" కారణజన్ములుగా ఇది మన కర్తవ్యం "

 

 

నా పేరు "సరోజ". 1999 సంవత్సరంలో పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోకి నేను ప్రవేశించాను. ఆ క్షణం నుంచే భూమి మీద దివ్యప్రణాళిక అమలులో నా కర్తవ్యాన్ని గుర్తించుకుని పత్రీజీ ధ్యాన ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాను.

 

పత్రీజీ అందించిన మహాజ్ఞాన నిధి "తులసీదళం" లోని "ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం" అన్న సందేశం చదివి... ధ్యానంలో కూర్చోగానే నాకు ఒక పెద్ద పిరమిడ్ దర్శనం ఇచ్చింది. అదే యోగసామ్రాజ్యంగా మరి దానిని నిర్మించడమే నా జన్మకర్తవ్యంగా నేను తెలుసుకున్నాను.

 

వెంటనే పత్రీజీ సూచన మేరకు "ఖమ్మం పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్" ను రిజిస్టర్ చేయించడం జరిగింది! "ఈ భూగ్రహాన్ని మరింత చైతన్యవంతం చెయ్యడానికి ఉన్నత తలాలకు చెందిన పిరమిడ్‌లు దానిపై విరివిగా నిర్మాణం చెయ్యాలి! మరి కారణ జన్ములుగా అది మన కర్తవ్యం" అని గుర్తించి మా వంతు బాధ్యతగా ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం!

 

అందుకు గాను ఖమ్మం చుట్టుప్రక్కల అనేక స్థలాలను పరిశీలించి .. 2015 జనవరిలో ఖమ్మం పట్టణానికి 27 కి.మీ. దూరంలో ఉన్న "పిండిప్రోలు" గ్రామానికి సమీపంలో ఒక స్థలాన్ని ఎంపిక చేశాం.

 

ఖమ్మం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ "మానుకొండ రఘురామ్ ప్రసాద్" గారితో కలిసి స్థలం అమ్మిన వారికి డబ్బులు చెల్లించి .. ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ పేరుమీద దానిని రిజిస్టర్ చేసి... దానికి "కాస్మిక్ వ్యాలీ" గా నామకరణం చేశాం. ముళ్ళపొదలతో, రాళ్ళతో నిండిన ఆ ప్రాంతాన్నంతా చదును చేయించి 2015 జూలై 1 తేదీ నుంచి అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించాం.

 

ముందు పత్రీజీ కోసం కాటేజ్ తో ప్రారంభించి .. పిరమిడ్ స్ట్రక్చర్, గెస్ట్‌హౌస్ నిర్మాణాలు పూర్తి చేసి 27'x27' పిరమిడ్ నిర్మాణం కోసం శ్లాబ్ కూడా వేశాం.

 

2015 మే 13 వ తేదీన పత్రీజీ "కాస్మిక్ వ్యాలీ" కి విచ్చేసి, మొక్కలను నాటి .. అక్కడ 160'X160' పిరమిడ్ రాబోతోందని తెలియజేశారు. "కాస్మిక్ వ్యాలీ" అవసరాల కోసం గెస్ట్‌హౌస్ ప్రక్కనే బావిని త్రవ్వించగా అతి తక్కువ లోతులోనే ఆ రాళ్ళు, గుట్టల ప్రాంతంలో తియ్యటి మంచినీరు వచ్చింది! పత్రీజీ దానికి "గంగాదేవి" అని నామకరణం చేశారు!

 

ఒకానొక రోజు ఆ స్థలంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూండగా "మహావతార్ బాబాజీ" దర్శనం ఇచ్చి.. "ఇక్కడ నాకు ఒక గుహ ఉంది; అందులో ఉంటూ నేను ఈ శక్తిక్షేత్ర నిర్వహణను చూసుకుంటాను" అని తెలియజేశారు!

