" ‘ సమస్య ’ చర్య అయితే ..
‘ ధ్యానం’ దానికి ప్రతి చర్య ’

 


అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రం "స్యాన్ రామెన్" లో నివసిస్తూన్న పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి సుధ, శ్రీ సంతోష్ గార్లు కాలిఫోర్నియా రాష్ట్రంలోని పలు నగరాలలో చక్కటి ధ్యాన ప్రచార సేవను నిర్వహిస్తున్నారు! ధ్యానంలోని విశిష్ఠతను స్వయంగా అనుభూతి చెంది అందులోని శాస్త్రీయతను అందరికీ అందజేయాలన్న అంకిత భావంతో పనిచేస్తూన్న ఈ దంపతుల తో "ముఖాముఖి" మన కోసం!
తమ అమెరికా పర్యటన సందర్భంగా వారిని స్వగృహంలో కలుసుకుని ఇంటర్వ్యూ నిర్వహించిన సోలాపూర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ G. చంద్రశేఖర్ రెడ్డి" గారికి కృతజ్ఞతలు!

 


ప్రశ్న: "నమస్కారం మేడమ్! మీ బాల్యం మరి కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?"


సుధగారు: నేను 1978లో విజయనగరంలో పుట్టి అక్కడే పెరిగాను. మా నాన్న శ్రీ మండవ లక్ష్మీనాథ్ గారు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చెందారు.


మా అమ్మ శ్రీమతి రామలక్ష్మి; మరి నాకు అయిదుగురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు! మాది సనాతన బ్రాహ్మణ కుటుంబం.


విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మా మేనత్త శ్రీమతి లలితా పరమేశ్వరి గారు మా చిన్నతనం నుంచీ మా తోనే నినసించేవారు.


ఆవిడ రమణమహర్షి బోధనలను చదువుతూ అనేకానేక ఆధ్యాత్మిక విషయాలను మాకు చెబుతూ "ఒక నడిచే గ్రంథాలయం" లా ఉండేవారు!
గంటలు గంటలు ధ్యానంలో గడుపుతూ .. ఆవిడ తరచుగా అరుణాచలంలోని రమణుల ఆశ్రమానికి వెళ్ళి వస్తూండేవారు! అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను సేకరిస్తూ మా అత్తయ్య మా ఇంట్లోనే చక్కటి గ్రంథాలయాన్ని నెలకొల్పారు!


తమ చెల్లెలితో పాటే మా నాన్నగారు కూడా ధ్యానం చేసుకుంటూ, కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఎక్కువ కాలం మౌనంగా గడిపేవారు. నేను కూడా చిన్నప్పటి నుంచే భగవద్గీత, రామాయణ మహాభారతాలు బాగా చదివేదాన్ని. సుందరాకాండ పారాయణ చాలా సార్లు చేశాను.

 

ప్రశ్న: "మీ విద్యాభ్యాసం..?"


విజయనగరంలో ఇంటర్ వరకు చదివి వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో BA ఎకనమిక్స్ చేశాను. చిన్నప్పటి నుంచీ మా నాన్నగారు చదువుతో పాటు సంగీతానికి కూడా సరిసమానమైన ప్రాముఖ్యత ఇవ్వడంతో నేను విజయనగరంలోని ప్రఖ్యాత "మహారాజా సంగీత కళాశాల" లో డిప్లొమా పూర్తిచేశాను.


శ్రీ B.A. నారాయణ మరి శ్రీ P.V.S. శేషయ్య శాస్త్రి గార్లు నాకు సంగీత గురువులు! ఆ తరువాత హైదరాబాద్ శ్రీ ద్వారం దుర్గాప్రసాద్ గారి దగ్గర "కర్నాటక స్వర సంగీతం" (వోకల్)లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను.


వైజాగ్‌లో BA మొదటి సంవత్సరం నేను చదువుతూండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ లో ఉద్యోగం వచ్చింది!

