు ధ్యానంలో బోలెడు అనుభవాలు వచ్చి ఉంటాయి.."


వసంత గారు: నాకు ఒక్క ధ్యానానుభవం వస్తే ఒట్టు! మా ఇంటికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళేవాళ్ళంతా "మాకు దివ్యచక్షువు తెరుచుకుంది .. మాకు దృశ్యాలు కనిపించాయి .. మాకు మాస్టర్లు దర్శనం ఇచ్చారు .. సునామీలు, భూకంపాలు వచ్చేది మాకు ముందుగానే తెలిసిపోతున్నాయి .. మేం సూక్ష్మశరీర యానాలు చేశాం" అని చెబుతూ ఉంటే "అయ్యో! అవేవీ నాకు రావడంలేదే?" అని తెగ బాధపడిపోయేదానిని.

 

"నా ధ్యానం లోనే ఏదో లోపం ఉంది" అని మధనపడుతూ పత్రీజీ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా వారితో మొరపెట్టుకునే దానిని. "అవన్నీ మీకు గత జన్మలలోనే అయిపోయాయి మేడమ్" అనేవారు సార్! "ఏదో నన్ను సమాధానపరచడానికే అలా అంటున్నారులే" అనుకుని మళ్ళీ మళ్ళీ అడుగుతూండే దానిని!

 

ఇలా ఊరికే వారి వెంటపడుతూంటే వారు ఒకరోజు "ఇక మీరు ధ్యానప్రచారానికి బయలుదేరండి మేడమ్" అన్నారు గట్టిగా! "నాకేం అనుభవం ఉంది సార్? నేనేం చెయ్యగలను??" అన్నాను సందేహంగా .. "తల్లిగా మీకు ఇదివరకు అనుభవం ఉండే మరి ఇద్దరు పిల్లల్ని కని, చక్కగా పెంచుతున్నారా? ఇదీ అంతే .." అన్నారు సింపుల్‌గా!

 

చెంప పెట్టులా తగిలింది నాకు ఆ మాట! అంతే! ఇక నేను ఏనాడూ ధ్యానానుభవాల కోసం వెంపర్లాడుతూ కూర్చోలేదు; ధ్యానప్రచారం చేసుకుంటూ వెళ్ళానంతే!

 

వాణి: "మీ ధ్యాన ప్రచార విశేషాలు.."


వసంత గారు: ఈ క్రమంలో మా పెద్దమ్మాయి "అలేఖ్య" లో సహజంగా టీనేజీలో ఉండే ప్రవర్తన కారణంగా నేను దానిని అర్థం చేసుకోలేక కొంత ఆందోళనకు గురికావడం జరిగింది. ఆ సమయంలో కూడా పత్రీజీ ఒక కన్నతల్లిలా నాకు సత్యాన్ని తెలియజేసి నన్ను నేను సరిచేసుకునేలా నాకు శిక్షణ ఇచ్చారు.

 

మహాతత్త్వవేత్త "ఖలీల్ జిబ్రాన్" గారి "ది ప్రోఫెట్" అనే ఆత్మజ్ఞాన గ్రంథాన్ని నాకు ఇచ్చి చదవమన్నారు. అందులో ..

 

"మీ పిల్లలు.. మీ పిల్లలు కారు! వాళ్ళు వాళ్ళ జీవితానికే చెందిన వారు. "వాళ్ళు మీ ‘నుంచి’ వచ్చారే కానీ .. మీకు ‘చెందిన’ వాళ్ళు కాదు! మీరు వాళ్ళకు ప్రేమను మాత్రమే పంచగలరు కానీ మీ ఆలోచనలను కాదు! మీరు వాళ్ళ శరీరాలను పోషించగలరే కానీ .. వాళ్ళ ఆత్మలను కాదు! ఎందుకంటే మీరు దర్శించలేని .. మీరు కనీసం కలగనలేని భవిష్యత్తులో నివసించే ఆత్మలు వాళ్ళు!

