" నవ్వుతూ .. నవ్విస్తూనే ఉంటాను "

 

 

ఆహ్వానం అందగానే " కృష్ణాపుష్కర ధ్యాన మహోత్సవాలకు" తరలివచ్చి .. వాటిని విజయవంతం చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా ధన్యవాదాలు!

 

స్వభావరీత్యా కమ్యూనిస్ట్ భావాలతో నిండిపోయి .. నాస్తికుడిగా, హేతువాదిగా .. ఆధ్యాత్మికతకు ఆమడ దూరంలో ఉన్న నేను .. ఎనిమిది సంవత్సరాల క్రితం నా భార్య "శ్రీమతి రమణి" ప్రేరణతో ధ్యానం నేర్చుకుని .. పిరమిడ్ కుటుంబంలోకి "బలవంతంగా" నెట్టబడ్డాను!

 

అలా నెట్టబడిన నేను .. పత్రీజీ సాంగత్యాన్ని పొందాక .. ఆత్మసత్యాలను తెలుసుకుని అనేక ధ్యానానుభవాలను పొంది .. బ్రహ్మానందాన్ని అనుభవించి .. ఆధ్యాత్మికతకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నాను.

 

"పంచితేనే పెంచబడుతుంది" అన్న ప్రకృతి సూత్రం ఆధారంగా నేను పొందిన ఆనందాన్ని మరింత మందికి పంచాలన్న స్వార్థబుద్ధితో కోట్ల రూపాయలు విలువచేసే నా స్వంత స్థలంలో "మానస సరోవర ధ్యాన ఆశ్రమం " నిర్మించాలని నిర్ణయించుకున్నాను.

 

నా ఆలోచనలను పత్రీజీ కి తెలియజేయగా వారు ముళ్ళ పొదలతో, తుమ్మకంపలతో నిండి వున్న ఆ ప్రదేశానికి విచ్చేసి అక్కడ ధ్యానం చేసి "భవిష్యత్తులో అది గొప్ప ఆరోగ్యవరదాయినిగా మారనుంది" అని చెప్పడం జరిగింది.

 

ఏడు సంవత్సరాల క్రితంనాటి వారి హక్కు "జన్మహక్కు" గా మారి .. అతి తక్కువ కాలంలోనే ఇంత గొప్ప శక్తి క్షేత్రంగా రూపుదిద్దుకుంది!!

 

ఆశ్రమ నిర్మాణం కోసం ఎవ్వరినీ ఏమీ ఆశించకుండా నేనే పూర్తి చెయ్యాలని సంకల్పం పెట్టుకుని కార్యరంగంలోకి దూకాను. అయితే అపరదానగుణ సంపన్నులయిన కొందరు పిరమిడ్ మాస్టర్లు మాత్రం నేను అడుగకుండానే ఈ ఆశ్రమ నిర్మాణానికి గాను ధనం రూపేణా మరి వస్తురూపేణా పదిహేను లక్షల రూపాయల విలువ చేసే వితరణను అందించారు.

 

వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పదిహేను లక్షల మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఇలా కనీసం నా బిడ్డలపై కూడా ఆధారపడకుండా ఈ ఆశ్రమాన్ని నిర్మించగలిగే ఆత్మస్థైర్యాన్ని నాకు అందించిన పత్రీజీకి నా కృతజ్ఞతలు!

 

ప్రస్తుతం 36'X36' శక్తివంతమైన సిద్ధార్థ పిరమిడ్, ఓపెన్ ఎయిర్ యాంఫీధియేటర్, ఆడిటోరియమ్, వంటశాల, అన్నదాన మంటపం, వసతి గదులు మరి చక్కటి ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్, లతో ఈ ఆశ్రమం తీర్చిదిద్దబడింది. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం!

