సరోజ గుళ్ళపల్లి - మెల్‌బోర్న్ - ఆస్ట్రేలియా దేశం
" ధ్యానంతోనే .. సంపూర్ణ జీవితం "

 

 

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యాధికురాలు మరి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన "సరోజ గుళ్ళపల్లి"గారు .. తమ సృజనాత్మక విధి విధానాల ద్వారా ధ్యాన ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ PSSM కీర్తికిరీటంలో "వజ్రపు తునక"లా మెరుస్తున్నారు! నిత్యం తమ ఉద్యోగ విధులలో బిజీగా ఉంటూ కూడా "ధ్యానంతోనే .. సంపూర్ణ జీవితం" అని తేల్చి చెబుతూన్న సరోజ గారితో కాస్సేపు ముచ్చటిద్దాం ..
T. వాణి .. మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా దేశం

 

వాణి: "హాయ్ సరోజ గారూ! ఆస్ట్రేలియా దేశంలో చక్కటి ధ్యానప్రచారాన్ని నిర్వహిస్తూన్నందుకు మీకు అభినందనలు. మీ గురించి .."
సరోజ గారు: థ్యాంక్యూ మేడమ్! మాది గుంటూరు జిల్లా. "ఛార్టర్డ్ అకౌంటెంట్" అయిన మా నాన్న "సోమయాజులు"గారు AG ఆఫీసులో అకౌంటెంట్ జనరల్‌గా ఉద్యోగం చేస్తూ చాలా కాలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. దాంతో నేను గ్వాలియర్‌లోనే పుట్టి పెరిగి అక్కడే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్‌తో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాను.

 

ఆ తరువాత వరంగల్ RECలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌తో M.Tech పూర్తి చేసి HPCL లో ఉద్యోగం చేయడానికి వైజాగ్ వచ్చాను. అక్కడే నాకు నా సహోద్యోగి హరీష్ గారితో పరిచయం ఏర్పడింది. ఖరగ్‌పూర్ IIT లో M.Tech పూర్తి చేసిన హరీష్ గారితో నా ప్రేమ వివాహం ఇరుపక్షాల పెద్దల ఆమోదంతో జరగడం మరి కొంతకాలానికే మేము ఆస్ట్రేలియా దేశానికి వలసరావడం జరిగిపోయింది.

 

ఇక్కడికి వచ్చాక మా ఇద్దరికీ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్‌రంగ సంస్థ అయిన "ExxonMobil"లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడంతో ఇక్కడ సెటిల్ కావడం మాకు చాలా సులభం అయిపోయింది! 1992లో "నిఖిల్" .. మరి 1996లో "నవ్య"మాకు పుట్టారు.

 

వాణి: "మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు?"


సరోజ గారు: "నిఖిల్" చిన్నప్పటి నుంచే ఏకసంథాగ్రాహి. అస్తమానం పుస్తకాలు ముందేసుకుని చదవకపోయినా .. పరీక్షల సమయంలో మాత్రం వందకు వందశాతం అంకితభావంతో చదివేవాడు.

 

"నవ్య" కూడా అన్న అడుగుజాడలలోనే నడుస్తూ .. ఇద్దరూ స్కూల్ మరి కాలేజీ స్థాయిలలో ఎన్నెన్నో ఎక్స్‌లెన్సీ అవార్డులను పొందుతూ ఉండడంతో మేము వాళ్ళు యూనివర్సిటీ స్థాయిలో ఏ విద్యలను అభ్యసించాలో అన్న ఎంపికను వాళ్ళకే వదిలేశాము.

 

ప్రస్తుతం నిఖిల్ ఆస్ట్రేలియాలోనే ప్రథమస్థానంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన మోనాష్ యూనివర్సిటీలో టాపర్‌గా "కామర్స్ & లా" తో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. నవ్య కూడా మోనాష్ యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తోంది.

