"వారి దివ్యమైన శోభ ముమ్మిడివరానికే వన్నె తెచ్చేది "

 

 

నా పేరు "శివప్రసాద్". నేను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకా "కొత్తలంక" గ్రామంలో దువ్వూరి వెంకటేశ్వర శర్మ, సీతామహాలక్ష్మి గార్ల మూడవ సంతానంగా జూన్ 25, 1967లో జన్మించాను.

 

నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి .. నేను విన్న యోగులు, బాబాలు ఇద్దరే! ఒకరు మా ఇంటి దగ్గరలోని "వల్లీబాబా" రెండవ వారు "ముమ్మిడివరం బాలయోగి".

 

నా చిన్నతనంలో ఈ ఇరువురి ఆశ్రమాలకు నేను తరచుగా వెళ్ళేవాడిని. మరి అక్కడ ఏదో తెలియని ఒక రసానుభూతిని నేను పొందడం జరుగుతూ ఉండేది. ఏడవతరగతి చదువుతూన్న రోజులలో ఒకసారి నా మిత్రులతో కలిసి నేను శ్రీబాలయోగి గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు .. నేను పొందిన అలౌకికానుభూతి ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోలేనిది!

 

శివరాత్రి వచ్చిందంటే చాలు మా ముమ్మిడివరం తో పాటు చుట్టుప్రక్కల ఊళ్ళంతా ఒక మహావేడుక! ఆ మరుసటి రోజు శ్రీ బాలయోగి గారు సమాధి నుంచి బయటికి వచ్చి అందరికీ ‘యోగ దర్శనాన్ని’ ఇచ్చే అద్భుతాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేవారు. ఆ రోజు వేలాది మంది భక్తులు శ్రీబాలయోగి గారిని దర్శించడానికి తండోపతండాలుగా అనేక ప్రాంతాల నుంచి వస్తూ వుండేవారు. శ్రీవారి దివ్యమైన శోభ ముమ్మిడివరానికే వన్నె తెచ్చేది.

 

19 జూలై, 1985న వారు దేహత్యాగం చేసారు. అదే సంవత్సరం సత్యాన్ని అన్వేషిస్తూ నేను ఆ ప్రాంతం వదిలిపెట్టాను. చిన్నతనంలోనే అద్భుతమైన ధ్యాన తృష్ణను నాలో రగిలించిన శ్రీబాలయోగి గారికి శతసహస్ర వందనాలు!

 

అయితే, ధ్యాన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ ని కలిసిన తరువాతే .. మరి నేను నిరంతర ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టిన తరువాతే .. బాలయోగీశ్వరుల యోగమహిమలు నాకు అవగతం కావడం మొదలైంది. మనల్ని అందరినీ తీర్చిదిద్దుతూన్న బ్రహ్మర్షి పత్రీజీకి నా వినమ్రప్రణామాలు!

 

1994లో నా ఆధ్యాత్మిక జీవితం అనంతపురంలో .. ప్రారంభమై .. 1995 నుండి ఇక విశేషమైన ధ్యాన సాధన మరి ధ్యాన ప్రచారం మొదలయింది; ఆ తరువాత "పత్రీజీ అంతరంగిక బృందం"లో నేను శాశ్వతంగా చేరిపోవడం అన్నది పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి తెలిసిన విషయమే!

 

దువ్వూరి శివప్రసాద్

తిరుపతి

Go to top