 

వెంటనే మేము వెళ్ళి వెతుకగా దట్టంగా ఉన్న వృక్షాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడి ఉన్న అత్యంత శక్తివంతమైన గుహ కనపడింది. దానికి "మహావతార్ బాబాజీ చైతన్యతలం" అని నామకరణం చేసి గురుపౌర్ణమి, పౌర్ణమి వంటి విశిష్ఠ రోజులలో అక్కడ సామూహిక ధ్యానం చేసుకుంటున్నాం!

 

ఈ శక్తిక్షేత్రంలో ఎదిగి ఉన్న మహావృక్షాల చుట్టూ ధ్యానానికి అనువుగా వేదికలను నిర్మించడంతో పాటు అక్కడ మామిడి, జామ, నిమ్మ, సపోటా, బత్తాయి వంటి పండ్ల మొక్కలనూ మరి అనేక రకాల పూల మొక్కలనూ పెంచడం జరుగుతోంది!

 

ఆ ప్రదేశం అంతా కోతులకు ప్రసిద్ధి అయినా అవి చెట్లకు కాసే పిందెలనూ, కాయలనూ మరి పూలనూ ఏ మాత్రం త్రుంచకపోవడం చుట్టుప్రక్కల రైతులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది!

 

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే .. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాభావం వల్ల దగ్గరలోని "ఆకేరు" చెరువు ఎండిపోవడంతో పంటపొలాలలో సేద్యం కరువైంది.

 

అయితే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి "KCR గారు" వచ్చి తిరుమలాయపాలెం మండలం "రోళ్ళపాడు" గ్రామంలో "సీతారామ ప్రాజెక్ట్" కు శంఖుస్థాపన చేసి గోదావరి జలాలను మళ్ళించడమే కాకుండా "కాస్మిక్ వ్యాలీ" ప్రక్కనే ఉన్న "ఆకేరు చెరువు" లో పూడిక తీయించమని ఆదేశించడం జరిగింది! ఇక దాంతో చుట్టుప్రక్కల రైతులు ఆనందానికి అంతే లేదు!

 

ఇటీవల కాలంలో కురిసిన వర్షాల వల్ల పూడిక తీయించిన "ఆకేరు చెరువు" లో నిండుగా నీళ్ళు రావడంతో పండ్ల చెట్లు కూడా రసాలూరే పళ్ళను విరివిగా కాస్తున్నాయి.

 

శరవేగంతో జరుగుతున్న "గెస్ట్‌హౌస్ నిర్మాణం" కోసం ఖమ్మం జిల్లా పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ "కుటుంబాక రమేష్" గారు యాభైవేలు విలువ చేసే గ్రానైట్ రాయిని సమకూర్చగా .. "రాయల పురుషోత్తం" గారు బాబాజీ గుహ మరి నింబదేవ వేదికలకు గాను పాలరాయిని అందజేశారు! ఈ శక్తిక్షేత్రంలో "గోశాల" ఏర్పాటు చేయగా మధిర పిరమిడ్ మాస్టర్ "మొదల నరసింహారావు" గారు ఆవుదూడలను దానం చేశారు!

 

కాస్మిక్ వ్యాలీ" విశిష్ఠతను గురించి పత్రీజీ ద్వారా మరి ఇతర మాస్టర్ల ద్వారా తెలుసుకున్న ధ్యానులు, మరి చుట్టుప్రక్కల తండాల ప్రజలు దీని సందర్శనకు వచ్చి ఇక్కడ హాయిగా ధ్యానం చేసుకుని శారీరకపరంగా, మానసికపరంగా మరి ఆత్మపరంగా అనేక అనుభవాలను పొందుతున్నారు.

 

సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పౌర్ణమి, ఆమావాస్య ధ్యానాలు, హరికృష్ణ, స్వర్ణలత గార్ల ఆధ్వర్యంలో నక్షత్రలోకాలు, DNA ఆక్టివేషన్ కార్యక్రమాలు మరి ఇతర పర్వదినాలలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

 

ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ "కాస్మిక్ వ్యాలీ’ కి విచ్చేసి ఇక్కడి శక్తితరంగాలను అనుభూతి చెందవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

 

నలజాల సరోజ

కాస్మిక్ వ్యాలీ
పిండిప్రోలు - ఖమ్మం
98484 84044

Go to top