 

స్వతహాగా ఇద్దరూ తెలివిగలవారవడంతోపాటు చిన్నప్పటి నుంచీ మాతో కలిసి సరియైన ధ్యానాన్ని సరియైన సమయం నుంచే చేస్తూ రావడంతో వారిలోని ప్రతిభ మరింతగా సానపెట్టబడింది.

 

ఇద్దరూ తమ తమ ఖాళీ సమయాలలో కాలేజీ మరి యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు ఇంటర్నెట్ ద్వారా యూత్ ఎమ్‌పవర్‌మెంట్ తరగతులను నిర్వహిస్తూ తమ అనుభవాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇద్దరూ కూడా నవీన ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన ఎన్నెన్నో పుస్తకాలను చదువుతూ వాటిని మాతో చర్చిస్తూ ఉంటారు. "యూ ఫర్ ఎవర్" పుస్తకాన్ని చదివి వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసేవారో! ప్రతిరోజూ ధ్యానం మరి రాత్రి భోజనాల దగ్గర ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చర్చిస్తూ ఉండడం మేము మా పిల్లలకు అందిస్తోన్న ఉత్తమసంస్కారం!

 

వాణి: "మీ ఆధ్యాత్మిక నేపథ్యం .."


సరోజ గారు: మేం ఏడుగురు అక్కచెల్లెళ్ళం. మాకు ఒక తమ్ముడు! సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మా అందరికీ మా తల్లితండ్రుల ద్వారా చిన్నప్పటినుంచే "భక్తియోగం" బాగా అలవడింది. నిత్యపూజార్చనలూ, సంధ్యావందనాలూ మరి భగవద్గీత పురాణేతిహాసాల పారాయణలూ మా ఇంట్లో నిత్యకృత్యాలుగా ఉండేవి. అయితే .. ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గరగా ఉన్న "అమ్మనబ్రోలు" గ్రామానికి చెందిన గొప్ప భూస్వామి అయిన మా తాతగారు మాత్రం ఎప్పుడూ ధ్యానం చేస్తూండేవారనీ మరి గొప్ప అతీంద్రియ శక్తులను కలిగి ఉండేవారనీ మా అమ్మ చెప్పేది. వారు ఉదారంగా దానధర్మాలు చేస్తూ దేవాలయాలను కట్టిస్తూ చాలా నిమిత్త మాత్రులుగా జీవించేవారట! వారికి మా అమ్మ లక్ష్మి ఒక్కతే సంతానం.

 

మా అమ్మ .. మా తాతగారి దగ్గర నేర్చుకున్న అనేకానేక ఆధ్యాత్మిక విషయాలను చిన్నప్పుడు మాకు కూడా చెప్పేది కానీ .. అప్పట్లో అవి నాకు అర్థం కాలేదు! ధ్యానంలోకి వచ్చాక అప్పటి విషయాలలోని గొప్పదనం అర్థం అయ్యింది.

 

వాణి: "ధ్యానంలోకి మీరు ఎలా వచ్చారు?"


సరోజ గారు: ఆస్ట్రేలియాలో నేను ఉద్యోగం చేస్తూన్న కంపెనీ ప్రపంచంలోనే చాలా పెద్దది! అందులో నాది ఎన్నెన్నో ఛాలెంజ్‌లతో కూడుకున్న టాప్ మోస్ట్ పొజిషన్. ఉద్యోగరీత్యా నేను ఒక్కోసారి హెలికాప్టర్‌లో సముద్రం మధ్యలోకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ రోజయినా .. ఏ దేశానికైనా వెళ్ళి రావడానికి నేను సంసిద్ధంగా ఉండాలి. అటువంటి పని ఒత్తిడిలో హరీష్ గారు ఎంతో సహనంగా పిల్లలను సంరక్షిస్తూ తమ ఉద్యోగం తాము చేసుకుంటూనే నాకు వెన్నుదన్నుగా ఉండేవారు.