ఉద్యోగం చేసుకుంటూనే మూడు సంవత్సరాల పాటు విజయవాడ ఆకాశవాణిలో 'B' గ్రేడ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేస్తూ .. BA, ఆ తరువాత హైదరాబాద్‌లో MBA పూర్తి చేశాను.


తరువాత పూణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా పనిచేస్తూన్న "సంతోష్" గారితో నా వివాహం జరిగి మేము ఐర్లాండ్ దేశంలోని "డబ్లిన్" లో కొంతకాలం గడిపి 2005సం||లో అమెరికా దేశానికి వలన రావడం జరిగింది.

 

మాకు ఇద్దరు అబ్బాయిలు! "సిద్ధార్థ్", "శిశిర్" చదువుకుంటున్నారు. నేను ప్రస్తుతం "Raaga Sudha.net" పేరుతోMusic studio నిర్వహిస్తున్నాను.

 

ప్రశ్న: "మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది?"


మా అత్తయ్య ప్రభావం వల్ల మా ఇంట్లో అందరూ క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారు. కానీ నేను మాత్రం ఏదో మ్రొక్కుబడిగా వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని.

 

2008 సం||లో ఒకసారి మా పెద్దక్కయ్య శ్రీమతి నాగలక్ష్మి మరి మా బావగారు శ్రీ నాగ శ్రీనివాస్ గార్లు పని మీద హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రైల్‌లో వెళ్తూన్నప్పుడు ఆ బోగీలో కొందరు పిరమిడ్ మాస్టర్స్‌ను కలవడం తటస్థించింది.

 

వారినుంచి "ధ్యానం" గురించీ, "పత్రీజీ" గురించి మరి "PSSM" గురించీ తెలుసుకుని .. ఇంటికి చేరగానే ధ్యానసాధన ప్రారంభించారట! మూడు నాలుగు రోజులలోనే మాకు ఫోన్ చేసి "మీరు కూడా వెంటనే ధ్యానం చెయ్యండి" అని ప్రోత్సహించారు.

 

ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు వారికి ఫోన్ చేసినా ధ్యానం గురించీ, ధ్యానానుభవాల గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళూ! 2011 సం||లో మా అన్నయ్య "జయరామ్" న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ D.L.N. శాస్త్రి గారిని కలిసి మరింత సమాచారం తెలుసుకున్నాడు.

 

ఆ తరువాత అందరం కలిసి 40 రోజుల పాటు ప్రతి రోజూ మూడు గంటలు ధ్యానం చేసి ఎన్నెన్నో ధ్యానానుభవాలను పొందేవాళ్ళం. ఆన్‌లైన్‌లో వెతికి క్రొత్త క్రొత్త పుస్తకాలనూ మరి పిరమిడ్ CD లనూ తెప్పించుకుని స్వయంగా ధ్యాన ప్రయోగాలు చేసేవాళ్ళం!

 

మా శరీరపు "ఆరా" లు చూసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసి సఫలం అయ్యాం! నేను, మా వారు, మా అన్నయ్య, తన స్నేహితుడు "సందీప్" అంతా కలిసి ఒక "టీమ్" లా ఈ ప్రయోగాలు చేస్తూ వాటిని మా అక్కయ్య మరి బావగార్లతో పంచుకునే వాళ్ళం!

 

ప్రశ్న: "పత్రీజీని ఎక్కడ కలిశారు?"


2012లో వారిని మేము శ్రాన్‌ఫ్రాన్సిస్‌కో విమానాశ్రయంలో కలిశాం! అప్పటికే CDల ద్వారా ఇంటర్నెట్ ద్వారా పత్రీజీ బోధనలతో ప్రభావితం అయి ఉన్న మేము పత్రీజీ రాక గురించి మా అక్కయ్య ద్వారా తెలుసుకుని .. వారు రావాడం మా మహాభాగ్యంగా తలచి .. మా ఇంటికి ఆహ్వానించాం!

