" ఈ విశ్వంలో ఉన్న గురువులంతా ఒక్కటే "

 

అమెరికా దేశం .. అట్లాంటా మహానగరం దగ్గరలోని " Johns Creek " లో నివసిస్తూ .. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ధ్యానప్రచారాన్ని ఒక సాంఘిక బాధ్యతలా నిర్వహిస్తున్నారు శ్రీమతి శీతల్ ఽ చంద్రకిరణ్ పవార్. నిరంతరం తమ ఉద్యోగ విధులతో మరి ధ్యానప్రచారంతో బిజీగా ఉండే ఈ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ల తో "ఇంటర్నెట్ ఫోన్ " ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించిన దంపతులు షోలాపూర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ " G. చంద్రశేఖర్ రెడ్డి " గారికి కృతజ్ఞతలు!

 

GCS : " హలో శీతల్ గారూ! మీ గురించి ‘ధ్యానజగత్’ కు వివరిస్తారా?"


శీతల్ గారు: మాది ముచ్చటయిన ధ్యాన కుటుంబం.

 

మా వారు చంద్ర కిరణ్ .. పిల్లలు "శివ (16)", "పూజ (13)" .. అందరం కలిసి ప్రతిరోజూ క్రమం తప్పకుండా సామూహిక ధ్యానం చేస్తాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకూ చక్కటి పరిష్కారాన్ని చూపించే ధ్యాన సంస్కారాన్ని మా పిల్లలకు వారసత్వ సంపదగా అందిస్తున్నందుకు తల్లితండ్రులుగా మేమెంతో గర్వపడుతున్నాం.

 

ప్రస్తుతం "IBM సాఫ్ట్‌వేర్ కంపెనీ" లో "క్వాలిటీ అనలిస్ట్" గా నేను ఉద్యోగం చేస్తూ .. ఖాళీ సమయాలలో మా ఇంటిలోనే నిర్వహిస్తూన్న "నిర్వాణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్" ద్వారా అట్లాంటా చుట్టుప్రక్కల అనేక ప్రదేశాలలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాను.

 

GCS : " మీ బాల్యం ఎక్కడ గడిచింది?"


శీతల్ గారు: మా స్వగ్రామం ప్రస్తుత తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని "కోరుట్ల" పట్టణం. మా అమ్మ శ్రీమతి కిరణ్మయి "కోరుట్ల" పట్టణం.

 

మా అమ్మ శ్రీమతి కిరణ్మయి కోరుట్ల మ్యున్సిపల్ కౌన్సిల్ లో కార్పొరేటర్‌గా పని చేశారు; మా నాన్న శ్రీ ప్రభాకర్ గారు వ్యాపారవేత్త! మా అమ్మ, నాన్నలతో సహా మా తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు మరి ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా ధ్యానులమే!

 

"కోరుట్ల" లో మా నాన్నగారిది పెద్ద ఉమ్మడి కుటుంబం కావడంతో మేమంతా కూడా మా కుటుంబానికి పెద్ద అయిన మా నాయనమ్మ "అన్నపూర్ణమ్మ" గారి నుంచే పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం వంటి అనేక దివ్య లక్షణాలను బాగా నేర్చుకున్నాం.

 

"నాయనమ్మ" తో కలసి పిల్లలమంతా ప్రతి ఆదివారం మా ఇంటికి దగ్గరలో ఉన్న "వాసవీ కళ్యాణమండపం" లో జరిగే రాధాస్వామి సత్సంగానికి హాజరు అయ్యేవాళ్ళం. వాళ్ళు చెప్పే ప్రవచనాలు అప్పట్లో నాకు అర్థం అయ్యేవి కాదు కానీ .. అందరితో కలసి నేను ధ్యానం మాత్రం చేసుకునే దానిని.