 

జీవితంఇలా సాగుతూ ఉండగా 2002 సంవత్సరంలో ఒక రోజు .. మా కంపెనీకి చెందిన డైరెక్టర్‌తో నేను ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యవిషయంలో ఘర్షణ పడవలసి వచ్చింది. నేనేం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో బ్లాంక్ మైండ్‌తో బయటికి వచ్చేసాను.

 

కారు కూడా నడుపలేని నిస్సత్తువ నన్ను ఆవరించడంతో అదే బిల్డింగ్‌లోని వేరొక సెక్షన్‌లో ఉన్న మా వారికి ఫోన్ చేసి వారి కారులోనే ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చాక నా పరిస్థితి వర్ణనాతీతం!

 

అప్పటి వరకూ ఇంటా బయటా "సూపర్‌డైనమిక్ మహిళ"గా క్షణం తీరిక లేకుండా గడిపిన నా జీవితం గిర్రున 180 డిగ్రీల కోణం తిరిగిపోయింది! ఏ పనీ చెయ్యబుద్ధి కాదు, ఎవ్వరితో మాట్లాడబుద్ధికాదు!

 

వంట చెయ్యడం .. పిల్లలను చూసుకోవడం అంతా మా వారే! ప్రొద్దున్నే ఒక కాఫీ కప్పు పట్టుకుని సోఫాలో కూర్చుంటే సాయంత్రం మా వారు పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చేవరకు అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేదానిని.

 

మా కంపెనీ డైరెక్టర్ మరి ఇతర సిబ్బంది వచ్చి నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమన్నారు. కానీ .. వాళ్ళు మాట్లాడిన మాటలేవీ నాకు పట్టలేదు. అంతా శూన్యం! మా పుట్టింట్లో .. మరి మా అత్తవారింట్లో .. అందరికీ నా ఆరోగ్యం గురించి మరి పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనే!

 

అటువంటి సమయంలో ఒకరోజు నేను మా ఇంటి ముందు నిలబడి ఉండగా వుయ్యూరు పిరమిడ్ మాస్టర్ "ఝాన్సీ మేడమ్" ఆ దారి వెంట వెళ్తూ నన్ను పలుకరించారు. వారి కుమారుడు మెల్‌బోర్న్‌లోనే ఉండడంతో ఇక్కడ తెలుగు సంఘాల కార్యక్రమంలో నాకు వారితో లోగడ కొద్దిగా పూర్వ పరిచయం ఉంది.

 

తన పలుకరింపునకు నాలో ఏ ప్రతిస్పందనా లేకపోగా జీవం లేని కళ్ళతో ఒక పిచ్చిదానిలా తనవైపు చూస్తున్న నా చేయిపట్టుకుని ఆమె ఆ ప్రక్కవీధిలోనే ఉన్న తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు మధ్యాహ్నం 12.00 గంటలు.

 

వారి ముందుగదిలో "పిరమిడ్" ఉన్న ఒక సోఫా మీద నన్ను కూర్చోబెట్టి .. "శ్వాస మీద ధ్యాస" ధ్యాన విధానం నాకు చెప్పి .. పత్రీజీ వేణునాదం కేసెట్ పెట్టి నన్ను ధ్యానం చేసుకోమన్నారు. ఒక "రోబో"లా ఆవిడ చెప్పినట్లు చేశాను. మెల్లిమెల్లిగా నా శరీరం కాస్సేపు బరువుగా .. మరి కాస్సేపు తేలిగ్గా అయిపోతూ .. నేను గాలిలో తేలిపోతున్నట్లు అయ్యింది! ఎక్కడో పురాతన శివాలయంలో చాలా సేపు తిరిగి .. అక్కడ నాగుపాము పడగల మధ్య ఉన్న శివలింగం దగ్గర ఆగిపోయాను. బాహ్య స్పృహ లేకుండా అలా ఎంత సేపు గడిచిందో తెలియదు.