 

అయితే వారి "కోపిష్టితనం" గురించి కథలు, కథలుగా విని ఉండడం వల్ల వారితో ఎలా మసలుకోవాలో తెలియక ఒకింత భయపడ్డాను! కానీ వారిని చూడగానే నా భయం అంతా పటాపంచలై .. ఒక ఆత్మీయభావన నాలో నిండిపోయింది!

 

వారు మా ఇంట్లో ఉన్న వారం రోజులు ఒక వేడుకలా గడిచిపోయింది! అప్పుడే కాలిఫోర్నియా చుట్టుప్రక్కల చాల చోట్ల మరి ప్రఖ్యాత IT కంపెనీ "Intel" ఆఫీసు లో కూడా పత్రీజీ కార్యక్రమం ఏర్పాటు చేశాం!

 

ప్రశ్న: "మీ ధ్యానానుభవాలను ఇంకా తెలుసుకోగోరుతున్నాం .."


నా ధ్యానానుభవాలను పంచుకునే ముందు మా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేస్తాను. ఒకసారి మేము మా వారి ఉద్యోగరీత్యా ఐర్లాండ్ దేశంలో ఉన్నప్పుడు అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఇండియా నుంచి ఫోన్ వచ్చింది.


మనస్సు కీడు శంకిస్తున్నా .. "హనుమాన్ చాలీసా" చదువుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. ఇంటికి రాగానే .. ఎదురుగా నాన్నగారి పార్థివ శరీరం! నిక్షేపంగా ఉన్న మనిషి మార్నింగ్ వాక్‌కి వెళ్ళి వచ్చి .. హఠాత్తుగా కుప్పకూలిపోయి కన్ను మూశారు.

 

అది జీర్ణించుకోవడం నాతరం కాక దుఃఖం, డిప్రెషన్‌ల బారిన పడిపోయాను. ఆ తరువార కొంత కాలానికే మా అన్నయ్య కూడా నాతో పోన్‌లో మాట్లాడుతూ, మాట్లాడుతూనే ప్రాణాలు వదిలేశాడు!

 

చావు - పుట్టుకల మధ్య అంతరార్థం తెలియని ఆ స్థితిలో నేను మరింత డిప్రెషన్ కు గురి కావడంతో "అన్నేళ్ళుగా చేస్తున్న పూజలూ, జపాలూ నాకు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి" అని తేలిపోయింది. ఏదో మొక్కుబడిగా పూజలు చేస్తున్నా "అసలు నిజంగా దేవుడనేవాడు ఉన్నాడా?!" అన్న ప్రశ్న నాలో బయలుదేరింది!

ఆ సమయంలో మా అమ్మా, మా మేనత్తా మరి మా వదిన గార్లు విజయనగరంలోనే మా వీధిలో ఉన్న "పిరమిడ్ మెడిటేషన్ సెంటర్" వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుని మనశ్శాంతిని పొందుతూ ఉండేవారు.

నన్ను ఓదారుస్తూ "పుట్టడం నిజం .. గిట్టడం నిజం .. నట్టనడుమ జీవితం అంతా ఓ నాటకం" అన్న అన్నమయ్య కీర్తనలోని అంతరార్థాన్ని వివరిస్తూ నన్ను కూడా ధ్యానకేంద్రానికి తీసుకువెళ్ళేవారు! అలా ధ్యానశక్తితోనే నేను మెల్లి మెల్లిగా ఆ విషాదాన్నుంచి బయటపడ్డాను.

 

ఆ తరువాత అమెరికాకు తిరిగి వచ్చి నా సంగీత తరగతులలో పిల్లలకు ధ్యానం కూడా నేర్పడం మొదలుపెట్టాను. ఆ పిల్లల వెంట వచ్చిన తల్లితండ్రులు "మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా సుగంధభరితంగా ఉందండీ" అనేవారు! "అది ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క ఉనికి" అని నేను తరువాత గుర్తించాను.