 

8వ తరగతి నేను లో ఉన్నప్పుడు ఒకసారి వాసవీ కళ్యాణమండపంలో ఒకానొక ఆధ్యాత్మిక సంస్థవారు నిర్వహించిన ఏడు రోజుల మెడిటేషన్ క్యాంప్ కు హాజరుకావడం జరిగింది. ఇలా ఏదో ఒక సందర్భంలో చిన్నప్పటి నుంచీ "ధ్యానం" అన్నది నా జీవితాన్ని స్పృశిస్తూనే ఉంది.

 

ఇంటర్ వరకు చదువు "కోరుట్ల" లో .. మరి BCA "నిజామాబాద్" లో పూర్తిచేశాను. 2000 సంవత్సరంలో నా వివాహం "చంద్రకిరణ్" గారితో జరిగాక మేము USA కి తరలి రావడం జరిగింది. 2010 సంవత్సరం వరకు నా జీవితం అంతా కూడా ఒకానొక సగటు సాధారణ గృహిణి లాగే పిల్లల్ని కనడం, పెంచడం, ఉద్యోగం చేసుకోవడం, పూజలు పునస్కారాలు చేయడం తోటే అతి సామాన్యంగా గడిచిపోయింది.

 

GCS : "ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు?"


శీతల్ గారు: 2009 వ సంవత్సరంలో మేము ఉద్యోగరీత్యా మిస్సూరీ స్టేట్ .. "సెయింట్ లూయిస్" నుంచి "అట్లాంటా" నగరానికి తరలి వచ్చాం.

 

అదే రోజు కనెక్టికట్ నుంచి ఉద్యోగరీత్యా మేము ఉన్న అపార్ట్‌మెంట్ లోకే తరలి వచ్చిన చెన్నై పిరమిడ్ మాస్టర్స్ "శ్రీకాంత్ గార్ల", "అనిల" దంపతులతో మాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరం తెలుగువాళ్ళం కావడంతో వారితో మాకు బాగా సాన్నిహిత్యం పెరిగింది.

 

ఈ క్రమంలో ఒకానొక రోజు నాకు ఉన్నట్లుండి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో విల విలలాడుతూ డాక్టర్లను సంప్రదించగా వాళ్ళు రకరకాల పరీక్షలూ, స్కానింగ్‌లూ చేసి "కారణం ఏమీ లేదు" అని తేల్చేశారు. నేను మాత్రం లేచి ఏ పనీ చేసుకోలేక మంచానికే పరిమితం అయిపోయాను.

 

అలా " కారణమే తెలియని జబ్బు " తో బాధపడుతూ ఉన్న నన్ను పరామర్శించడానికి ఒక రోజు మా ఇంటికి వచ్చిన "అనిల" .. నన్ను "40 రోజుల పాటు ధ్యానం చేసుకో" మని చెప్పింది.

 

వాళ్ళు వెళ్ళిపోగానే నేను తలుపులు వేసుకుని అనిల చెప్పినట్లు "శ్వాస మీద ధ్యాస" ఉంచి పత్రీజీ వేణువు మ్యూజిక్ వింటూ ధ్యానంలో కూర్చున్నాను.

 

కాస్త ఉపశమనం అనిపించడంతో ఇక ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా 40 రోజుల ధ్యానదీక్ష పూర్తిచేశాను. ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడు తగ్గిపోయిన కడుపునొప్పి .. మళ్ళీ నాకు తిరిగి ఎన్నడూ రాలేదు! దానికి తోడు రోజు రోజుకీ క్రొత్త శక్తి ఉత్సాహం నాలో నిండిపోతూ వచ్చింది!

 

నా ఆరోగ్యంలో వస్తూన్న మార్పును చూసి నా భర్త, పిల్లలు కూడా తమంతట తామే ధ్యానంలోకి రావడం .. మరి శుద్ధ శాకాహారులుగా మారడం జరిగిపోయింది! ఇలా మా కుటుంబాన్నంతటినీ "ధ్యానం" అనే రాజ మార్గంలోకి ప్రవేశపెట్టిన "గార్ల దంపతులకూ" మరి పత్రీజీకి కృతజ్ఞతలు.