 

"వాళ్ళను మీలా తయారు చేయడానికి బదులుగా వాళ్ళలా మీరు ఉండడానికి ప్రయత్నించండి! ఎందుకంటే ‘జీవితం’ అన్నది ‘నిన్న’లో నిలిచిపోవడం కానీ .. వెనుకకు ప్రవహించడం’ కానీ జరుగదు కదా! "సృష్టికర్త అనే విలుకాని చేతిలోని విల్లు మీరు అయితే అతనిచే సంధించబడిన బాణాలు వాళ్ళు! లక్ష్యాన్ని బట్టి విలుకాడు బాణాన్ని సంధిస్తాడు కనుక విల్లులా వంచబడడానికి మీరు సంతోషంగా సంసిద్ధులు కావాలి! లక్ష్యాన్ని చేరే బాణంతో పాటే స్థిరంగా వంగే విల్లును కూడా విలుకాడు ప్రేమిస్తాడు" అని ఉంది!

 

ఇది అర్థం చేసుకున్న తరువాత ఇక పిల్లల విషయంలో నేను ఎంత పరివర్తన చెందానో ఎంత పరిణితి చెందానో .. నాకు .. నా పిల్లలకే తెలుసు! వాళ్ళకూ నాకూ మధ్య ఎంతటి స్నేహం పెరిగిందీ నేను చెప్పలేను!!

 

నన్ను చూసి .. ధ్యానంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకుని .. పత్రీజి పట్ల గౌరవప్రత్తులతో వారు కూడా ధ్యానమార్గంలోకి వచ్చేశారు!! ఈ రోజు వారు చక్కగా చదువుకుని.. జీవితంలో స్థిరపడి తమ ఈడు పిల్లలకే "యూత్ ఎమ్‌పవర్‌మెంట్" క్లాసులను నిర్వహిస్తున్నారు!

 

వారి శిక్షణలో పరివర్తన చెందిన పిల్లల తల్లితండ్రులు మా పిల్లలను మెచ్చుకుంటూంటే ఒక తల్లిగా నేను గర్వపడుతూంటాను! ఒకప్పుడు రాబోయే సునామీలనూ మరి భూకంపాలనూ దివ్యచక్షువుతో చూడాలని తహతహలాడిన నేను .. పత్రీజీ అందించిన "ఆత్మజ్ఞానం" తో నా కుటుంబంలో సునామీలూ మరి భూకంపాలూ రాకుండా కాపాడుకున్నాను! మా పిల్లల సలహాతోనే నేను తల్లితండ్రుల కొరకు "స్పిరిచ్యువల్ పేరెంటింగ్" క్లాసులను ప్రత్యేకంగా నిర్వహించడం మొదలుపెట్టాను.

 

పిల్లల పట్ల అతిగా, ఆజ్ఞానంగా ప్రవర్తించే తల్లితండ్రులెందరో ఈ శాస్త్రీయమైన తరగతులలో పాల్గొని తమను తాము సరిదిద్దుకున్నారు! ఈ తరగతుల నిర్వహణకు గాను బ్యాంక్ ఉద్యోగిని అయిన నా స్నేహితురాలు, మరి గొప్ప పిరమిడ్ మాస్టర్ అయిన "జెస్సీ" నాకు సహాయం చేసేది!

 

వాణి: "ఆ తరగతులలో ఏం చెప్పేవారు?"


వసంతగారు: కేవలం నా ధ్యాన జీవిత అనుభవాలనే నేను ఆ తరగతులలో వారికి తెలియజేసేదానిని! ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిండిన ఈ నాటి ప్రపంచంలో "పిల్లలను పెంచడం" అన్నది ఛాలెంజ్‌గా మారిపోయింది! సమాజాన్ని పట్టి పీడిస్తోన్న "పోటీతత్త్వం" వల్ల పిల్లలు అయితే అతిశయాలకూ లేదా ఆత్మన్యూనతకూ గురికావడం మనం చూస్తూన్నాం!

 

ఇటువంటి పరిస్థితులలో పిల్లలలోని 100% సర్వసమర్థతను బయటికి తీసి .. అనారోగ్యకరమైన పోటీతత్త్వనుంచి వారిని బయటికి పడేసేలా చేస్తూన్న "ధ్యానంలోని శాస్త్రీయత" ను అందరూ గుర్తిస్తున్నారు! ఇది అత్యద్భుత పరిణామం!

 

భూమాత యొక్క ఈ క్లిష్ట సమయంలో "మన బాధ్యత మరింత పెరిగింది" కనుక ఈ దిశగానే మా ధ్యానప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం.

 

088870 84018

 

 

Go to top