 

ప్రశ్న: "ఇంకా మీ ధ్యానానుభవాలు.."


2012లో పత్రీజీ అమెరికా వచ్చినప్పుడు ఆగస్ట్ 2వతేదీన "సెంటర్ ఫర్ స్పిరిచ్యువాలిటీ" హాల్ లో ధ్యాన కార్యక్రమం జరుగుతూ ఉంది! పత్రీజీ వేణునాద ధ్యానంలో లీనమైపోయి ఉన్న నాకు నా భుజం మీద ఎవరో చేయివేసినట్లు అనిపించడంతో భయపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచాను! చుట్టూ అందరూ ధ్యానానందంలో మునిగి ఉన్నారు.. స్టేజీపై పత్రీజీ వేణువు వాయిస్తున్నారు!

 

"నా భుజంపై చెయ్యి ఎవరు వేసి ఉంటారబ్బా?" అని ఆలోచిస్తూ ఇక అక్కడ ఉండబుద్ధికాక మావారితో మాత్రం చెప్పి ఇంటికి వచ్చేసాను. అకారణంగా నాలోంచి దుఃఖం పొంగివస్తోంది! కళ్ళు తుడుచుకుంటూనే వంట ప్రయత్నం మొదలుపెట్టాను. కార్యక్రమాన్ని ముగించుకుని కాస్సేపటికి పత్రీజీ ఇంటికి వచ్చారు!

 

"ఏంటి మేడమ్, అలా మధ్యలోంచి వచ్చేశారు?" అని వారు అడుగగనే ఇక నా దుఃఖం ఆగలేదు! ఏడుస్తూ వారికి జరిగింది చెప్పాను! అంతా విని "మీ నాన్నగారు వస్తే కూడా పోల్చుకోలేదా?" అన్నారు సార్! అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు "ఆ రోజు మా నాన్న గారి సంవత్సరీకం" అని!

 

ఆ తరువాత నాకు ఒక భయంకర అనుభవం 2014 లో నేను CSF(Cerebral Spinal Fluid Leakage) అనే ప్రాణాంతకజబ్బు బారిన పడడం జరిగింది. కనుబొమ్మపై నుంచి తల వరకు ఉన్న ఒక ఎముక కరిగిపోయి అక్కడ పుట్టగొడుగులాగా తయారయ్యింది. అది వెడల్పుగా మారి ముక్కుకు అడ్డంగా రావడంతో నాకు శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారి పోయింది!

 

చాలా, చాలా పరీక్షల తరువాత పెద్ద సర్జరీ చెయ్యాలని చెప్పారు డాక్టర్లు! మా బావగారూ, అక్కయ్యా ఒక్కసారి నన్ను పత్రీజీతో మాట్లాడమని చెప్పారు. "‘మందులు’, సర్జరీలు’ అంటే సార్ ఏం కోప్పడుతారో" అనుకుంటూ భయం భయంగానే సార్‌కి ఫోన్ చేశాను! అంతా సావధానంగా విని వారు "డోంట్ వర్రీ మేడమ్! నేను మీతోనే ఉంటాను" అన్నారు.

 

మా అక్కయ్య సార్‌తో మాట్లాడుతూ నా గురించి ఆందోళన పడగా సార్ "ఆమెకు ఎప్పుడో ఆస్ట్రల్ సర్జరీ జరిగిపోయింది మేడమ్! ఇప్పుడు జరిగేది నామమాత్రమే" అని చెప్పారట!

 

ఆ తరువాత జరిగిన పౌర్ణమి ధ్యానంలో మా అక్కయ్యకు నా శరీరం చుట్టూ ఎవరెవరో మాస్టర్స్ నిలబడి సర్జరీ చేయడం.. నా శరీరం నుంచి వారు నల్లటి పదార్థాన్ని బయటికి తియ్యడం .. మరి ఆ తంతు జరిగినంతసేపు పత్రీజీ ఆ గదిలోనే పచార్లు చెయ్యడం "విజన్" లా కనిపించిందట!

