" నాకు .. అంతా విజయమే "

 

 

నా పేరు "దేవిక". నేను మా అత్తయ్య "ధనలక్ష్మి"గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. 21.6.2015 యోగా దినోత్సవం రోజు పేపర్‌లో ప్రకటన చూసి నల్గొండలోని "శ్రీ సదానంద పిరమిడ్" ధ్యాన కేంద్రానికి వెళ్ళాను. అక్కడ కొందరు ధ్యానులు చెప్పిన అనుభవాలు విని ఆశ్చర్యం వేసింది. "ధ్యానం చేస్తే ఇంత మార్పు వస్తుందా?" అనుకున్నాను.

 

అక్కడి నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు శాకాహార ర్యాలీ చేసి అక్కడ ధ్యాన తరగతి నిర్వహించారు. అందులో శ్రీ పిప్పళ్ళ ప్రసాద్ గారి నాద ధ్యానం, శ్రీ ఓబయ్యగారి ప్రసంగం విని చాలా ప్రేరణ పొందాను. ఆ రోజు నుంచే శాకాహారిగా మారాను!

 

నేను ధ్యానంలోకి రాకముందు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి. నిద్రపోవడం కోసం ప్రతిరోజూ నిద్రమాత్రలు వేసుకునేదాన్ని. తరచూ జ్వరం వస్తూ ఉండేది. రక్తహీనతతో బాధపడుతూండేదానిని. నెలకు రెండు వేల రూపాయలు వరకు మందులు కోసం ఖర్చు చేసేదాన్ని.

 

మా వారు ప్రతిరోజూ మద్యం తీసుకునేవారు. దాంతో గొడవలు జరుగుతూ ఉండేవి. దానికి తోడు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇటువంటి పరిస్థితులలో మనశ్శాంతి కోసం ధ్యానంలోకి వచ్చాను.

 

ఇంక అప్పటి నుంచి నా జీవితంలో మెల్లమెల్లగా మార్పులు వచ్చాయి. రోజూ నిద్ర మాత్ర వేసుకునే నేను ధ్యానం మొదలు పెట్టిన రోజునుంచి ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. ఎప్పుడో వదిలి వేసిన నా చదువు తిరిగి కొనసాగించగలననే నమ్మకం నాలో కలిగింది. చదువు పూర్తిచేసి ఇప్పుడు "ఉపాధ్యాయిని" ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నాను.

 

మా వారు ఆల్కహాల్ మానేయడంతో పాటు పూర్తి శాకాహారిగా మారారు! మా పాప "సాయి కీర్తన" ధ్యానం చేస్తూ పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అయ్యింది. తాను చదివిన ప్రశ్నలే పరీక్షలలో రావడంతో ధ్యానం పై నమ్మకం పెరిగింది. ప్రతిరోజూ మేము అందరం కలిసి ధ్యానం చేస్తున్నాము.

 

నేను పొందిన ఆనందం అనుభూతి అందరూ పొందాలనే ఉద్దేశ్యంతో తెలిసిన వాళ్ళకూ, బంధువులకూ, మిత్రులకూ ధ్యానం ప్రాముఖ్యతను చెప్పి వారితో ధ్యానం చేయిస్తున్నాను. వారు ధ్యానం చేస్తూ అనుభవాలు పొందుతున్నారు.

 

మే 1, 2016న పత్రి సార్ "హాలియా" వెళ్తూ నల్లగొండలో గంటన్నర సేపు గడిపారు. సర్ వస్తారన్న విషయం 10 నిమిషాలు ముందు తెలుసుకున్న నేను ఎంతో ఆత్రుతతో అక్కడికి చేరుకున్నాను. ధ్యానం చేసాక సార్ అందరినీ వరుసగా కలుస్తూ వస్తున్నారు. నా వరకు వచ్చేసరికి నాలో ఏవో తెలియని భావోద్వేగం నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగకుండా దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చి! అది చూసిన సార్ నన్ను అప్యాయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు!

 

ఇక అంతే .. నాలో ఉన్న భారం అంతా దించేసినట్లు అయ్యింది. ఇంక నాకు ఏ బాధ లేదు, "అంతా విజయమే" అనిపించింది. "ప్రపంచాన్నే జయించగలను" అనే మనోధైర్యం కలిగింది.

 

నేను ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నాను అంటే అది ధ్యానం ద్వారానే. ఈ ఆనందాన్ని ఇచ్చిన విశ్వానికీ, జగద్గురువు పత్రీ సార్‌కూ నాకు తోడ్పడిన మాస్టర్లందరికీ శతకోటి పాదాభివందనాలు.

 

 

దేవిక

నల్గొండ జిల్లా

 

Go to top