 

GCS : " ఆ తరువాత మీ సాధన ఎలా కొనసాగింది?"


శీతల్ గారు: 2010 సం||లో చెన్నై సీనియర్ పిరమిడ్ మాస్టర్ "జ్యోతి మేడమ్ " అంటే "అనిల అత్తగారు" .. అట్లాంటాకు రావడంతో వారి నుంచి మేము ధ్యానం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. "గురువు అంటే ఎవరు? .. వారితో ఎలా మసలుకోవాలి? .. వారి నుంచి ఏం నేర్చుకోవాలి? .. అన్న విషయాలను వివరిస్తూ జ్యోతి మేడమ్ .. లోకకళ్యాణం కోసం పత్రీజీ చేస్తోన్న నిస్వార్థ సేవను వివరించారు. ప్రతి ఒక్కరినీ ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మరి శాకాహారులుగా తీర్చిదిద్దడానికి పత్రీజీ పడే తపనను జ్యోతి మేడమ్ ద్వారా విని "ఎలాగైనా ఆ మహాశక్తిని కలవాలి" అని బలంగా అనుకున్నాను.

 

అలా "జ్యోతి మేడమ్ " ప్రేరణతో మా ధ్యానసాధన మరింత తీవ్రతరమై మేము సామూహిక ధ్యానాలను మరి సత్సంగాలనూ మొదలుపెట్టాం!

 

GCS: "మీ ధ్యాన అనుభవాలు?"


శీతల్ గారు: ఒక రోజు ధ్యానంలో కూర్చున్న కొద్దిసేపటి తరువాత నాకు దివ్యకాంతులతో కూడిన నా ఇష్టదైవం శిరిడీ సాయిబాబా దర్శనం ఇచ్చారు! చిన్నప్పటి నుంచీ నేను సాయిబాబా భక్తురాలినే అయినా .. ఇది వరకెన్నడూ నాకు ఇటువంటి దివ్య అనుభవం కలుగలేదు.

 

ఆ ఆనందానుభూతికి పులకించి పోతూండగానే శిరిడీ సాయి పత్రీజీలా మారిపోయి .. మళ్ళీ సాయిబాబాలా దర్శనం ఇచ్చారు!

 

"ఈ విశ్వంలో ఉన్న గురువులంతా ఒక్కటే" అన్న ఆ గొప్ప జ్ఞాన సందేశంతో నేను పునీతురాలిని అయ్యాను.

 

GCS: "పత్రీజీని ప్రత్యక్షంగా ఎప్పుడూ కలిశారు?"


శీతల్ గారు " 2012 జూలై మాసంలో పత్రీజీ అమెరికా వచ్చినప్పుడు మేము శ్రీకాంత్ దంపతులతో కలిసి వారిని విమానశ్రయంలో స్వాగతించి .. వారి క్లాసులను నిర్వహించడం చేశాం.

 

ఆ సందర్భంగా సార్ మా ఇంట్లో కూడా ఉండడం మా అదృష్టం! వారు ఉన్న వారం రోజులు మా అందరిలో ఒక నూతన శక్తి! ఎప్పుడో పోగుట్టుకున్న పెన్నిధి మళ్ళీ దొరికినంత ఆనందం! అప్పుడే పత్రీజీ కార్యక్రమంలో కూడా పాల్గొని ఎంతో మంది తెలుగు వాళ్ళకు ధ్యానాన్ని పరిచయం చేశారు.