 

ఆగస్ట 5వతేదీన .. ఏకంగా 13 గం||ల సేపు సర్జరీ జరిగింది. అంత నేను "శ్వాస మీద ధ్యాస" ఉంచి ధ్యానంలోనే ఉన్నాను. థియేటర్లో ఉన్నంత సేపు పత్రీజీ, షిరిడీ సాయి, రమణ మహర్షి .. ముగ్గురూ నా చేయి పట్టుకునే ఉన్న శక్తి అనుభూతిని నేను పొందాను.

 

అలా ఒక దాని వెంట ఒకటి వరుసగా నాకు నాలుగు సర్జరీలు చేసిన డాక్టర్స్ వారం రోజులు తరవాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆరు నెలలపాటు "సంతోష్" గారు నన్ను కంటికి రెప్పలా చూసుకోవడంతో నేను చక్కగా కోలుకోవడం జరిగింది. ఆ సమయంలో సెలవుకోసం సంతోష్ గారు తమ ఆఫీస్‌కి ఫోన్ చేయగా వాళ్ళ బాస్.. "నువ్వు సెలవు పెట్టకు! వీలయినప్పుడే పని చేసుకో" అని స్నేహపూర్వకంగా చెప్పడం పరోక్షంగా ఆస్ట్రల్ మాస్టర్స్ చేసిన సహాయంగా మాకు అర్థం అయ్యింది!

 

నా సర్జరీని స్పెషల్ కేస్‌గా రిజిస్టర్ చేసుకుని మెడికల్ కాలేజీ వాళ్ళు అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకూ, వాళ్ళూ చేస్తోన్న రకరకాల పరీక్షలకూ నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేది. దానికి తోడు నేను వాడుతూన్న రసాయనిక మందుల కారణంగా నాలో మళ్ళీ సమస్య మొదలై .. డాక్టర్లు అయిదవసారి సర్జరీ చెయ్యాలన్నారు.

 

ఏమి పాలుపోక పత్రీజికి ఫోన్ చేశాను! "ఇంకా మందులు వాడుతున్నావా? తక్షణం మానెయ్యి. అసలు నువ్వు మాస్టర్‌వే నా? నీకు బుద్ధి ఉందా?!" అంటూ నన్ను గట్టిగా తిట్టేశారు!

 

ఇంతవరకూ నా జీవితంలో అంత గట్టిగా నన్ను ఎవ్వరూ కోప్పడకపోవడంతో నేను ఉక్రోషంతో ఏడుస్తూ మా బావగారితో మొరపెట్టుకున్నాను. వారు "గురువులు ఊరికే ఎందుకు తిడతారు? దానికి ఏదో కారణం ఉంటుంది .. వారు మనకు తండ్రిలాంటి వారు" అని నన్ను ఓదార్చారు.

 

అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని సార్ మాటలలోని అంతరార్థాన్ని ఆలోచించి .. మందులన్నీ మానేసి ధ్యానసమయాన్ని మరింత పెంచాను. చాలా తక్కువ సమయంలోనే నేను ధ్యానశక్తితో కోలుకుని మునుపటి కంటే ఉత్సాహంగా లేచి తిరగడం మొదలు పెట్టాను. అప్పటినుంచీ ధ్యానం .. పత్రిసార్ మీద అభిమానం .. అవే నా మందులు! "మెడికల్ రిపోర్ట్స్" అన్నీ నార్మల్!

 

ఆ తరువాత .. 2015 సెప్టెంబర్‌లో .. పూణెలో .. ఉన్న మా అమ్మ గారు పూజ చేసుకుంటూ దీపం అంటుకుని జరిగిన ప్రమాదంలో 95% కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరారు. నిజంగా ధ్యానశక్తి మమ్మల్ని ఎంతటి స్థితప్రజ్ఞులుగా మార్చేసిందంటే ఆ సమయంలో మా అమ్మ సంతానం ఏడు మందిమి కూడా కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడ రాకుండా "అమ్మకు బాగుంటుంది" అన్న సంకల్పధ్యానంతో ఆమెకు ఎనర్జీస్ పంపేవాళ్ళం.