 

మేము చేస్తోన్న లోకకల్యాణ కార్యక్రమాలను గౌరవిస్తూ నా చిన్న కొడుకు, కోడలు నెలకు లక్షరూపాయల జీతం వచ్చే తమ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈ ఆశ్రమ నిర్వహణలో పాలుపంచుకుంటున్నందుకు తల్లి తండ్రులుగా మా బిడ్డల ఆధ్యాత్మిక సంస్కారానికి ఎంతో, ఎంతో గర్వపడుతున్నాము!

 

నా గురువు నా జీవితానికి కలిగించిన మరొక సార్థకత .. పదవ తరగతి కూడా పూర్తిచేయని నాతో నా జీవిత గ్రంధాన్ని "మానస సరోవరం" పేరుతో వ్రాయించడం!

 

ఆ పుస్తకాన్ని నాలుగు సార్లు ఓపికగా ప్రూఫ్ రీడింగ్ చేసి మరీ నాతో అచ్చువేయించారు పత్రీజీ!

 

"మానవ సరోవరం" పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తూ .. తమకు ఉన్న ఎన్నో సందేహాలు దానిని చదవడం ద్వారా తీరిపోయాయని తెలియజేస్తూంటే "జన్మ ధన్యం అయ్యింది " అని సంతోషించాను.

 

మొదటి ముద్రణ తరువాత ఆరునెలల కాలంలోనే రెండవ ముద్రణకు నోచుకోవడం నా గ్రంథం చేసుకున్న అదృష్టం!

 

కృష్ణాపుష్కరాల సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు స్ఫూర్తి ఇచ్చిన గొప్ప మాస్టర్ నా భార్య "రమణి"!

 

క్రితం సారి గోదావరి పుష్కరాల సమయంలో "రాబోయే కృష్ణా పుష్కరాలలో మనం కూడా ఒక రోజు అన్నదానం చేద్దాం " అన్న నా భార్య సంకల్పం .. మహా సంకల్పంగా మారి ఇంతటి "ధ్యాన - జ్ఞాన బ్రహ్మోత్సవ నిర్వహణ " కు కారణభూతం అయ్యింది.

 

ఈ మధ్య ఒకప్పుడు నాతోపాటు వ్యాపారం చేసిన నా పాత మిత్రుడు కలిసి "ఇప్పుడు ఏం చేస్తున్నావు? " అని అడిగాడు.

 

"కేవలం జీవనోపాధికే కాకుండా .. జీవితాన్ని సరిక్రొత్తగా జీవించడం నేర్చుకుంటున్నాను " అని నేను ఇచ్చిన జవాబుకి అతడు ఆశ్చర్యపోయాడు!

 

ఈ లోకంలో అందరూ "చనిపోయేంతవరకు ఏదో ఒకలా బ్రతికేయాలి "అనుకుంటూంటే .. పత్రీజీ మాత్రం మనకు ప్రతి క్షణం ఎలా జీవించాలో నేర్పుతున్నారు! ఆత్మజ్ఞానంతో ప్రతి క్షణం బ్రహ్మానందాన్ని పొందడం నేర్పిస్తున్నారు! లోకకల్యాణ కార్యక్రమాలు మనతో చేయిస్తూ నిత్యానందంతో మనల్ని చిరంజీవులుగా మలుస్తున్నారు!

 

ఈ లోకానికి అందరూ ఏడుస్తూ వచ్చి అందరినీ ఏడిపించి పోతారు! కానీ ఏడుస్తూ వచ్చిన నేను .. ఒక పిరమిడ్ మాస్టర్‌గా నవ్వుతూ .. అందరినీ నవ్విస్తూ జీవిస్తున్నాను!

 

ఇలా నవ్విస్తూ, నవ్విస్తూ .. ఏదో ఒక రోజు నవ్వుకుంటూనే వెళ్ళిపోతాను! ఇదే నా జీవిత ఆశయం .. మరి ఇదే నా జీవిత లక్ష్యం!!

 

 

కళ్ళం రామిరెడ్డి

తాడేపల్లి
గుంటూరుజిల్లా

 

 

Go to top