 

ఆ తరువాత 2015 సంవత్సరం .. చికాగోలో జరిగిన "ISOL కార్యక్రమం" లో పత్రీజీ తో కలసి పాల్గొనడం మా అదృష్టం! లోగడ స్వామీ వివేకానందులు పాల్గొని తమ గురుదేవుల వాణిని వినిపించిన ఆ "సర్వమత సమ్మేళన వేదిక" నుంచి ధ్యాన శాకాహార అహింసా జ్ఞానసందేశాలు అందించడం మరి ఆ సందర్భంగా వివిధ దేశాల నుంచి విచ్చేసిన మన పిరమిడ్ మాస్టర్లను కలుసుకోవడం గొప్ప చారిత్రాత్మకమైన విషయం!

 

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న PSSM కుటుంబ సభ్యులను ఇలా వివిధ వేదికల ద్వారా కలుపుతోన్న పత్రీజీకి శతకోటి కృతజ్ఞతలు!

 

ఆ సందర్భంలో మేము పత్రి సార్‌తో కలిసి "శాంటా ఫే" కూడా వెళ్ళి " Star Wisdom" నీనా బ్రౌనె గారినీ మరి Star Wisdoms"జేమ్స్ జెరెబ్" గారినీ కలవడం మాకు ఒక అరుదైన అవకాశం! అలాగే మొన్న 2016 జూలైలో పత్రీజీ అమెరికా వచ్చినప్పుడు అట్లాంటా మాస్టర్స్ అందరం కలిసి వెళ్ళి పత్రీజీ సమక్షంలో ఇండియానా రాష్ట్రం "గ్రీన్ ఫీల్డ్స్" లో గురుపౌర్ణమి సంబరాలు జరుపుకున్నాం!

 

పత్రీజీ తో కలసి ఉండే ప్రతిక్షణం ఎంతో విలువైనదిగా మేము భావిస్తాము. వండడం .. వడ్డించడం .. ధ్యానం చేయించడం .. ఆత్మజ్ఞానాన్ని బోధించడం .. అంతా కూడా "ఒక సరదా, సరదా ఆటలా" అవధులు లేని ప్రేమతో నిర్వర్తించే ఆ కరుణామూర్తి మనతో కలిసి ఉండడం మనం జన్మ జన్మలుగా చేసుకున్న అదృష్టం!

 

GCS: " మీ మెడిటేషన్ సెంటర్ వివరాలు .. ?"


శీతల్ గారు: 2014 ఆగస్ట్‌లో మేము మా స్వంత గృహంలోకి గృహప్రవేశం చేసుకున్నాం! మా ఇంటిలోని "విజిటర్స్ లాంజ్" ని పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ గా తీర్చిదిద్దగా .. అప్పుడే బోస్టన్ లో ఉన్న మేడమ్ స్వర్ణమాల పత్రిగారు విచ్చేసి, దానిని ప్రారంభోత్సవం చేసి "నిర్వాణ మెడిటేషన్ సెంటర్" గా దానికి నామకరణం చేశారు!

 

ఇక్కడ ప్రతి బుధవారం రాత్రి 8;30 గం|| నుంచి 9:30 గం|| వరకు మరి ప్రతి పౌర్ణమికి ధ్యానశిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఉంటాం.

 

GCS: "ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారా?"


శీతల్ గారు : చాలా చదువుతాను! పీటర్ రిఛెలూ గారు రచించిన "A Soul Journey " బార్బారా మార్సెన్యాక్ రచించిన "నక్షత్రమిత్రులు " .. స్వామి రామా వారి "హిమాలయ యోగులు" .. పరమహంస యోగానందుల వారి "ఒక యోగి ఆత్మకథ" .. ఇవన్నీ నాకు చాలా నచ్చిన పుస్తకాలు!

 

నవీన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చక్కగా అనువదించి అందిస్తూ .. ప్రపంచానికి ఆత్మజ్ఞాన వెలుగులను పంచుతోన్న PSSM కు అభినందనలు!

 

 

శీతల్ పవార్ ఽ చంద్ర కిరణ్ పవార్ 

అట్లాంటా 

అమెరికా దేశం
This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
cell: 636-489-8585

Go to top