 

ఆ సందర్భంలో పూణె నుంచి హైదరాబాద్ కు అమ్మను తీసుకువచ్చాం! అప్పటికే కొన్ని నెలలుగా ఫిజియోధెరపీ చికిత్స జరుగుతూన్నా మా అమ్మ శరీర అవయవాలలో ఎలాంటి కదలిక లేదు! కాలకృత్యాలతో సహా అన్నీ మంచం మీదే! అప్పుడు నా అభ్యర్థన మేరకు మా అమ్మను చూడడానికి పత్రీజీ "లకడీకాపూల్" లో ఉన్న మా అక్కయ్య ఇంటికి వచ్చారు! వారు అమ్మ మంచం దగ్గర మోకాళ్ళుపై కూర్చుని ప్రమాదంలో కాలిపోయిన మా అమ్మ రెండు చేతులనూ దగ్గరికి చేర్చి .. ఒక చేత్తో వాటిని ప్రేమగా పట్టుకుని .. ఇంకొక చేత్తో ఆమె తల నిమురుతూ అరగంట సేపు అలా కళ్ళు మూసుకున్నారు.

 

వారు వెళ్ళిపోయాక మా అమ్మలో క్రొత్తశక్తి! అతి తక్కువ సమయంలోనే ఆమె కోలుకుని లేచి తిరగడం, తన పనులు తాను చేసుకోవడం మా అందరినీ ఎంతో స్వాంతన పరిచింది! అంతటి అపారమైన కరుణహృదయం పత్రీజీది!

 

ప్రశ్న: "చాలా బాగుంది మేడమ్! ఇంకా .. ?"

 

2015 సంవత్సరంలో మా మేనత్త అమెరికా వచ్చారు. అప్పుడు మా కుటుంబం అంతా కలిసి "మౌంట్ శాస్తా" అనే కొండ ప్రాంతానికి పిక్నిక్ వెళ్ళాం! మన కైలాసపర్వతంలా మంచుతో కప్పబడి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆ కొండపై కూర్చుని మేము ధ్యానం చేసుకుంటూ అద్భుతమైన శూన్యస్థితిని అనుభూతిని పొందాం.

 

అక్కడ మేము బసచేసిన రిసార్ట్ .. ఒకప్పుడు "అమెరికన్ స్పిరిచ్యువల్ గురువు సెయింట్ జెర్మెయిన్ గారు నివసించిన ఇల్లు" అని తెలిసి ఆనందం పట్టలేకపోయాం! వారు అమెరికన్లకు మన ఆదిశంకరాచార్యులు వంటి ఆది గురువు! అక్కడ ధ్యానం చేసుకుంటూ "పత్రీజీ కూడా మా వెంట వుంటే ఎంత బాగుండేది" అనుకున్నాను.

 

ఆ తరువాత "స్యాన్ రామోన్" కు తిరిగి వచ్చాక ఈ విషయాన్ని మా బావగారితో చెప్పడం వారు సార్‌తో మాట్లాడడం.. మరి 2016, జూన్ 30వ తేదీన పత్రీజీ అమెరికా వచ్చినప్పుడు వారితో కలిసి మేమంతా "మౌంట్ శాస్తా" కు వెళ్ళడం ఒక అద్భుతమైన అనుభవం!

 

ట్రెక్కింగ్ చేస్తూ ఆ కొండపైకి వెళ్ళిన నేను అక్కడ ఆస్ట్రల్ మాస్టర్స్‌ని భౌతిక నేత్రాలతో దర్శించడం జరిగింది!