 

"పిల్లలను స్కూలు నుంచి తీసుకువచ్చే సమయం అయ్యింది" అంటూ "ఝాన్సీ మేడమ్" నన్ను తట్టి లేపితే కళ్ళు తెరిచాను! సమయం 3.30 గం||లు అయ్యింది. శరీరం అంతా దూదిపింజలా అయిపోయి ఏదో తెలియని ఆనందం లోపల నుంచి తన్నుకొస్తోంది! వెంటనే నాకు నా భర్త .. పిల్లలు గుర్తుకు వచ్చారు!!

 

మేడమ్‌కి థ్యాంక్స్ చెప్పి .. ఆవిడ ఇచ్చిన పత్రీజీ ఆడియో కేసెట్స్ మరి పుస్తకాలను తీసుకుని ఇంటికి వచ్చి ఎంతో ఉత్సాహంగా కారు తీసుకుని పిల్లల కోసం స్కూలుకు వెళ్ళాను. గత కొన్ని రోజులుగా నా వాలకంతో బిక్కచచ్చిపోయి ఉన్న నా పిల్లలు నాలో క్రొత్తదనాన్ని చూసి ఎంతో ఆనందపడిపోయారు. ఇక మా వారు సరేసరి!

 

అలా నాకు "పునర్జన్మ" లభించిన నాటినుంచి ధ్యానమే నా జీవితం అయిపోయింది. ఎన్ని పుస్తకాలు చదివేదాన్నో లెక్కలెదు! "యూ ఫర్ ఎవర్" నాకు చాలా ఇష్టమైన పుస్తకం. పిల్లలు స్కూలు నుంచి రాగానే నా అనుభవాలన్నీ వాళ్ళతో చెప్పి అందరం కూర్చుని ధ్యానం చేసుకునేవాళ్ళం. అప్పటికి "నిఖిల్" తొమ్మిదేళ్ళవాడు.. "నవ్య" ఆరేళ్ళ పిల్ల! అతి త్వరలో ఏ మందులూ వాడనవసరంలేకుండానే నేను కేవలం నా ధ్యానశక్తితో మరి కేసెట్‌లలో ఉన్న పత్రీజీ బోధనలతో పర్‌ఫెక్ట్ అయిపోయి ఉద్యోగంలో చేరడం జరిగిపోయింది!

 

ఆ తరువాత మెల్లిమెల్లిగా కమ్యూనిటీ సర్వీస్‌కి అవసరమైన లైసెన్స్‌లన్నీ తీసుకుని "వుమెన్ & ఛైల్డ్ ఎమ్‌పవర్‌మెంట్" తరగతుల ద్వారా ధ్యానం యొక్క విశిష్ఠతను ఇక్కడి వాళ్ళ అభిరుచికి అనుకూలంగా మలచి అందించడం మొదలుపెట్టాను!

 

వాణి: "పత్రీజీని కలవడం ఎప్పుడు?"


సరోజ గారు: 2004 డిసెంబర్‌లో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో "ధ్యానమహాయజ్ఞం" జరిగిన సమయంలో మేము హాలీడే కోసం ఇండియాకు వచ్చి ఉన్నాము. చిన్నప్పటి నుంచీ అందరూ "హార్డ్ వర్క్" అనుకున్న దానిని "స్మార్ట్ వర్క్"గా చెయ్యడం అలవాటు ఉన్న నాకు "ఎంతో నిగూఢమైనవి" అనుకున్న ఆధ్యాత్మిక సత్యాలను ఇన్‌స్టెంట్ కాఫీ చేసుకుని త్రాగినంత సులువుగా మలిచి అందిస్తూన్న "పత్రీజీ విధానం" నచ్చడంతో వారిని ఎలాగైనా కలుసుకోవాలని జింఖానా గ్రౌండ్స్‌కి వెళ్ళాను. వేలాది మంది జనాలలో ఎక్కడో వెనుక వరుసలో కూర్చున్నాను. వేదిక మీద మినిస్టర్లు, అధికారులు మరి VIPల మధ్య వెలిగిపోతూ పత్రీజీ!

