" ఆత్మ విజ్ఞానం కోసం ధ్యానం "

 

 

నా పేరు "నరసయ్య". సూరత్‍ లో RMP డాక్టర్‌గా ఉన్నాను. "వైజాగ్ కిషోర్", "యిల్లందు వెంకటేశ్వర్లు" గార్ల ద్వారా 25.2.2010లో 40 రోజుల ధ్యానం క్లాసులు పెట్టించడంతో నా ధ్యాన ప్రయాణం మొదలైంది. సద్గురు బ్రహ్మర్షి పత్రీజీ దర్శనం లభించి "ఆయన వ్యక్తి కాదు శక్తి" అని తెలుసుకున్నాను.

 

సూరత్ నగరంలో మిత్రుల ఏరియాలలో 40రోజుల క్లాసులు మొదటి ఆరు నెలలోనే సుమారు 12 క్లాసులు పెట్టించాను. చాలా మంది మాస్టర్లు వచ్చేవారు. 25.5.2010లో "బుద్ధపౌర్ణమి"కి బెంగళూరు వెళ్ళాను. అక్కడ పిరమిడ్ యొక్క అద్భుతం నాకు అర్థం అయ్యింది. అక్కడే "నేను సూరత్‌లో ఒక పిరమిడ్ కట్టాలి" అన్న నిర్ణయం తీసుకున్నట్టుగానే .. 15.8.2010లో బ్రహ్మర్షి పత్రీజీతో 22'x22' పిరమిడ్, 30'x60' సైజులో హాలుకు శంఖుస్థాపన జరిగింది!

 

23.3.2011 నాడు ప్రారంభోత్సవం .. మొదటి పౌర్ణమి ధ్యానం చేసిన తరువాత కంచి రఘురామ్, మెగా మురళి గార్లతో పిరమిడ్ ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి పౌర్ణమి ధ్యానం మూడురోజులు, అమావాస్య ధ్యానం ఒకరోజు చేస్తున్నాము.

 

పిరమిడ్ కట్టిన ఒక సంవత్సరంలోపే నాకు తీవ్రమైన అనారోగ్యంతో మూడు నెలలు ఆహారం ద్రవ పదార్ధాలు తీసుకున్నా సరే .. వాంతులు, విరోచనాలు, దగ్గు, జ్వరం .. నా బరువు 80 కేజీల నుంచి 50 కేజీలకు వచ్చింది. చాలా మంది మందులు వాడమని సలహా ఇచ్చారు. నేను ధ్యానం కూడా చేయలేని స్థితి.

 

కూర్చుంటే దగ్గు వచ్చేది. అయినా "ధ్యానం" అనేదాన్ని దృఢంగా నమ్మాను. క్రమంగా కోలుకున్నాను. పిరమిడ్ శక్తిని, ధ్యాన శక్తిని స్వయంగా అనుభవించాను. నా కుటుంబం, నేను ధ్యానం మొదలు పెట్టినరోజు నుంచే శాకాహారులుగా మారాము.

 

నా శ్రీమతి మా ఇద్దరు అమ్మాయిలు కూడా ధ్యానం, ధ్యానప్రచారం చేస్తారు! మేము సూరత్‌ లో ఒక టీమ్‌గా కలిసి కట్టుగా ప్రచారం చేస్తూంటాం. చాలా మంది మిత్రులు అనేకానేక ధ్యానానుభవాలు పొందారు.

 

సూరత్‌ లో అయిదు పిరమిడ్‌లు తయారయ్యాయి! అందరూ పిరమిడ్ శక్తిని తెలుసుకుంటున్నారు. నాకు త్రి రత్నాలు దొరికాయి. అవి 1. ధ్యానం 2. పత్రీజీ 3. పిరమిడ్. నేను నిత్యానందంలో ఉంటాను.

 

ధ్యానం చేయకముందు అనారోగ్యాలు, జలుబు, జ్వరం నెలకు ఒకసారైనా వచ్చేవి. ఇప్పుడు అవి ఎలా వుంటాయో .. అయిదు సంవత్సరాల నుంచి నాకు తెలియకుండా పోయింది! ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మాత్ర కూడా తీసుకోలేదు! ఆరోగ్యం బాగుంటుంది. ఈ శరీరం గాలిలో తేలినట్టు ఉంటుంది.

 

ధ్యానం అన్నది విజ్ఞానం కోసం అని తెలుసుకున్నాను. సృష్టి రహస్యం, శరీర, జీవిత రహస్యాలు చాలా అర్థమవుతున్నాయి. ఇక నా జీవితం .. గురువు గారి ఆదేశానుసారం ధ్యానప్రచారం, ధ్యానం జీవితాంతం వరకు చేస్తాను. నాకు ఈ ధ్యానాన్ని అందించిన పత్రీజీకి శతకోటి వందనాలు!

 


డా|| అమృతం నరసయ్య

సూరత్
గుజరాత్ రాష్ట్రం

97238 53850

Go to top