 

ప్రశ్న: "ప్రముఖ చిత్రకారులు బాపుగారి బొమ్మలు మీ ఇంట్లో చాలా ఉన్నాయి .."

 

మా అక్కయ్యకు సినీ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారి అమ్మాయి "అనిత" తో పరిచయం ఉంది!

 

"స్యాన్ హోస్" లో ఉంటూన్న "అనిత" తమ కూతురికి సంగీతం నేర్పించడం కోసం నా దగ్గరికి తీసుకుని వచ్చేది. తమ మనుమరాలు పాడిన "పలుకే బంగారమాయేనా" పాట విని ముళ్ళపూడిగారు నన్ను ఎంతగానో ప్రశంసించారు. తాము వ్రాసిన ప్రతి పుస్తకాన్ని సంతకం చేసి మరీ నాకు పంపేవారు!
బాపుగారు స్వయంగా వేసిన అద్భుత చిత్రాలనూ మరి మా గృహప్రవేశం సందర్భంగా "సీతారామ కల్యాణం" నుంచి "పట్టాభిషేకం" వరకు ఉన్న బాపుగారి బొమ్మలను బహుమతిగా ఇచ్చారు. రమణ గారి అమ్మాయి నా వెబ్‌సైట్ కోసం బాపుగారు స్వయంగా గీసిన "లోగో" ని మరి బాపుగారి తమ్ముడు గీసిన త్యాగరాజు స్కెచ్‌ని అందించారు.

 

ప్రశ్న : "మీ లక్ష్యాలు?"


"కాలిఫోర్నియాలో పెద్ద పిరమిడ్ రావాలి" అన్న మహా సంకల్పంతో మా వంతు కృషి చేస్తున్నాం! అమెరికా దేశ వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ ఒక యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ దిశగా కృషి చేస్తున్నాం!!

 

ప్రశ్న: "హలో సంతోష్ గారూ! మీ ధ్యాన జీవితం ఎలా మొదలైంది?"

 

సంతోష్ గారు: నాకు మా తోడల్లుడు మరి న్యూఢిల్లీ పిరమిడ్ మాస్టర్ అయిన "నాగ శ్రీనివాస్" గారి ద్వారా 2010లో పిరమిడ్ ధ్యాన పరిచయం జరిగింది.

 

వాస్తవానికి నేను నా చిన్నతనం నుంచే ధ్యానం చేసేవాడిని కానీ అందులోని పరమార్థం అప్పట్లో నాకు బోధపడలేదు. "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేయడం మొదలయ్యాకే నాలో అంతర్గత జాగరూకత మొదలై ..నాకు నా జీవిత పరమార్థం మరి లక్ష్యం ఏమిటో అర్థం అయ్యింది!

 

ధ్యానంలోని విశిష్ఠత నాకు మరింతగా అనుభవంలోకి వస్తూండడంతో క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గంట సేపు నేను .. ఎన్ని పనులున్నా వాటిని ఒకింత ప్రక్కకు పెట్టి .. ధ్యానం చేసే వాడిని.

 

2012 సంవత్సరంలో పత్రీజీ అమెరికాకు వస్తున్నారని తెలుసుకుని ఎంతో ఆనందించాం! వారితో గడిపిన సమయం అద్భుతం!

 

ఆ సమయంలోనే నాలో "టెలీపతీ" అన్న అతీంద్రియ జ్ఞానం మొదలైంది! ఆ తరువాత ఎప్పుడు నేను పత్రీజీని తలచుకుని "వారితో మాట్లాడాలి" అనుకున్నా .. వెంటనే వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే .. ఫోన్ చేసి మాట్లాడుతున్నారు!

 

ప్రశ్న: "ఇంకా మీ ధ్యాన అనుభవాలు?"


చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి! నా భార్య "సుధ"కు సర్జరీ జరిగినప్పుడు.. నేను ఆపరేషన్ థియేటర్ బయటే ధ్యానంలో కూర్చున్నాను. సర్జరీకి అయిదు గంటలు పడుతుందని చెప్పిన డాక్టర్లు పదమూడు గంటలపాటు సర్జరీ చేస్తూనే ఉన్నారు.