 

అదే రోజు మధ్యాహ్నం నేను వైజాగ్ వెళ్ళాల్సి ఉండడంతో వారిని ఎలాగైనా కలవాలి అన్న తపన ఒక వైపు.. "అంత మంది జనంలో ఆయనను కలవడం ఎలా సాధ్యం?" అన్న సంశయం మరొకవైపు! అలా గంటసేపు ధ్యానం పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూద్దును కదా .. నా వైపే వస్తున్న పత్రీజీ కనపడ్డారు!

 

వెళ్ళి వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చి "మెల్‌బోర్న్ నుంచి వచ్చానండీ" అని చెప్పాను. వెంటనే వారు అక్కడ రెండు కుర్చీలు వేయించి నన్ను కూర్చోబెట్టి నా ముందు కూర్చుని "మీ గురించి చెప్పండి!" అన్నారు. జన్మజన్మలుగా నేను వెతుకుతూన్న పెన్నిధి నాకు దొరికినట్లు వారి చేతిని నా రెండు చేతులతో అలాగే గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళ నుంచి కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఒక్కమాట లేదు .. ఒక్క పలుకూ లేదు .. అంతా బ్రహ్మానందమే!

 

కాస్సేపటికి, నేను కళ్ళు తెరిచాక, వారు తమ అంతరంగిక కార్యదర్శి "దువ్వూరి శివప్రసాద్" గారిని పిలిచి .. అక్కడ స్టాల్‌లో నాకు కొన్ని పుస్తకాలు ఇప్పించి .. నన్ను కారు దగ్గర దిగబెట్టి రమ్మన్నారు! ఆ రోజునుంచి ఈ రోజువరకు ప్రతి సంవత్సరం మా కుటుంబం అంతా కలిసి ధ్యానమహాయజ్ఞాలు మరి ధ్యానమహాచక్రాలలో పాల్గొనడానికి ఇండియాకు క్రమం తప్పకుండా వస్తున్నాము!

 

వాణి: "ఆస్ట్రేలియా దేశంలో మీ ధ్యాన ప్రచారం ఎలా సాగుతోంది?"


సరోజ గారు: చిన్నప్పటి నుంచీ నాకు లలితకళలలో మంచి ప్రవేశం ఉండడంతో నేను ఆస్ట్రేలియలోని అనేకానేక తెలుగు మరి సాహిత్య రంగ అసోసియేషన్‌లలో మెంబర్‌గా ఉన్నాను. ఆ పరిచయాల సహాయంతో మరి మెల్‌బోర్న్ పిరమిడ్ మాస్టర్ సాయినాథ్, శివ జవాజీ గార్ల సహకారంతో ఇక్కడి వాళ్ల అవసరాలకు అనుగుణంగా ధ్యానం క్లాసులనూ మరి పత్రీజీ కార్యక్రమాలనూ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పత్రీజీ సూచన మేరకు 2013లో మెల్‌బోర్న్‌లోని థియోసోఫికల్ సొసైటీలో .. 2014లో పెర్త్ లోనూ .. మరి చికాగో లో (1893 స్వామి వివేకానంద గారు ఉపన్యసించిన సర్వమత సమ్మేళనం వేదికపై) 2015-ISOL కార్యక్రమంలోనూ .. నా సందేశాన్ని ఇవ్వగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను!

 

ఇప్పుడు ఎంతో మంది ఇంకా క్రొత్త క్రొత్త పిరమిడ్ మాస్టర్లు ఉద్యోగరీత్యా మరి వ్యాపార రీత్యా దేశానికి వలస వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి వినూత్న విధానాలలో ధ్యానప్రచారాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము!

 

This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top