 

అంతసేపు పత్రీజీ ఆస్ట్రల్‌గా ఆపరేషన్ థియేటర్ బయటికీ, లోపలికీ తిరుగుతూ అరగంటకొకసారి నా దగ్గరికి వచ్చి.. "మరేం ఫరవాలేదు. అంతా బాగానే ఉంది" అంటూ నా భుజం తట్టి నన్ను స్వాంతన పరుస్తూనే ఉన్నారు. అందుకే సర్జరీ జరిగినంత సేపు నేను ఏ అలజడి లేకుండా చాలా ధైర్యంగా ఉన్నాను.

 

ఇటీవలె..

 

2016 సంవత్సరం జూలైలో పత్రీజీ అమెరికా వచ్చినప్పుడు మేమంతా వారితో కలిసి "మౌంట్ శాస్తా" కు వెళ్ళాం! అక్కడ అందరం ఆనందంగా గడిపిన తరువాత తిరిగివస్తూ .. ఒక వైపు కొండలు మరొకవైపు లోయలతో అనేక చోట్ల వంపులతో కూడి ఉన్న ఘాట్ రోడ్డులో నేను చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తున్నాను. వెనుక సీట్లో సార్, సుధ పిల్లలు కూర్చుని సంగీతం గురించి మాట్లాడుకుంటూ పాటలూ పాడుకుంటూన్నారు.

 

ఇంతలో ఎదురుగా ఉన్న కొండల మధ్య హఠాత్తుగా రెండు అందమైన కళ్ళతో కూడిన ఒక స్త్రీ రూపం కనపడింది. ఆ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా .. చిరపరిచితంగా ఉన్నాయి! "నా భ్రమేమో" అనుకుని కళ్ళు నులుముకుని చూశాను! పదే పదే అదే రూపం!

 

ఇక కారు నడపడం నా వల్ల కాక "సుధ"ను డ్రైవింగ్ చెయ్యమని నేను వెనుకసీట్లో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను.

 

ఇంటికి తిరిగి వచ్చాక కూడా ధ్యానం చేస్తూ ఆ స్త్రీ మూర్తి గురించే ఆలోచించాను! నాలుగు రోజులు తరువాత మరింత స్పష్టత కోసం పత్రీజీని అడుగగా వారు.. "Keep on your thoughts" అన్నారు.

 

వెంటనే పూజగదిలోకి వెళ్ళి ధ్యానం చేసుకుని అక్కడ ఉన్న మా అమ్మ ఫోటోను చూద్దును కదా.. అచ్చం అవే కళ్ళు! ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కాలం చేసిన మా అమ్మను ఇప్పుడు నా ధ్యానశక్తితో మళ్ళీ చూడగలిగినందుకు నేను ఎంతో సంబరపడిపోయాను!

 

ఇది నిజంగా అద్భుతమే! ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మా అమ్మ కనీసం నా కలల్లోకి కూడా రాలేదు!

 

ప్రశ్న: "మీ జీవిత లక్ష్యం?"


బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చి.. అక్కడి "మైత్రేయబుద్ధా మెగాపిరమిడ్" లో ధ్యానం చేసుకుంటూంటే "కాలిఫోర్నియా లో కూడా ఒక పెద్ద పిరమిడ్ రావాలి" అన్న సంకల్పం నాలో కలిగింది!

 

దానికి సాకారరూపంగా అమెరికా వచ్చాక ఇక్కడి NRI పిరమిడ్ మాస్టర్లతో కలిసి ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాం.

 

"PSSM-USA" ఆధ్వర్యంలో అమెరికాలో త్వరలోనే అతి పెద్ద ధ్యాన పిరమిడ్ నిర్మాణ లక్ష్యం పూర్తికాబోతోంది!

 

Go to top